వలస కూలీల దుస్థితి జాతి క్షేమానికి ప్రమాదం

Former Minister Yashwant Sinha Critics Centre Economic Package - Sakshi

సందర్భం

మన వలస కార్మికుల దుస్థితి యావత్‌ ప్రపంచానికీ తెలిసిపోయింది. ఇది అంతర్జాతీయంగా మన ప్రతిష్టను బాగా దెబ్బతీసింది. కానీ మన కేంద్ర ప్రభుత్వం సొంత డబ్బా వాయించుకుంటూ, తాను సాధిం చని విజయాల గురించి డప్పుకొట్టుకుంటూ ఉండటం మాత్రం ఆపలేదు. ఇటీవలే ప్రధాని ప్రకటించి, కేంద్ర ఆర్థికమంత్రి వెల్లడించిన రూ. 20 లక్షల కోట్ల ఉద్దీపన పథకం ఒక వట్టి భ్రమగా మిగలడమే కాకుండా పేదల గాయాలపై మరింతగా పుండు రాసేలా ఉంది. ఇది తప్పుడు ప్యాకేజీ మాత్రమే కాదు.. వంచనాత్మకమైన పథకం కూడా. 

కేంద్ర ఆర్థిక మంత్రి ఎంత దయారాహిత్యంతో కనిపిం చారంటే ఉద్దీపనపై తొలి ప్రెస్‌ సమావేశంలో వలస కార్మికుల పేరెత్తడానికి కూడా ఆమెకు మనసొప్పలేదు. ఇక రెండో సమావేశంలో వారికి కాస్త బిచ్చం విసిరేశారు కానీ, రోడ్డు ప్రమాదాల్లో, రైలు పట్టాలపై వారి విషాద మరణాలకు కనీస సంతాపం ప్రకటించలేదు. తమకు అందుబాటులో ఉన్న ప్రతి రవాణా సాధనాన్ని పట్టుకుని ప్రయాణిస్తూ, అదీ సాధ్యం కానప్పుడు కాలినడకనే వందల మైళ్ల దూరం రహదారులపై నడుస్తూ వలస కార్మికులు పడుతున్న పాట్లను దేశవిభజన తర్వాత ఇంతవరకు దేశం ఎన్నడూ చూసి ఉండలేదు. వారి బాధలు చూస్తే హృదయాలు బద్దలవుతున్నాయి. వారి కడగండ్లు ఎంతమాత్రం జాతికి ఆమోదనీయం కాదు.

వలస కార్మికుల పట్ల జరుగుతూన్న ఈ గందరగోళానికి భారత ప్రభుత్వానిదే పూర్తి బాధ్యత. కనీస ప్లాన్‌ కూడా లేకుండానే మార్చి 24న ఉన్నట్లుండి లాక్‌డౌన్‌ ప్రకటించడం కేంద్రం చేసిన మొదటి తప్పు. వైరస్‌ వ్యాప్తి చెందకుండా, వలస కార్మికులు ఎక్కడివారక్కడే బస చేసేలా కేంద్రం జాగ్రత్తలు పాటించాల్సి ఉండె. సంవత్సరానికి ఒకసారి సీజన్‌లో స్వస్థలాలకు వెళ్లే కూలీలకు మాత్రమే మినహాయింపునిచ్చి మిగిలిన అందరినీ ఉన్నచోటే ఉంచి సౌకర్యాలు అందించడంలో కేంద్రం పూర్తిగా విఫలమైంది. 

ఉన్నఫళాన లాక్‌డౌన్‌ ప్రకటించినప్పుడు వలస కార్మికులకు అంతవరకు పనిపాటలు కల్పించిన ఆరుకోట్ల సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలు మూతపడతాయన్న ఎరుక కూడా కేంద్రానికి లేకుండా పోయింది. ఇవి కార్మికులకు, కూలీలకు పూర్తి వేతనం ఇవ్వలేవని గ్రహించకుండా హుకుం జారీ చేసినంత మాత్రాన పని జరగదని కేంద్రం గుర్తించాల్సి ఉండె. చివరకు తన నిర్ణయంలో తప్పును గ్రహించాక ప్రభుత్వం ఇక తప్పదని పూర్తివేతనంపై తన హుకుంను వెనక్కి తీసుకోవలసి వచ్చింది.

వలస కార్మికులందరూ ఉన్నట్లుండి తమ స్వస్థలాలకు వెళ్లిపోవాలని నిర్ణయించుకోలేదు. ఇన్నాళ్లూ తాము దాచుకుని ఉన్న డబ్బులు పూర్తిగా ఖర్చయిన తర్వాత, ఇక అధికారుల నుంచి తమకు ఎలాంటి సహాయం లభించదని, ఆకలితో చావడం తప్ప తమకు ఏ మార్గమూ లేదని గ్రహించిన తర్వాతే వారు సొంత ఊరి బాట పట్టారు. రాష్ట్ర ప్రభుత్వాలు తమకు శక్తిమేరకు సహాయం చేశాయి కానీ అది ఏమాత్రం సరిపోలేదు. వలస కార్మికుల సహాయార్థం రాష్ట్రాలకు నిధులు, ఆహారధాన్యాలు పంపించడం కేంద్ర ప్రభుత్వ తొలి నిర్ణయంగా ఉండాలి. 

మార్చి నెలలో తదుపరి మాసాల్లో వలసకూలీల వేతనం పూర్తిగా వారికి అందేలా కేంద్రం తగు జాగ్రత్తలు చేపట్టాల్సి ఉండె. వారికి అవసరమైన రేషన్‌  సరుకులు, వైద్య సహాయం కూడా కేంద్రం కల్పించాల్సి ఉండె. కానీ కేంద్ర ప్రభుత్వం వీటిలో ఏ ఒక్క అంశం పట్ల బాధ్యత పడలేదు. వలస కార్మికులను గాలికి వదిలేసింది. దీంతో వేలాది కార్మికులకు కాలినడకన ఊళ్ల బాట పట్టడం తప్ప మరోదారి లేకుండాపోయింది. కానీ కేంద్ర ప్రభుత్వం, బీజేపీలు ఫక్తు రాజకీయ వ్యూహం పన్నుతూ మొత్తం తప్పును రాష్ట్ర ప్రభుత్వాలపైకి నెట్టేయడానికి చూస్తున్నాయి. 

ఉద్దీపన ప్యాకేజీని మొదట్లో రూ. 20 లక్షలకోట్లుగా ప్రకటించి తర్వాత రూ. 21 లక్షల కోట్లకు పెంచి చూపారు. కానీ ఇంత భారీ ప్యాకేజీలో వలస కార్మికులకు తక్షణ ఉపశమనం కలిగించే అంశమే కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో వలసకూలీల సమస్య పరిష్కార మార్గాలను భారత ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని తలచి భావసారూప్యత కలిగిన కొద్దిమంది మిత్రులతో చర్చించాను. భారత ప్రభుత్వం  ఇప్పుడైనా పారామిలటరీ బలగాలను రప్పించి వలస కార్మికుల తరలింపు బాధ్యతను అప్పగించి ఉంటే బాగుండేదని మేమంతా నిర్ధారణకు వచ్చాం. సైన్యాన్ని దింపి ఉంటే తక్షణం కొన్ని ప్రయోజనాలు నెరవేరేవి.

అవేమిటంటే. సాయుధ బలగాలపై మన ప్రజలకు అపార విశ్వాసం ఉంది కనుక కూలీల తరలింపు క్రమశిక్షణతో జరిగేది. పైగా తనకున్న వనరులు, పౌర ప్రభుత్వాల వనరుల సహాయంతో సైన్యం.. రైళ్లతో సహా అన్ని రకాల రవాణా సాధనాలను కూలీల తరలింపునకు ఉపయోగిం చేది. కార్మికులకు తగిన ఆహారం, నీరు, వైద్య సహాయాన్ని సైన్యం క్రమబద్ధీకరించేది. వలస కూలీలను వీలైంత తక్కువ సమయంలో ఊళ్లకు చేర్చేది. నా ఉద్దేశంలో మన సైనిక బలగాలు ఈ మొత్తం కార్యక్రమాన్ని 48 గంటల్లోపే విజయవంతంగా పూర్తి చేసేవి. కోవిడ్‌పై పోరాడుతున్న వైద్య సిబ్బంది, తదితరుల గౌరవార్థం పూలు చల్లడానికి సైనిక బలగాలను ఉపయోగించాలన్న కేంద్ర ప్రభుత్వ యోచన సరైందే. కానీ వలస కూలీల సంక్షోభం విషయంలో కూడా సాయపడాల్సిందిగా కేంద్రం సైన్యాన్ని కోరి ఉండాల్సింది.

కానీ నేనిక్కడ విచారంతోనే ఒక విషయాన్ని చెబుతున్నాను. గతంలో సంభవించిన అనేక సంక్షోభాలను భారత పాలనా యంత్రాంగం సమర్థవంతంగా ఎదుర్కొంది. ప్రస్తుత సంక్షోభంలో అది విఫలమైందంటే, రాజకీయ మార్గదర్శకత్వ లేమి మాత్రమే దీనికి కారణం. అందుకే వలసకూలీల తరలింపులో సైన్యం సహాయం తీసుకోవలసిందిగా అనేక ఇంటర్వ్యూలలో ప్రస్తావిస్తూ భారత ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి ప్రయత్నించాను. కొంతమంది మిత్రులతో, రాజకీయ పార్టీల సహచరులతో కలిసి మే 18న ఉదయం 11 గంటల నుంచి రాత్రివరకు రాజ్‌ ఘాట్‌ వద్ద ధర్నాలు చేశాము. కేంద్ర మాజీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా దీంట్లో పాల్గొన్నారు. కానీ కేంద్రం నుంచి స్పందన లేకపోగా 11 గంటల తర్వాత మమ్మల్ని అరెస్టు చేసి పోలీసు స్టేషన్‌కు తీసుకుపోయి తర్వాత వదిలేశారు.

ధర్నా అలా ముగిసింది కానీ సమస్య అలాగే ఉండిపోయింది. నా భయం ఏమిటంటే ఓపిక నశించిన జనం ఆగ్రహావేశాలతో ఎలా స్పందిస్తారన్నదే. కార్మికుల్లో అశాంతిని ఇప్పటికే మనం చూశాం. ఇప్పటికైనా మన సమాజం మేలుకొని వలస కూలీల సమస్యను తక్షణం పరిష్కరించడానికి సైన్యం సహాయం తీసుకోవలసిందిగా భారత ప్రభుత్వంపై ఒత్తిడి తేకపోతే, పరిస్థితి చేయిదాటిపోతుంది. అదే జరిగితే మనలో ఓ ఒక్కరం కూడా ఇళ్లలో సురక్షితంగా ఉండలేం. అందుకే ఇప్పటికైనా బయటకొచ్చి ఈ అంశంపై గళమెత్తాల్సిందిగా ప్రాధేయపడుతున్నాను.
వ్యాసకర్త: యశ్వంత్‌ సిన్హా, బీజేపీ మాజీ సీనియర్‌ నేత, మాజీ ఆర్థిక, రక్షణ మంత్రి

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top