పీయూష్‌ గోయల్‌ (ఆర్థికమంత్రి) రాయని డైరీ

Central Minister Piyush Goyal About His Finance Ministry - Sakshi

‘అన్నీ ఒక పెట్టు. ఇదొక్కటీ ఒక పెట్టు’ అని ఆపరేషన్‌ థియేటర్‌లోకి వెళ్లే ముందు అరుణ్‌ జైట్లీ నా చేతిలో చెయ్యేసి ధైర్యం చెప్పడం నాకింకా గుర్తుంది. నెల క్రితం ఆర్థిక శాఖ అప్పగింతలప్పుడు ఆయన నాతో ఆ మాట అన్నారు. ఎవరైనా ధైర్యం చెప్పడానికి భుజం మీద చెయ్యేస్తారు. జైట్లీ నా చేతిమీద చెయ్యి వేశారు!  తర్వాత అనిపించింది, ఆయన నాకు ధైర్యం చెప్పలేదు, తనకు ధైర్యం చెప్పుకున్నారని. సుబ్రహ్మణ్యస్వామికి భయపడి ఆర్థిక శాఖను మధ్యలోనే వదిలేస్తానేమోనని ఆయన భయం.ఆపరేషన్‌ థియేటర్‌లోకి వెళుతున్న వాళ్లతో ఎవరైనా ధైర్యంగానే మాట్లాడాలి. నేనూ ధైర్యంగానే మాట్లాడాను. ‘ఆర్థిక శాఖను వదిలేయను జైట్లీజీ. మీరు తిరిగొచ్చేవరకు చేతిలోనే ఉంచుకుంటాను’ అన్నాను.. ఆయన చేతిలోంచి నా చేతిని తీసేసుకుంటూ. 

డాక్టర్లు లోపలికి తీసుకెళుతుంటే, మళ్లీ నన్ను దగ్గరికి పిలిపించుకున్నారు జైట్లీ. వెళ్లాను. నాతో ఏం చెప్పకుండా డాక్టర్ల వైపు చూశారు. నన్ను దగ్గరకు రమ్మన్నారంటే, వాళ్లను దూరంగా వెళ్లమంటున్నారని డాక్టర్లు అర్థం చేసుకుని పక్కకు వెళ్లిపోయారు.
‘‘చెప్పండి జైట్లీజీ’’ అన్నాను. 
‘‘ఎయిమ్స్‌ డాక్టర్లలో మార్పు కనిపిస్తోంది గోయల్‌. పేషెంట్‌లని నెమ్మది నెమ్మదిగా అర్థం చేసుకోగలుగుతున్నారు’’ అన్నారు జైట్లీ నవ్వుతూ.
నేనూ నవ్వేందుకు ట్రై చేసి, ‘‘చెప్పండి జైట్లీజీ.. ఎందుకో నన్ను దగ్గరకు రమ్మన్నారు..’’ అన్నాను. అప్పటికే నేను ఆర్థిక శాఖను డీల్‌ చేయబోయే టెన్షన్‌లో ఉన్నాను. 
‘‘ఎవరైనా చేతిలో చెయ్యి వేసినప్పుడు, వేసినవాళ్లే తీసేవరకు మనం ఆగాలి గోయల్‌. ముందే మనం మన చేతిని తీసేసుకోకూడదు’’ అన్నారు జైట్లీ. ‘‘అయ్యో.. జైట్లీజీ, అది నేను తప్పనుకోలేదు’’ అన్నాను. 
‘‘పర్లేదు గోయల్‌. పిల్లవాడివి కదా!’’ అన్నారు.. మరికాస్త దగ్గరగా రమ్మన్నట్లు సైగ చేస్తూ. వెళ్లాను.
‘‘చేతిని వదిలించుకో. కానీ చేతిలో ఉన్నదాన్ని వదులుకోకు’’ అన్నారు జైట్లీ. 
ఆపరేషన్‌ అయ్యాక కూడా జైట్లీ తన శాఖను తను తీసుకోవడం లేదు. కనిపించి నప్పుడు మాత్రం నవ్వి, ‘బాగున్నావా?’ అని అడుగుతున్నారు.
ఇంటి బయట అరుపులు వినిపిస్తు న్నాయి!! బాల్కనీలోకి వెళ్లి చూశాను. రాహుల్, ఏచూరి, స్వామి! చేతుల్లో కాగితా లున్నాయి. వాటిని ఊపుతూ అరుస్తున్నారు. ‘మోదీ బయటికి రా’ అని రాహుల్, ఏచూరి అరుస్తున్నారు. ‘అథియా బయటికి రా’ అని స్వామి అరుస్తున్నాడు. స్విస్‌ బ్యాంకులో మన వాళ్ల డబ్బు ఎందుకంత పెరిగిందో చెప్పాలట! డిమాండ్‌ చేస్తున్నారు.  రాహుల్, ఏచూరి డిమాండ్‌ చెయ్యడంలో అర్థముంది. స్వామి ఎందుకు డిమాండ్‌ చేస్తున్నాడో అర్థం కాలేదు. ఆయన మా పార్టీ మనిషి. అథియా మా ఫైనాన్స్‌ సెక్రెటరీ. అయినా డిమాండ్‌ చేస్తున్నాడు! 
జైట్లీ అన్నది నిజమే.
అన్నీ ఒక పెట్టు, ఆర్థిక శాఖ ఒక పెట్టు.
మాధవ్‌ శింగరాజు

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top