హద్దులు దాటిన అమానుషత్వం

Absentity ; Mallepalli Laxmaiah writes on Professor Saibaba - Sakshi

కొత్త కోణం

సాయిబాబాకి చట్ట ప్రకారమే శిక్షలు విధించామని చెప్తున్నారు. కానీ అదే చట్టాల్లో ఖైదీల హక్కుల గురించి ఉన్న అంశాలను ఆయన విషయంలో అమలు చేయకపోవడం రెండు నాల్కల వైఖరి తప్ప మరోటి కాదు. జైళ్లలోని ఖైదీల ఆరోగ్య బాధ్యతను జైలు అధికార యంత్రాంగం పట్టించుకోకపోవడం చట్టబద్ధ్దం అవుతుందా? సాయిబాబా విషయంలో చట్టాలను అమలుపరచాల్సిన అధికార యంత్రాంగం కక్షపూరితంగా వ్యవహరిస్తున్నట్టు కనిపిస్తున్నది. ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమైన సంకేతం.

‘‘రాబోయే చలికాలాన్ని గురించి ఆలోచించాలంటే నాకు భయమేస్తోంది. ఇప్పటికే నిరంతరం జ్వరంతో వణికిపోతున్నాను. నాకు దుప్పటి లేదు. స్వెట్టర్‌ లేదు. ఉష్ణోగ్రతలు తగ్గేకొద్దీ కాళ్లను, ఎడమ చేతిని వేధిస్తున్న నొప్పి పెరిగిపోతోంది. నవంబర్‌ నుంచి మొదలయ్యే చలికాలంలో బ్రతికి ఉండడం నాకు అసాధ్యం. ఇక్కడ నేను ఆఖరి ఘడియల్లో ఉన్న జంతువులా జీవిస్తు న్నాను. ఎనిమిది నెలలు ఎలాగో తట్టుకొని జీవించగలిగాను. కానీ రానున్న శీతాకాలాన్ని తట్టుకొని జీవించలేను. ఇంక నా ఆరోగ్యం గురించి రాయడం వల్ల ఏ మాత్రమూ ప్రయోజనం లేదు. ఏది ఏమైనా నవంబర్‌ చివరి నాటికి సీనియర్‌ న్యాయవాదిని ఖరారు చేయండి. అక్టోబర్‌ చివరి వారంలో గానీ నవంబర్‌ మొదటి వారంలో గానీ నా బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేయమని గాడ్లింగ్‌కి తెలియజేయండి. ఇది ఈ విధంగా జరగకపోతే పరిస్థితి నా చేతిలో ఉండదని గుర్తుంచుకోవాల్సింది. ఇంక నా బాధ్యత ఏమీ లేదు. ఈ విషయం స్పష్టంగా చెపుతున్నాను. ఇక మీదట ఈ విషయం గురించి నేను ఏమీ రాయబోవడం లేదు. శ్రీమతి రెబెకాజీ, నందిత నారాయణ్‌లతో మాట్లాడు. అలాగే ప్రొఫెసర్‌ హరగోపాల్‌ తదితరులతో మాట్లాడు. మొత్తం పరిస్థితిని వివరించు. ఈ పని త్వరగా చేయవలసింది. ఒక నిర్భాగ్యుడిలా, భిక్షగాడిలా మిమ్మల్ని పదే పదే ప్రాధేయపడాల్సిరావడం నన్ను కుంగ దీస్తోంది. కానీ మీరెవ్వరూ ఒక్క అంగుళం కూడా ముందుకు కదలడం లేదు. నా పరిస్థితిని ఎవరూ అర్థం చేసుకోవడం లేదు. అనేక ఆరోగ్య సమస్యలతో ఒక చెయ్యి మాత్రమే పనిచేస్తున్న 90 శాతం వైకల్యం గల మనిషి జైలులో ఉన్నాడన్న విషయం ఎవరూ అర్థం చేసుకోవడం లేదు. నా ప్రాణం గురించి ఎవరికీ పట్టింపులేదు. ఇది కేవలం నేరపూరిత నిర్లక్ష్యం. నిర్లక్ష్య వైఖరి. నీ ఆరోగ్యం జాగ్రత్త. నీ ఆరోగ్యమే నా ఆరోగ్యం, మొత్తం మన కుటుంబ ఆరోగ్యం. ఇప్పుడు నీ ఆరోగ్యాన్ని చూసుకోవడానికి ఎవరూ లేరు. నేను నీ వద్దకు వచ్చేదాకా నీ ఆరోగ్యం పట్ల అశ్రద్ధ వహించవద్దు.’’  - ప్రేమతో నీ సాయి.

ఎవరీ ‘సాయి?’
మావోయిస్టులతో సంబంధాలున్నాయన్న ఆరోపణతో, కేవలం ల్యాప్‌ టాప్, కంప్యూటర్‌ల సాంకేతిక ఆధారాలతో మహారాష్ట్రలోని గడ్చిరోలి కోర్టు విధిం చిన జీవితఖైదుని అనుభవిస్తూ...  ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ సాయిబాబా నాగ్‌పూర్‌ అండా సెల్‌నుంచి అత్యంత దయనీయమైన స్థితిలో తన భార్య వసంతకు రాసిన లేఖ ఇది. భారత దేశంలో అమలౌతోన్న ప్రజాస్వామిక వాతావరణాన్ని ఇది చెప్పకనే చెపుతోంది. అసలింతకీ ఎవరీ సాయిబాబా? ఎందుకీ చర్చ?

సాయిబాబా తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలో 1967లో ఒక నిరుపేద రైతు కుటుంబంలో జన్మించారు. స్కాలర్‌షిప్‌ల సాయంతో చదువు సాగించారు. అమలాపురంలోని ఎస్‌కేబీఆర్‌ కళాశాలలో డిగ్రీ చదువుతున్న ప్పుడు, విశ్వవిద్యాలయ స్థాయిలో మంచి ప్రతిభను కనబరచి, హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌లో చేరారు. అదే సమ యంలో ఆయనకు విప్లవ రాజకీయాలతో సంబంధాలేర్పడ్డాయి. ఏఐపీ ఆర్‌ఎఫ్‌ (అఖిల భారత ప్రజా ప్రతిఘటనా వేదిక)లో కొనసాగుతూ ఢిల్లీ యూనివర్సిటీలో అధ్యాపక వృత్తిలో జీవనం సాగించేవారు. చిన్నతనంలోనే పోలియో వచ్చి ఆయన రెండు కాళ్లూ చచ్చుబడిపోయాయి. ఢిల్లీకి చేరేంత వరకు ఆయన చాలా వరకు రెండు చేతుల సాయంతో నేల మీద పాకుతూ వెళ్లేవారు. సహచరి వసంతతో పెళ్లి అనంతరం సాయిబాబా ఆమె సహకా రంతో నడవడం అలవర్చుకున్నాడు. రాజకీయాల్లో భుజం భుజం కలిపి నడిచినట్టే, అతనికి తోడునీడై నిలచిన ఆమె అతని భారాన్ని మోసేందుకు తన జీవితాన్ని అర్పించింది. ఇటువంటి పరిస్థితిలోని సాయిబాబాకు మహారాష్ట్ర లోని గడ్చిరోలి కోర్టు, మావోయిస్టులతో సంబంధాలున్నాయనే ఆరోపణతో చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం(ఉపా)లోని వివిధ సెక్షన్‌ల ప్రకారం జీవిత ఖైదు విధించింది. ఉపాలోని సెక్షన్‌ 13 కింది చట్ట వ్యతిరేక కార్యకలాపాలు, సెక్షన్‌ 18 కింద ప్రభుత్వాన్ని కూలదోసే కుట్ర, 20, 38, 39 సెక్షన్ల కింద  ఉగ్రవాద సంస్థల్లో సభ్యత్వం లేదా వాటితో సంబంధాలు కలిగి ఉండటం, ఆ కార్యకలాపాలకు మద్దతుగా నిలబడటం లాంటి నేరారోపణలు చేశారు. అందుకుగానూ సాయిబాబా సహా జెఎన్‌యు పరిశోధక విద్యార్థి హేమ్‌ మిశ్రా, జర్న లిస్టు ప్రశాంత్‌ రాహి, మహేష్‌ టిర్కి, పాండు నరోత్‌లకు గడ్చిరోలి కోర్టు జీవిత ఖైదుని విధించింది. వారితో పాటు విజయ్‌ టిర్కి అనే గిరిజనుడికి పదేళ్ల కారాగార శిక్షను కోర్టు విధించింది.

చట్టాలకు తిలోదకాలిచ్చి...
అయితే, సాయిబాబా పరిస్థితి ప్రత్యేకమైనది. 90 శాతం వైకల్యంతో పాటు ఎన్నో ఇతర తీవ్రమైన అనారోగ్య సమస్యలు కూడా ఆయన్ను సుదీర్ఘకా లంగా వేధిస్తున్నాయి. సాయిబాబా గత 15 ఏళ్లుగా హైబీపీతో సతమతమౌ తున్నారు. ఒక్క చేయి పూర్తిగా కదిలించలేరు. దీనికి తోడు పోలీసుల విచా రణలో ఒక చేయి పూర్తిగా పనిచేయని స్థితికి వచ్చింది. కార్డియోమయోపతి (గుండె కండరాలకు సంబంధించిన వ్యాధి) కూడా ఉంది. గాల్‌ బ్లాడర్‌లో రాళ్ల సమస్య తీవ్రంగా ఉంది. వీటికి తోడు వేరొకరి సహకారం లేకుండా కదల్లేని స్థితిలో, గడ్డకట్టే చలిలో నేలపైన పాకుతూ బతకడం ఎంత కష్టమో అర్థం చేసుకోవచ్చు. అన్ని వ్యాధులతో, కదల్లేని స్థితిలో ఉన్న నిస్సహాయుణ్ణి గాలీ వెలుతురూ సోకని అండాసెల్‌ అనే చీకటి గదిలో ఉంచడంలో ఆంతర్యం ఏమిటో అంతు పట్టదు. నిజానికి ఇలాంటి ఖైదీ ఉండాల్సినది ఆసుపత్రిలో, వైద్యుల పర్యవేక్షణలో. కానీ సాయిబాబాని ఉంచింది అండా సెల్‌ అనే చీకటి గుహలో. మన ౖజైళ్ల చట్టంలోని 37, 38, 39 సెక్షన్‌ల ప్రకారం జైలు అధికా రులు ఖైదీలకు అనారోగ్య సమస్యలు ఏర్పడినప్పుడు వారిని వెంటనే జైలు లోని ఆసుపత్రికి తరలించాలి. ఇంకా అదనపు వైద్య సహాయం అవసరమైన పుడు ప్రత్యేక సదుపాయాలు కలిగిన బయటి ఆసుపత్రుల్లో అవసరమైన వైద్య సహకారం అందించాలని చట్టాలు స్పష్టం చేస్తున్నాయి. పౌరుడికి జీవించే హక్కు ఉంది. అలాగే ఖైదీకి సైతం ఆ హక్కు ఉంటుంది. కాకపోతే అతను పోలీసుల నిర్బంధంలో ఉంటే, ఇతను బాహ్య ప్రపంచంలో ఉంటాడు. నిజానికి నిర్బంధంలో ఉన్నప్పుడు అతను ఆరోగ్యంగా ప్రాణా లతో ఉండేలా చూడాల్సిన బాధ్యత జైలు అధికారులపైనా, ఇంకా చెప్పా లంటే ప్రభుత్వం పైనా ఉంటుంది.

సాయిబాబాకి చట్ట ప్రకారమే శిక్షలు విధించామని ప్రభుత్వాధినేతలు, పోలీసు అధికారులు, న్యాయాధిపతులూ చెప్తున్నారు. కానీ అదే చట్టాల్లో ఖైదీల గురించి ఉన్న అంశాలను అమలు చేయకపోవడం రెండు నాల్కల వైఖరి తప్ప మరోటి కాదు. జైళ్లలోని ఖైదీల ఆరోగ్య బాధ్యతను జైలు అధికార యంత్రాంగం పట్టించుకోకపోవడం చట్టబద్దం అవుతుందా? చట్ట వ్యతిరేకం అవుతుందా? మరణ శిక్ష విధించిన ఖైదీని సైతం ఎటువంటి అనారోగ్యం ఉన్నా ఉరితీయకూడదనే నిబంధనను కచ్చితంగా పాటిస్తారు. ఖైదీలు సంపూ ర్ణారోగ్యంతో ఉండేలా జైలు అధికారులు చర్యలు తీసుకోవాలనేదే దాని అసలు ఉద్దేశం. పైగా ఐక్యరాజ్య సమితిలోని సభ్యదేశంగా భారత్, దివ్యాం గుల హక్కుల ఒప్పందాన్ని అమలుచేయాల్సి ఉంది. అందులోని సెక్షన్‌  15(1), సెక్షన్‌15(2) ప్రకారం అంగ వైకల్యంతో గానీ, మానసిక వైకల్యంతో గానీ బాధపడుతున్న ఏ వ్యక్తినీ అమానవీయంగా చూడటం, చిత్రహింసలకు గురిచేయడం జరగకుండా అన్ని ప్రభుత్వాలు, న్యాయవ్యవస్థలు అధికార యంత్రాంగం చట్టపరమైన ఏర్పాట్లు చేయాలి. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 21 భారత పౌరులందరి ఆత్మగౌరవం, జీవన భద్రతలకు రక్షణనిచ్చే హక్కుకు హామీ కల్పిస్తోంది. సాయిబాబా విషయంలో మన ప్రభుత్వం ఈ నిర్దేశాలన్నిటికి తిలోదకాలిచ్చినట్టు స్పష్టమౌతోంది.

ప్రజాస్వామ్యంపై విశ్వాసం సడలదా?
అంగవైకల్యంతో చిత్రహింసలకు గురై, అతి దయనీయ స్థితిలో సాయి బాబా అండా సెల్‌లో మగ్గుతుంటే... మరోవైపు ప్రజా ధనాన్ని వనరులనీ దోచేసి, ప్రభుత్వాలనీ, వ్యవస్థలనీ భ్రష్టుపట్టించిన అనేక మంది బడా రాజకీయ, ఆర్థిక నేరçస్తులు జైళ్లలో ఫైవ్‌స్టార్‌ హోటల్‌లో లభించే విలాసాలతో గడు పుతున్నారని ప్రముఖ జర్నలిస్టు సునేత్రా చౌదరి ఇటీవల తాను రాసిన బిహైండ్‌ బార్స్‌ అనే పుస్తకంలో వివరంగా వర్ణించారు. అందులో, ఉత్తర ప్రదేశ్‌ మాజీ మంత్రి పప్పూ యాదవ్, వివాదాస్పద ఆయుధ వ్యాపారి అభి షేక్‌ వర్మ, స్టార్‌ టీవీ సీఈఓ పీటర్‌ ముఖర్జీ, 2–జీ కుంభకోణం నిందితుడు మాజీ కేంద్ర మంత్రి ఎ. రాజా, ఓట్ల కోసం నోట్ల కేసులో నిందితుడు, సమా జ్‌వాదీ పార్టీ నాయకుడు అమర్‌సింగ్‌ లాంటి వ్యక్తులు దేశంలోని వివిధ జైళ్లలో రాజభోగాలు అనుభవించిన తీరును సాక్ష్యాధారాలతో సహా రచయిత్రి ఈ పుస్తకంలో పేర్కొన్నారు.

జైళ్లలోని ఖైదీల పట్ల అధికారులు చూపుతున్న ఈ పరస్పర విరుద్ధ వైఖరులు మన ప్రజాస్వామ్య విధానం పట్ల విశ్వాసాన్ని సడలింపజేసేవిగా ఉన్నాయి. ఒకే దేశానికి సంబంధించిన రెండు వర్గాలకు చెందిన వ్యక్తుల పట్ల ప్రభుత్వాలు అనుసరిస్తున్న ఈ ద్వంద్వ వైఖరికి మన దేశంలోని జైళ్లు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. చట్టాలు అందరికీ సమానమైన అవకాశాలను, హక్కులను కలిగించాలి. కానీ ఇక్కడ సాయిబాబా లాంటి వ్యక్తులు చట్ట ప్రకారం శిక్ష అనుభవిస్తున్నప్పటికీ, చట్టాలను అమలుపరచాల్సిన అధికార యంత్రాంగం కక్షపూరితంగా వ్యవహరిస్తున్నట్టు కనిపిస్తున్నది. ఇది ప్రజా స్వామ్యానికి ప్రమాదకరమైన సంకేతం. స్వాతంత్య్రానికి ముందు కొమురం భీం నాయకత్వంలో సాగిన ఆదివాసీ ఉద్యమాన్ని సమీక్షించి, తగు పరిష్కా రాలను చూపాలని నాటి రాచరిక నిజాం ప్రభుత్వం హేమండార్ఫ్‌ లాంటి సామాజిక శాస్త్రవేత్తలను కోరారు. వారి సలహాలను అమలు పరచడానికి ప్రయత్నించారు. దాన్ని చూసి అయినా మనం నేర్చుకోవాల్సింది ఏమిటో అర్థం చేసుకోవాలి.


- మల్లెపల్లి లక్ష్మయ్య

వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు ‘ 97055 66213 

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top