కబళిస్తున్న కాలుష్యం

Special Story On Pollution In Funday On 01/12/2019 - Sakshi

‘స్వచ్ఛ‘భారతదేశంలో స్వచ్ఛమైన గుక్కెడు గాలి దొరకడమే గగనమైపోతోంది. దుమ్ము ధూళి నానా రకాల పొగతో నిండిన గాలి పీల్చక తప్పని స్థితిలో జనాలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. సాక్షాత్తు దేశ రాజధాని ఢిల్లీలో వాయుకాలుష్యం ఎంత దారుణంగా మారిందంటే, అక్కడి జనాలు స్వచ్ఛమైన గాలి కోసం ఆక్సిజన్‌ బార్లను ఆశ్రయించాల్సి వస్తోంది. ప్రపంచంలోని మొదటి పన్నెండు కాలుష్య నగరాల్లో పదకొండు మన దేశంలోనే ఉన్నాయంటే, మనది ఎంతటి ‘స్వచ్ఛ’భారతమో అర్థం చేసుకోవచ్చు. ప్రకృతి వైపరీత్యాలు, మహమ్మారి వ్యాధులకు మించి కాలుష్యం జనాల ప్రాణాలను కబళిస్తోంది.

మన దేశంలో గత ఏడాది 12.4 లక్షల మంది కేవలం వాయు కాలుష్యం కారణంగా తలెత్తిన ఆరోగ్య సమస్యలతో ప్రాణాలు పోగొట్టుకున్నారు. దేశంలో సంభవిస్తున్న అకాల మరణాలలో దాదాపు 26 శాతం మరణాలు కాలుష్యం కారణంగా సంభవిస్తున్నవేనని అధికారిక గణాంకాలే చెబుతున్నాయి. వాయువు మాత్రమే కాదు, ప్లాస్టిక్, రసాయనిక వ్యర్థాల కారణంగా నేలా నీరూ కూడా కలుషితమై ప్రజారోగ్యానికి పెను సవాలు విసురుతున్నాయి.

కాలుష్య నియంత్రణ కోసం ప్రభుత్వాలు ఎన్ని లక్ష్యాలు పెట్టుకున్నా, అవి నెరవేరే దాఖలాలే కనిపించడం లేదు. ప్రపంచంలోనే అత్యధిక స్థాయిలో కాలుష్యం ఉన్న తొలి 15 నగరాల జాబితాలో 14 భారత్‌కు చెందిన నగరాలే ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ప్రకటించింది. వాయు కాలుష్యం వల్ల దేశంలో దాదాపు 20 లక్షల మందికి పైగా పిల్లలు తీవ్రమైన ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్నారు. వీరిలో దాదాపు సగం మంది దేశ రాజధాని ప్రాంతంలో ఉన్న పిల్లలేనని ఢిల్లీ హార్ట్‌ అండ్‌ లంగ్‌ ఇన్‌స్టిట్యూట్‌ వెల్లడించింది.

భారత్‌లో వాయు కాలుష్యం గడచిన పదేళ్లలో విపరీతంగా పెరిగిందని, సగానికి సగం ఆరోగ్య సమస్యలు వాయు కాలుష్యం ఫలితంగా తలెత్తుతున్నవేనని జాతీయ, అంతర్జాతీయ సంస్థలు చెబుతున్నాయి. నానాటికీ పెరుగుతున్న వాహనాలు, పరిశ్రమలు, పల్లెల్లో ఇంకా వంట కోసం కట్టెలు, పిడకలు వాడటం వంటివన్నీ వాయు కాలుష్యాన్ని ప్రమాదకరమైన స్థాయికి చేరుస్తున్నాయి. ఎరువులు, పురుగు మందులు, ప్లాస్టిక్‌ వ్యర్థాలు, పరిశ్రమల నుంచి వెలువడే రసాయనిక వ్యర్థాలు నేలనూ నీటినీ కూడా కలుషితం చేస్తున్నాయి. కాలుష్యం లేని చోటు భూతలమంతా వెదికిన దొరకదు అనేంతగా పరిస్థితి నానాటికీ విషమిస్తోంది.

జనాలు ఉక్కిరిబిక్కిరి
మన దేశంలో దాదాపు 14 కోట్ల మందికి పైగా ప్రజలు రోజూ కలుషితమైన గాలి పీలుస్తూ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వారు పీల్చే గాలి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) నిర్దేశించిన ప్రమాణాల కంటే పదిరెట్లు ప్రమాదకరంగా ఉంటోంది. మన దేశంలో ఏటా సంభవించే అకాల మరణాల్లో దాదాపు 20 లక్షల వరకు మరణాలు వాయు కాలుష్యానికి సంబంధించినవే. ప్రస్తుతానికి అందుబాటులో ఉన్న లెక్కల ప్రకారం 2017లో వాయు కాలుష్యం కారణంగా 1,95,546 మంది చిన్నారులు మరణించారు. ఇదే విషయాన్ని కాస్త తేలికగా చెప్పుకోవాలంటే, మన దేశంలో ప్రతి మూడు నిమిషాలకు ఒక చిన్నారి వాయు కాలుష్యానికి బలైపోతున్నారు. వాహనాలు, పరిశ్రమల నుంచి వెలువడే పొగ నగరాలను, పట్టణ ప్రాంతాలను ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే, ఇంకా కట్టెలు, పిడకలపైనే ఆధారపడి వంట చేయడం, శీతకాలంలో చలిమంటలు వేసుకోవడం, కోతల తర్వాత పంటల వ్యర్థాలను నేలలో పూడ్చిపెట్టకుండా ఎక్కడికక్కడ తగులబెట్టడం వంటి చర్యలు పల్లెలను ఊపిరాడకుండా చేస్తున్నాయి.

హరితావరణానికి దెబ్బతీసే వాయువులను అత్యధికంగా వెదజల్లే దేశాల్లో చైనా, అమెరికాల తర్వాత భారత్‌ మూడో స్థానంలో ఉంది. వాయు కాలుష్యం ఫలితంగా పొగతాగే అలవాటు లేనివారిలో 30 శాతం మంది సైతం ఊపిరితిత్తుల వ్యాధుల బారిన పడుతున్నారు. వాయు కాలుష్య నిరోధం, నియంత్రణల కోసం ప్రభుత్వం 1981లోనే ఒక చట్టాన్ని తెచ్చినా, ఆ చట్టం సక్రమంగా అమలుకు నోచుకోకపోవడంతో కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. ఐఐటీ కాన్పూర్‌ సాయంతో ప్రభుత్వం 2015లో జాతీయ వాయు నాణ్యత సూచిని ప్రారంభించింది. పరిస్థితి నానాటికీ దిగజారుతుండటంతో ఈ ఏడాది ‘నేషనల్‌ క్లీన్‌ ఎయిర్‌ ప్రోగ్రామ్‌’ను ప్రారంభించి, రానున్న ఐదేళ్లలో గాలిలోని పీఎం 2.5, పీఎం 10  కాలుష్యాలను 20–30 శాతం మేరకు తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుంది. జాతీయ వాయు నాణ్యత ప్రమాణాల కంటే తక్కువ స్థాయిలో వాయు కాలుష్యం ఎక్కువగా ఉన్న 102 నగరాల్లో ఈ కార్యక్రమాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం సమాయత్తమవుతోంది.

కల్తీ ఇంధనం... ట్రాఫిక్‌ రద్దీ...
పట్టణ ప్రాంతాల్లో వాయు కాలుష్యానికి ఆటోల వంటి వాహనాల్లో వాడే కల్తీ ఇంధనం, విపరీతమైన ట్రాఫిక్‌ రద్దీ వాయు కాలుష్యానికి ప్రధాన కారణాలవుతున్నాయి. ఇంధన ధరలు నానాటికీ పెరుగుతుండటంతో తక్కువ ఖర్చుతో వాహనాలను నడపాలనే ఆలోచనతో చాలా చోట్ల ఆటో డ్రైవర్లు దాదాపు 20–30 శాతం మేరకు కల్తీ ఇంధనం వాడుతున్నారు. కల్తీ ఇంధనం ఫలితంగా ప్రమాదకరమైన పదార్థాలు వెలువడి వాతావరణం కలుషితమవుతోంది. కిక్కిరిసిన ట్రాఫిక్‌ కారణంగా వాహనాలు ఎక్కువ సేపు రోడ్లపైనే ఉండాల్సిన పరిస్థితులు కూడా వాయు కాలుష్యానికి ఇతోధికంగా దోహదపడుతున్నాయి.  ఈ పరిస్థితుల కారణంగానే ఢిల్లీ, బెంగళూరు వంటి నగరాల్లో దాదాపు 50 శాతానికి పైగా చిన్నారులు ఉబ్బసం బారిన పడుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) నివేదిక ప్రకారం ప్రపంచంలోనే అత్యంత కలుషిత నగరంగా మన దేశ రాజధాని ఢిల్లీ రికార్డులకెక్కింది.

నదులు కాలుష్య కాసారాలు
నదులను పరమ పవిత్రంగా పూజించే మన దేశంలో నదులేవీ స్వచ్ఛంగా లేవు. గంగ, యమున వంటి నదులు కాలుష్య కాసారాలుగా మారాయి. దేశంలోనే అతి పెద్ద నది అయిన గంగా నదీ పరివాహక ప్రాంతంలో దాదాపు 50 కోట్ల మంది నివసిస్తున్నారు. రోజూ గంగానదిలో సగటున 20 లక్షల మంది పవిత్రస్నానాలను ఆచరిస్తారు. గంగానది కాలుష్యం కారణంగా దేశ జనాభాలో దాదాపు సగం మంది ఆరోగ్య సమస్యల బారిన పడే పరిస్థితులు ఉన్నాయి. దేశంలో చిన్నా చితకా నదులు ఉపనదులన్నీ కలుపుకొని దాదాపు 275 నదులు ఉంటే, వాటిలో 121 నదులు పూర్తిగా కలుషితంగా మారాయని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ప్రకటించింది.

ఇళ్లకు సంబంధించిన డ్రైనేజీ నీటిని, కర్మాగారాలకు చెందిన రసాయన వ్యర్థాలతో నిండిన నీటిని యథేచ్ఛగా నదుల్లోకి మళ్లిస్తుండటం వల్లనే దేశంలోని నదీజలాలు దారుణంగా కలుషితమవుతున్నాయి. గంగా, యమున నదులను శుభ్రపరచడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించినా, ఆశాజనకమైన ఫలితాలేవీ కనిపించడం లేదు. దేశంలోని భూగర్భ జలాలను మినహాయిస్తే, నదులు, తటాకాల వంటి ఉపరితల జలాల్లో దాదాపు 80 శాతం జలాలు కలుషితంగా మారాయని కాలుష్య నియంత్రణ మండలి ప్రకటించింది.

దేశంలోని ప్రథమ, ద్వితీయ శ్రేణి నగరాల నుంచి 1991 నాటికి రోజుకు 1200 కోట్ల లీటర్ల మురుగు నీరు నదుల్లోకి చేరేదని, 2018 నాటికి ఈ పరిమాణం 6200 కోట్ల లీటర్లకు చేరుకుందని వెల్లడించింది. చాలా చోట్ల శుద్ధిచేయని మురుగునీటిని నేరుగా నదుల్లోకి వదిలేస్తుండటంతో నదుల్లో ప్రమాదకరమైన బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్‌ వంటి సూక్ష్మజీవులు పెరిగి ప్రాణాంతకమైన వ్యాధులకు దారితీస్తున్నాయి. మరోవైపు ప్లాస్టిక్‌ వ్యర్థాలు కూడా యథేచ్ఛగా నదుల్లోకి చేరుతుండటంతో పరిస్థితి మరింతగా దిగజారుతోంది. వరదలు ముంచెత్తినప్పుడు నదీ పరివాహక ప్రాంతాల్లో తక్షణ ప్రాణనష్టం, ఆస్తినష్టంతో పాటు వరదల ఉధృతి తగ్గిన తర్వాత కొన్నాళ్ల పాటు వ్యాధుల తాకిడి కొనసాగే పరిస్థితులు నెలకొంటున్నాయి. దేశంలోని దాదాపు 80 శాతం జీర్ణకోశ వ్యాధులు నీటి కాలుష్యం వల్ల వస్తున్నవేనని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి.

నేల విలవిల
కాలుష్యం తాకిడి నేల కూడా విలవిలలాడుతోంది. కాలుష్యం దెబ్బకు విలువైన మట్టిసారం నాశనం అయిపోతోంది. మట్టి కాలుష్యం వ్యవసాయ ఉత్పాదనకు, ఆహార భద్రతకు, మనుషుల ఆరోగ్యానికి ముప్పుగా మారుతోందని ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్‌ఏఓ) గత ఏడాది విడుదల చేసిన ‘సాయిల్‌ పొల్యూషన్‌: ఎ హిడెన్‌ రియాలిటీ’ నివేదికలో ఆందోళన వ్యక్తం చేసింది. ‘‘మట్టి కాలుష్యం మనం తినే తిండిపైనా, మనం తాగే నీటిపైనా, మనం పీల్చే గాలిపైనా ప్రభావం చూపుతోంది. ఇది మన ఆరోగ్యాన్నీ, పర్యావరణాన్నీ, జీవ వైవిధ్యాన్నీ దెబ్బతీస్తోంది’’ అంటూ ఎఫ్‌ఏఓ డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌ మారియా హెలెనా సెమెడో ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా మట్టి కాలుష్యాన్ని నివారించడానికి అన్ని దేశాలూ అత్యధిక ప్రాధాన్యమివ్వాలని ఆమె పిలుపునిచ్చారు.

కాలుష్య నియంత్రణ కోసం ప్రభుత్వం ‘స్వచ్ఛభారత్‌’ వంటి కార్యక్రమాన్ని చేపడుతున్నా, పర్యావరణ లక్ష్యాలను అందుకోవడంలో మన దేశం మరింతగా వెనుకబడుతోందని అంతర్జాతీయ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 180 దేశాలకు చెందిన ‘గ్లోబల్‌ ఎన్విరాన్‌మెంట్‌ పెర్ఫార్మెన్స్‌ ఇండెక్స్‌’ (ఈపీఐ)– 2016 జాబితాలో 141వ స్థానంలో నిలిచిన భారత్, 2018 నాటి జాబితాలో 177వ స్థానానికి పడిపోయింది. ఈపీఐ వెల్లడించిన వివరాల ప్రకారం వాయు నాణ్యతలో భారత్‌ 5.75 శాతం స్కోరు మాత్రమే సాధించింది.

ఇదే జాబితాలో జపాన్, స్విట్జర్లాండ్‌లు 90 శాతం స్కోరుతో అగ్రస్థానంలో నిలిచాయి. ఇదిలా ఉంటే, ఇప్పటికీ మన దేశంలో 4.73 కోట్ల మంది గ్రామీణ ప్రజలు తాగునీటి కోసం కలుషితమైన భూగర్భ జలవనరులపైనే ఆధారపడుతున్నారు. ప్రభుత్వం ఒకవైపు దేశంలోని ప్రతి ఇంటికీ 2030 నాటికల్లా మంచినీటి కొళాయిల ద్వారా మంచినీటి సరఫరా చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రకటించినా, ఇప్పటికీ 18 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో 82 శాతం ఇళ్లకు మంచినీటి కొళాయిలు లేవు.

విచ్చలవిడిగా పెరుగుతున్న ఘనవ్యర్థాలు మట్టిని కలుషితం చేస్తున్నాయి. మన దేశంలోని నగరాల్లో ఏటా 10 కోట్ల టన్నులకు పైగా ఘన వ్యర్థాలు నేల మీదకు చేరుతున్నాయి. చాలాచోట్ల నివాస ప్రాంతాల్లో వీధుల పక్కనే చెత్తకుప్పలు పడి ఉంటున్నాయి. ఈ ఘన వ్యర్థాల్లో కొన్ని కాలువల్లోకి, నదుల్లోకి చేరుతున్నాయి. చెత్తను సేకరించి, రీసైకిల్‌ చేయడం, జనాలకు హాని కలగని రీతిలో నాశనం చేయడం వంటి ప్రక్రియలు కొద్దిచోట్ల మాత్రమే జరుగుతున్నాయి. మన దేశంలో పట్టణ ప్రాంతాల్లో పేరుకుపోతున్న చెత్తలో దాదాపు 40 శాతం చెత్తను ఎవరూ పట్టించుకోకుండా అలాగే వదిలేస్తున్నారు.

వీటిలో వ్యాధులకు దారితీసే ఆస్పత్రి వ్యర్థాలు కూడా ఉంటున్నాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. మన దేశంలో సగానికి సగం ఆస్పత్రి వ్యర్థాలను సరైన రీతిలో నాశనం చేయకుండా, ఇష్టానుసారం ఆరుబయట పడేస్తున్నట్లు జాతీయ స్థాయిలో నిర్వహించిన ఒక తాజా అధ్యయనంలో తేలింది. తడి పొడి చెత్తలను వేరు చేయకుండా ఇష్టానుసారం వీధుల్లో పడేస్తుండటంతో ఆరుబయటి చెత్తకుప్పలు దోమలు, ఈగలు, బొద్దింకలు, ఎలుకలు, పందులకు ఆవాసాలుగా మారి, ప్రమాదకరమైన వ్యాధులు విజృంభించడానికి కారణమవుతున్నాయి. గాలి నీరు నేల కాలుష్యం కోరల్లో చిక్కుకోవడం వల్ల ఆర్థిక వ్యవస్థకు, ప్రజారోగ్యానికి తీరని నష్టం వాటిల్లుతోంది. పరిస్థితిని చక్కదిద్దడానికి సత్వర చర్యలను ప్రారంభించకపోతే ఢిల్లీ తరహాలోనే దేశంలోని మిగిలిన నగరాలు, పట్టణాల్లో ఆక్సిజన్‌ బార్లు వెలిసే పరిస్థితి దాపురించినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top