శివానంద లహరి

Shankara Vijayam Part 6 - Sakshi

ఆదిశంకరాచార్యుల జీవితచరిత్ర

సాక్షి గణపతి సన్నిధికి ఎడమ వైపున సుమారు ఇరవై గజాల లోతైన లోయ ఉంది. శంకరుడు అక్కడ తపోనిష్ఠలో ఉన్నాడు. పొద్దుపొడిచి చాలాసేపే అయినా సూర్యకిరణాలు ఇంకా అక్కడిదాకా ప్రసరించడం లేదు. పుష్యమాసపు మంచు లోయంతా ఆక్రమించుకుని ఉంది. కరుగుతున్న మంచుబొట్లు చెట్ల ఆకుల మీద నుంచి వానచినుకుల్లా కిందికి రాలి పడుతున్నాయి. 
శంకరుడక్కడ లోయకు అభిముఖంగా పద్మాసనంలో తపోనిష్ఠుడై ఉన్నాడు. ఎడమవైపున కొద్దిదూరంలో విష్ణుశర్మ కూర్చుని ఉన్నాడు. ఎక్కడి నుంచి సంపాదించాడో కానీ అతని ముందు కొన్ని భూర్జపత్రాలున్నాయి. ఏదో వ్రాసుకుంటున్నాడు. ఇద్దరూ మౌనాన్నే ఆశ్రయించారు.

శిరస్సు వంచి చిబుకాన్ని కంఠంలో గుచ్చి హఠయోగులు జాలంధర బంధం చేస్తారు. అది శంకరునికి సంకల్పంతోనే సిద్ధించింది. నాభి ప్రదేశం సమతలంగా ఉంది. ప్రణవజపం మణిపూరంలో అగ్నిని ప్రజ్వరిల్ల చేస్తోంది. మూలాధారంలో మూడున్నర చుట్టలు చుట్టుకుని నిద్రపోతున్న కుండలినికి గాలి అందడం లేదు. గుదస్థానంలో ఎడమ మడమను నొక్కిపెట్టి, కిందికిపోయే అపానవాయువును నిరోధించే మూలబంధం శంకరునికి పద్మాసనంలోనూ సాధ్యమైంది. కల్లోలమైన కుండలిని వేగంగా కదిలింది. ప్రాణవాయువు కోసం తహతహలాడుతూ సుషుమ్నను దాటి, కనుబొమల మధ్య ఆజ్ఞాచక్రంలోని పడగను విస్తరించి పైకిలేచి సహస్రారాన్ని వేగంగా ఢీ కొట్టింది.

‘దీర్ఘాయుష్షు... శతాయుష్షు... బ్రహ్మంత ఆయుష్షు...’ అంటూ పసితనంలో అమ్మ పెట్టిన ఆముదంతో మూసుకున్న బ్రహ్మరంధ్రం తేజోమయమైంది. కుండలిని సెగ సహస్రారాన్ని దాటి; పన్నెండు అంగుళాలకు పైన ఆవరించి ఉన్న చంద్రకళా స్థానాన్ని వేధించింది. 
పదహారు కళలతో శోభిల్లే చంద్రకళ క్రమంగా కరగడం మొదలు పెట్టింది. ఒక్కొక్కబొట్టుగా అమృత బిందువులను స్రవించడం ఆరంభించింది. అంగిట్లో కొండనాలుకతో అమృతాన్ని గుటక వేసిన కుండలినీ సర్పం శాంతి పొందింది. చంద్రుని చలవ అనాహతాన్ని ఆక్రమించి శంకరయోగికి దివ్యత్వం ఆపాదించింది. 
దక్ష ప్రజాపతి అల్లుడని కూడా చూడకుండా చంద్రుణ్ణి శపించాడు. అమావాస్యకు, పౌర్ణమికి నడుమ రెండు పక్షాలలోనూ క్షీణ, వృద్ధికళలతో చంద్రుడు మనుగడ సాగిస్తున్నాడు. పాపం తోడల్లుడు పోగొట్టుకున్న కళలన్నీ భద్రపరిచి, లోకకల్యాణం కోసం పోషిస్తూ ఉంటాడట శివపరమాత్మ. మార్గశీర్ష పౌర్ణమికి నారాయణ దర్శనమైన ఆనందంలో పూర్ణచంద్రుణ్ణి వెలిగ్రక్కుతాడట. కేవల కుంభక యోగంలో అప్పటివరకు నిశ్చలంగా ఉన్న శంకరయోగి కంఠం విశుద్ధ ప్రకాశంగా ఇలా పాడింది.

భక్తో భక్తి గుణావృతే ముదమృతా పూర్ణే ప్రసన్నే మనః
కుంభే సాంబ! తవాంఘ్రి పల్లవ యుగం సంస్థాప్య సంవిత్ఫలం
సత్త్వం మంత్ర ముదీరయన్‌ నిజ శరీరాగార శుద్ధిం వహన్‌
పుణ్యాహం ప్రకటీకరోమి రుచిరం కల్యాణ మాపాదయన్‌
–  సాంబా! శుభాలు పొందడం కోసం నేను శుద్ధి పుణ్యాహవాచనం ఆచరిస్తాను. నా మనస్సునే కలశంగా చేస్తాను. దానికి భక్తి అనే దారాలు చుడతాను. ఆనందమనే నీటిని అందులో పోస్తాను. నీ పాదయుగళం అనే మామిడి చిగుళ్లు అందులో ఉంచుతాను. జ్ఞానమనే కొబ్బరికాయను కలశంపై ఉంచి, పంచాక్షరీ మంత్ర జపంతో నా శరీరమనే నివాసాన్ని శుద్ధి పరుస్తాను.

సూర్యుడు నడిమధ్యకు వచ్చాడు. శంకరుని నోటివెంట శ్లోకలహరి కొనసాగుతోంది. విష్ణుశర్మ అప్పటికప్పుడు ఆ శ్లోకాలను అక్షరబద్ధం చేస్తున్నాడు. 
దేవతలందరూ మందరగిరిని కవ్వంగా చేసుకుని సముద్రాన్ని మథించారు. కల్పవృక్షం, కామధేనువు, చింతామణి, అమృతం, చంద్రుడు ఇవన్నీ ఆ మథనంలో నుంచే పుట్టాయి. విద్వాంసులందరూ తమ మనస్సునే కవ్వంగా చేసి, భక్తి అనే తాడుకట్టి, వేదాలనే మహాసముద్రాన్ని మథిస్తారు. భక్తిపరులకు ఆ మథనంలో కల్పవృక్షాదులే కాకుండా మోక్షలక్ష్మీ స్వరూపుడైన సోమేశ్వరుడు లభిస్తాడు అని శంకరుడు తరువాతి శ్లోకం చెప్పాడు. 

వీలైనంత వేగంగా వ్రాసుకుంటూ పోతున్నాడు విష్ణుశర్మ. రచనలోని ప్రవాహానికి తన్మయుడవుతూ, ఒక్కొక్కటే గుర్తు చేసుకుంటూ హృదయాన్ని పొంగించుకుంటున్నాడు.
శివా! నీ చరిత్ర దివ్యామృత మహాసముద్రం. దానిని నా వాక్కు అనే చేదతో బుద్ధి అనే మోటతాడును ఉపయోగించి తోడుకుంటాను. కాలువలుగా, పిల్లకాలువలుగా నా హృదయమనే పొలంలోకి ప్రవహింప చేసుకుంటాను. నీ చరిత్ర నాలో భక్తి పంటలు పండిస్తుంది. ఇంక నాకు కరువెక్కడిది? అని శంకరుడు మరోశ్లోకం చెప్పాడు.

విష్ణుశర్మ పంచెకు తడి తగలడంతో అదాటున లేచి నిలబడ్డాడు. వ్రాస్తున్న గ్రంథమంతా భద్రపరచి ఎక్కడి నుంచి వచ్చాయబ్బా ఈ నీళ్లు అని పరికిస్తున్నాడు. ఇందాక సరిగా గమనించలేదు... ఆ నీళ్లన్నీ శంకరునిపై వర్షించి కిందికి వస్తున్నాయి. కొండ నడిమధ్యలో ఒక ధార బయలుదేరింది. తరచి ఆలోచిస్తే కొద్దిసేపటి కిందట ‘టప్‌’మన్న చప్పుడు విన్న స్ఫురణ కలిగింది విష్ణుశర్మకు. పాపం అతడి ఏకాగ్రత భంగమైంది. అక్కడినుంచి వెళ్లి శంకరునికి కుడివైపున కూర్చున్నాడు.
శంకరుడింకా కన్నులు తెరవలేదు.

శివా! నేను నిన్ను ఆరాధిస్తాను. దానికి ఫలితంగా నన్ను బ్రహ్మగానో, విష్ణువుగానో నియమించి రొష్టుపెట్టకు. మళ్లీ నిన్ను చూడాలంటే పక్షిగా మారి పైకెగరలేను. వరాహమై పాతాళం దాకా తవ్వుకుంటూ పోలేను. లోతుకు పోయినా, పైకి ఎగిరినా నీవు కనబడక రోదిస్తూ కూర్చోలేను. శాశ్వతమైన సుఖాన్ని ప్రసాదించు చాలు అనే అర్థం వచ్చే శ్లోకాన్ని విష్ణుశర్మ వల్లెవేస్తున్నాడు.
ఊడిగ చెట్టు గింజలు చెట్టునుంచి రాలిపడినా మళ్లీ తల్లిని అతుక్కుపోతుంటాయి. ఒక్కసారి అతుక్కున్న తరువాత అయస్కాంతం సూదిని విడిచిపెట్టదు. పతివ్రత ఏనాడూ భర్తను విడిచి పెట్టదు. లత తనకు ఆధారమైన చెట్టును విడిచి ఉండలేదు. సముద్రుణ్ణి చేరుకోవాలనే నది ఆరాటం ఎడతెగదు. నిన్ను పొందేందుకు నాకు అటువంటి స్థిరచిత్తాన్ని ప్రసాదించు ఈశ్వరా!... అంటూ శంకరుడు మరోశ్లోకం చెప్పాడు. అంతలోనే అంతర్ముఖుడయ్యాడు.
అయిదు ఉపమానాలనూ తర్కిస్తూ, యతి ప్రాసలను, గణాలనూ సరిచూసుకుంటున్నాడు విష్ణుశర్మ.

‘టప్‌ టప్‌’ మని శబ్దం చేస్తూ ఒకదానివెంట ఒకటిగా అయిదు కొండరాళ్లు... చిన్నవే కానీ విసిరికొట్టినట్టు వచ్చి విష్ణుశర్మ ముందు పడ్డాయి. జలజల శబ్దం చేస్తూ అయిదు నీటిధారలు సరాసరిగా శంకరుని శిరస్సున పడుతూ అభిషేకం చేస్తున్నాయి. ఇందాకటి ఫాలధార కాక మరో అయిదుధారలు నిలువెల్లా కడిగేస్తుంటే శంకరునిలో తపన చల్లారుతూ శ్రీశైల సానువులలో కరిగిపోతోంది. ఇంతగా తడిసిపోతూ ఇంకా మెలకువ తెచ్చుకోడేం శంకరుడని విష్ణుశర్మ కంగారు పడుతున్నాడు. ఇంతలో...
‘‘ఓయ్‌... ఒహోయ్‌...’’ అన్న పిలుపు లోయ కింద నుంచి వినవచ్చింది. గిరుక్కున తలతిప్పి చూడడం వల్ల...అప్పుడే శంకరుడు కన్నులు విప్పిన సంగతి విష్ణుశర్మ గ్రహించలేదు.
‘‘లాల పోయించుకున్నది చాలు గానీ ఇక లేచి రావయ్యా సామీ!’’ అంటూ ఓ చెంచుబాలుడు లోయ దిగువభాగం నుంచి పైకి వచ్చాడు.
శంకరుడు పైకి లేచి, అతడిముందు సాగిలపడ్డాడు.

‘‘మా మల్లయ్యను చూసినందుకు మంచి బహుమానమే దక్కినట్టుందిగా’’ అన్నాడు ఆ బాలుడు. వెలుగు జ్యోతుల్లాంటి కన్నులతో శంకరుడు అవునన్నాడు.
‘ఎవరీ పిల్లాడు? వీడికి మొక్కుతాడేంటి మన స్వామి?’ అయోమయంగా పరిశీలన మొదలుపెట్టాడు విష్ణుశర్మ.
పొట్టిగా ఉన్న ఆ కుర్రాడికి బానపొట్ట ఉంది. పొట్టకంటే పెద్దదైన తలకాయ ఉంది. రావణుడు నెత్తిన మొట్టికాయ వేస్తే గోకర్ణ వినాయకుడికి సొట్ట పడిందట. ఈ పిల్లవాడి శిరస్సున ఆ సొట్ట విష్ణుశర్మకు కనిపించింది. అప్రయత్నంగా అతడూ సాగిలపడి లేచాడు.
కుర్రవాడు నవ్వుతూ, ‘‘సెబుతూ పోతుంటే ఒద్దిగ్గా రాసి పెట్టడం శానా కట్టమే గురూ! ఇకముందు ఎలా పడతావో బాధ’’ అన్నాడు. 
విష్ణుశర్మకు కన్నులు చెమర్చాయి.
‘‘ఏం పెద్దగురూ! తనివి తీరింది కదా! మరి అసలు గురుణ్ణి ఎప్పుడు చూడడం?’’ ప్రశ్నించాడు పిల్లవాడు.
‘‘దారి తెలియడం లేదు’’ అన్నాడు శంకరుడు.

‘‘లేదనుకుంటేనే హాయి గురూ! ఉంది అనుకుంటే ఏముంది? చద్దన్నం తిని కూచోడం తప్ప?! ఈ ప్రయాణం మధ్యలో ఆపెయ్యబోకు గురూ! చకచకా అడుగులెయ్‌. అసలు గురుడు నీకోసం అన్ని దారులూ మూసేసి గుహలో దాగిపోయి కూచున్నాడు. ఓంకార పర్వతాన్ని కింద నుంచి కొండచిలువలా కమ్మేస్తున్నాడు. నువ్వు కనబడితే తప్ప నర్మదకూ శాంతి లేదు. మాంధాత వంటివాడికే భయం పుట్టింది. పసితనంలో అతగాడు గుక్కపెట్టి ఏడుస్తూ ముల్లోకాలూ ఏకం చేసి పారేశాడట. పోన్లే పాపం అని ఇంద్రుడు వెళ్లి ఆ పిల్లాడి నోట్లో తన బొటన వేలు పెట్టాడట. అంతే టక్కున ఏడుపు ఆపేశాడు ఆ కాబోయే చక్రవర్తి. ఇన్ని యుగాల తర్వాత మళ్లీ ఆ విషయం గుర్తు చేసుకున్నాడు. ఇంకా అలాంటోళ్లు ఎంత మంది ఉన్నారో? ఊ... పద పద. నడువు’’ నవ్వుమొగంతో చెంచుబాలుడు అక్కడి నుంచి కదిలి లోయ దిగి నడుచుకుంటూ వెళ్లిపోయాడు.

అతడు పూర్తిగా కనుమరుగయ్యే వరకూ చూస్తూ ఉండిపోయారు స్నేహితులిద్దరూ. మెల్లిగా అక్కడి నుంచి కదిలారు. శ్రీశైల శిఖర దర్శనం చేసి ముందుకు సాగారు.
దుర్గమమైన కైలాస పర్వతంపై నివసించే ఓ దేవా! నా మనసును ఓ మహాదుర్గంగా నీ కోసమే మలచుకున్నాను. దాని చుట్టూ గాంభీర్యమనే లోతైన అగడ్త ఉంది. ధైర్యమనే ఎత్తైన ప్రాకారం ఉంది. సుగుణాలనే సైనికులను దానికి కాపలాగా ఉంచాను. నేత్రాలు మొదలైన ఇంద్రియాలతో ద్వారాలు నిర్మించాను. పరమశివ జ్ఞానమనే పదార్థం నా మనస్సనే దుర్గంలో ఇబ్బడిముబ్బడిగా ఉంది. ఇంకా 
కైలాసమెందుకు? నీ కోసమే నిర్మించిన నా మనస్సుకు దుర్గాధిపతివై విచ్చేయి అని శంకరుడు శివానందలహరిని కొనసాగించాడు.  

వయసులో ఉన్న కుర్రవాళ్లు కనుక చలాకీగా నడుస్తున్నారు. ఒక్కో అడుగుకి మూడు అడుగులు పడుతున్నాయి. వయసులో పెద్దవాడే కానీ విష్ణుశర్మ కాస్త పొట్టివాడు. శంకరుడు బాలుడే కానీ అతడి కంటే మరో రెండు గుప్పిళ్లు ఎక్కువుంటాడు. ఇద్దరూ చకచకా అడుగులు వేసుకుంటూ ముందుకు సాగిపోతుంటే వయసులో ఉన్న రెండు గుర్రాలు పరుగెడుతున్నట్లే ఉంది. ఎక్కడా నేలమీద ఆగడం లేదు వాళ్లిద్దరూ.
మహాదేవా! పాపం ఆ ఎద్దు నిన్ను వేగంగా మోసుకుపోలేదయ్యా! ఇదిగో చూడు. నా మనసు పంచకల్యాణి గుర్రం. కావాలంటే దీన్ని ఎక్కి స్వారీ చేయి అనే అర్థం వచ్చే శ్లోకం చెప్పాడు శంకరుడు. 
‘‘శంకరా! క్రూరమృగాలకు ఆవాసమైన అరణ్యాలు దాటిపోతున్నాం. నాకైతే నువ్వున్నావనుకో... నీకేమీ భయం వేయడం లేదా?’’ అడిగాడు విష్ణుశర్మ.
‘‘పరమేశ్వరుడు సింహం లాగా నా చిత్తకుహరంలో ఉండగా భీతి ఎందుకు?’’ అన్నాడు శంకరుడు నవ్వేస్తూ. 
రాయి గుచ్చుకుని కాబోలు విష్ణుశర్మ ‘అబ్బా!’ అన్నాడు.

‘ఓ కైలాసవాసా! నేనొకణ్ణి ఎప్పుడో ఈ భూమి మీద పుట్టబోతానని నీకు ముందే తెలుసు. వీడి మనసు రాయిలా కఠినమైనది. ఎప్పటికైనా దానిమీద సంచరించక తప్పదు అనుకుని ముందుగానే ఈ కొండలమీద, రాళ్లురప్పల మధ్యలో సంచరించడం అలవాటు చేసుకున్నావు. లేకపోతే మిద్దెలు, మేడలు, పూలపాన్పులు ఉండగా నువ్వీ రాళ్లమీద నడవడం ఎందుకు చెప్పు?’ అని శ్లోకంలోనే ప్రశ్నించాడు శంకరుడు.
‘‘అబ్బ... శంకరా! ఇప్పటివరకూ మనస్సుని పద్దెనిమిది రకాలుగా వర్ణించావు. పువ్వన్నావ్‌ తోటన్నావ్‌ పక్షులతో పోల్చావ్‌. చెరువన్నావ్‌ పొలమన్నావ్‌ కోటన్నావ్‌. గుర్రం, ఏనుగు, దొంగ, అడివి అన్నీ మనసులోనే సృష్టించావు. ఇప్పుడేమో శివుడి కోసం మనసు రాయి చేసుకున్నానన్నావ్‌. ఇంతేనా మనసుని ఇంకా వర్ణించబోతున్నావా?’’ అడిగాడు విష్ణుశర్మ.  
‘‘మనస్సుకు అధిపతి చంద్రుడు. ఆ చంద్రుడికి పదహారు కళలుంటే... చంద్రుడితో కలిసి శివుడికి పదిహేడు తత్త్వాలున్నాయని పెద్దలు చెబుతారు. పద్దెనిమిదో తత్త్వం చెప్పినందువల్ల సాధకుడు ఆ మనసు నేను కాదని తెలుసుకోవాలి. మనసే లేకుండా చేసుకోవాలి... అందుకోసం.’’
‘‘మరి లేని మనస్సులోకి శివుణ్ణెందుకు రమ్మన్నట్లు?’’
‘‘నువ్వూ నేనూ ఒకటేనని చెబుదామని’’ అన్నాడు శంకరుడు చివరిగా.
మాఘమాసం ప్రవేశించింది. వింధ్యపర్వత శ్రేణులలో శంకరుని గమ్యం దగ్గర పడ్డది. రథసప్తమి నాటికి నర్మద కళ్లబడ్డది. ఆవలిగట్టున ఓంకారేశ్వర శిఖరం గోచరిస్తోంది.

కావేరికా నర్మదయోః పవిత్రే సమాగమే సజ్జన తారణాయ
సదైవ మాంధాతృపురే వసంత మోంకార మీశం శివమేకమీడే
నర్మద, కావేరీ పవిత్ర సంగమంలో, మాంధాతపురంలో సజ్జనులను తరింపచేసేందుకు నివాసం ఏర్పరుచుకున్న ఓంకారేశ్వరా నీవే శరణు అని కీర్తించాడు శంకరుడు. శివసన్నిధిలో నిలిచి మొక్కాడు. పూజారి ఏవో మంత్రాలు గొణుక్కుంటున్నాడు. దూరంగా మాంధాతకు ప్రత్యేకించిన ఆసనం కనిపిస్తోంది. ఎవరో సాధువు సరాసరిగా వచ్చి దానిమీద కూర్చున్నాడు. 
‘‘ఏయ్‌ లే అక్కణ్ణుంచీ... ఎన్నిసార్లు చెప్పాలి నీకు. రోజూ ఇదో జాతరైపోయింది’’ అని అతణ్ణి కసిరి కొట్టాడు పూజారి.
శంకరుడు, విష్ణుశర్మలతో పాటుగా గుడి బయటకు వచ్చాడా సాధువు.
– నేతి సూర్యనారాయణ శర్మ

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top