విప్లవ విద్యార్థి

Reveluetionary Student Tarak Nath Das - Sakshi

తారక్‌నాథ్‌ దాస్‌

• ధ్రువతారలు
‘హిందువులు ఇప్పుడు హింసావాదానికి బానిసలుగా మారిపోయారంటే అందుకు కారణం వారు గతంలోను అందుకు బానిసలు కాబట్టే. ఇప్పుడు చేస్తున్నది కూడా అదే. ప్రేమకు సంబంధించి మానవాళిలో అంతర్గతంగా ఉండే సమున్నత సత్యాన్ని వారు గుర్తించడం లేదు.....’ 
ప్రపంచ ప్రఖ్యాత రష్యన్‌ రచయిత లియో తొలొస్తయ్‌ 1908 సంవత్సరంలో ఒక లేఖలో రాసిన వాక్యాలివి. ‘హిందువుకో ఉత్తరం’ పేరుతో ఈ లేఖ రాశారాయన. ‘భారతదేశంలో బ్రిటిష్‌ జాతి చేస్తున్న అరాచకాల గురించి ప్రపంచానికి చాటేందుకు జరుగుతున్న కృషిలో సహచరించండి!’ అని ఒక భారతీయ విప్లవకారుడు కెనడా నుంచి రాసిన లేఖకు జవాబుగా అది రాశారు తొలొస్తయ్‌. కానీ ఆ భారతీయ విప్లవకారుడు ఆ మహా రచయిత నుంచి ఆశించిన అభిప్రాయం ఇది కాదు. ప్రతిఫలం అసలే కాదు. అణచివేత గురించి రచయితలు గళం విప్పితే ఎక్కువ మందికి చేరుతుందన్నదే ఆ విప్లవకారుడి అభిప్రాయం. ఆ లేఖకు ప్రత్యుత్తరం రాశాడు యువ విప్లవ నాయకుడు. కెనడా నుంచి తాను నడుపుతున్న పత్రిక ‘ఫ్రీ హిందుస్తాన్‌’ పత్రికలో బహిరంగ లేఖగా దానిని ప్రచురించాడు. ఆ యువకుడి పేరు తారక్‌నాథ్‌ దాస్‌.

తొలొస్తయ్‌కి దాస్‌ రాసిన సమాధానంలో కొన్ని మాటలు.
‘అహింస అనేది కేవల అంధ విశ్వాసం. మేం హింసారాధకులం కాదు. మా అభిమతం పురోగతి సాధించడం, మానవాళి సౌఖ్యం. మాది వసుధైక కుటుంబకం అన్న భావన. అలా అని వేరే దేశం, జాతి, సమాజం, కుటుంబం, లేదా వ్యక్తులు మమ్మల్ని దోచుకోవడానికి చేసే ప్రయత్నాలని సహిస్తూ మిన్నకుండిపోయేవాళ్లం మాత్రం కాదు.’ మంచి రచయిత కూడా అయిన దాస్‌ రచనలలో ఈ లేఖకు ఉన్నత స్థానం కూడా దక్కింది. తరువాత ఆ ఇద్దరి మధ్య జరిగిన ఉత్తరప్రత్యుత్తరాలను ధారావాహికంగా ఆ పత్రికలోనే దాస్‌ ప్రచురించారు.
వంగదేశంలో పుట్టి విద్యార్థి దశలోనే అనుశీలన్‌ సమితి సభ్యునిగా పోలీసుల దృష్టిలో పడి అరెస్టు కాకుండా జపాన్‌కు మారు వేషంలో తప్పించుకు వెళ్లిన యోధుడు దాస్‌. వ్యవసాయ కూలీగా, విశ్వవిద్యాలయ ప్రయోగశాలలో ఉద్యోగిగా, ప్రవాస వ్యవహారాల కార్యాలయంలో అనువాదకునిగా, గదర్‌పార్టీ నాయకునిగా, పత్రికా రచయితగా, చివరికి కొలంబియా విశ్వవిద్యాలయంలో రాజనీతి శాస్త్ర ఆచార్యునిగా దాస్‌ ఎదిగారు. ఆయన జీవితమంతా అటు విప్లవం, ఇటు విద్య అన్న పంథాలోనే సాగింది. దాస్‌ స్వరాజ్య సమరయోధుడే కాదు, అంతర్జాతీయ స్థాయి విద్యావంతుడు. భారత్‌ నుంచి అమెరికా వలస వెళ్లిన తొలితరం భారతీయులలో ఒకరు. ఆనాడు అక్కడకు వచ్చిన భారతీయులను స్వరాజ్య ఉద్యమం కోసం తమ వంతు సేవ చేసే విధంగా వారిని ఏకం చేసిన నాయకుడాయన. కొలంబియా విశ్వవిద్యాలయంలో రాజనీతి శాస్త్ర ఆచార్యుడు. పలు ఇతర విశ్వవిద్యాలయాలలో విజిటింగ్‌ ప్రొఫెసర్‌గా కూడా సేవలు అందించారు.

తారక్‌నాథ్‌ దాస్‌ (జూన్‌ 15, 1884–డిసెంబర్‌ 22, 1958) నాటి వంగదేశంలోని 24 పరగణాల జిల్లాలో మాఝిపురా అనే గ్రామంలో పుట్టారు. తండ్రి కాళీమోహన్‌ కలకత్తాలోని సెంట్రల్‌ టెలిగ్రాఫ్‌ కార్యాలయంలో గుమాస్తా. ప్రాథమిక పాఠశాలలో చదువుతున్నప్పుడే దాస్‌లో చైతన్యం తొణకిసలాడేది. తన చుట్టుపక్కల ఉన్న గ్రామాలలో తిరిగారు. అక్కడ ఆర్థిక, సామాజిక పరిస్థితులకు స్పందించారు. తన వంతుగా కూలీవారి కుటుంబాల పిల్లల కోసం చిన్న చిన్న పాఠశాలలు నెలకొల్పారు. ఆ వయసులోనే దాస్‌ రచనా వ్యాసంగంలో ప్రతిభ చూపించారు. పాఠశాలలో ‘దేశభక్తి’ అనే అంశం మీద  వ్యాస రచన పోటీ జరిగితే ప్రధానోపాధ్యాయుడి ప్రోత్సాహంతో దాస్‌ పాల్గొన్నారు. ఆ పోటీకి న్యాయనిర్ణేతగా వచ్చారు బారిస్టర్‌ పి. మిట్లర్‌.

నాడు బెంగాల్‌ ప్రాంతంలో ఇంగ్లిష్‌ పాలనకు వ్యతిరేకంగా పోరాడుతున్న సంస్థలలో ఒకటైన అనుశీలన సమితి వ్యవస్థాపకులలో ఆయన ఒకరు. పదహారేళ్ల బాలుడు చూపించిన రచనా సామర్థ్యానికి ముగ్ధుడైన ఆ బారిస్టర్‌ దాస్‌ను అనుశీలన్‌ సమితిలో చేర్చించాలని భావించారు. తన సహచరుడు సతీశ్‌చంద్ర బసు ద్వారా దాస్‌ను సమితిలో సభ్యుడిని చేశారాయన. కలకత్తా విశ్వవిద్యాలయ ప్రవేశ పరీక్షలో దాస్‌ ఎంతో ప్రతిభ చూపించారు. అదే సమయంలో తండ్రి కన్నుమూయడంతో ఉన్నత విద్య అక్కడ సాగలేదు. కానీ కలకత్తాలో ఎంతో ఖ్యాతి గాంచిన జనరల్‌ అసెంబ్లీ విద్యా సంస్థలో చేరారు. చదువుకుంటూనే విప్లవ కార్యకలాపాలలో పాల్గొన్నారు. ఆయనకు పెద్దక్క గిరిజ నుంచి మంచి మద్దతు ఉండేది.\

బెంగాలీలలో జాతీయ చైతన్యం తిరిగి తెచ్చేందుకు రాజా సీతారాం రాయ్‌ ఉత్సవాలను, శివాజీ ఉత్సవాలను సామాజికోత్సవాలుగా ఆనాడు నిర్వహించేవారు. మహమ్మద్‌పూర్‌ ప్రాంతంలోని జెస్సోర్‌లో సీతారాం రాయ్‌ ఉత్సవం నిర్వహించినప్పుడు బాఘా జతీన్‌ (జితేంద్రనాథ్‌ ముఖర్జీ, మరొక బెంగాలీ యోధుడు)తో కలసి దాస్‌ హాజరయ్యారు. దీనికే శ్రీష్‌ చంద్రసేన్, సత్యేంద్ర సేన్, అధర్‌ చంద్ర లస్కర్‌ కూడా హాజరయ్యారు. తరువాత ఈ నలుగురు కూడా ఒకరి తరువాత ఒకరు చదువు పేరుతో విదేశాలకు వెళ్లిపోయారు. వీరంతా ఏ ఉద్దేశంతో వెళ్లారో 1952లో గాని భారతీయులకు తెలియలేదు. ఏదో సందర్భంలో మాట్లాడుతున్నప్పుడు అదేదో మామూలు విషయమన్నట్టు దాస్‌ నాటి సాహస కృత్యాలను గుర్తు చేసుకున్నారు. కానీ దాస్‌ జీవితం, విప్లవ కార్యకలాపాలు స్వరాజ్య సమర చరిత్రలో ఒక అద్భుత ఘట్టంగా మిగిలి ఉంటాయి.

దాస్‌ ఉపన్యాసాలకు కూడా ఎంతో ఖ్యాతి ఉండేది. వివేకానందుడు, బిపిన్‌చంద్ర పాల్‌ జాతీయ భావాల మీద ఎంత గొప్పగా ప్రసంగించేవారో, ఆ ఇద్దరి తరువాత అలా భారతీయుల గుండెలను కదిలించేటట్టు ఉపన్యసించే సామర్థ్యం దాస్‌కు ఉండేది.  
అప్పటికే పోలీసుల దృష్టిలో పడిన దాస్‌ అరెస్టు నుంచి తప్పించుకోవడానికి మొదట జపాన్‌ పారిపోయారు. తారక్‌ బ్రహ్మచారి పేరుతో, ఒక హిందూ సన్యాసి వేషంలో దేశాన్ని దాటారాయన. ఉపదేశాలు ఇవ్వడానికి అని చెప్పి మద్రాస్‌ వచ్చి అక్కడ నుంచి విదేశాలకు వెళ్లారు. ఇది 1905లో జరిగింది. అంటే వందేమాతరం ఉద్యమంతో బెంగాల్‌ ఊగిపోతోంది. నాటికే జపాన్‌లో పలువురు భారతీయ విప్లవకారులు కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు. జపాన్, ఇంగ్లండ్‌ దేశాల మధ్య బంధాలు బాగుండేవి. భారతీయ విప్లవకారులను అప్పగించాలని ఇంగ్లండ్‌ జపాన్‌ను కోరింది. దీనితో మీజీ ప్రభుత్వం భారతీయ విప్లవ సంస్థల కోసం, నాయకుల కోసం వేట ఆరంభించింది. దాస్‌ జపాన్‌ వీడి జూన్‌ 18, 1906 నాటికి అమెరికాలోని సియాటెల్‌ నగరంలో ప్రత్యక్షమయ్యారు. బతకడానికి  రైల్‌రోడ్డు పనిలో చేరారు.

ఆసుపత్రులలో, లాండ్రీలలో, గ్రంథాలయాలలో పనిచేశారు. కొద్దికాలం వ్యవసాయ కూలిగా కూడా పనిచేశారు. చివరికి బర్కెలీలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో ఒక ప్రయోగశాలలో ఉద్యోగం దొరికింది. ఇంత శ్రమపడి డబ్బు సంపాదించడం వెనుక దాస్‌కు ఒక ధ్యేయం ఉంది. అదే విశ్వవిద్యాలయంలో విద్యార్థిగా చేరారాయన. పోటీ పరీక్షలు రాసి వాంకోవర్‌ నగరం (కెనడా) లో ప్రవాసుల వ్యవహారాల చూసే కార్యాలయంలో అనువాదకుడు, సమన్వయ కర్త ఉద్యోగానికి (జూలై 5, 1907) ఎంపికయ్యారు. అదే సమయంలో పాండురంగ ఖాంఖోజె కెనడా వచ్చారు. ఆయన బాలగంగాధర తిలక్‌ అనుయాయుడు. మరొక మిత్రుడు అధర్‌ లస్కర్‌ కూడా కలకత్తా నుంచి కొంత డబ్బుతో వచ్చారు. కెనడాలో స్థాపించవలసిన పత్రిక కోసం బాఘా జతీన్‌ సేకరించి పంపిన నిధి అది. ఆ విధంగా ‘ఫ్రీ హిందుస్తాన్‌’ పత్రిక ఆవిర్భవించింది. ఖాంఖోజె పర్యవేక్షణలోనే ఇండియన్‌ ఇండిపెండెన్స్‌ లీగ్‌ను కూడా దాస్‌ స్థాపించారు.

దాస్‌ ఇంకా హిందుస్తానీ అసియేషన్‌ పేరుతో మరొక సంస్థను కూడా స్థాపించారు. శ్యామ్‌జీ కృష్ణవర్మ, మేడమ్‌ కామాలతో పాటు, లియో తొలొస్తయ్‌ కూడా దాస్‌ను ప్రోత్సహించేవారు. ఉత్తర అమెరికాలో భారతీయ విప్లవకారులు స్థాపించిన ఆ పత్రిక ఉద్దేశం మాతృదేశానికి స్వాతంత్య్రం కావాలని కోరడం, అలాగే స్వదేశంలో రావలసిన రాజకీయ, సామాజిక, ఆర్థిక సంస్కరణల గురించి అమెరికా, కెనడాలలో ఉన్న భారతీయులను చైతన్యవంతం చేయడమే. బాంబులు తయారు చేయడంలో నైపుణ్యం ఉన్న ప్రొఫెసర్‌ సురేంద్రమోహన్‌ బోస్‌ కూడా ఈ పత్రికకు సేవలు అందించేవారు. ఇది ఆంగ్ల పత్రిక. కెనడాలో విశేషంగా ఉన్న పంజాబీల కోసం గుర్ముఖిలో కూడా పత్రికను అప్పుడే ఆరంభించారు. కలకత్తాకే చెందిన గురన్‌ దత్‌ కుమార్‌ ‘స్వదేశ్‌ సేవక్‌’ అనే పత్రికను అక్కడే నెలకొల్పారు.

ఎన్ని కార్యకలాపాలు నిర్వహిస్తున్నా దాస్‌ అందరికీ విద్య అన్నది మౌలికాంశంగా తీసుకున్నారని అనిపిస్తుంది. కెనడాలోని మిల్‌సైడ్‌కు దగ్గరగా ఉన్న న్యూ వెస్ట్‌మినిస్టర్‌ ప్రాంతానికి ఎక్కువగా పంజాబీలు వచ్చేవారు. వారిలో చాలామంది నిరక్షరాస్యులు. అలాంటి వారి కోసం దాస్‌ స్వదేశీ సేవక్‌ హోమ్‌ను స్థాపించారు. భారతీయులకే కాకుండా ఆసియా దేశాల నుంచి వచ్చిన కూలీల పిల్లల కోసం పాఠశాలలు తెరిచారు. పెద్దలకి సాయంకాల బడులు నిర్వహించారు. అక్కడ ఆంగ్లం, గణితం ప్రధానంగా నేర్పేవారు. దీనితో కూలీలకు అధికారులతో ఇంగ్లిష్‌లో సంప్రతింపులు జరిపే అవకాశం వచ్చింది.

1908లో నార్విచ్‌ విశ్వవిద్యాలయం నుంచి దాస్‌ మెట్రిక్యులేషన్‌ పట్టా అందుకున్నారు. ఇందుకోసం ఆయన నార్విచ్‌ను ఎన్నుకోవడం కూడా ఒక లక్ష్యంతోనే జరిగింది. అది అమెరికాలో అత్యంత పురాతన ప్రైవేట్‌ మిలటరీ విశ్వవిద్యాలయం. మాతృదేశంలో సాయుధ పోరాటం జరపాలన్న లక్ష్యమే దాస్‌ను అక్కడకు నడిపించింది. ఆ విశ్వవిద్యాలయం పత్రిక ది రెవిల్లేతో పాటు, ఇతర అమెరికా పత్రికలకు కూడా దాస్‌ వ్యాసాలు రాసేవారు. కానీ మెట్రిక్యులేషన్‌ తరువాత కూడా అక్కడే ఉన్నత విద్యను అభ్యసించాలన్న ఆయన కోరిక నెరవేరలేదు. ఆయన మీద ఉన్న బ్రిటిష్‌ వ్యతిరేకత ముద్ర కారణంగా ఆయనను బయటకు పంపేశారు.

సరిగ్గా అప్పుడే అక్కడికి వచ్చాడు విలియం సి హాప్‌కిన్స్‌. ఇతడు బ్రిటిష్‌ ఇండియా గూఢచారి. కెనడా వచ్చి కేంద్రంగా భారతీయ యువకులు, విద్యార్థులు  జరుపుతున్న కార్యకలాపాల గురించి బ్రిటిష్‌ ప్రభుత్వానికి నివేదికలు పంపేవాడు. ఇతడు కూడా దాస్‌ మాదిరిగానే  వాంకోవర్‌లో అనువాదకుడు, హిందీ, గుర్ముఖి భాషలను వివరించే ఉద్యోగిగా నటిస్తూ ఈ సమాచారం పంపేవాడు. దాస్‌ వంటి విప్లవకారుల పేర్లు, బేలా సింగ్‌ వంటి బ్రిటిష్‌ అనుకూల భారతీయ యువకుల గురించి హాప్‌కిన్స్‌ నివేదికలు పంపేవాడు. లంచాలు ఇచ్చి ఎవరినైనా లోబరుచుకునే సామర్థ్యం ఉన్న హాప్‌కిన్స్‌ కెనడా అధికారులకు కూడా లంచం ఇచ్చి దాస్‌ను వెళ్లగొట్టేందుకు కుట్ర పన్ని విజయం సాధించాడు. ఇతడిని తరువాత ఒక సిక్కు యువకుడు హత్య చేశాడు.

విప్లవ కార్యకలాపాలు, విద్యార్జన అనే రెండు ధ్యేయాలతో దాస్‌ నడిచారు. 1909లో సియాటెల్‌ వచ్చి అప్పటికే అక్కడ లాలా హరదయాళ్‌ నాయకత్వంలో జరుగుతున్న గదర్‌ పార్టీ కార్యకలాపాలలో పాలు పంచుకున్నారు. 1910లో వాష్టింగ్టన్‌ విశ్వవిద్యాలయంలో రాజనీతిశాస్త్రం ప్రధాన అంశంగా పట్టభద్రులయ్యారు. ఆపై ఎంఎ చేశారు. బోధనకు అర్హత సాధించారు. అలాగే 1914లో అమెరికా పౌరుడయ్యారు. ఆ సంవత్సరంలోనే కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో పరిశోధక విద్యార్థిగా చేరారు. ఎంఎ విద్యార్థిగా కూడా ఆయన అవిశ్రాంతంగా శ్రమించారు. వాషింగ్టన్‌ విశ్వవిద్యాలయంలో ఉన్న కాస్మొపాలిటన్‌ క్ల»Œ  అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. ఫిట్జ్‌గెరాల్డ్‌ ప్రోత్సాహంతో ఫ్రీహిందుస్తాన్‌ను న్యూయార్క్‌ నుంచి కొద్దికాలం ప్రచురించారు.

మొదటి ప్రపంచ యుద్ధం మొదలయింది. యుద్ధంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఇంగ్లండ్‌ను చావుదెబ్బ కొట్టడానికి అవకాశం వచ్చిందని భారత స్వాతంత్య్రం కోసం పోరాడుతున్న తీవ్ర జాతీయవాద సంస్థలు భావించాయి. అందులో గదర్‌ పార్టీ ముందు ఉంది. దాస్‌ అదే సమయంలో జర్మనీ వెళ్లి వచ్చారు. ప్రవాస భారతీయుల నుంచి ఇందు కోసం నిధులు సేకరించే పనిలో కూడా ఆయన ఉన్నారు. సూయెజ్‌ కాలువ వెంబడి ఉన్న రైల్వే లైన్‌ను ధ్వంసం చేయడం వీరి ఉద్దేశం. ఇది బ్రిటిష్‌ ప్రభుత్వం అధీనంలో ఉంది. ఆసియా అంతటికీ ప్రాతినిధ్యం వహించే విధంగా పాన్‌ ఆసియాటిక లీగ్‌ను నిర్మించడం, భారత స్వాతంత్య్రం గురించి ప్రచారం చేయడమే ధ్యేయంగా దాస్‌ చైనా, జపాన్‌లలో కూడా పర్యటించారు. ఇది కూడా ఇండోజర్మన్‌ కుట్ర కేసులో భాగంగానే చూస్తారు.

అమెరికాలో ఉంటూ జర్మనీ సహకారంతో భారత్‌లోని బ్రిటిష్‌ ప్రభుత్వాన్ని కూల్చడానికి కుట్ర చేశారంటూ దాస్, మరో 16 మంది మీద కేసు నమోదు చేశారు. దీనికే ఇండో జర్మన్‌ కుట్ర కేసు అని పేరు. దీనితో 1918లో దాస్‌కు 22 మాసాల జైలు శిక్ష పడింది. లీవెన్‌వర్త్‌ జైలులో ఉన్నారు. అయినప్పటికీ ఆయన ఉద్యమ స్ఫూర్తి, రాజకీయ చైతన్యం మసకబారలేదు. భారతదేశంలో తన మిత్రదేశం ఇంగ్లండ్‌ దారుణమైన హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్నప్పటికీ అమెరికా మౌనం వహించడం పట్ల ఆయన విమర్శలు కురిపించేవారు. ‘భారతదేశం స్వాతంత్య్రం కోసం పోరాడడమంటే, ప్రపంచం సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా చేసే పోరాటమే. ప్రపంచ స్వేచ్ఛ కోసం జరుగుతున్న పోరాటమే’ అని దాస్‌ గట్టిగా విశ్వసించేవారు. భారత్‌ మీద హక్కును కోల్పోతే ఇంగ్లండ్‌ కుప్పకూలిపోతుంది.

అదే జరిగితే ఇండియా, చైనా, రష్యా, మధ్య ప్రాచ్య దేశాలు కలసి ప్రపంచంలోనే బలమైన కూటమిగా ఏర్పడతాయని ఆయన జోస్యం చెప్పేవారు. ఇంగ్లండ్‌ కుప్పకూలిపోతే సరైన విధానం ఎంచుకుని న్యాయబద్ధమైన కూటమిలో ఉండవలసిందని ఆయన అమెరికాను కోరేవారు. జైలు నుంచి వచ్చిన తరువాత మళ్లీ ఆయన జార్జిటౌన్‌ విశ్వవిద్యాలయంలో పరిశోధనకు చేరారు. తన చిరకాల మిత్రురాలు మేరీ కీటింజ్‌ మోర్సేను వివాహం చేసుకున్నారు. ఆమె రాజకీయవేత్త.  నేషనల్‌ ఉమెన్స్‌ పార్టీ సభ్యురాలు. తరువాత ఆయన కొలంబియా, జార్జిటౌన్‌ విశ్వవిద్యాలయాలలో బోధించారు.

వాటర్‌మల్‌ ఫౌండేషన్‌ సాయంతో నలభయ్‌ ఏళ్ల ప్రవాసం తరువాత, మాతృదేశానికి స్వాతంత్య్రం వచ్చిన ఐదేళ్లకి దాస్‌ 1952లో భారత్‌కు విజిటింగ్‌ ప్రొఫెసర్‌గా వచ్చారు. ఆరేళ్లు ఉన్నారు. తరువాత మళ్లీ అమెరికా వెళ్లిపోయారు. అక్కడే తన 74వ ఏట కన్నుమూశారు. భారత స్వాతంత్య్రం పోరాటం ఖండాంతరాల నుంచి కూడా శక్తిమంతంగా సాగింది. అందుకు గొప్ప ఉదాహరణ తారక్‌నాథ్‌ దాస్‌. ఇలాంటి వారి సేవలను ఇప్పటికైనా భారతీయ సమాజం, భారతీయ చరిత్రకారులు గుర్తించడం అవసరం కాదా!
- డా. గోపరాజు నారాయణరావు

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top