పరిమళాల పూబోణి... కృష్ణవేణి

పరిమళాల పూబోణి... కృష్ణవేణి - Sakshi


ప్రతి సభలో ‘నా పాటల తండ్రి సినారె’ అంటూ నువ్వు సభికులతో చప్పట్లు కొట్టించుకుంటావు. నిజానికి సినారె నా తండ్రి  - అంది సినారె పాట.‘మూడు వేల పాటల్లో నీవెవరు సోదరీ’ అన్నాను. ‘‘ఈ వరుసలేంటి’’అంది. ‘‘మనం ఇద్దరం సినారెని తండ్రి అంటాం. కనుక నాకు నీవు సోదరివే, చెప్పక్కా.’’  నేను శిఖరమస్తకుడు అని సినారెతో పిలిపించుకునే రెబల్‌స్టార్ కృష్ణంరాజు, అభినేత్రి వాణిశ్రీ నటించి రామకృష్ణ - సుశీల ఆలపించిన కృష్ణవేణిని అంది.సంగీతం విజయభాస్కర్. దర్శకుడు అద్భుత దార్శనిక దర్శకుడు వి.మధుసూదన్‌రావు.



కథ చెబుతూ పెళ్లయ్యాక కృష్ణానదీ పరివాహక ప్రాంతాలలో ముఖ్యంగా శ్రీ పర్వతం - నాగార్జున సాగర్ నుండి సముద్రంలో సంగమించే హంసలదీవి దాకా పాటను నడిపించాలని చెప్పి తయారించిన బాణిని సినారె ముందుంచారు.సినీరంగంలోకి రాకమునుపే ‘కృష్ణవేణి తరంగిణి పయఃకింకిణులు’ నాగార్జున సాగర కావ్యంలో పలికించిన నా పాటల తండ్రిలోని కవితా పారిజాత హృదయం చిరునవ్వు నవ్వుకుంది తెలుగు మల్లెపూవులా.



రావాల్సిన పాటే వచ్చిందే అని... ‘‘నాయిక చూపు నది వైపుగా నాయకుని చూపు తనదిగా (పెళ్లయింది కనుక) మారిన నాయిక వైపుగా ఇలా నాయకానాయిక హృదయాల్లోకి దూకు తండ్రీ’’ అన్నాను. నా తండ్రి సినారెతో - ఇచ్చిన బాణీ దారి చూపుతుంటే పలికాడు సినారె... ఆమె పల్లవిగా ‘‘కృష్ణవేణీ... తెలుగింటి విరబోణీ’ అతడేమనాలో క్షణంలో వెయ్యోవంతు ఆలస్యం లేకుండా ‘‘కృష్ణవేణీ... నా ఇంటి అలివేణీ’’ అంటుండగా - చిన్నారి చిరు పల్లవి వచ్చేసింది.



పాట ప్రారంభమయ్యేది శ్రీ పర్వతం నుండి కదా

 ‘‘శ్రీగిరి లోయల సాగే జాడల

 విద్యుల్లతలు కోటి వికసింపచేసేవు’’

 నిజానికి నాగార్జున సాగరంలో విద్యుత్తు కూడా పుడుతుంది.

 నాయికతో విద్యుల్లతలు అనిపించాను కనుక నాయకునితో ఏమనిపించాలనుకున్నారు. సినారె కళ్లలో దయ - ఒళ్లంత లయ తొణికిసలాడుతుంది. ఏళ్లుఏళ్లుగా...

 మనసు వెన్నపూస - మాటలో ప్రాస - తనది. అందుకే పైన విద్యుల్లతకు అనుబంధంగా ‘లావణ్యలతవై నను చేరువేళ శతకోటి చంద్రికలు వెలిగిస్తావనిపించాడు.’’

 నాగార్జున గిరి కౌగిట ఆగి - నీళ్లను బంగారు చేలుగా మార్చేవు అనిపించాడు. నాయికది ‘వస్తువుపైన ఆలోచన కనుక బంగారు చేలు అన్నది కాబట్టి నా జీవనదివై ఎదలోన ఒదిగి పచ్చని (జీవితాంతం ఆరిపోని) వలపులు పండించమనిపించాడు.

 

కృష్ణానదితో పాటు - వెళుతుంది సినారె కలం...

 అమరావతిలో రాళ్లను అందాల రమణులుగా తీర్చిదిద్దేవంటే ఏ శిల్పరమణులకు - ఏ దివ్యలలనులకు నోచని అందాలు దాచిన కృష్ణవేణి - అని/ ఆ తర్వాత చరణంలో... అభిసారిక అంటే ప్రియుని కోసం వెతుక్కుంటూ వెళ్లే నాయిక.

ఇక్కడ నది కూడా సముద్రం కోసం వెళుతూ ఉంటుంది కనుక వాణిశ్రీ నోట ‘అభిసారికవై హంసల దీవిలో సాగర హృదయంతో సంగమించావంటే, కృష్ణంరాజుతో కొసమెరుపుగా నా మేని సగమై - నా ప్రాణ సుధవై సుధ అని ఎందుకనాలి సుధ అంటే సలిల సంబంధి అమృతం బతికించేది గనుక నిఖలము నీవై నిలిచిన కృష్ణవేణి అంటూ నదిని, పాటని అంటూ సాగరానికి - ఇటు ప్రేక్షకుల హృదయ సాగరాలకు చేర్చుతాడు సినారే.

 

ఒక్కోపాట రాయడానికి పరిసరాలు - హృదయ పరిమళాలు కూడా తెలిసుండాలని ఆ రెంటిని కలిపే చతురతా ప్రాభవాలు కవి కలిగుండాలని పాట ద్వారా చూపిన నా తండ్రికి ఇటీవలే ‘కేంద్ర సాహిత్య ఫెలో’ అవార్డు వచ్చింది తెలుసా తేజా అంటూ సాయం సంధ్యవేళ నా తండ్రి రవీంద్రభారతికి వచ్చుంటాడు. వస్తా... అంటూ పరిమళాల నెవడాపునంటూ మా ఉప్పల్ నుండి హుస్సేన్ సాగర్ మీదుగా సాగిపోయింది కృష్ణవేణిలోని కృష్ణవేణి పాట.

- డా॥సుద్దాల అశోక్‌తేజ, పాటల రచయిత

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top