ఏం చేసినా... ఎన్ని చేసినా నా బతుకు నా ఇష్టం!

ఏం చేసినా... ఎన్ని చేసినా నా బతుకు నా ఇష్టం!


దారి తప్పిన కొడుకు ఎలా ఉంటాడు?  ‘రౌడీ’ సినిమాలో ‘అన్న’ పెద్దకొడుకులా! దుష్టుడికి బంధాలతో పనేమిటి?  నాన్న అయినా, తమ్ముడైనా సరే! అందుకే కుట్రదారుల మాటలను శ్రద్ధగా వింటాడు. నాన్న మీద కోపాన్ని పెంచుకుంటాడు. ఒక సందర్భంలో కుట్రదారుడు ఇలా అంటాడు.. ‘మీ అమ్మానాన్నలు నిన్నే కనాలని డిసైడే కనలేదు.నువ్వు యాక్సిడెంటల్‌గా పుట్టావు. అంచేత మీ నాన్న గురించి బ్యాడ్‌గా అనుకోవడానికి నీవేమీ ఫీల్‌ కానక్కర్లేదు.



పితృదెయ్యమో భవ’

 తన నాన్నపై విషం కుమ్మరిస్తున్నందుకు... ఈ పెద్దకొడుకు కళ్లు ఎర్రబడాలి. ఇప్పుడు కూడా పడ్డాయి... అయితే కుట్రదారుడి మీద కోపం కాదు... తండ్రి మీద కోపంతో! ‘నా బతుకు... నాకు ఇష్టం వచ్చినట్లు బతుకుతాను’ అనుకునే దుర్మార్గపు క్యారెక్టర్లో  ‘రౌడీ’ సినిమాలో కనిపిస్తాడు కిశోర్‌కుమార్‌. అప్పుడెప్పుడో ఎసీపి రత్నంగా తెలుగు ప్రేక్షకులకు కనిపించిన కిశోర్‌ డబ్బింగ్‌ సినిమాలతో చేరువయ్యాడు. తెలుగు సినిమాలతో మరింత చేరువయ్యాడు.





సాధనతోనే నటన పండుతుందని నమ్మేవాళ్లు కొందరు. సాధనకు దూరంగా ఉంటూనే... నటనలో సహజత్వాన్ని పండించేవాళ్లు కొందరు. కిశోర్‌ కుమార్‌ రెండో కోవకు చెందిన నటుడు. ‘‘అది ఏ పాత్ర అయిన సరే... నేను ప్రిపేర్‌ కావడం అంటూ ఉండదు’’ అంటూ తనను తాను ‘లేజీ యాక్టర్‌’గా ప్రకటించుకుంటాడు కిశోర్‌. అయితే ఆ ‘బద్ధకం’ అనేది మాటల వరకు మాత్రమే పరిమితమేమో అనిపిస్తుంది. ఎందుకంటే... కిశోర్‌ నటన చూస్తే... ‘ఇతడి నటనలో సాధన లోపించింది’ అనిపించదు. సహజంగా ఉంటుంది. ఆకట్టుకునేలా ఉంటుంది.



మొన్న మొన్నటి వరకు... కిశోర్‌ అంటే... ఒక కన్నడ నటుడు మాత్రమే. ఇప్పుడు మాత్రం కిశోర్‌ తన పరిధిని విస్తరించాడు. తమిళ్, తెలుగు సినిమాల్లో సరికొత్త విలన్‌గా ఆకట్టుకుంటున్నాడు. ‘అట్టహాస’ అనే కన్నడ సినిమాలో కిశోర్‌ చేసిన ‘వీరప్పన్‌’ పాత్రకు ఎంతో పేరు వచ్చింది. ఇది తమిళంలో ‘వన యుద్ధం’గా డబ్‌ కావడంతో కిశోర్‌ నటన మరింత మంది ప్రేక్షకులకు చేరువయింది.‘‘నాకూ వీరప్పన్‌కు ముఖ కవళికల్లో కొన్ని పోలికలు కనిపిస్తాయి’’ అని కిశోర్‌ అంటాడుగానీ... కేవలం ‘కొన్ని పోలికలు’ మాత్రమే వీరప్పన్‌ను తెర మీదికి తీసుకురాగలవా? కానే కాదు. ముఖ కవళికలు అనేవి ఎంతో కొంత ప్లస్‌ అయితే కావచ్చుగానీ... ‘వీరప్పన్‌’ రాక్షసత్వాన్ని వీర లెవెల్లో పండించడంలో కిశోర్‌లోని అసలు సిసలు నటుడికే ఎక్కువ మార్కులు పడతాయి.



వీరప్పన్‌గా నటించే నటుడికి చూపులు ముఖ్యం.

అవి జిత్తుల మారి నక్క చూపుల్లా ఉండాలి.

కానీ పులిలా రక్తం కళ్ల చూడాలి.

ఉన్మాదంతో రాక్షసంగా ప్రవర్తించే పులి చూపులా ఉండాలి.

కానీ, జిత్తులతో ప్రత్యర్థిని... చిత్తు చేయడానికి లంఘించాలి.

కిశోర్‌ లోతైన కళ్లకు ఆ చూపులను పట్టుకోవడం కష్టమేమీ కాలేదు.




వీరప్పన్‌లాంటి నరహంతకుడి పాత్రే కాదు... ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్ట్, రాజకీయనాయకుడు, డ్రిల్‌ మాస్టారు... ఏ పాత్రనయినా అవలీలగా పోషిస్తూ కన్నడంలోనే కాదు తమిళ, తెలుగు, మలయాళ సినిమాలలో రాణిస్తున్నాడు కిశోర్‌.



బసవనగుడి(కర్నాటక)లోని ‘నేషనల్‌ కాలేజి’లో చదువుకున్న కిశోర్‌... విద్యార్థిగా ఉన్న రోజుల్లోనే ‘సామ్రాట్‌ అశోకా’లాంటి నాటకాల్లో నటించేవాడు. బెంగుళూరు యూనివర్శిటీలో కన్నడ సాహిత్యాన్ని చదువుకున్న కిశోర్‌ ఆ తరువాత ‘శారద కాలేజీ’లో రెండు సంవత్సరాల పాటు లెక్చరర్‌గా పనిచేశాడు. ‘సాహిత్యాన్ని బోధించకూడదు. అందరూ కలిసి చర్చించుకోవాలి’ అనేది లెక్చరర్‌గా కిశోర్‌ సిద్ధాంతం. అయితే కాలేజీ యాజమాన్యానికి మాత్రం కిశోర్‌ సిద్ధాంతం నచ్చేది కాదు. ‘‘వాళ్లు నన్ను కాలేజీ నుంచి గెంటక ముందే నేను తప్పుకున్నాను’’ అని నవ్వుల మధ్య చెబుతాడు కిశోర్‌.  ఆ సమయంలోనే కిశోర్‌కు సినిమాల్లో అవకాశాలు వచ్చాయి.





‘కంఠీ’ ‘రాక్షస’ సినిమాలతో కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం నుంచి ‘బెస్ట్‌ సపోర్టింగ్‌ యాక్టర్‌’గా అవార్డ్‌ అందుకున్నాడు. ఏసీపి రత్నంగా ‘హ్యాపీ’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన కిశోర్‌ ‘భీమిలీ కబడ్డీ జట్టు’ ‘దమ్ము’ ‘క్రిష్ణం వందే జగద్గురుం’ ‘దళం’ ‘రౌడీ’ ‘చందమామ కథలు’ ‘చీకటి రాజ్యం’... మొదలైన సినిమాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ‘‘విలన్‌గా నటించడం ఈజీ’’ అంటాడు కిశోర్‌.  అయితే ఇది ఆత్మవిశ్వాసమే తప్ప అతి విశ్వాసం కాదని అతని విలనిజాన్ని చూస్తే తేలిగ్గా అర్థమవుతుంది. అందుకే కన్నడ కిశోర్‌కుమార్‌ మన ‘ఉత్తమ విలన్‌’ అయ్యాడు.కాలేజీ లెక్చరర్‌ కాస్తా ‘కరుకైన విలన్‌’గా అలరిస్తున్నాడు.

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top