బిచ్చగాడి ఆకలి ఎవరు గుర్తిస్తారు!

Heart Touching Beggar Story in Telugu - Sakshi

కథా ప్రపంచం

అది కలకత్తాలో ఉండే ఒక అనాథాలయం. ఒక చిన్న సందులో పశువులశాలలాగా ఉన్నది. తూర్పుదిక్కు నుండి కొద్దిగా వెలుతురు వ్యాపిస్తున్నది. కన్నీటిలాగా మంచు వర్షిస్తుంది. విపరీతమైన చలి. అనాథాలయంలో చీకటి వ్యాపించి ఉన్నది.
పూరిల్లు. పైన కప్పిన గడ్డి అక్కడక్కడ లేచిపోయి ఉన్నది. చుట్టూ తడికలు. నేలంతా చెమ్మ. ఆ నేల మీద చినిగిపోయిన చాపలు. ఆ చాపల మీద కొంతమంది మనుష్యులతో బాటు, కొన్ని  కుక్కలు పడుకొని ఉన్నవి. ఆ సందు నిండా పడి ఉన్న కోడిగుడ్ల పై పొట్టూ, ఎంగిలి విస్తళ్లూ, నాకి పారేసిన ఎముకలు, తాగిపారేయడం వల్ల బద్దలైన సారాయి సీసాలు అన్నీ ఆ సందులోని ఇళ్లలో రాత్రిల్లు ఎలాంటి బీభత్సాలు జరుగుతుంటాయో తెలియజేస్తూ ఉన్నవి.
ఆ సందులో నివసించేవారంతా వేశ్యలు.
పాపం! వాళ్లు తెల్లవార్లూ మేల్కొని, ప్రియులనే జంతువులు దయతలిచి వదిలిపెట్టి వెళ్ళిన తరువాత తెల్లవారుజామున మురికి బట్టలతో ముఖాలు కప్పుకొని నిద్రపోతున్నారు.
శరీరాలను అమ్ముకొని వారు అర్జించిన డబ్బు వాళ్ల తలగడల క్రింద ఉన్నది. రూపాయలూ, చిల్లరానూ.
రూపాయలు తక్కువ, చిల్లర ఎక్కువ. ఎందువల్లనంటే వారి శరీరాల విలువ అంతతక్కువ. రాత్రిపూట ఉండే శాంతి, నిశ్శబ్దం...ఎంతో సంగీతమయంగానూ, కావ్యమయంగానూ ఉంటుంది. కాని వారి గార్ధభ సంగీతం, పిచ్చి ఆలాపనలు, వెర్రినవ్వులు శాంతిమయవాతావరణాన్ని కూడా అశాంతంగా చేస్తూ ఉంటాయి.

చౌరంగీలో అంతా ధనవంతులు ఉంటారు.
చౌరంగీకి, ఈ సందుకూ భేదం ఏమిటంటే అక్కడ ‘పాపం’ అనేది ఐశ్వర్యం చాటున దాగి ఉంటుంది. ఇక్కడ నగ్నరూపంలో తాండవం చేస్తూ ఉంటుంది. 
అక్కడ పాపం అందమైన దుస్తుల్లోనూ, సుందరంగా ఉండే ఇళ్ళల్లోనూ చేరి ‘నాగరికత’ అనే పేరును సంపాదిస్తుంది. ఇక్కడ అనాగికత ‘విశృంఖలత్వం’ అనే పేరుతో వ్యహరించబడుతుంది.
ఆ పాపనగరంలో ఆ పశువుశాల–అనా«థాలయం.
తెల్లవారింది. ఒక్క దున్నపోతులబండి వచ్చి ఆ శాల ముందు ఆగింది. బండివాడు కంబళి కప్పుకొని చలికి గడగడ వణుకుతున్నాడు. బండిలో నుండి ఇంకొకడు దిగి అనాథాలయం తాళం తీశాడు. అతని పేరు చౌదరీ. ఆ అనాథాలయం యజమాని అతనే. అతని చేతిలో గేదెచర్మంతో తయారుచేయబడిన కొరడా ఒకటి ఉన్నది. తలుపు చప్పుడుకు లేచి లోపలివాళ్లు  కొంతమంది ఆవలించారు. కొంతమంది లేచి నిలబడ్డారు. అంతా గుడ్డివాళ్ళు.
తొందరలో ఒకడికొకడు తగిలి కిందపడ్డారు.
అదృష్టదేవత ఇంటితలుపుల్లాగా వాళ్ళ కళ్ళు మూయబడి ఉన్నవి. కొంతమంది కళ్లు తెరవబడే ఉన్నా పాపం! వారికి ఏమీ కనబడేది కాదు. ఎవరి కళ్ళ వంక చూసినా కన్నీళ్లకు మాత్రం ఏమీ కొదవలేదు.
ఆ గుడ్డివాళ్ళలో మొగవాళ్ళూ ఉన్నారు, ఆడవాళ్ళూ ఉన్నారు. పిల్లలు ఉన్నారు. ముసలివాళ్ళూ ఉన్నారు. రాత్రి ఏడుగంటలకు ఆ దున్నపోతులబండి అందరినీ పోగుజేసుకొని ఎక్కించుకొని వస్తుంది. అందరూ బండిదిగి ఆ పశువులశాలలో తమ చాపల మీదకు చేరుతారు.
 హోటళ్లలో మధ్యాహ్నం మిగిలిపోయిన అన్నం, కూరలు అన్నీ ఆ అనాథాలయం యజమాని కొనితెస్తాడు. హోటళ్లలో భోజనం చేసి పారేసిన ఎంగిలి కూడును కూడా హోటల్‌ యజమానులు అనాథాలయానికి అమ్మి సొమ్ము చేసుకుంటూ ఉంటారు.

గుడ్డివాళ్లు ఆ మల్లల్లో పెట్టిన కూడు తింటారు. మధ్యమధ్య కుక్కలు కూడా ఆ గుడ్డివాళ్లతో పాటు మల్లల్లోనే మూతులు పెట్టి  ఆ అన్నం తింటూ ఉంటవి. కుక్కలు అన్నం తింటున్నవని వాళ్లకు తెలిసేది కాదు. అధవా చప్పుడును బట్టి తెలిసినా అవి ఎంత నెట్టినా పోయేవికాదు. వాళ్లు నెట్టలేకపోయేవారు.
వాళ్లకు ఆ కుక్కలు తప్ప నా అన్నవాళ్ళు ఇంకెవళ్ళున్నారు? అవిగూడా కోపగించి పారిపోతే వారి జీవితానికి తోడెవరు?
భోజనాలు పూర్తి అయిన తరువాత అందరూ చాపల మీద నిద్రబోయేవాళ్లు. జోలెలు తలక్రిందబెట్టుకొని బొంతలూ, కంబళ్లూ కప్పుకొనేవాళ్లు. ఒకరినొకరు స్పర్శ చేత గుర్తించుకొనేవాళ్లు.
పిల్లలు, ముసలి వాళ్ళూ ఒక వైపునా, నవయవ్వనంలో ఉన్న ఆడవాళ్ళు మొగవాళ్ళూ ఇంకొక వైపున పడుకునేవాళ్ళు. మధ్య కుక్కలు పడుకొనేవి.
పడుచుతనానికీ, ముసలితనానికీ మధ్య ఈ కుక్కల పంక్తి పెద్దగోడలాగా అడ్డు ఉండేది. రాత్రిపూట ఒక్కొక్కప్పుడు ఒక ప్రపంచంలో ఉండేవాళ్లు ఇంకొక ప్రపంచంలోకి పోవాలని ప్రయత్నం చేస్తే కుక్కలు అరచి గోల చేసేవి.
అప్పుడప్పుడు అలికిడికి లేచి కుక్కలు ఆ మానవ సంఘాన్ని తీవ్రంగా విమర్శిస్తూ ఉండేవి.

తెల్లవారంగానే దున్నపోతులబండి తయారు. అనాథాలయం యజమాని గుడ్డివాళ్ళందర్నీ మేల్కొలిపేవాడు. రేకుతలుపు తెరిచేవాడు.  జోలెలు చేతికి తగిలించుకొని త్రుళ్ళిపడుతూ బయటకు వచ్చే గుడ్డివాళ్ళనే లెక్కపెట్టుకునేవాడు. అప్పుడప్పుడు ఇద్దరు ముగ్గురు ఇంకా నిద్రపోతూనే ఉంటే అలాంటి సమయంలో యజమాని లోపలికిపోయి, లేచి దున్నపోతుల బండి ఎక్కేదాకా చేతిలో ఉన్న చర్మపు కొరడాతో వాళ్ళను చావగొట్టేవాడు. చచ్చిపోయిన జంతువు చర్మం బతికి ఉన్న మనుష్యుని చర్మంతో కలిసి కలుగజేసే బాధకు అంత పడుచుదనంలో ఉన్నా, పాపం! ఆ నవ యువకులు భోరుమని ఏడ్చేవాళ్లు.
దున్నపోతలుబండి బయలుదేరి అందరినీ వాళ్ళవాళ్ళ స్థానాల్లోకి చేరిస్తే గుడ్డివాళ్లంతా బజారు మూలల్లో కూర్చొని ఆకాశం వైపుకు తలలెత్తి ‘‘బిచ్చం వెయ్యండి బాబూ!’’ అంటూ చెవులు చిల్లులుపడేటట్లు అరిచేవాళ్ళు. 

ఒకడు ‘‘నాలుగు రోజుల నుండి అన్నం లేదు బాబూ!’’ అంటే ఇంకొకడు ‘‘ఐదు రోజుల నుండి ఆకలికి పిల్లలు చచ్చిపోతున్నారు’’ అని అరిచేవాడు.
ఒకడు పాపపుణ్యాలను గురించి ఉపన్యాసం ఇస్తుంటే ఇంకొకడు ‘‘ఈ తనువు శాశ్వతం కాదు’’ అని వేదాంతం బోధిస్తూ ఉండేవాడు.
బిచ్చగాళ్లు దాతల సానుభూతిని సంపాదించడానికి రకరకాల వేషాలు వేసేవాళ్లు.
బిచ్చగాళ్ళు సరిగా బిచ్చం అడుగుతున్నారో లేదో ఎప్పటికప్పుడు యజమానికి నివేదించడానికి కొంతమంది సి.ఐ.డీలు నియమింపబడి ఉండేవారు.
సరిగా అరవలేదని సి.ఐ.డీ రిపోర్టు పోయిందంటే ఆనాడు ఆ బిచ్చగాడికి ఆ ఎంగిలి కూడా గూడా దొరికేది గాదు! పైపెచ్చు ఆ చర్మపు కొరడా తాండవమాడేది.
 రాత్రి దున్నపోతులబండి మళ్ళీ శాలకు చేరేది. శాలకు చేరడంతోనే బిచ్చగాళ్లు సంపాదించిన డబ్బంతా యజమానికి అప్పగించాలి.
గుడ్డి బిచ్చగాళ్లకు  రాత్రిళ్లూ, పగళ్లూ అన్నీ సమానంగానే ఉండేవి. పాసి పోయిన ఎంగిలి కూడు, ఎండిపోయిన రొట్టె ముక్కలు, కొరడా దెబ్బలు తప్ప వాళ్లకు ప్రపంచం ఏమున్నది?

ఒకరోజు రాత్రి గుడ్డివాళ్ళకు అన్నం వడ్డించే సమయంలో కుక్కలెందుకో మొరగడం ఆరంభించినవి. బిచ్చగాళ్ళు ‘‘ఏదో కొత్తప్రాణి వచ్చింది’’ అనుకొన్నారు. వడ్డించేవాణ్ని అడిగారు. రధియ అనే పిల్ల వచ్చిందనీ, చాలా అందంగా  ఉన్నదనీ, బహుశా దాని రూపాన్ని చూసే చాలామంది బిచ్చం వేస్తారని వడ్డించేవాడు జవాబు చెప్పాడు.
గుడ్డివాళ్ళంతా సానుభూతి సూచకంగా కుక్కలు మొరిగే వైపుకు చూశారు. కాని, నందు మాత్రం వంచిన తల ఎత్తకుండా మల్లలో ఉన్న కూరముక్కలు తింటూ ఉండిపోయాడు.
నందు ఒక రసాయనద్రవ్యాలు తయారుచేసే కార్ఖానాలో పనిచేస్తూ ఉండేవాడు. ఒకరోజున అతని చేతిలో నుండి ఒక సీసా కిందపడి బద్దలైపోయింది. ఆ సీసాలోని మందుచుక్కలు రెండు మూడు చింది అతని కళ్ళలో పడ్డవి. కళ్ళు రెండూ ఇక కనబడలేదు.
ఆనాటి నుంచి అతనికి ప్రపంచం అంధకారం అయిపోయింది. గుడ్డివాణ్ణి కార్ఖానా యజమానులు నౌకరుగా అట్టిపెట్టుకుంటారా? నౌకరీ పోయింది.

కొన్ని నెలల పాటు తిండిలేక ఉపవాసాలు చేస్తూ కలకత్తాలో నానాబాధలు పడ్డాడు. చివరకు ఈ అనాథాలయంలో చేరాడు. సంవత్సరం నుండి అతనికి ఇదే జీవితం, అయినా అతనిలోని వేడిరక్తం ఆ వేడిరక్తంలోని అగ్ని మాత్రం అతన్ని వదిలిపెట్టలేదు.
అందరూ పడుకొన్నారు. ఎముకలు కొరికే చలి. నందు బొంతను బిడాయించి కప్పుకొన్నాడు. అతనికెందుకో  ఆనాడు నిద్రపట్టలేదు. ఇంతలో తన బొంతను ఎవరో లాక్కుంటూ ఉన్నట్లు అతనికి తోచింది. కుక్క అనుకున్నాడు. కుక్కను నెడదామని చెయ్యి పక్కకు చాచాడు. చెయ్యి కుక్క మీద కాదు, ఎవరిదో శరీరం మీద పడింది. ఆ శరీరం ఎందుకో ఆ కొత్తగా వచ్చిని రధియాదని అతనికి అనిపించింది.
‘‘రధియా!’’
‘‘ఆ! నువ్వెవరు?’’
‘‘నా పేరు నందూ. బొంత ఎందుకులాగావు? చలిగా ఉన్నదా?’’
‘‘నా దగ్గర కప్పుకొనేంటందుకు ఏమీలేదు. కాళ్ళు చల్లబడిపోతున్నాయి. పొరపాటు చేశాను’’
నందూ లేచి తన బొంతను రధియాకు కప్పాడు. తాను అలాగే కూర్చున్నాడు. తన పూర్వజీవితం అతనికి జ్ఞాపకం వచ్చింది. రంగునూ, వెలుతురునూ చూడగలిగేవాడు. 
రంగు, సంగీతం, ప్రకాశం...ఈ మూడింటి సంయోగం వల్ల సౌందర్యం ఉత్పన్నమవుతుంది. ఆ సౌందర్యాన్ని మానవుడు కళ్ల ద్వారా చూసి ఆనందిస్తాడు. కాని  ఇప్పుడు అతను శబ్దం ద్వారానే సౌందర్యాన్ని తెలుసుకోవాలి.

రధియా కంఠధ్వని మీద ఆధారపడి ఆమె సౌందర్యాన్ని తన మనస్సులో చిత్రించుకోవడం ఆరంభించాడు. అతనిలో పడుచుతనపు ఎన్నో ఊహలు రేగినవి. ప్రతీరాత్రీ వాళ్లిద్దరూ ఒక్కచోటికే చేరుకునేవారు. మెల్లగా ఒకరొకరి పదధ్వనినీ, స్పర్శనూ గుర్తించుకొన్నారు. రధియ ఆగమనంతో నందు జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభించినట్లయింది. అంతకుమందు అతని దృష్టిలో ప్రపంచమంతా మమతావిహీనం, వజ్రకఠోరం. ఒకనాడు అతనికి రధియ జీవిత వృత్తాంతం గూడా తెలిసింది. ఆ వృత్తాంతాన్ని తన జీవితపు లోతుల్లో దాచిపెట్టుకున్నాడు.

ఆ లోతుల్లోకి తిరిగి చూడవలెనన్నా, ఆ విషయాలను తన స్మృతిపథంలోకి తెచ్చుకోవాలనుకొన్నా భయభ్రాంతుడై పోయేవాడు. రధియ, నందూ లిద్దరూ ఒకే బొంతలో నిద్రపోవడం ఆరంభించారు. వాళ్లకు బొంత చాలకపోయినా చలి వేసేది కాదు. ఒకనాటి రాత్రి రధియ నందూకు తన కథ వినిపించింది. ఆమె తండ్రి ఏదో కంపెనీలో గుమస్తా పనిచేసేవాడు. ముసలివాడు. ఆమె తల్లి రోగిష్టిమనిషి. రధియ వాళ్లకు ఒక్కతే కూతురు, పుట్టుగుడ్డి. కంపెనీ దివాలా తీయడంతో తండ్రి నౌకరీ పోయింది. నిరుద్యోగం–ముసలితనం. రెండు మూడు నెలల్లో ఇంట్లో ఉన్న సామానంతా బజారుకు చేరింది.

ఏమి చేయాలో ఎవరికీ బోధపడని సమయం. సరిగ్గా  ఆ సమయంలోనే రధియాకు వరసకు పిన్ని అవుతుంది. ఒకామె రోజూ ఆ ఇంటికి రావడం, పోవడం సాగించింది. ఆ పిన్ని అంటే రధియ ఎందుకో భయపడుతూ ఉండేది. ఆమె రోజూ వచ్చి రధియ తల్లి చెవి కొరుకుతూ ఉండేది, అప్పుడప్పుడు ముసలివాడుగూడా ఆ ఆలోచనలో చేరడం ఆరంభించాడు. మొదట్లో పిన్ని చెప్పిన మాటలు విని మండిపడ్డాడు. కాని, తరువాత తరువాత మెత్తబడ్డాడు. ఆ రహస్యాలోచన ఎందుకో, దేనిని గురించో రధియాకు బోధపడేది కాదు. ఆమెకు ఏ విషయమూ తెలియనిచ్చేవారు కాదు. ఆమె హృదయం దడదడలాడడం ఆరంభించింది.
తరువాత జరిగిన ఘటననను గురించి చెప్పవలసి వచ్చినప్పుడు రధియ మాట్లాడలేకపోయింది.  ఒకరోజున పిన్నీ, రధియ తల్లీ, ఇద్దరే రధియాను స్నానం చేయించి శృంగారించారు. జడ వేస్తూ తల్లి బొటబొటా కన్నీరు కార్చింది. ఆమె ఏడుపుకు కారణం రధియాకు బోధపడలేదు.

రధియాకు కొన్ని పాటలు వచ్చు. ఆ పాటల్లో ఆమె వివాహమనీ, ప్రియతముడనీ, యవ్వనమనీ, ప్రేమ అని కొన్ని మాటలు విని ఉన్నది.
తనకు వివాహం కానున్నదేమోననుకొన్నది.
ప్రియతముడు? ఏ జాతి పశువో? ప్రేమ? అది ఏ రోగమో?
ఇవన్నీ ఆలోచించడం వల్ల ఆమె మనస్సుకు కొంత బాధ కలిగింది.
శృంగారించడం పూర్తయిన తరువాత పిన్ని రధియాను ఒక రిక్షా మీద కూర్చోబెట్టుకొని బయలుదేరింది. తల్లిదండ్రులిద్దరూ ‘‘అమ్మా! భయపడబోకు. రేపు ఉదయమే పిన్ని నిన్ను ఇక్కడికి తీసుకొని వస్తుంది’’ అని ధైర్యం చెప్పారు. పిన్ని దారి పొడుగునా ధైర్యం చెప్పుతూనే ఉంది.
పిన్ని రధియాను ఒక ఇంటికి చేర్చింది. ఎవరో ఆమెకు తెగ తాగించి ఏవేవో మాటలు చెప్పారు. ఆ మాటలకు అర్ధం ఆమెకు చాలాసేపయిన తరువాత బోధపడింది. పిన్ని చెప్పినట్లు చేస్తే తమ దరిద్రం పోతుందనీ, తల్లిదండ్రులు సుఖంగా జీవితం గడపగలరనీ, చెప్పిన మాటలు ఆమెకు బోధపడినవి, తనవల్ల తల్లిదండ్రులకు సుఖం కలిగితే మహదానందం అనుకొన్నది.

రాత్రి తొమ్మిది, పదిగంటలైంది. రధియ ఒక గదిలో మెత్తని పక్క మీద కూర్చొని ఎవరికోసమో నిరీక్షిస్తుంది. ఎవరో తలుపుతట్టారు. పిన్ని తలుపు తీసింది. ఆ వ్యక్తి లోపలికి వచ్చాడు. పిన్ని తలుపు వేసి లోపల రధియ దగ్గరకు వచ్చింది. ఆవ్యక్తి కూడా రధియ దగ్గరకు వచ్చి పరుపు మీద కూర్చున్నాడు. తన రెండు కఠోరహస్తాలతో రధియ గడ్డం పట్టుకొని ఆమె వివర్ణమైన ముఖాన్ని పైకెత్తాడు. ఈమధ్యలోనే పిన్ని అతనితో వివాదపడింది. దానికి ఫలితంగా ఘల్లని రూపాయలు మోగినవి. పిన్ని  ఆ రూపాయలను రధియ పమిటచెంగుకు మూటగట్టి రధియాను బుజ్జగించి మెల్లగా లేచి గది బయటకు వెళ్ళిపోయింది. తలుపు బయట గడియ వేసింది. రెండు హస్తాలు రధియను చుట్టుముట్టినవి.
–ఇదేనా ప్రేమ! దుర్గంధమయమైన నోరు ఆమె పెదవుల్ని ముద్దుగొన్నది. ఆమె బుగ్గలకూ. దవడలకూ ముళ్ళలాంటి వెంట్రుకలు గుచ్చుకొన్నవి, దుర్వాసనకు  ఆమె ముక్కు బద్దలైపోయింది. రధియ జీవితం అంధకారమయమైపోయింది.
అలా రెండు సంవత్సరాలు గడిచాయి.
రోజూ ఆమె శరీరం అమ్మబడుతూ ఉండేది, ఇవాళ ఈ బజార్లో, రేపు ఆ బజార్లో–తక్కిన కథంతా అనవసరం. తిరిగి తిరిగి ఆమె చివరకు ఈ అనాథాలయంలో చేరింది.

ఒకరోజు రాత్రి రధియ అనాథాలయానికి రాలేదు.
నందూ ద్వారం వంక ముఖం పెట్టి రధియ పదధ్వని కోసం ఎదురుచూస్తూ కూర్చున్నాడు. మల్లలో ఉన్న అన్నం కొద్దిగా నంజాడు. ఎక్కువ భాగం మల్లలో మూతిబెట్టి, కుక్క తినేసింది. అతడది గమనించనేలేదు. రాత్రి ఒంటిగంట, రెండు గూడా అయింది. మిగతా అంధులూ, కుక్కలు అందరూ నిద్రపోయారు. నందు మాత్రం అలానే కూర్చొన్నాడు. రధియ రాలేదు. లేచి ఎవరిదో శరీరం తడిమి చూశాడు.
ఉహు... రధియ కాదు. మళ్ళీ తనచోటికి చేరుకున్నాడు. పడుకొన్నాడు. నిద్ర రాలేదు. ఇంతవరకూ అతని నయనపధమే శూన్యం. ఈనాటి నుంచి అతని జీవితపధం కూడా శూన్యమే.
తెల్లవారింది. చౌదరీ లోపలికి వచ్చాడు.
‘‘రధియ పారిపోయిందా? రాత్రి రాలేదు’’ అని నందు చౌదరీని ప్రశ్నించాడు.
చౌదరీ నవ్వాడు. కొరడా ఫెళ్ళున మోగించాడు, నందు ‘‘అబ్బా’’ అన్నాడు.
‘‘నీకు అది తగదురా. దాన్ని రాయ్‌ హీరాచంద్‌కు ఐదువందలకు అమ్మేశాను’’ అంటూ ఉల్లాసంలో చౌదరీ నందూకు నాలుగు కొరడా దెబ్బలంటించాడు.
నందూ నేల మీద కూలబడ్డాడు.

కొరడా దెబ్బలబాధ సహించలేక లేచి దున్నపోతుల బండి ఎక్కాడు. తను రోజూ బిచ్చమడిగే చోటుకి చేరాడు. మనుష్యునిలో ఆత్మ అనేది ఉంటుందని ఎవరో చెపితే విని ఉన్నాడు. కాని, అతనికది ఎప్పుడూ అనుభవంలోకి రాలేదు. కాని, రధియాతో పరిచయం కలిగిన తరువాత అతని జీవితంలో అతనికేదో కొత్త అనుభవం కలిగింది.
ఆ రధియ ఏది? రాయ్‌హీరాచంద్‌కు బలి అయిపోయింది. ప్రపంచమంతా అతనికి అంధకారబంధురమైపోయింది. ఆరోజూ నందూ ఎవ్వరిని బిచ్చమడగలేదు. రోజూ వాడి అరుపు వినలేక బాధపడే పక్కనున్న దుకాణదార్లందరూ ఆరోజు వాణ్ణి చూసి ఆశ్చర్యపడ్డారు.
ఏడింటికి దున్నపోతులబండి వచ్చింది. నందు దానిలో ఎక్కి కూర్చున్నాడు. బండి అనాథాలయానికి చేరింది. చౌదురి అందరి దగ్గరా డబ్బులు వసూలు చేస్తూ నందూను కూడా అడిగాడు. నందు ఒక అణా తీసి చౌదరి చేతిలో పెట్టాడు. మిగతా డబ్బులు ఇవ్వవేమిరా వెధవా? అని గద్దించాడు చౌదరి. 
నందు జవాబు చెప్పలేదు. కొట్టి జోలె లాక్కొని పరిశీలించాడు చౌదరి. డబ్బులు లేవు. తరువాత...
ఆకలిమంట, కొరడా దెబ్బల వల్ల నందుకు ఆనాటి రాత్రి నిద్ర పట్టలేదు. తరువాత రెండు రోజుల వరకూ అలాగే జరిగింది. అణా కంటే నందూకు ఎక్కువ దొరకలేదు. బిచ్చగాడు అరిస్తేగాని దాతలు కూడా బిచ్చం వెయ్యరు. మౌనంగా ఉండే బిచ్చగాణ్ణి  చూస్తే బిచ్చం వేయడానికి దాతకు కూడా చేతులు రావు. 
నందు బండబారిపోయినాడు. నాలుగో రోజున కూడా అలాగే జరిగితే చౌదరి నానా దెబ్బలు కొట్టి అతన్ని ఆ పశువులశాలలో నుండి వెళ్లగొట్టేశాడు.

వేసికాలం. అర్ధరాత్రి సమయం. ఎక్కడికి పోవాలో నందుకూ తెలియలేదు. ఆకలి మండిపోతున్నది. కాళ్ళు తేలిపోతున్నవి. సర్క్యులర్‌ రోడ్డు ఫుట్‌పాత్‌ దగ్గరకు వచ్చాడు. ఇక ముందుకు పోలేకపోయినాడు.
ఆకలి! ఆకలి!! ఆకలి!!
భగవంతుడు ఈ నరకంలో అతన్ని జన్మింపచేశాడు. కార్ఖానాలో కళ్ళు పోయినవి. కొరడాతో బాది వెళ్ళగొట్టాడు అంధాలయపు యజమాని, ఎండిన రొట్టెలు–పోయిన కళ్లూ సమాజం అతనికి ప్రసాదించిన వరప్రసాదం.
అంతే, చివరకు అతని జీవితమరుభూమిలో ఒక చిన్న సెలయేటిధార ప్రవహించి వస్తే ఒక సేఠ్‌ దాన్ని కూడా ఎండిపోయేట్లు చేశాడు. ఆకలి, చీకటి! చీకటి? ఆకలి!!
పైన నక్షత్రాలు మానవుని పరిస్థితిని చూసి మౌనభాషలో తమలో తాము విచారపడుతున్నావి. అలసి సొలసి ఆ ఫుట్‌పాత్‌ మీద నందు నిద్రపోయాడు. అతనిబోటి అభాగ్యులు ఆ స్థలంలో ఇంకా చాలామంది పడుకొన్నారు.
అకస్మాత్తుగా ఫుట్‌పాత్‌ మీద నిద్రపోయేవాళ్ళంతా లేచి అటూ ఇటూ అరుస్తూ పరుగెత్తుతున్నారు. నందుకు నిద్ర మెళకువ వచ్చింది. వాళ్ళ అరుపుతో పాటు లాఠీదెబ్బల ధ్వనీ కూడా నందుకు వినబడింది. అతని మీద కూడా మూడు లాఠీదెబ్బలు పడిన తరువాతగాని విషయం అతనికి బోధపడలేదు.
పోలీసుల లాఠీలు–కాలదండాలులాగా ఉన్నవి. మనుష్యుని చేతిలో ఉన్న ఒక ప్రాణం లేని కర్రముక్క ఎముకల్ని విరగ్గొడుతూ, మాంసంలోకి జోరబడుతూ, మానవరక్తాన్ని కాల్వల క్రింద ప్రవహింపజేస్తూ ఉన్నది. బిచ్చగాళ్ళు, కూలీలు, బీదవారు అయితే మాత్రం వాళ్లు ఫుట్‌పాత్‌ మీద ఎందుకు నిద్రపోవాలి?

అద్దెలిచ్చి ఇళ్ళల్లో ఉండలేనివారికి ప్రపంచంలో జీవించడానికి హక్కేమున్నది? ఆరోడ్డు పక్కన ఉన్న పెద్దపెద్ద భవనాలు ఈ దరిద్రుల్ని చూసి నవ్వుతున్నవి. ఈ కూలీలే, ఈ బీదవారే–ఆ భవనాలను నిర్మించింది. ఆ భవనాల గోడల్లో ఉన్న ప్రతి ఇటుక ముక్కా, ఈ దరిద్రుల, ఈ కష్టజీవుల స్వేదంలో, రక్తంలో స్నానం చేసినదే. ఈ ఫుట్‌పాత్‌నూ, ఈ ఇళ్ళనూ, ఈ రోడ్డునూ, ఈ ప్రపంచాన్ని సృష్టించిందెవరు? కాని ఆ దరిద్రులకు ఆ కష్టజీవులకు ఇల్లు లేదు. వాకిలి లేదు. ఆశ్రయం లేదు. సహాయం లేదు.
దొరికినవాళ్లను బాదుకుంటూ ఫుట్‌పాత్‌ మీద నిద్రపోయే అభాగ్యుల్ని వెదుక్కుంటూ పోలీసుల గుంపు తుపానులాగా ముందుకుసాగిపోయింది. 
నందు స్మృతి లేకుండా నేలమీద పడి ఉన్నాడు. లాఠీప్రహారానికి తలబ్రద్దలైపోయింది. రక్తం ప్రవాహంగా కారి కింద ఉన్న కన్నీటితో కలిసిపోతున్నది. సరిగ్గా ఆ సమయంలోనే అతనికి ఎదురుగా ఉన్న భవనంలో నుండి సంగీతస్రవంతి బయలుదేరి తూర్పుదిక్కాంతను మేల్కొల్ప ప్రయత్నిస్తున్నది. ఆ సంగీతం పాడుతున్నదెవరు? 
నందు హృదయస్పందనం ఆగినట్లయిపోయింది. ఆ సంగీతాన్ని వినడం కోసం నందు తన ఆత్మను వెదకి బయటకు తీశాడు. కాని ఆ సంగీతం పాడబడుతూ ఉన్న సభ ఎవరిది? ఎవరి సమక్షంలో ఆ సంగీతం? మధ్యమధ్య సిగ్గులేని వికటాట్టహాసాలు...అదే సేట్‌ హీరాచంద్‌ గృహమని నందు తెలుసుకున్నాడు.
అతని కళ్లు మూతలు పడినవి.
ఉర్దూ మూలం : డా.సయ్యద్‌ అఖ్తర్‌ హుస్సేన్‌
తెలుగు: వేమూరి ఆంజనేయశర్మ

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top