ఆ వీధిలో..

Funday Telugu Short Story - Sakshi

కొత్త కథలోళ్లు

ఆ వీధిలో...శుక్రవారం రాత్రి ఆ దారంట రావాలంటేనే భయమేసి, గుండె వేగంగా కొట్టుకుంటుంది నాకు. నిద్రట్లో కూడా ఆ దారిని తలచుకుంటే చాలు వెన్నులో వణుకుపుడుతుంది చిన్నప్పటినుండి. కానీ నాకు ఆ దారిలో రావడం మినహా వేరే దారే లేదు. 
టైమ్‌ చూస్తే రాత్రి పది అయింది. మా ఇంటి నుంచి నలభై  కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫ్యాక్టరీలో ఉద్యోగం నాది. ఉదయం ఎనిమిది  గంటలకు వెళ్ళిపోతే మరలా రాత్రి పది గంటలకు ఇంటికి  చేరుకుంటాను. వారమంతా రాత్రుళ్లు రావడానికి అసలు భయపడను. కానీ ఇదిగో, ఈ శుక్రవారం రాత్రి అంటేనే గుండె దడ. ఆ దారి మా వూరి  పెద్ద బజార్‌ వీధి. ఉదయం పూట అంతా చుట్టపక్కల పల్లెల నుండి వచ్చి, పోయే జనాలతో బలే సందడిగా ఉంటుంది. బట్టల షాపులు, మందుల షాపులు, ఎరువుల షాపులు, చిన్నా పెద్ద కిరాణా కొట్లు, కిల్లి కొట్లు, అప్పారావు లస్సీషాప్‌  రోడ్డుకు అటు ఇటు వరుసుగా ఉంటాయి. సుమారు ఒక కిలోమీటరు ఉంటుంది మా పెద్ద బజార్‌  రోడ్డు.  ఆ రోడ్డు చివర నుంచి ఇదిగో వీధి ప్రారంభంలో ఉన్న  పెద్ద అప్పన్న కొట్టు వరకు వచ్చి, కుడివైపు తిరిగితే మా వీధి వస్తుంది.  నిజానికి బజార్‌ వీధి అన్ని వీధులకు జంక్షన్‌ లాంటిది.

అటు ఇటు చూసుకుంటూ మోటార్‌ సైకిల్‌ని నెమ్మదిగా డ్రైవ్‌ చేసుకుంటూ జాగ్రత్తగా వస్తున్నాను. 
‘‘దేవుడా..ఏ ఇబ్బంది లేకుండా నన్ను ఇంటికి చేర్చు తండ్రి’’ మనసులోనే దేవుడిని వేడుకున్నాను.
‘‘హమ్మయ్య ..పెద్ద అప్పన్న షాపు దగ్గరకు వచ్చేస్తున్నాను’’ అని సంబర పడే లోపలనే, నే భయపడినంత పనీ అయ్యింది. 
‘తపక్‌...తపక్‌’ మంటూ చిన్న సౌండ్‌. మోటారు సైకిల్‌ వెనుక నుండి. ‘చచ్చా’ననుకుంటూ దిగి స్టాండ్‌ వేసి చూసా. అనుకునంతా అయ్యింది. మరలా అదే దృశ్యం పునరావృతమయింది. నెలలో కనీసం రెండు సార్లు  అలవాటు అయిన ఇబ్బంది. బలమైన ఇనుప తీగ మోటార్‌ సైకిల్‌  వెనుక టైరుకు లోపలకంతా గుచ్చుకొని, చక్రం తిరిగినప్పుడు మడ్‌ గార్డ్‌కు తగిలి ‘తపక్‌ తపక్‌’ మనే సౌండు వస్తుంది.
సెంటర్‌ స్టాండ్‌ వేసి, ఆ ఇనుప తీగను బయటకు లాగాను. తీగతో పాటు మూడు నిమ్మకాయలు, మూడు మిరపకాయలు వచ్చాయి. ‘‘ఛీ’’ అనుకుంటూ ఆ నిమ్మకాయలు, మిరపకాయలు గుచ్చిన తీగను అటు ఇటు చూసి దగ్గరలో ఉన్న చెత్తకుండిలో పారేసాను. ప్రతి శుక్రవారం రాత్రి ప్రతి షాపు వాళ్ళు కూడా ఇనుప తీగకు ముందు ఒక తాజా నిమ్మకాయ, దానిపై ఒక మిరప కాయ, మరల నిమ్మకాయ, మిరప కాయ..ఇలా మూడు నిమ్మకాయలు, మూడు మిరపకాయలు గుచ్చి షాపు ముందు వేలాడగట్టి అంతకు ముందు వారం షాపు ముందు దిష్టికి కట్టిన పాత నిమ్మకాయల దండను రోడ్డు పైకి విసిరేస్తారు.

అలా రోడ్డుపైకి వచ్చి వాలిన ఇనుప తీగే నా టైరును పెనవేసుకుంది. మోటారు సైకిల్‌ వెనుక చక్రం ట్యూబ్‌కి గుచ్చుకొని గాలి మొత్తం పోయింది. ఇక చేసేదేముంది ఈసురోమంటూ బండిని తోసుకుంటూ ఇంటికి చేరడమే. ఉదయం గబా గబా రెడీ అయ్యి, జంక్షన్‌లో ఉన్న రాము పంక్చర్‌ షాప్‌కి బయర్దేరాను మోటార్‌ సైకిల్‌ తోసుకుంటూ. ఎప్పుడూ ఉదయం ఎనిమిది వరకు షాప్‌ తియ్యని రాము శనివారం పూట మాత్రం తెల్లవారి ఆరు గంటలకే షాప్‌ తీస్తాడు. నేను వెళ్ళేసరికి ఒక ముగ్గురు ఉన్నారు నాలాగే మోటారు సైకిల్‌ పంక్సర్లతో.
అందరం ఒకే ఏరియా వాళ్ళమే, ఇంచుమించు నెలలో రెండు సార్లయిన ఇదే రకంగా రాము షాపులో కలుసుకోవడం వలన ముఖ పరిచయాలు బాగానే ఉన్నాయి మాకు.
 ‘‘ఆహా..మీ గురించే అనుకుంటున్నాము ఇంతలోనే వచ్చారు’’ అన్నాడు  బ్యాంక్‌ క్లర్క్‌ ఆనంద్‌ చిరునవ్వుతో.

‘‘గురూ, కుటుంబంతో సెకండ్‌ షో సినిమాకి వెళ్ళి వస్తూ ఇలా దొరికిపోయాను. ఆటో వారెవరూ మా ఏరియాకి ఆ టైమ్‌లో రామన్నారు రిటర్న్‌ ఖాళీగా రావాలని.’’  ఏడుపు ముఖంతో అన్నాడు నా క్లాస్మెట్‌ కృష్ణ. 
వాళ్ళది మా ఏరియా  చివర కొత్తగా వేసిన  లేఅవుట్‌లో కట్టిన అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నాడు.
‘‘మరి ఎలా వెళ్లారురా?’’ అన్న నా ప్రశ్నకు ఒక వెర్రినవ్వు నవ్వి ‘‘రాత్రి బండి అదిగో ఆ షాపు సందులో పెట్టాను. ఏది అయితే అది అవుతుందని. చచ్చినట్లు అందరం నడుచుకుంటూ ఇల్లు చేరాము. పిల్లలయితే ఒకటే ఏడుపు కాళ్ళు నోప్పెడుతున్నాయని. రాత్రంతా ఒకటే బెంగ. బండి ఉంటుందా, పోతుందా అని. అందుకే తెల్లవారగానే వచ్చేశానురా.’’ అన్నాడు కృష్ణ.
 ఇలా మా బాధలు చెప్పుకుంటున్నాము. పంక్చర్ల రాము మాత్రం తన పని చేసుకుంటూ, ముసిముసి నవ్వులతో మాటలు వింటున్నాడు. 
 ‘‘మన బాధలకు పరిష్కారం లేదా ?’’ ఆశగా అడిగాడు కృష్ణ.
‘‘ఏముంది, ట్యూబులెస్‌  టైర్లు ఉన్న బళ్ళు కొనుకోవడమే.’’ ఆనంద్‌ జవాబిచ్చాడు.
‘‘అంతేనా, ఇంకే మార్గం లేదా ?’’ దిగులుగా కృష్ణ ముఖం పెట్టాడు.
‘‘నడుసుకెళ్లిపోడమే’’ పళ్ళికిలిస్తూ  అన్నాడు రాము.
‘‘నీకు అలాగే వేళాకోళంగా ఉంటుంది. ఉదయం అంతా పని చేసి అలసిపోయి, హమ్మయ్య ఇల్లు చేరిపోతున్నాం అనే టైమ్‌లో బండి పంక్చరు అయితే, బండి తోసుకుంటూ, అలసి విసిగి కదలనని మొరాయిస్తున్న శరీరాన్ని తోసుకుంటూ  ‘రా’ అప్పుడు తెలుస్తుంది. మా బాధ ఏమిటో?’’ ఆవేశంగా అన్నానేను.
 నా గొంతులో ప్రతిధ్వనించిన ఆవేశానికి అంతా నిశ్శబ్ధం అయిపోయారు.

‘‘బాబు, నానేదో ఏలాకోలానికి అనేసాను. బుస్సున కొప్పడిపోనారు’’ అన్నాడు రాము.
‘‘రాము, నాకెందుకో అనుమానంగా ఉందిరా. చార్లీ చాప్లిన్‌ ‘కిడ్‌’ సినిమాలా నువ్వుకూడా కొంపదీసి  అలాగే నీ పంక్చర్ల బిజెనెస్‌ కోసం ఇలా చేస్తున్నవేమోనని’’ అర్ధం కానట్లు తెల్లముఖం పెట్టాడు రాము.
‘‘అదేరా...నీ వ్యాపారం కోసం నువ్వే ఆ తీగలు పడేసి, మా బళ్ళుని పంక్చర్లు చేస్తున్నవేమోనని...’’
‘‘అదేటి బాబో అలగంటారేటి? నాకే పాపం పున్నెం తెలీదు. నమ్మండి..అమ్మోరి మీద వొట్టు.’’ అన్నాడు ముఖం అంతా దిగులుగా. నవ్వేసాము వాడి ముఖ కవళికలు చూసి.
 ‘‘లేదు లేదు, ఏదొకటి చెయ్యాలి. ప్రతిసారి ఇలాంటి ఇబ్బందులతో చచ్చిపోతున్నాము.’’ అన్న ఆనంద్‌ మాటకు కృష్ణ కూడా తోడయ్యాడు.
‘‘అవును చెయ్యాలి’’ స్థిరంగా పలికింది నా హృదయం.
‘‘ఒక పని చేద్దాము. రేపు ఆదివారం ఉదయం పది గంటలకు అందరం పార్కులో కలుసుకొని చర్చిద్దాము. తప్పని సరిగా కలుద్దాము.’’

‘‘హాలో ! ఇక్కడ’’ చప్పట్లు కొట్టి పిలిచాను వస్తున్న మా బైక్‌ బృందాన్ని చూసి. నేను కూర్చున్న చెట్టు కిందకే వచ్చి, అందరు బాసింపట్టులో కూర్చున్నారు. ‘‘చెప్పండి సార్, ఏం చేద్దాము. ?’’
‘‘మనందరం కలిసి వెళ్లి, ఆ షాపుల వాళ్లకి మన ఇబ్బందులు చెప్దాం. వాళ్ళు పడేస్తున్న నిమ్మకాయల తీగలు గుచ్చుకొని మనం ఎన్ని ఇబ్బందులు పడ్తున్నామో వివరిద్దాము.’’ అన్నాన్నేను.
‘‘అబ్బే, లాభం లేదండి. వాళ్ళు వినరు.’’ అన్నాడు ఆనంద్‌.
‘‘వినేలా చేద్దాము’’ ఆవేశంగా కృష్ణ అన్నాడు.
‘‘మనలా ఇబ్బంది పడే మరో పది మందిని కలుపుకుందాం. జనబలం ఉంటే అన్ని పనులు సక్రమంగా జరుగుతాయి.’’  నా మాటలకు అందరం సరేనని...సాయంత్రం ఐదు గంటలకు పెద్ద అప్పన్న కొట్టు నుండి మా ప్రయత్నం ప్రారంభించాలని నిర్ణయించుకొని ఎవరి ఇళ్ళకు వాళ్ళం వెళ్ళిపోయాము.

‘‘నమస్తే అప్పన్న గారు...’’ అంటూ షాపు లోనికి వచ్చిన మమ్మల్ని చూసి నవ్వు ముఖంతో ‘‘రండి..రండి’’ అంటూ పలకరించారు అప్పన్న.
‘‘ఏం కావాలి?’’  వ్యాపార ప్రశ్న వేస్తూనే పదిమంది గుంపుగా మేము వెళ్ళడం వలన కాస్తా అనుమానం కనబడింది ఆయన కళ్ళలో. ఏమైనా చందా కోసం వచ్చేవేమోనన్న అభిప్రాయం కూడా.
‘‘మరేమీ లేదు సార్‌...వారం వారం మీరు మీ షాపు దగ్గర నిమ్మకాయలు, మిరపకాయలు  దిష్టి కోసం కడతారు కదా...’’
‘‘ఆ! కడితే ?’’....కనుబొమ్మలు ముడి వేస్తూ అప్పన్న గారు ప్రశ్నించారు.
‘‘మీరు కొత్తవి పెట్టి పాతవి రోడ్డు మీదకు విసిరేస్తున్నారు. ఆ నిమ్మకాయలు గుచ్చిన ఇనుప తీగలు గుచ్చుకొని మా బైక్స్‌ పంక్చర్లు  అవుతున్నాయి.’’
‘‘ఏటి, మరి రోడ్డు మీదకు విసరకుండా ఇంట్లో దాచుకోవాలా ?’’
‘‘మేము అలా అనడం లేదు అప్పన్న గారు, అలా రోడ్డు పై పడెయ్యకుండా చెత్తబుట్టలో వెయ్యమని చెప్పడానికి వచ్చాము.’’
‘‘మా బాగుంది ఏపారం, దీపాలేట్టె ఏలకు ఒచ్చి తగులుకున్నారు. ఎల్లండెల్లండి’’ కాస్తా కటువుగా చెప్పేసరికి  బయటకు వచ్చేసాము అవమానంతో.
‘‘నేను ముందే చెప్పా కదా వీరు వినరని’’ అన్నాడు ఆనంద్‌.

‘‘చివరి వరకు ప్రయత్నం చేద్దాం. ఎవరో ఒకరు మన మాటలు వినకపోరు, మెల్లగా అందరిలో మార్పు రాకపోదు’’ ఆశగా అన్నాన్నేను పక్క షాపులోనికి నడుస్తూ,
‘‘చూడండి, మీరు చెప్పేవన్నీ నిజాలే. కాని మా వ్యాపారాలు బాగుండాలంటే  దిష్టి పోవాలి. అందుకే నిమ్మకాయలను  రోడ్డు పైనే వెయ్యాలి. బళ్ల  కింద పడి అవి చిదిగిపోవాలి. అప్పుడే మాకు మంచి జరుగుతుంది. మా నమ్మకం మాది’’ అన్నారు మా మాటలన్నీ విన్న పక్క షాపు  సుబ్బయ్య గారు.
 ఇలా ఎక్కే గుమ్మం, దిగే గుమ్మం  అందరి షాపు వాళ్ళ చేత చీదరించుకోవడం తోనే మాకు రాత్రి  తొమ్మిది అయిపొయింది. అందరం నిరాశ నీడలో చేరాము. 
‘‘ఛా..ఛా...ఏంటిరా. మన బాధను ఎవ్వరూ అర్ధం చేసుకోవడం లేదు. అయినా  నిమ్మకాయలు కట్టడం మూఢాచారం అని తెలిసి కూడా, కట్టవద్దని చెప్పకుండా ‘కట్టండి, చెత్తకుండిలో వెయ్యండి’ అని చెప్పడం ఇంకా బాధాకరం రా’’  అన్నాడు కృష్ణ.
‘‘మనం కూడా వాళ్ళ వైపు నుంచి ఆలోచించాలి. వాళ్ళ నమ్మకాలు వాళ్ళవి. అయినా ఇపుడే కదా ప్రయత్నం మొదలుపెట్టాం. చూద్దాం వచ్చేవారం కూడా మన ప్రయత్నం కొనసాగిద్దాము.’’ అని చెప్పి అందరి దగ్గర సెలవు తీసుకున్నాను.

గత వారం లానే ఈవారం కూడా అన్ని షాపులకు మరల వెళ్లి కలిసాము. కాని ప్రయోజనం లేకపోయింది. ఏ ఒక్క షాపు వాళ్ళు కూడా మాకు సహకరించడానికి ముందుకు రాలేదు. 
‘‘ఇన్ని సంవత్సరాలు బట్టి లేదు, ఇప్పుడేటి కొత్త్తగా ఇబ్బంది అంటున్నారు.’’ అంటూ కొంతమంది వాదనకు కూడా దిగారు.
 ‘‘అసలు మీరేవిట్లు? హిందువులేనా? ఆచారాలు, పద్దతులు తెలియవా మీకు?’’ అని ఒకతను మమ్మల్ని నిలదీశాడు.
‘‘సార్, మేము ఏ కులం, మతం అన్నది కాదిక్కడ ముఖ్యం. మీ నమ్మకాల్ని, వాటి ఉనికిని మేము ప్రశ్నించడం లేదు. ఆచారాలు, నమ్మకాలు పేరిట మీరు చేస్తున్న పని వలన మేము పడుతున్న ఇబ్బంది మీకు చెప్పడానికి వచ్చాము. రోడ్డుపై పడెయ్యకుండా, చెత్తకుండిలో వెయ్యమని చెప్తున్నాము అంతే.’’ అని నచ్చచెప్పే మా ప్రయత్నం ఫలించలేదు. మా ప్రయత్నం చూసి కొంతమంది నవ్వుకున్నారు. అతి తక్కువ మంది మెచ్చుకున్నారు. కాని పరిస్థితిలో మార్పు రాలేదు.  
 ‘‘సార్, ఏం చేద్దాము. మన ప్రయత్నాలు వృథా యేనా.’’ దీనంగా అడిగాడు ఆనంద్‌.
‘‘లేదు ఆనంద్‌....మార్పు మొదట  వ్యతిరేకించబడుతుంది. తరువాత విమర్శింపబడుతుంది. ఆ తరువాత ఆలోచింప చేస్తుంది. చివరకది అంగీకరించబడుతుంది. ఇంకా మనం మొదటి దశ లోనే ఉన్నాము. చూస్తూ ఉండండి తప్పని సరిగా మనం విజయం సాధిస్తాము.’’ అన్న నా మాటలకు అందరి ముఖాలలో వెలుగువచ్చింది.
 ‘‘వాళ్ళు ఎందుకు ఒప్పుకోవడం లేదు? నిమ్మకాయలు రోడ్డుమీదనే వెయ్యాలి అనేది వాళ్ళ సెంటిమెంట్‌. ఆ పాయింటే ఇక్కడ ముఖ్య విషయం. అంటే రోడ్డు మీద నిమ్మకాయులు వేసినా, మన బైక్స్‌ పంక్చర్లు కాకపొతే మనకి కూడా ఇబ్బంది ఉండదు కదా.’’ 
‘‘అవును సార్‌..ఐతే ఎలా?’’ నిమ్మకాయల ఇనుప చువ్వ గుచ్చుకున్న బైక్‌ పంక్చర్ కాకుండా ఎలా?’’ అన్న ఆనంద్‌ ప్రశ్నకు ‘‘ఇనుప తీగ బదులుగా నైలాన్‌ తాడు వాడమని చెప్దాము.’’ అన్నాడు కృష్ణ.

‘‘నైలాన్‌ తాడు వాడితే మన సమస్య తగ్గుతుంది, కాని పర్యావరణానికి హాని.  నైలాన్‌ తాడు బదులుగా  నూలుదారం వాడమని చెప్దాం. అందువలన వాళ్ళు రోడ్డుపై వేసిన ఎవరికీ ఏ ఇబ్బంది ఉండదు.’’ అన్నాన్నేను.
పక్కనే నిలబడి మా మాటలు వింటున్న ఒకతను ‘‘మాతెలివోనోరు మీరు. నాను అదిగో ఆ కొట్టులో పనిసేస్తాను. తమరి ఆలోసన బాగున్నా ఎవిడికి పట్టిందండి సూది, దారమొట్టుకొని నిమ్మకాయలు, మిర్పకాయలు గుచ్చడానికి. ఇనుపరువ్వ వుచ్చుకుంటే పుసుక్కున గుచ్చేయడమే....సూదోట్టుక్కురా, దార్మోట్టుకురా అంటే కుదరని పని కాదు బావూ. వోలోప్పుకోరు’’ అన్నాడు. 
ఒక్కసారిగా గాలి తీసినట్లయింది మాకు. కాని అతని మాటలు మాలో కొత్త ఆలోచనను కలిగించాయి. పదిరోజుల కృషి తర్వాత మాలా ఇబ్బంది పడుతున్న ఒక వంద మంది జాబితా తయారుచేసాము. అందరు కలిసి ఎవరికి తోచింది వాళ్ళు చందా వేసి, ఒక నిధిని సిద్ధం చేసాము. నిమ్మకాయలు గుచ్చిన ఇనుప తీగలు వలన కలుగుతున్న నష్టాల గురించి, మా బాధల గురించి వివరంగా ఒక కరపత్రం తయారుజేసి, ప్రతి శుక్రవారం సాయంత్రం నాలుగు గంటలకు ఒక కుర్రాడికి ఇచ్చి ప్రతి షాపులోను ఇచ్చే ఏర్పాటు చేసాము. కరపత్రంతో పాటుగా దారంతో గుచ్చిన మూడు నిమ్మకాయలు, మిరపకాయల  దండ కూడా. అది కూడా ఉచితంగా. ఇలా ఒక నాలుగు వారాలు మేము దారపు దండలు ఇచ్చిన తర్వాత, కొంతమంది దారం గుచ్చిన దిష్టి దండలు అమ్మడం ప్రారంభించారు. షాపుల వాళ్ళు కూడా స్వచ్ఛందంగా దారం గుచ్చిన నిమ్మకాయల దండలనే వాడసాగారు. రోడ్డు మీదవేసినా, ఎవరికీ ఏ ఇబ్బంది లేకుండా ఉంది ముఖ్యంగా మా బళ్ళకి. ఇప్పుడు నాకు శుక్రవారం భయం లేదు. మాకు నమ్మకం ఉంది. మా ఊర్లో అతిత్వరలోనే మరొక మార్పు కూడా చూస్తామని, మా ఊరికి పట్టిన దిష్టి త్వరలో మాయం అవుతుందని.
మరి మీ ఉళ్ళో?
-∙జి.వి.శ్రీనివాస్‌ 

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top