కడపటి కోరిక

funday story to in this week - Sakshi

ఈవారం కథ

‘‘బాగా యెవరైనా బతుకుతారు. కాని బాగా చనిపోయేవాళ్లు తక్కువ. వాళ్లే ధన్యులు’’ అంటుండేవారు ఆత్రేయ. ఆయన మాట అక్షరాలా నిజమని వెంకటేశ్వర్లు విషయంలో రుజువయింది.’’ బయట నుంచి వస్తూనే సానుభూతితో నిట్టూర్చి కుర్చీలో కూలబడ్డాడు నారాయణ.‘‘అలా అంటారేమిటండీ? ఆయన రోగం రొష్టూ లేకుండా సునాయాసంగా పోయాడట కదా?’’ భర్త మాటలకు ఆశ్చర్యపోయింది రమ.‘‘పోవడం వరకు నువ్వు విన్నది నిజమే. భోంచేసి పడక కుర్చీలో చేరబడి కొంచెం ఆయాసంగా వుందని భార్యను పిల్చాడట. ఆమె చెయ్యి కడుక్కొని వచ్చేలోగా ప్రాణాలు వదిలేశాడట. నలుగురూ కూడి హాస్పిటల్‌కి తీసుకెళ్దామని హడావిడి చేసే సరికి అనుభవజ్ఞుడెవరో నాడి చూసి యింక ఆ అవసరం లేదని, మనిషిని కిందకు దింపించేశాడట! అదిగో, అక్కడే ప్రారంభమైంది అసలు కథ. శవాన్ని యింట్లో వుంచడానికి వీల్లేదని యింటి యజమాని గొడవ చేస్తుంటే కొందరు దగ్గర్లోనే వున్న కొడుకు యింటికి శవాన్ని తీసుకెళ్దామని ప్రతిపాదించారట. కాని కొడుకు సోమేశం శవాన్ని తీసుకెళ్లడానికి ససేమిరా అనడమే కాకుండా అసలు కర్మకాండే చెయ్యను పొమ్మన్నాట్ట...’’‘‘అయ్యో.. అతనికేం పొయ్యేకాలం? సొంత తండ్రే కదా? పైగా సోమేశానిది సొంత యిల్లేనేమో!’’ రమ ముక్కున వేలేసుకొంది.

‘‘నిజమే. వెంకటేశ్వర్లు రెండో పెళ్లి చేసుకోవడం పిల్లలకిష్టం లేదు. ఆ కోపంతో సోమేశం తండ్రి అంత్యక్రియలు చెయ్యనన్నాడు.’’‘‘అవును మరి వెంకటేశ్వర్లు మాష్టారిది మాత్రం తప్పుకదా? రిటైర్మెంట్‌కి దగ్గరగా వున్నప్పుడు కదా ఆయన రెండో పెళ్లి చేసుకొన్నాడు. ఆ వయసులో రెండో పెళ్లి అంత అవసరమా? ఆ వయసులో భర్త పోయిన ఆడది మరో మనువుకి సిద్ధమైతే లోకం దుమ్మెత్తి పోసేది. ఈ కాలంలో కూడా ఆడామగా మధ్య యింత తేడానా? చచ్చినోళ్లను తిట్టకూడదు కాని వెంకటేశ్వర్లు మాష్టారికి తగిన శాస్తి జరిగింది.’’‘‘రమా. వెంకటేశ్వర్లును నీలాగే చాలమంది ఆడాళ్లు అపార్థం చేసుకొని కొడుకును సమర్థిస్తున్నారు. కాని మాష్టారు మీరనుకుంటున్నంత దుర్మార్గుడు, కాముకుడు కాదు. మనం చాలా సార్లు చర్చించుకునే సమస్యే మొదటి భార్య పోయినప్పుడు అతనికీ యెదురయ్యింది. అదే – భర్తపోయిన తర్వాత భార్య జీవితం దుర్భరమని నువ్వూ, భార్యపోయిన మగాడి బతుకు నరకమని నేనూ వాదించుకొంటుంటాం కదా. నా అభిప్రాయం నిజమని భార్యావియోగం వల్ల యేర్పడిన వెలితినీ, వేదననూ అనుభవిస్తూ వెంకటేశ్వర్లు యెన్నోసార్లు అనేవాడు. తన మనోభావాలను పట్టించుకోని పిల్లల అనాదరణ గురించి నాతో చెప్పుకొని యేడ్చేవాడు. తోడు–నీడ లేని మోడు లాంటి బతుకు వెళ్లదీసే కంటె చావు వస్తేనో, ఆత్మహత్య చేసుకొంటేనో నయమని వాపోయేవాడు. అతని బాధ చూడలేక మళ్లీ పెళ్లి చేసుకోమని ప్రోత్సహించిన స్నేహితుల్లో నేనొకణ్ని. అయితే అతని పెన్షన్‌ కోసం ఆశపడి భార్య స్థానంలో వచ్చిన కృష్ణవేణి ఆ లోటును భర్తీ చెయ్యలేకపోవడమే కాదు – తన గొంతెమ్మ కోరికలతో అతనిని హింసించేది. సోమేశాన్ని, అతని చెల్లెలను దగ్గరకు చేరనిచ్చేదికాదు. అలా వెంకటేశ్వర్లు పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలోకి దూకినట్టయింది. ఈ పెళ్లి వల్ల తనెంతగా నలిగిపోతున్నాడో నాకు చెప్పుకొని బాధపడేవాడు. నేను, మరికొందరు ఆత్మీయమిత్రులు అతణ్ని ఓదార్చడం తప్ప ఆ సమస్యను పరిష్కరించలేకపోయాం. ఆ మానసిక వేదన వల్లే హార్టెటాక్‌ వచ్చి అతనంత హఠాత్తుగా చనిపోయాడు. కృష్ణవేణి లాంటి పెంకిఘటం రెండో పెళ్లాంగా రావడం అతని దురదృష్టం తప్ప, గతి లేని స్థితిలో రెండో పెళ్లి చేసుకోవడం తప్పుకాదని యిప్పటికీ నా దృఢమైన అభిప్రాయం..’’

‘‘మీ మగబుద్ధి పోనిచ్చుకొన్నారు కాదు. రేపు నాకేమైనా జరిగితే వెంకటేశ్వర్లు మాష్టారిలాగే మీరూ పెళ్లికొడుకవడానికి సిద్ధపడతారా?’’‘‘అలాంటి పరిస్థితి చస్తేరాదు. నువ్వే ప్రమాణం చెయ్యమన్నా చేస్తాను. అయినా నీకెన్నోసార్లు చెప్పాను. నీ కంటె నేను వయసులో పెద్ద. అందువల్ల ముందు ముందే వెనుక వెనుకే అన్న న్యాయంగా మనం కళ్లు మూసేలా అనుగ్రహించమని ఆ దేవుణ్ని కోరుకుంటుంటానని...’’‘‘అసురసంధ్యవేళ ఈ పాడుమాట లేమిటండీ? మీరు మళ్లీ మళ్లీ యిలా మాట్లాడితే మీ కళ్లెదుటే ప్రాణం తీసుకొంటాను...’’ రమ మొహం ఆకస్మికంగా మేఘావృతమైన ఆకాశంలా మారిపోయింది.‘‘ఛ! ఊరుకో రమా. అన్నీ మనం అనుకున్నట్టే జరుగుతాయా పిచ్చిదానా? ఈ చావుల్ని చూస్తుంటే నేను కూడా చివరికొచ్చేశానని అనిపిస్తోంది–అంతే! వెంకటేశ్వర్లు నాకంటె రెండేళ్లు చిన్న. ఈ సంవత్సర కాలంలో నాతో పనిచేసిన యిద్దరు ముగ్గురు మాష్టర్లు పోయారు. ఇలా ఒక్కొక్కరూ వెళ్లిపోతుంటే నాకు బ్రతుకుతున్న ప్రతిరోజు బోనస్‌లా అనిపిస్తోంది. ఈ మధ్య కలల్లో తరచుగా చనిపోయిన మా కుటుంబ సభ్యులంతా కనిపిస్తున్నారు. ఇదంతా చూస్తుంటే...’’ నారాయణ స్వరంలో వైరాగ్యధోరణి.

‘‘ఏవండీ. మీరీ చావుకబుర్లు చాలిస్తారా? నన్నొచ్చి మీ నోరు ముయ్యమంటారా? చావుకి వయసుతో నిమిత్తం లేదు. ఎవరికి టైమొస్తే వాళ్లు వెళ్లిపోతుంటారు. వాళ్లతో మీరెందుకు పోల్చుకుంటారు? మీ కంటె పదేళ్లు ముందు రిటైరయిన వాళ్లు రాళ్లలా లేరూ? ఆ వైపు చూడకుండా నెగెటివ్‌ థాట్స్‌తో నన్నెందుకు భయపెట్టి చంపుతారు? నేనెన్నోసార్లు చెప్పాను. మళ్లీ చెపుతున్నాను. మీరు నిండు నూరేళ్లు బతుకుతారు. నేను పండు ముల్తైదువుగా పుణ్య స్త్రీగా మీ వొళ్లో కళ్లు మూస్తాను. మీరు లేంది నేను ఒక్కక్షణం కూడా బ్రతకను.’’‘‘నువ్వు తోడు లేనిది నేను మాత్రం బ్రతకగలనా? మా పెన్షనర్స్‌లో కొందరం మార్నింగ్‌ వాక్‌ తర్వాత, అప్పుడప్పుడూ సాయంత్రాలు పార్క్‌ దగ్గర కూర్చొని కాలక్షేపానికి కబుర్లు చెప్పుకొంటుంటాం. మాలో యిటీవల భార్యలను కోల్పోయిన వాళ్లు ప్రసంగవశాత్తు వాళ్ల యిక్కట్లను చెపుతుంటే మేమంతా జాలితో సానుభూతితో స్పందిస్తుంటాం. వాళ్ల హృదయవిదారకమైన అనుభవాలు విని భర్తవియోగం కంటే భార్యావియోగం కష్టతరమనే అభిప్రాయానికొచ్చాం. అది స్త్రీకి మేమిచ్చే గౌరవమే కాని, చులకన చేయడం కాదు. భర్త దూరమైన భార్య రెండు పాత్రలనూ తానే పోషిస్తూ యింటిని చక్కదిద్దగలదు. పురుషుడికి ఆ సమర్థత లేదు. ఇలా మా మిత్రబృందం చర్చల ప్రభావంతో వృద్ధాప్యంలో మగాడు ఏకాకిగా సంసారాన్ని ఈదలేడని నీతో వాదిస్తుంటాను కాని, మన విషయం మాత్రం దీనికి భిన్నమని నేను అనుక్షణం భయపడుతుంటాను. అనుకున్నామని జరగవు అన్నీ అన్నట్టు అనుకోకుండా నాకేమైనా జరిగితే సహజంగా ఆవేశపరురాలివి, అమాయకురాలివి అయిన నువ్వు నా తర్వాత యెలా బతుకుతావో అని కూడా అప్పుడప్పుడూ...’’‘‘అయ్యా, మీకు పుణ్యముంటుంది. ఆ పార్క్‌ దగ్గరకెళ్లి యెక్కువగా ఆలోచించి మీ బుర్రపాడు చేసుకోకండి. నా బుర్ర తినకండి. పుణ్యం కొద్దీ పురుషుడన్నట్టు మీలాంటి మంచి భర్తనిచ్చిన భగవంతుణ్ని నేను సుమంగళిగా కన్నుమూసే అదృష్టాన్ని కూడా యిమ్మని నిత్యం ప్రార్థిస్తుంటాను. ఒకవేళ దేవుడు మన ప్రార్థనల్ని ఆలకించి మన అన్యోన్యతని గమనించి యిద్దర్నీ ఒకేసారి తీసుకొనిపోతే అది యింకా అదృష్టం. ఇంతకీ వెంకటేశ్వర్లుగార్ని అనాథ ప్రేతంలా వదిలేశారా? దహన సంస్కారం చేయించారా?’’

‘‘ఇంతమంది మిత్రుల ముండి యెలా వదిలేస్తాం? సోమేశాన్ని బ్రతిమలాడి, వినకపోతే సమాజమనీ, పాపమనీ భయపెట్టి కర్మ వరకు చెయ్యడాని కొప్పించాం...’’‘‘పోన్లెండి. తక్కిన ఖర్చులకు ప్రభుత్వం డబ్బిస్తుందట కదా. మీరా ఆలోచనల నుంచి తేరుకొని ఏ టీ అయినా తాగండి. మీరసలే డయాబెటిక్‌. ఇంతసేపు ఏమీ తినకుండా తాగకుండా వుంటే మీ ఆరోగ్యానికి ప్రమాదం కదా? ఇంతకీ స్నానం చేసి బట్టలు మార్చుకొన్నారా?’’‘‘అన్నీ అక్కడే పూర్తిచేశా. లోపలకు పద... వస్తున్నాను..’’ అంటూ దండెం మీద తడి బట్టలు ఆరెయ్యడానికి వెళ్లిన నారాయణ, ‘దబ్‌’మనే శబ్దం విని కంగారుగా పరుగెత్తుకొని వెనక్కి వచ్చాడు – నేల మీద స్పృహ లేకుండా రమ...!అంతవరకు తనతో లక్షణంగా మాట్లాడిన రమను హఠాత్తుగా ఆ స్థితిలో చూసేసరికి నారాయణకు ఒళ్లంతా చెమటలు పట్టాయి. నిలువెల్లా వణికిపోతూ తడబడుతున్న కాళ్లతో దగ్గరగా వెళ్లి ‘రమా... రమా’ అని పిలిచాడు. ఆమె కళ్లలో నిస్తేజం తప్ప నోట మాటలేదు. శ్వాస మాత్రం ఆడుతున్నట్టు గమనించి ఇరుగుపొరుగు వాళ్లను పిలిచి, వాళ్ల సహాయంతో హాస్పిటల్‌లో జాయిన్‌ చేశాడు.రమకు తెలివి వచ్చేసరికి హాస్పిటల్‌ వాతావరణాన్ని, పక్కనే ఆందోళనతో నిల్చుని తనకేసి చూస్తున్న భర్తనూ, పరీక్షలు చేస్తున్న డాక్టర్ని చూసి గాబరాపడింది.‘‘ఏమ్మా, కొంచెం సులువుగా వుందా? ఇలా పడిపోవడం యిదే మొదటిసారా? ఇంతకు ముందు కూడా ఈ కంప్లైంట్‌ వుందా?’’ డాక్టర్‌ గుచ్చిగుచ్చి అడుగుతున్నాడు.‘‘ఈ మధ్య యెప్పుడైనా నీరసంగా వున్నప్పుడు, మనస్సు బాగోలేనప్పుడు ఫిట్స్‌లా వచ్చి యిలా పడిపోతున్నాను’’ రమ స్పష్టంగా మాట్లాడలేకపోతోంది. ఆమె తన శరీరంలోకెక్కుతున్న సెలైన్‌ బాటిల్‌ వేలాడ దీసిన స్టాండ్‌కేసి చూస్తోంది.

‘‘ఈరోజు ఈమె మనస్సు గాయపడే సంఘటన ఏదైనా జరిగిందా మాష్టారూ?’’ నారాయణకేసి చూసి అడిగాడు డాక్టర్‌.‘‘అలాంటిదేం కాదు కాని...’’ అని నసుగుతూ తమ మధ్య జరిగిన సంభాషణను వివరించాడు నారాయణ. అంతా విన్న తర్వాత ఒక నిర్ణయానికి వచ్చిన డాక్టర్‌ తన అనుమాన నివృత్తి కోసం కొన్ని టెస్ట్‌లు చెయ్యాలన్నాడు. రమ యిష్టపడకపోయినా నారాయణ నచ్చజెప్పి దగ్గరుండి టెస్ట్‌లన్నీ చేయించాడు. అతని మనసులో ఒక అపరాధ భావన – తను మూర్ఖంగా వాదించడం వల్లనే రమకీ అనర్థం జరిగిందని!అన్ని టెస్ట్‌లూ పరిశీలించిన తర్వాత డాక్టర్‌ తోటి వైద్యులతో కూడా చర్చించి రోగ నిర్ధారణను చేశాడు. నారాయణను పక్కకు పిలిచి జాలిగా చూస్తూ – ‘వెరీ సారీ మాష్టారూ’ అంటూ ప్రారంభించగానే నారాయణ ఎలాంటి దుర్వార్త వినవలసి వస్తుందోనని వణికిపోయాడు.రమకున్న కంప్లైంట్‌ టోటల్‌ కెరోటిడ్‌ బ్లాక్‌ అనీ, అంటే రక్తనాళాల్లో రక్త ప్రవాహానికి ఆటంకం యేర్పడ్డం వల్ల మెదడుకు రక్తం సరఫరా కావడంలో తేడా వస్తోందనీ, చికిత్స చేయించకుండా నిర్లక్ష్యం చేస్తే పక్షవాతం వచ్చే ప్రమాదం వుందనీ, అందువల్ల ఆమెకు మెడ దగ్గర సర్జరీ చెయ్యాల్సివుంటుందనీ, దానికి రెండు మూడు లక్షల వరకూ ఖర్చవుతుందనీ డాక్టర్‌ విశదంగా చేప్పేసరికి నారాయణకు గుండెదడ కొంత తగ్గింది, ‘‘ఖర్చు యెంతయినా వెనుకాడను. రమకు ఏ ప్రమాదమూ జరక్కుండా మామూలు మనిషిని చెయ్యండి. దయచేసి ఆమెకు మాత్రం వ్యాధి తీవ్రత గురించి చెప్పకండి..’’ అంటూ డాక్టర్‌ చేతులు పట్టుకొని ప్రాధేయపడ్డాడు నారాయణ.రమ మాత్రం యెంత సర్దిచెప్పినా సర్జరీకి సుముఖత చూపలేదు.

‘‘ఆ దేవుడు నా మొరాలకించాడు. ఈ కుంకుమతో ఈ గాజులతో పుణ్యస్త్రీగా కడతేరడానికి ఆ స్వామి అనుజ్ఞ అయింది. మీరు అప్పుచేసి అవస్థలు పడి నన్ను బతికించకండి. బాధ్యతలన్నీ తీరిపోయాయి కదా! ఇంకా నేను బతికి యెవర్ని ఉద్ధరించాలి?’’ అంటూ మొండికేసింది.‘‘నిన్ను బతికించడానికి మాత్రమే కాదు. పక్షవాతంతో మంచానపడి జీవచ్ఛవంలా నరకం అనుభవించకుండా ఉండడానికి కూడా ఈ సర్జరీ...’’ అంటూ నారాయణ మొత్తుకొని, కావలసిన వాళ్లందరి చేత చెప్పించేసరికి రమ అయిష్టంగానే ‘సరే’ అంది.హాస్పిటల్‌ నుంచి డిశ్చార్జ్‌ అయి రమ క్రమంగా కోలుకొంటున్న కొద్దీ ఆమెలో కృతజ్ఞతాభావం, మృత్యు ముఖం నుంచి బయటపడిన ఆమె పట్ల నారాయణ భద్రతాచర్యలు ఆ దంపతుల అనుబంధాన్ని అన్యోన్యతను దృఢతరం చేశాయి. జీవితంలో చివరి మజిలీకి చేరుకున్న ఆ దంపతుల మధ్య పరస్పర ఆరోగ్య పరిరక్షణ ప్రయత్నాల్లో వింతకోపాలు, చిత్రమైన అంతర్యుద్ధాలు ఆరంభమయ్యాయి.వైద్యుల సూచన ప్రకారం రమ సమయానికి మందులు వేసుకోకపోతే నారాయణ మందలిస్తాడు. అతను చక్కెర వ్యాధిని లెక్కచెయ్యకుండా చాటుమాటుగా తీపి పదార్థాల కోసం కక్కుర్తిపడితే ఆమె కళ్లెర్ర జేసి వాటిని బలపవంతంగా లాక్కుంటుంది. ఆమె వంట వార్పులతో అలసిపోతుందని పనిమనిషిని పెట్టుకోమని అతను పోరుతుంటాడు. అతను కూరగాయలకో కిరాణా సరుకులకో యెండలో నడిచివెళ్తుంటే అంత పొదుపు తగదని ఆమె రుసరుసలాడుతుంది. ఆమె అర్ధరాత్రి వరకు టీవీ దగ్గర నుంచి లేవడం లేదని అతను బలవంతంగా స్విఛాఫ్‌ చేస్తాడు. అతను పొద్దుటపూట నడకను నిర్లక్ష్యం చేస్తే ఆమె డాక్టర్‌ సలహాను గుర్తుచేసి అతణ్ని విసిగిస్తుంటుంది.

ఇక అతని మీద ఈగ వాలినా కంగారు పడిపోయి అతను వద్దని వారిస్తున్నా ఆమె దగ్గర కూర్చొని కాళ్లూవేళ్లూ నొక్కి సపర్యలు చేస్తుంది. ఆమె శరీరం జ్వరంతో కాగిపోతున్నా అతను తలనొప్పి మందు కూడా రాయడానికి వీల్లేదని ఆమె చేతులడ్డం పెడుతుంది – ఇలా మగని చేత సేవలు చేయించుకోవడం పతివ్రతా లక్షణం కాదట! పెళ్లయిన కొత్తలో చీటికీ మాటికీ తన మీద అలిగి పుట్టింటికి పరుగెత్తిన రమేనా ఈమె అని అతను, తనవాళ్లను వీసమెత్తు మాటన్నా వీరావేశంతో చెయ్యి చేసుకొన్న భర్తేనా యితనని రమ – తమలో వచ్చిన మార్పుకి ఆశ్చర్యపోతున్నారు. వయసులోని దాహం కేవలం మోహమనీ, వార్ధక్యంలో పడిన ముడి నిజమైన ప్రేమ అనీ అనుభవపూర్వకంగా తెలుసుకొన్న రమా నారాయణులు – యముణ్ని మెప్పించి పతిప్రాణం దక్కించుకొన్న సావిత్రినీ, పాముకాటుతో మరణించిన ప్రమద్వరను సగం ఆయువును ధారపోసి బ్రతికించుకొన్న రురుణ్నీ స్ఫూర్తిగా తీసుకొని పరస్పరం పార్ట్‌నర్‌ కోసం ప్రాణం పెడుతున్నారు. ఒకరికొకరు మాత్రమే సాయంగా సంసారసాగరాన్ని ఈదుతూ ఎడబాటు యెరక్కుండా యిద్దర్నీ ఒకేసారి తీసుకుపొమ్మని భగవంతుణ్ని వేడుకొనే ఆ దంపతులు యెప్పుడైనా కొడుకు వరప్రసాద్‌నూ, కూతురు సుమతినీ, మనవల్నీ తల్చుకొని వాళ్ల ముచ్చట్లను చెప్పుకుంటుంటారు.

వరప్రసాద్‌ ఆ దంపతుల ఏకైక సంతానం. అతని భార్య మోహిని మొదట్నుంచీ అత్తరికాన్ని అసహ్యించుకోవడం వల్ల వూళ్లోనే దూరంగా కాపురముంటున్నాడు. పంచాయతీ సెక్రటరీ వుద్యోగాన్నడ్డెట్టుకొని బాగానే సంపాదిస్తున్నట్టు జనం చెప్పుకొంటారు. అతను మాత్రం సంతానమిద్దరూ ఆడపిల్లలు కావడం వల్ల అడ్డదారులు తప్పవని సమర్థించుకుంటాడు. సుమతి రమానారాయణులు దత్తత తీసుకొన్న కూతురు. రమ ఆడపిల్ల మీద మక్కువతో ఆమెను చేరదీసి సొంత కూతురులా పెంచి పెళ్లి చేసింది. సుమతికి ఓ కొడుకూ, కూతురూ భర్త వుద్యోగం దృష్ట్యా వాళ్లు బెంగళూరులో ఉండడం వల్ల పెంచిన తల్లి తండ్రుల మీద ప్రేమవున్నా, సుమతి తరచుగా రాదు. రమకు సర్జరీ జరిగినప్పుడు మాత్రం వచ్చి చూసి రెండ్రోజులుండి వెళ్లింది. వరప్రసాద్‌ హాస్పిటల్‌కి ఒకటిరెండుసార్లు రాగా, మోహిని ఆ మర్యాదను కూడా దక్కించుకోలేదు!వరప్రసాద్‌ చాలాకాలం తర్వాత తల్లిని చూడ్డానికి యింటికి రావడం రమ, నారాయణలకు ఆశ్చర్యాన్ని కలిగించింది. అదే మాట తండ్రంటే, వాళ్లు మర్చిపోయిన పెళ్లిరోజును గుర్తుచేద్దామని వచ్చానన్నాడు. తల్లి చచ్చిబతికింది గనుక వారం రోజులు మాత్రమే గడువున్న తల్లిదండ్రుల పెళ్లిరోజును అట్టహాసంగా జరపాలని ప్రతిపాదించాడు. అయితే ఆ యేడు రమ చికిత్సకోసం అయిన ఖర్చును, వచ్చేయేడు జరుపుకోదగిన వైవాహిక స్వర్ణోత్సవాన్ని దృష్టిలో పెట్టుకొని నారాయణ కొడుకు ప్రతిపాదనను కాదన్నాడు. తన మాటకు యెప్పుడు మాత్రం విలువిచ్చారని వరప్రసాద్‌ యెదురు తిరిగి తల్లిదండ్రులను దులిపేశాడు. పెన్షన్‌ మీద అప్పుతీసుకొని అన్ని లక్షలు పెట్టి ముసలావిడకు వైద్యం చేయించడం అవసరమా? అని కడిగేశాడు. తండ్రికేమన్నా అయితే ఆ అప్పు తనమీదే పడుతుంది కదా అని ప్రశ్నించాడు. తనకిద్దరు ఆడపిల్లలుండగా తల్లి తదనంతరం ఆమె బంగారాన్ని పెంపుడు కూతురు కూతురికిస్తాననడం యెంతవరకు న్యాయమని నిలదీశాడు. తల్లిదండ్రులుంటున్న యింటిని తనకు విల్లుగానో గిఫ్ట్‌గానో రాయకపోతే రేపు చెల్లెలు ఆస్తిలో వాటాకొస్తే తన గతేమిటని వాపోయాడు. కొడుకు ప్రశ్నలన్నిటికీ నారాయణ దీటుగా ఘాటుగా సమాధానాలు చెప్పిన తర్వాత అతను కాళ్లబేరానికొచ్చాడు. తను లంచం తీసుకొంటుండగా ఏసీబీకి దొరికిపోయి ఉద్యోగం నుంచి సస్పెండ్‌ అయ్యాననీ, తనను ఆర్థికంగా ఆదుకోపోతే సంసారం వీధిన పడుతుందనీ తల్లిదండ్రులను కాళ్లావేళ్లా పడి బ్రతిమలాడాడు. పాండురంగడిలా తనలో మార్పు వచ్చిందనీ, తను పశ్చాత్తాపపడుతున్నాననీ, ఇకముందు వ్యసనాలను విడిచిపెట్టి తల్లిదండ్రులను తన రెండు కళ్లలా చూసుకొంటాననీ నమ్మబలికాడు. కొడుకు దైన్యానికి కరిగిపోయి బ్యాంకులో తాకట్టు పెట్టుకొని డబ్బు తెచ్చుకోమని తన నగలిచ్చిన రమ మాతృ ప్రేమకు నారాయణ ఆశ్చర్యపోయాడు. వరప్రసాద్‌ కృతజ్ఞతతో తల్లిదండ్రుల పాదాలకు నమస్కరించి, నామమాత్రంగా జరిగినా సరే పెళ్లిరోజున వస్తానని మొహమాటపెట్టినా నారాయణ రావద్దన్నాడు.

‘‘ఈ భ్రష్టుడిలో నిజంగా మార్పు వచ్చిందంటావా? లేక ఏదో దురాలోచనతో వచ్చి నటిస్తున్నాడంటావా?’’ వరప్రసాద్‌ వెళ్లగానే అనుమానంగా అడిగాడు నారాయణ.‘‘అలా అనకండి. స్నేహాల వల్ల చెడిపోయాడు గాని మనవాడు బంగారమే. వాడు కన్నీళ్లు పెట్టుకొంటే చూడలేక ఆ నగలిచ్చాను.’’ రమ గిల్టీగా బదులిచ్చింది.‘‘గొప్పపని చేశావ్‌. నీతో అతివృష్టి, అనావృష్టి! ఇన్నాళ్లూ కోడలి మీద కోపంతో వాణ్ని గడప తొక్కొద్దన్నావ్‌. ఇప్పుడేమో వాడి అవస్థ చూసి, వెనకా ముందూ ఆలోచించకుండా...’’‘‘ఏం చెయ్యమంటారు? కడుపుతీపిని చంపుకొని వాడి కర్మకు వాణ్ని వదిలెయ్యమంటారా? మీరు మాత్రం?  వాడెగిరినంతసేపు యెదురుదాడి చేశారు కాని, కాళ్లు పట్టుకోగానే కరిగిపోలేదూ! రేపు మనవరాళ్లను తీసుకొచ్చి మీ ఒళ్లో కూర్చోబెడితే ముద్దు చెయ్యకుండా వుండగలరా?’’‘‘అదే ఆలోచిస్తున్నాను రమా. వరం మీద ఆంక్షలు పెట్టి దూరంగా వుంచటం కంటేæ పాజిటివ్‌గా దగ్గరకు తీసుకుంటేనే వాడిలో క్రమంగా మార్పు వస్తుందనుకుంటున్నాను.’’‘‘ఏవండీ, మీరేనా ఈ మాటంటున్నది?’’ నారాయణకు దగ్గరగా జరిగి ఆనందంగా ఆశ్చర్యంగా అతని కళ్లలోకి చూసింది రమ.‘‘అవును రమా. డబ్భైకి దగ్గరవుతున్న ఈ వయసులో యింకా పంతాలూ, పట్టింపులూ దేనికి? నీ అనంతరం వాడి పిల్లలకు ఈ ఆస్తిపాస్తులు సంక్రమించేలా విల్‌ రాసేద్దామనుకుంటున్నాను.’’‘‘మాటాడితే ‘నీ’ అనకండి ‘మన’ అనండి. మీరు లేకుండా నేనెక్కడుంటాను?’’ రమ గొంతు గాద్గదికమైంది.‘‘పిచ్చి రమా. నీపాత పాట విడిచిపెట్టు. రేపేం జరుగుతుందో ఎవరికి తెలుసు? నీ సెక్యూరిటీ’ గురించి ఆలోచించి అలా అన్నాను. పోనీ, ఓ పని చేద్దాం. లాయరుగార్ని సంప్రదించి ఆయన సలహా తీసుకుందాం. లే. నువ్వు తయారయితే లాయరు గారింటికి వెళ్దాం.‘‘లేడికి లేచిందే పరుగన్నట్టు ఇప్పుడా? మనం బాగా ఆలోచించుకొని రేపు వెళ్దాం లెండి’’‘‘అలాక్కాదు. వరాన్ని మ్యారేజ్‌ డేకి రావద్దంటే చిన్నబుచ్చుకొని వెళ్లిపోయాడు. అందువల్ల వాణ్ని ఆ రోజున పిల్చి,  ‘విల్‌’ గిఫ్ట్‌గా యిచ్చి సర్‌ప్రయిజ్‌ చేద్దామని...’’భర్త మాటకు యెప్పుడూ యెదురు చెప్పని రమ నిమిషాలమీద రెడీ అయింది. వాళ్లిద్దరూ మెయిన్‌రోడ్‌ వరకు వెళ్లి ఆటోను ఆపి లాయరు గారింటికి బేరమాడుకొని ఆటో యెక్కారు. ఆటో నేలమీద వెళ్తున్నట్టు లేదు. ఆటో వేగానికి భయపడి ఆందోళనతో నారాయణ ఎన్నిసార్లు హెచ్చరించినా, జాగ్రత్తలు చెపుతున్నా ఆటో డ్రైవర్‌ వినిపించుకోవడం లేదు. పైగా విసుక్కొంటున్నాడు కూడా. ఒక దశలో ఆటో నుంచి దిగి పోదామని నారాయణ ఆటోను ఆపమంటుండగానే అది అదుపు తప్పి యెదురుగా వస్తున్న లారీని ఢీ కొట్టింది. ఆ భయంకరమైన శబ్దానికి అదిరిపడిన చుట్టుపక్కల జనం యాక్సిడెంట్‌ జరిగిన స్థలం చుట్టూ చేరేసరికి ఒక పక్క నుజ్జునుజ్జయిన ఆటో భాగాలు,  మరో పక్క నెత్తుటి మడుగులో రమానారాయణల మృతదేహాలు! మృత్యుముఖంలో కూడా చేతులు వీడని ఆ జంటను చూసి చెమర్చని కళ్లు లేవు!.
డా. పైడిపాల 

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top