జలప్రస్థానం 

Funday new story of the week 20-01-2019 - Sakshi

కొత్త కథలోళ్లు

ఒంటరిగా నేను. ఒకప్పుడు ఇక్కడ గుంపులుగా జనం. చుట్టూ జల అగాథం. కాలం వేగంగా పరుగులు తీసింది. నా ముందు జలనిధి ఉంది. అయినా కనిపించదు. మనిషి ముందు పుట్టాడా! జలం ముందా! మనిషి ప్రస్థానం జలప్రస్థానం సమాంతరంగా సాగాయా! ప్రకృతిలోని ప్రతి జీవికి జలం అవసరం. చివరికి నిర్జీవమనుకుంటున్న రాతిలోనూ చెమ్మ ఉంది. రాళ్ళ మధ్య మొక్కలు రెండు ఆకులు తొడుగుతాయి. ఇదే జలం ప్రాణాల్నే కాదు అడ్డువచ్చిన ప్రతీదాన్నీ కూల్చేస్తుంది. జలానిది ముందుకే కాదు ప్రయాణం  వెనక్కి కూడా. శతాబ్దాల  సహస్ర సహస్ర శతాబ్దాల వెనక్కి ...అవును. జలం మనకు గత చరిత్రను చెపుతుంది. కొన్ని శతాబ్దాల జలం నిశ్చలంగా ఉంటుంది. అది కొన్నిచోట్ల ఆవిరి కావచ్చు...ఇంకొన్ని చోట్ల అస్తిత్వం నిలబెట్టుకుంటుంది. ఎప్పటికయినా జలరహస్యం విడిపోతుందా! అందుకు అడ్డంగా ఉన్నవాటిని దారితప్పిస్తుందా! నా ఆలోచనలను తెంపుతూ అప్పుడు ఫోన్‌ మోగింది. కొత్త నెంబర్‌. ‘‘హలో’’ అన్నాను.‘‘వికాస్‌ గారా?’’     ‘‘అవును మీరు?’’ ‘‘నేను మహేష్‌ని ... మహీని ... గుర్తున్నానా!మనం చిన్ననాటి స్నేహితులం.’’ ‘‘గుర్తున్నావు మిత్రమా ... ఎక్కడినించి?’’ ‘‘ఇప్పుడు ఢిల్లీలో ఉంటున్నాను. నిన్ను కలవటానికి మీ ఊరు వస్తున్నాను. నీ ఫోన్‌ నెంబర్‌ సంపాదించటానికి చాలా కష్టపడ్డాను. మిగతా విషయాలు మనం కలుసుకున్నాక.’’ ‘‘నీకోసం ఎదురుచూస్తుంటాను’’ ఫోన్‌ కట్‌ అయింది. ‘‘మహీ చిన్ననాటి స్నేహితుడు. మేము ఆరో తరగతిలో విడిపోయాం. అయినా వాడికి నేను, నేను వాడికి గుర్తున్నాం. వాడేం చేస్తున్నాడో తెలియదు. ఇంకొన్ని గంటల్లో అన్ని రహస్యాలూ విడిపోతాయి కదా!

దుమ్ము రేపుకుంటూ బస్సు వచ్చి ఆగింది. చేతిలో పెట్టెతో దిగుతున్న స్నేహితుడికి ఎదురెళ్లి, పెట్టె అందుకుని నవ్వుతూ కౌగిలించుకుని స్కూటర్‌ వైపుకి నడిచాం. ఇద్దరికీ చాలా ఆనందంగా ఉంది. ఇద్దరికీ మదినిండా బోలెడు కుశలప్రశ్నలు, ఇంకా బోలెడు కబుర్లు. భూషయ్యకి పెట్టె అందించి, వాణ్ణి చెయ్యి పట్టుకుని, మండువా లోకి తీసుకెళ్ళేటప్పటికి అమ్మ ఎదురొచ్చింది. ‘‘నమస్తే అమ్మా, నా పేరు మహీ’’. ‘‘అయ్యో, నీ గురించి ఎప్పుడూ చెబుతూనే ఉంటాడు. నిన్ను చూడ్డం ఇదే అయినా మాకందరికీ నువ్వు బాగా తెలుసునయ్యా. అబ్బాయ్‌ వికాస్, బాబుకి ఏం కావాలో చూడు. స్నానం చేస్తాడేమో’’. ‘‘అలాగే అమ్మా, పది నిముషాల్లో సిద్ధం అవుతాం. భోజనానికి వచ్చేస్తాం’’ అన్నాను అమ్మతో.మాఘమాసం చివరికొచ్చింది. పగలు ఎండ చుర్రుమంటోంది. రాత్రుళ్ళు మాత్రం చలి, పొగమంచూనూ. భోజనాలు అయ్యాక ఇద్దరం గదిలో పడుకున్నాం. మా కాలేజీ సంగతులు, మిగతా స్నేహితులు, సినిమాలు, షికార్లు  అలా ప్రవాహం లా సాగిపోతూనే ఉన్నాయ్‌  మా కబుర్లు. ఇంక ఎంతసేపటికీ మా కబుర్లు అయ్యేటట్టు లేవు. ‘‘ఒరేయ్, కొద్దిసేపు కునుకు తియ్యరా. కొంచెం ఎండ తగ్గాక ఊరి మీదకు వెళ్దాం. ఇక్కడ ఒక విశేషం, నీకు బాగా నచ్చే చోటు చూపిస్తాను సాయంత్రం’’ అన్నాను.పాలకోవా, కజ్జికాయలు, జంతికలు పెట్టింది అమ్మ. ‘‘చాలా బావున్నాయిరా’’ అంటూ ఇష్టంగా తిన్నాడు. ‘‘అబ్బ, ఎంత రుచిగా ఉన్నాయిరా. పొట్ట ఖాళీ లేకపోయినా ఆపలేకపోతున్నానురా బాబూ! ఆ జంతికలేంట్రా అంత కమ్మగా అమృతంలా ఉన్నాయి!’’ ‘‘అన్నీ అమ్మే స్వయంగా చేస్తుందిరా. అమ్మ చేతి రుచులంటే మా బంధువులందరికీ ఎంత ఇష్టమో తెలుసా’’ అన్నాను కాస్త గర్వంగానే.బయటకొచ్చి స్కూటర్‌ తియ్యబోతూ అడిగాను, ‘‘ఒరేయ్‌ మహీ! నిన్నో విచిత్రమైన చోటికి తీసుకెళ్లుతున్నాను.  మరి వెళ్దామా! స్కూటర్‌ పై చుట్టూ తిరిగి వెళితే మూడు కిలోమీటర్లు ఉండొచ్చు. కానీ నీకు ఫరవాలేదంటే పొలాల్లోంచి అడ్డదారిన నడిచివెళితే ఒక కిలోమీటరు ఉండొచ్చు. నీ ఇష్టం మరి. ఎలా వెళ్దాం?’’ అన్నాడు.

వాడు ఏమాత్రం ఆలోచించకుండా, ‘‘పొలాల్లోంచి వెళదాం’’ అన్నాడు. స్కూటర్‌ వదిలేసి బయలుదేరాం. మా కంకరరోడ్డు వదిలి పొలం గట్లపై నడక సాగించాం. వరి కోతలయిపోయి నెల దాటింది. ఖాళీ చెలకల్లో కొన్ని పెసర, కొన్నింట జనుము వేసినవి పెరిగి పచ్చగా పరుచుకుని ఉన్నాయి. ఆ తరువాత మామిడితోటల్లోంచి వెళుతుంటే మావాడు చుట్టూ చూసుకుంటూ మైమరిచిపోతున్నాడు. ‘‘ఎన్నాళ్ళయ్యిందిరా ఇలా పచ్చని పొలాల్లో తిరిగి. నేను ఢిల్లీలో ఆర్కిలాజికల్‌ డిపార్టుమెంట్‌లో చేరినాక ఈ మూడేళ్ళలో ఇదే ఇంత ప్రశాంతమయిన చోటులో తిరగడం. అందునా నా ప్రియమిత్రుడితో, మీ అమ్మగారి ప్రేమాదరాలతో, నాకు చాలా సంతోషంగా ఉందిరా వికాస్‌! వీలు చేసుకుని రెండేళ్ళకోసారయినా మీ ఊరికి రావాలనుందిరా!’’ ‘‘రెండేళ్ళకేం ఖర్మ, ప్రతి ఏడూ రారా. సెలవు దొరకబుచ్చుకుని సంక్రాంతికి రా.ఇంకా ఎంత సందడిగా ఉంటుందో  తెలుసా ఇక్కడ?’’ అన్నాను. ‘‘అది సరే ఈ ఊర్లో ఏదో విచిత్రమైన చోటు అన్నావు, ఏమిటిరా విశేషం?’’ ‘‘నువ్వు పెద్దగా ఊహించుకోకు.  అదొక చరిత్రకీ, విశ్వాసానికీ సంబంధించిన ‘జీవజల’ తో కూడిన కొలను గురించి. నాలుగుతరాల కంటే ముందునుండీ దీనిపై చాలా ఆసక్తికరమయిన విషయాలను ఊరంతా చెప్పుకుంటారు. నాకు తెలిసి ప్రభుత్వ శాఖలు, పురావస్తు శాఖ తవ్వకాలు చెయ్యాలని ప్రయత్నించినప్పుడల్లా ఊరంతా ఒక్కటై అది జరగనివ్వలేదు. ఆ ‘జీవజల’ కు సంబంధించిన ఆ పెద్ద బావి లాంటి పాడుపడిన కొలనులోకి ఎవరూ దిగే ప్రయత్నం చెయ్యరు.చెయ్యనివ్వరు. ఆ కొలను విషయంలో ఊరందరిదీ ఒకే మాట, కట్టుబాటు. అందులోకి ఎవరు దిగే ప్రయత్నం చేసినా ఊరికి కీడు జరుగుతుందని పండితులూ, పామరులూ అందరూ విశ్వసిస్తారు.దాని లోతుగానీ, అందులో ఉన్న జలచరాల గురించి కానీ ఎవ్వరూ ఖచ్చితంగా చెప్పలేరు. ఇంకో మూడు నెలల తరువాత వైశాఖ పూర్ణిమకు ఇక్కడ ఒకరోజు కార్యక్రమం మా ఊరికి చాలా ముఖ్యమయిన ఘట్టం’’.‘‘చాలా ఆసక్తికరంగా ఉందిరా వికాస్‌! నాకు పరిశోధనకు మంచి ముడిసరుకు దొరికినట్టే అయితే ...’’  అనగానే, నేను కంగారుగా, ‘‘ఆ ఆలోచనా, ప్రయత్నమూ మాత్రం పెట్టుకోకురా నాయనా! మా ఊరునుంచి నన్ను తరిమేస్తారు అంతా ... ఏకగ్రీవంగా’’ అన్నాను.

‘‘సరే, దాని చరిత్ర అంతా చెప్పు’’ అని అడిగాడు మా మహీ చాలా ఉత్సుకతతో.‘‘అదిగో ... ఆ ఎత్తుగా కనబడుతున్న గట్టు దిగితే ఆ పక్క నీకు ఆ కోనేరు కనిపిస్తుంది’’ అన్నాను, పిల్లకాలువ పైన వేసిన తాటిపట్టెల పైనుంచి వాణ్ణి మెల్లగా చెయ్యిపట్టి దాటిస్తూ ... కట్ట దాటి కొంచెం కిందకు దిగి పెద్ద చెట్లతోనూ, ముళ్ళకంపల పొదలతోనూ, అడవిపూల తీగెలతోనూ దట్టంగా ఉన్న చిట్టడవి లాంటి ప్రదేశాన్ని చుట్టూతిరిగి దాటుతుండగా చెప్పాను, ‘‘ఇదేరా! ఆ కొలను’’ అని.‘‘కొలను ఎక్కడరా, నీళ్ళు ఏవీ?’’ అడుగుతున్నాడు  గుబురుపొదల్లోంచి ఏవన్నా కనబడుతుందేమోనని, గట్టు చివరన వంగిచూస్తూ ... 
‘‘ఇంకా ఆ వైపుకి వెళ్దాం రా. తూర్పువైపున ఇప్పుడు సాయంత్రపు ఏటవాలు, నీరెండలో కొంచెం కనబడొచ్చు’’ అని అటువైపు దారితీసాం. దారి కూడా లేకుండా అంతా పిచ్చిమొక్కలతో నిండిపోయి ఉంది.కొలనుకు తూర్పుగట్టు వైపుకు చేరుకున్నాక, అక్కడ ఒక నాలుగు రాతిస్థంభాల మీద ఏ చెక్కుడూ లేని రాళ్ళతోనే పైకప్పు కూడా పరిచిన మండపం లాంటి కట్టడం  ఉంది. అందులో కూడా మొక్కలు మొలిచి, ఎండుటాకులు కుప్పలుగా చేరి దుమ్మూ, ధూళితో చాలాకాలం మానవ సంచారం లేని పాతరాతియుగపు శిథిలకట్టడం లా నిలబడిఉంది. ఆ మండపానికి ముందు ఓ ఇరవై అడుగుల దూరంలో పెద్ద రాతిపలకతో కొలనుపైకి పేర్చినట్టు పరిచిఉంది. నేను చుట్టూ తలతిప్పి చూసి, ఏ మానవ సంచారం లేదని నిర్ధారణ చేసుకుని మావాణ్ణి చెయ్యిపట్టుకుని ఆ రాయిపైకి తీసుకెళ్ళాను. వాడు ఆ మండపాన్ని,ఇంకా అక్కడ కనిపించే రాయిని పరిశీలనగా చూస్తున్నాడు. ‘‘అదిగో... ఆ కొమ్మల మధ్యనుంచి చూడు, నీళ్ళు కనబడతాయి’’ అన్నాను కొంచెం బెరుకుగా. ఆ వైపునే ఆ చెట్ల కొమ్మలపై పడిన నీరెండ కిరణాలు ముదురాకుపచ్చ ఆకుల గుబురులోంచి కొలనులోకి పడుతున్నాయి.‘‘నీళ్ళెక్కడ, రాతిబండలే కనిపిస్తున్నాయి’’ అన్నాడు మహీ కళ్ళు చిట్లించి, దీర్ఘంగా పరిశీలించి చూస్తూ. ‘‘ఒక్క నిముషం’’ అని నేను చుట్టూ చూసుకుంటూ జడుస్తూనే ఒక గులకరాయి వేశాను ఆ గుబుర్ల మధ్యలో ఖాళీలోంచి.‘‘బుడుంగు’’మని నీళ్ళ శబ్దం వినిపించింది. ‘‘చూడు చూడు’’ అని మావాణ్ణి కంగారుగా కిందికి తలపట్టుకు వంచాను. రాయి విసిరిన ఫలితంగా ఏర్పడిన అలలు లేతకిరణాల కాంతికి బంగారు రంగులు మెరుస్తూ లీలగా కనిపించాయి. మహి ఆశ్చర్యపోయి చూస్తున్నాడు.‘‘ఇంత స్వచ్ఛమయిన నీరా! నువ్వు కదిలించకపోతే, అవి నీళ్ళు అనే తెలియడం లేదు. ఎక్కడో కింద ఉన్న బండరాళ్ళు అంత స్వచ్ఛంగా, తేటగా కనిపిస్తున్నాయి. ఇన్ని చెట్ల ఆకులు రాలుతూ, పొదల మధ్యన వాడకంలో లేని కొలనులో నీరు ఇంత స్వచ్ఛంగా ఉండడం నిజంగా నమ్మశక్యం కావడం లేదురా వికాస్‌’’.

అప్పటికే సూర్యుడు నారింజ రంగుకు మారుతున్నాడు. ‘‘మహీ! చీకటి పడితే మనం వచ్చిన తోటదారి వెంట వెళ్ళడం కష్టం. రోడ్డు మీదుగా పోవాలంటే దగ్గరలో ఓ గంట పడ్తుంది. పోతూ పోతూ నీకు ఈ కొలను గురించిన విశేషం చెబుతాను. బయల్దేరు’’ అని వాణ్ణి బలవంతంగా బయలుదేరదీశాను.‘‘మా నాన్నకు ముత్తాతగారి చిన్నతనంలో ఇది జరిగింది. బ్రిటిష్‌వారి పాలనలో ఉన్ననాటి సంగతి.  ఇప్పటికి నూరు సంవత్సరాల కంటే కిందటి మాట. ఈ కొలను చిన్న తేటనీటి గుంటగా ఉండేది. అప్పట్లో మా ఊరికి మంచినీటి అవసరాలకు మొత్తం ఇదే వాడుకునేవారు. కొలనులో దిగటానికి ఏర్పాటు చేసుకున్న దిగుడు మెట్లేమీ లేవు. సహజంగానే ఏర్పడిన రాళ్ళ వరసలు చిన్నపిల్లలు కూడా దిగడానికి అనువుగా ఉండేవి. బిందెలతో, కుండలతో ఒకరి తరువాత ఒకరుగా నీళ్ళు తెచ్చుకునేవారు. ఎప్పుడూ నీరు అంతే తేటగా, అంతే లోతులో ఉండేవి. వర్షాకాలంలో అయినా నీటిమట్టం పెరిగేది కాదు. ఎంత వేసవిలోనైనా, చివరికి మాకు దగ్గరలో ఉన్న గోదావరి బాగా తరిగిపోయినప్పుడు కూడా ఈ కొలనులో మాత్రం అంతే నీరు ఉండేది. అదొక అద్భుతమయిన ‘జీవజల’ గా మా ఊరి అవసరాల కోసం పుట్టిన పాతాళగంగగా అందరూ ఎంతో పవిత్రంగా పూజించుకునేవారు. ఆ నీటిని బిందెల్లో నింపుకునే దగ్గరగానే నీటిలో నుండే ఒక నిలువెత్తు రాయి నిటారుగా ఉండేది. నీళ్ళు నింపుకున్న ప్రతివాళ్ళూ వంగి బాగా సాగి ఆ రాయిని చేతితో తాకి కళ్ళ కద్దుకుని అప్పుడు నీళ్ళబిందెతో పైకి వచ్చేవాళ్ళు. ఊరి వాళ్ళందరూ ఈ కొలను దగ్గర మాత్రం ఎంతో ప్రశాంతంగా, పవిత్రంగా ప్రవర్తించేవారు.

అప్పటికి పదేళ్ళపైగా దక్షిణభారతంలో పనిచేస్తున్న బ్రిటిష్‌ అధికారి హైడెన్‌ గత మూడేళ్ళుగా ఆంధ్రరాష్ట్రంలో పదోన్నతి పొంది రెవెన్యూ అధికారిగా పనిచేస్తున్నాడు. ఒకసారి పన్ను వసూళ్ళ నిమిత్తం మా ఊరిమీదుగా పోతూ, మధ్యాహ్న భోజనానికి ఆగాడు. ఉన్నవాటిలో పెద్దదయిన మునసబు ఇంటివద్ద బస ఏర్పాటుచేశారు. ముందుగానే చేరుకున్న రెవెన్యూ సిబ్బంది. హైడెన్‌ వంటమనిషి పట్నం నుండి వచ్చి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసి ఉన్నారు. మొత్తం పటాలానికి, మందీమార్బలానికి సరిపడా మాంసాహారం కోసం మేకలూ, కోళ్ళూ బంట్రోతుల ద్వారా సేకరించి, అన్ని ఏర్పాట్లూ ఎంతో శ్రద్ధగా నిర్వహించిన కరణాన్ని దొరవారు చాలా మెచ్చుకున్నారు. మునసబు గారి పట్ల కృతజ్ఞత తెలియజేశారు. భోజనానంతరం విశ్రమించడానికి మాత్రం కొంచెం ఇబ్బందిపడ్డారు. వేడి, ఉక్కబోతకు చాలా నొచ్చుకోసాగారు హైడెన్‌ దొరవారు. గమనించిన కరణం ఊరి బయట ఉన్న కొలను దగ్గర చల్లగా ఉంటుందని చెప్పి ఒప్పించి వారిని గుర్రాల మీద బయలుదేరించి, వెనుక పరిమిత పరివారం, మునసబు, కరణం వగైరాలు బయలుదేరారు. కొలను గట్టున పెద్ద రావిచెట్టు నీడన అప్పటికే పరచిఉంచిన పడకపై విశ్రమించిన హైడెన్‌ దొర గాఢనిద్రలోకి వెళ్ళిపోయాడు. సుమారు రెండు గంటల తరువాత మెలకువ వచ్చిన దొరగారు ఆ సౌకర్యానికి, నిద్ర సౌఖ్యానికి ఉబ్బితబ్బిబ్బైపోయారు. కరణం దొరవారిని సంతోషపెట్టిన సంబరంలో ఆ కొలనులో నీళ్ళు చాలా బావుంటాయనీ, తాగి చూడవలసిందనీ అభ్యర్థించాడు. ఆరోగ్యసూత్రాలు పక్కనబెట్టి, కడవతో తెస్తామంటే వద్దని, వెనక ఇద్దరు సహాయంగా నడవగా తనే స్వయంగా కిందికి దిగాడు. ఎడమచేత్తో కొంచెం నీటిని తీసుకుని నోట్లో పోసుకున్నాడు. పుక్కిలించి, పక్కకు ఊసి, దోశెడు నీళ్ళు తీసుకుని, మరోసారి నోట్లో పోసుకుని ఒక క్షణం పుక్కిటబట్టి మళ్ళీ ఊసేశాడు. అయితే ఈసారి అవి ఆ నిలువెత్తు శిలపైన పడ్డాయి. గట్టుపైనుండి చూస్తున్న అందరూ నిర్ఘాంతబోయి ‘అపచారం అపచారం’  అంటూ గొణుక్కున్నారు. 

మునసబుగారు కొంచెం ధైర్యంచేసి, ‘‘దొరగారూ! ఒక్కసారి ఆ శిలకు మొక్కి లెంపలేసుకోండి. అది మాకు చాలా విశ్వాసపాత్రమయిన శక్తిరూపం. చెప్పండయ్యా మీరు’’ అన్నాడు కరణాన్నీ, దొర వెంబడి వచ్చిన దుబాసీనీ ఉద్దేశించి. వాళ్ళు చెప్పబోతుంటే హైడెన్‌ దొర చెయ్యి ఊపి అవసరం లేదు, అర్థం అయ్యింది అన్నట్టు సైగ చేశాడు. అందరూ నిశ్శబ్దం అయిపోయారు. జనం అంతా బిక్కచచ్చిపోయారు.మునసబు తలవంచుకుని దొర పైకిరాకముందే ఇంటిదారి పట్టి వెళ్ళిపోయాడు.ఇది జరిగిన నెల రోజులకే కరణాన్ని కబురుపెట్టి పట్టణంలో తన ఆఫీసులో మంతనాలు చేసి తన నిర్ణయం చెప్పి ఊరిలో అందరికీ, ముఖ్యంగా మునసబుకి తెలియచెయ్యమని, తను పదిరోజుల్లో వస్తాననీ చెప్పి పంపించాడు. కరణం మునసబుకు మాత్రమే విషయం చెప్పి, జనానికి ఆయన్నే చెప్పమన్నారని దొరగారి ఉత్తర్వు అన్నట్టుగా చెప్పాడు. మునసబు హతాశుడైపోయి, మార్గం తోచక, వైద్యానికి తన మామగారి ఊరెళుతున్నట్టు, రెండు నెలలు ఊరికి రాలేనని చెప్పి, గ్రామనౌకరుతో హైడెన్‌ దొరగారికి కబురెట్టి, కుటుంబంతో సహా ఊరినుంచి పలాయనం చిత్తగించాడు.పట్నం నుండి వచ్చిన రెవెన్యూ సిబ్బంది కరణంతో కలిసి ఊరి జనానికి దొరగారి ప్రణాళిక వివరించే ప్రయత్నం చేశారు. ‘‘ఆ కొలనుని పెద్దదిగా చేసి చుట్టూ ఉద్యానవనంగా తీర్చిదిద్దాలని దొరగారి ఉత్తర్వు’’ అని చెప్పారు.  ‘‘కాదు దొరలకోసం ఇక్కడ బంగ్లా కట్టుకుంటారు’’ అని జనంలోంచి కొందరు గట్టిగానే అన్నారు. 

కొలనును మరింత లోతు చెయ్యడానికి ఉప్పరివాళ్ళను పనికి దిగమన్నారు అధికారులు. కరణం పేరు పేరునా పిలుస్తూ వివరాలు వ్రాసుకుంటూ కొలనులోకి దిగమని పురమాయిస్తున్నాడు. అయిష్టంగానే ఒక్కొక్కరూ దిగినాక పైనుండి ‘‘ఆ రాళ్ళను ఒక్కొక్కటీ పగలగొట్టండి. ముక్కల్ని గంపలకెత్తండి’’ అని చెప్పగానే పలుగులతో, పారలతో దిగినవాళ్ళంతా ‘‘ఇయ్యి రాళ్ళు కాదు పెబూ, మా ఊరిని కాపాడే ఇలవేలుపులు బాబు ఇయ్యి. వాటిని ఏం సెయ్యకూడదు దొరలారా. ఆటికి మొక్కటవే కానీ మేం ముట్టను కూడా ముట్టం బాబులూ. వొదిలెయ్యండి’’ అనుకుంటూ అందరూ పైకివచ్చి మిగతా ఊరిజనంతో కలిసి, కరణం ఎంత అరుస్తున్నా వినకుండా విసుక్కుంటూ వెళ్ళిపోయారు.నాలుగురోజుల్లో మందీమార్బలంతో హైడెన్‌ దొరవారే కదిలివచ్చి కొలను దగ్గరే డేరాలు వేసి, క్యాంపు వేశారు. ఊరిలోని పెద్దలు వచ్చి దొర దగ్గర మొర పెట్టుకున్నారు. ఈ పవిత్ర ‘జీవజల’ ను అలాగే కాపాడుకోవాలనీ, అక్కడ శక్తి స్వరూపాలైన ఆ సహజ శిలలు తాము కొలుచుకునే దైవాలనీ, దయచేసి కొలనును ఏమాత్రం కలకలం చేయొద్దనీ బ్రతిమిలాడారు. హైడెన్‌ దొర ఆగ్రహోదగ్రుడైపోయాడు. ‘‘అందరూ వినండి. ఇది బ్రిటిష్‌ ప్రభుత్వ ఉత్తర్వు. ఇక్కడ రహదారి బంగళా నిర్మిస్తారు. ఈ చుట్టుప్రక్కల ఉన్న పధ్నాలుగు గ్రామాలకూ ఇది ముఖ్య రెవెన్యూ తహశీల్‌ గా చేస్తాం. గ్రామాన్ని వృద్ధి చేస్తాం. ఈ కొలనును విశాలం చేసి సుందరంగా తీర్చిదిద్దుతాం. అక్కడి శిలల్ని తొలగించకపోతే నీటి ఊట పూర్తిస్థాయిలో పైకిరాదు. అందుకే ముందు ఈ పని మొదలుపెట్టాం. అప్పుడు మొత్తం కొలను పైదాకా నిండేంత నీరు వస్తుంది. ఎవరికి అభ్యంతరాలున్నా ఈ పని ఆగదు. అందరూ సహకరించండి. ప్రభువులను ప్రసన్నం చేసుకోండి. ఇది ఆర్డరు’’ అని ముగించాడు.

‘‘ఊరికే కాదు, ప్రభువులకు కూడా అరిష్టం అనీ, ఈ పవిత్రమైన కొలనును ఏమీ చెయ్యవద్దనీ మళ్ళీ చెప్ప ప్రయత్నించారు ఊరిపెద్దలు. హైడెన్‌ దుబాసీ వంక తిరిగి ‘వ్వాట్‌ పవిత్రత’ అని అడిగాడు. ‘సేక్రెడ్‌నెస్‌’ అని జవాబు. హైడెన్‌ తనలో తాను గొణుక్కుంటున్నట్టుగా ‘‘వ్వాట్‌ బ్లడీ సేక్రెడ్‌నెస్‌ ఇన్‌ దీజ్‌ స్టోన్స్‌’’ అన్నాడు.కరణం ఊరివాళ్ళకు నచ్చజెప్పి పంపించివేసి, దొర దగ్గర చేరి, ‘‘అయ్యా, ప్రభువులు తలచుకుంటే అసంభవం ఏముంటుంది? ఊరివాళ్ళకి నేను చెప్పుకుంటాను. కానీ ఒక్క శిస్తులు వసూలు మాత్రమే చేసేనన్ను వారెవ్వరూ ఖాతరు చెయ్యరు. అదీ చిక్కు’’ అన్నాడు నర్మగర్భంగా.హైడెన్‌ తల పంకించాడు.ఒకసారి చెయ్యి గడ్డం కింద ఆనించి కళ్ళు మూసుకున్నాడు. ఒక నిమిషం తరువాత, ‘‘మీకు మునసబు అధికారాలను కూడా కట్టబెడుతున్నాం. దోషులను నిర్ణయించి ప్రభువులదగ్గర హాజరు పరిచే అధికారం మీకుంటుంది. అంతేకాదు, ఇక్కడ రహదారి బంగళా నిర్మించి ఎదురుగా ఈ కొలనుని ఈతకొలను గా మార్చి సిద్ధం చేసాక, ఈ ఫిర్కాకి మిమ్మల్ని ముఖ్య అధికారిగా చేసే బాధ్యత నాది. రేపే కొలనులో రాళ్ళు తీసే పని ప్రారంభం కావాలి. సరేనా!’’ అని కరణాన్ని కరుణ, కాఠిన్యం కలిపిన చూపుతో కట్టడి చేసాడు. కరణం వంగి వంగి, ‘‘చిత్తం, చిత్తం ప్రభువుల మనసెరిగి మసలుకోగలను. అన్ని విషయాలు సానుకూలం చేసుకునే బాధ్యత నాది. ఆపై  మీ దయ’’ అంటూ నిష్క్రమించాడు.ఊరంతా అట్టుడికిపోతోంది. ఎవరికివారే గుబులు పడుతున్నారు కాని పైకి చెప్పుకోలేకపోతున్నారు. రాత్రి కరణం చేసిన హెచ్చరికలు, ప్రభువుల శక్తి సామర్థ్యాలను వివరిస్తూ, వారికి ఆగ్రహం వస్తే ఊరికి  సంభవించబోయే గండం గుర్తుకుతెచ్చుకొని వణికిపోతున్నారు. అంతకుమించి కొలనులో, తాము పవిత్రంగా చూసుకునే శిలారూపాలకు ఏమైనా అపచారం జరుగుతుందేమోనన్న భయాందోళనలు వారిని  ఎక్కువ కలవరపెడుతున్నాయి.

హైడెన్‌ మాత్రం రెట్టించిన పట్టుదలతో పొద్దుపొడిచి పొడవకముందే కొలను పక్కన కుర్చీ వేయించుకుని ఉప్పరివాళ్ళ పనిని స్వయంగా పర్యవేక్షిస్తున్నాడు. వాతావరణం గంభీరంగా ఉంది. కరణంతో బాటు వచ్చిన కొద్దిమంది ఏమి జరుగుతుందోనని, ఏమీ జరక్కూడదనీ మనసులోనే మొక్కుకుంటూ శిలల్లా కొలను చుట్టూచేరి ఉన్నారు. ఇష్టం లేకపోయినా ఆతృతకొద్దీ తమ ఇష్టదైవాన్ని ప్రార్థించుకుంటూ మిగతా గ్రామస్థులు ఒకరి వెంబడి ఒకరు వచ్చి కొలను చుట్టూ చేరుతున్నారు. పట్నం నుంచి వచ్చిన దొరవారి పటాలం కాకుండా కరణం, అతని తైనాతీలు మాత్రమే హైడెన్‌ కి దగ్గరలో నించున్నారు. కొలను లోపల ఏడెనిమిది మంది ఉప్పరివాళ్ళు నీటిలో సగం మునిగిన శిలల దగ్గర ఉన్నారు. లోనికి దిగే రాళ్ళపై సగంలో ఇద్దరు ప్రభుత్వోద్యోగులు ఇంజనీరింగ్‌ శాఖకు సంబంధించినవారు అసహనంగా నిలబడి ఉన్నారు.నలుగురు పెద్ద కడవలతో నీళ్ళు వంతులువారీగా పైకి మోస్తున్నారు. ఠక్కుఠక్కున పైపైన తగిలే గునపం దెబ్బలకు శిలలు ఏమాత్రం చలించడంలేదు. హైడెన్‌ కి మాత్రం చలనం వచ్చింది అసహనంతో.వాళ్ళెవరూ మనస్ఫూర్తిగా ఆ పని చెయ్యడంలేదని అర్థం అయిన హైడెన్‌ కి మొహం ఎర్రబడుతోంది. అప్పుడప్పుడే పెరుగుతున్న ఉదయపు సూర్యుని తీక్షణత హైడెన్‌ కళ్ళల్లో ప్రతిబింబిస్తోంది. కరణం పసిగట్టి ‘‘గునపం పోటు గట్టిగా వెయ్యండిరా, వొంట్లో  చేవలేనట్టు ఏంటిరా ఆ మెతక పని? అలా మెత్తగా తాకిస్తే రాళ్ళు పగులుతాయిరా?’’ అని అరుస్తున్నాడు మధ్యమధ్యలో దొరగార్ని పరిశీలిస్తూ, ‘‘అయ్యి ఉత్త రాల్లేటండె పగిలిపోతాకి?’’ అన్నాడొక మనిషి గునపానికి గెడ్డం ఆనించి అనాసక్తంగా. ఇక ఉండబట్టలేకపోయాడు హైడెన్‌. దిగ్గున కుర్చీలోంచి లేచాడు. దెబ్బతిన్న క్రూరజంతువు లాగ ఒక్కబిగిన నాలుగంగలుగా కొలనులోకి దిగేశాడు. ఒకని చేతిలోని గునపాన్ని లాక్కుని ఆ మహాశిలపై, ఎంతో కాలంగా ఊరికంతటికీ శక్తిస్వరూపంగా నిలిచిన ఆ మహిమాన్వితమయిన శిలపై, అక్కడి యావన్మంది విశ్వాసానికి, నమ్మకానికి ప్రతిరూపమయిన ఆ శిలపై, అందరి మొక్కులూ అందుకుంటున్న ప్రకృతి చెక్కిన ఆ మూర్తిపై   అహంకారంతో, అధికారమదంతో హైడెన్‌ దెబ్బ వెయ్యబోయాడు. ఆ వెర్రి ఆవేశంలో అతని కాలు పట్టుతప్పింది. నీరు తోడిన బురదగుంట లోకి అతని బూటుకాలు దిగబడిపోయింది.

చేతిలోని గునపాన్ని పక్కకు విసిరేంతలో ఆ బరువే అతని రెండో కాలునూ పట్టుతప్పించి వెనక్కిపడేట్టు చేసింది. అందరూ అయ్యో, అయ్యో పట్టుకోండి లాంటి అరుపులు వినిపిస్తుండగా, ఎవరూ ఊహించని ఒక మహాద్భుతం జరిగింది. నిలువెత్తు ఆ మూర్తి, ఎప్పుడూ ఊరిని చల్లగా చూసే ఆ గంభీర రూపం గర్జించకుండానే దుర్గాదేవి వాహనం పులిలాగా, అప్పటికే బురదలోకి దిగిపోయిన హైడెన్‌ దొరపై విరుచుకుపడిపోయింది. అదే సమయలో ఆ మహామూర్తి ఇంతకాలం ధీమాగా నిల్చున్న పీఠం దగ్గర నుండి ఒక్కసారిగా పెల్లుబుకి వెల్లువలా వచ్చింది ప్రళయరూపంలో జల. ఆకాశంలోకి ఒక్కసారిగా ఉవ్వెత్తున ఎగిరిపడ్డాయి ఆ జీవజలాలు. ఊరందరి పైనా అవి వర్షించాయి. కొలనులో ఉన్నవారంతా హాహాకారాలతో పైకి వచ్చేశారు. ఇంకా ప్రాణభీతితో చేస్తున్న ఒక ఆర్తనాదం మాత్రం హోరున ప్రతిధ్వనిస్తోంది. అదే హైడెన్‌ చించుకుంటున్న గొంతు. క్రమంగా ఆ గొంతు నీళ్ళల్లో ఉక్కిరిబిక్కిరి అయినట్టు వినిపించింది. జల తాలూకు నీరు ఉబికివస్తూ కొలనును నింపేస్తోంది. మెల్లమెల్లగా హైడెన్‌ నీ, అతని అహంకారాన్నీ,  అధికార దౌష్ట్యాన్నీ, జనుల అచంచల విశ్వాసాన్ని కించపర్చిన హేళననీ శాశ్వతంగా జలసమాధి చేసేసింది. జనం అంతా స్థాణువులైపోయి చూస్తున్నారు. తాము చేయని తప్పుకు లెంపలు వేసుకుంటూ, దణ్ణాలు పెడుతూ, ఎవరికి వారు కొలనుకీ, ఒరిగిపోయిన ఆ మహామూర్తికి మొక్కుతున్నారు. అప్రయత్నంగానే ప్రణమిల్లుతున్నారు. ఇంతలో వారి మధ్య దబ్బున పడిన శబ్దానికి అందరూ అటు చూశారు. కరణం కిందపడి గిలగిల కొట్టుకుంటున్నాడు. జరిగిన ప్రళయం అతన్ని నిశ్చేష్టుణ్ణి చేయడమే కాదు, అపరాధ భావన అతన్ని హతాశుణ్ణి చేసింది. నోరు వంకరపోయి కాలూ చెయ్యీ మెలికలు తిరిగిపోయాయి. అందరూ తేరుకుని నిశ్శబ్దంగానే ఒక మూకుమ్మడి నిర్ణయానికి వచ్చారు. చేతులెత్తి ఆ జల తల్లికి, ఆ కొలనుకూ, ఆ మహా విరాట్స్వరూపమైన ప్రకృతిశిలకూ మొక్కుతూ వెనుదిరిగారు. అహంతో కళ్ళు మూసుకుపోయిన హైడెన్‌ దొర చచ్చిపడి ఉన్న, జలసమాధి అయిన ఆ కొలనును మైలపడిపోయినదిగా మనసులో నిర్ధారించుకున్నారు యావత్తు ఊరి జనమూ. అప్పటినుండి ఇక ఎవరూ ఆ నీటిని తాకలేదు. సంవత్సరంలో వైశాఖపూర్ణిమ నాడు ఒక్కరోజు మాత్రం ఊరంతా వచ్చి ఎవరికి వారు కడవలతో గోదావరీ జలాల్ని మోసుకొచ్చి, ఆ కొలనులో పోసి జలశుద్ధి చేసి, కొలనుకు ప్రణమిల్లి వెనుదిరుగుతారు.’’

నేను మహీని చూస్తూ అడిగాను.‘‘ఇప్పుడు ఈ రహస్యాన్ని శోధించాలని ఉందా!’’నిలువుగా తలూపాడు చిన్నగా.‘‘ఇదివరకటి మనుషులు ఇప్పుడు లేరు. అయినా అలాంటి పరిశోధనకు  అంగీకరించరు.చుట్టుప్రక్కల వారిని కలుపుకుని పెద్ద ఉద్యమం చేస్తారు.’’ అన్నాను.‘‘ఈదేశంలో ఇలాంటివి చాలా ఉన్నాయి. అవన్నీ పరిశోధించడానికి చాలా పెద్దమొత్తం కావాలి. మనం అనవసరంగా కోట్లు తగలేస్తాం.మనుషుల ప్రకృతి పరిణామాల గురించి తెలుసుకోవడానికి ఇష్టపడరు. అయితే ఈ స్థితి ఇలానే  ఉంటుందని అనుకోను’’‘‘అంటే ...’’ అన్నాను.‘‘నడుస్తూ మాట్లాడుకుందాం’’ అన్నాడు. ఇద్దరం వచ్చిన దారిలో నడుస్తున్నాం.‘‘నేనిక్కడ ప్రజల సెంటిమెంట్‌ గురించి మాట్లాడటంలేదు. అలా వాళ్ళ వ్యతిరేకత వల్ల జరగబోయే పరిణామాల గురించి కూడా అప్పటి బ్రిటిష్‌వారిలా ఇక్కడ ఒక వర్గం తయారయింది. అది కార్పొరేట్‌ వర్గం.’’ఆశ్చర్యంగా చూస్తున్నాను. ‘‘ఏదోఒక రోజు బ్రిటిష్‌వారు సాధించలేనిది కార్పొరేట్‌ రంగం చేయగలదు. అందులోను ఈ ప్రాంతానికి విలువ పెరుగుతుంది. అది ఈరోజు జరుగుతుందా ... కొన్ని సంవత్సరాల తరవాతా అన్నది వేరే విషయం. ఏ రహస్యమైనా ప్రగతికోసం, పరిశోధన కోసం అయివుంటే ప్రయోజనం ఉంటుంది. అది కొందరు వ్యక్తులకు, సంస్థలకు మాత్రమే  ఉపయోగపడినంతకాలం ఘర్షణలుంటాయి. ప్రకృతి రహస్యాలను అర్థం చేసుకోవడానికి మనిషి జరిపే అన్వేషణ లాభాల కతీతంగా ఉండే మంచిరోజు కోసం ఎదురుచూద్దాం. ఈ ప్రయాణం నాకు కొత్త పాఠాల్ని నేర్పింది’’ అన్నాడు మహి.
పొత్తూరి  సీతారామరాజు 

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top