అదేమైనా సమస్యా?

family health counciling - Sakshi

సందేహం

‘హెవీ పీరియడ్స్‌’ అనే మాటను ఇటీవల ఎక్కడో చదివాను. అదేమైనా సీరియస్‌ సమస్యనా? అది రావడానికి గల కారణాలను తెలియజేయగలరు?
 – పీఆర్, సూర్యాపేట

సాధారణంగా పీరియడ్స్‌ సమయంలో ఒక్కొక్కరి శరీరతత్వాన్నిబట్టి మూడు నుంచి అయిదు రోజుల వరకు బ్లీడింగ్‌ అవ్వడం సాధారణం. వారికి ఆ సమయంలో 10 ఎమ్‌ఎల్‌ నుంచి 35 ఎమ్‌ఎల్‌ వరకు రక్తం పోవడం జరుగుతుంది. కొందరిలో రెండు నుంచి ఏడు రోజుల వరకు మామూలుగా బ్లీడింగ్‌ అవ్వొచ్చు. మరికొందరిలో బ్లీడింగ్‌ చాలా ఎక్కువగా అవుతుంది. ఇది ఏడు రోజులకంటే ఎక్కువగా హెవీ బ్లీడింగ్‌  అవ్వడం, బ్లీడింగ్‌లో 80 ఎమ్‌ఎల్‌ వరకు రక్తం పోవడాన్ని, అలాగే అయిదు రోజులు అయినా సరే అదే 80 ఎమ్‌ఎల్‌ రక్తం పోవడాన్ని ‘హెవీ పీరియడ్స్‌’ అంటారు. దీనికి అనేక రకాల కారణాలు ఉంటాయి. గర్భాశయంలో ఇన్‌ఫెక్షన్స్, అండాశయాల్లో గడ్డలు, సిస్ట్‌లు, థైరాయిడ్, హార్మోన్‌ అసమతుల్యత, ఇతర హార్మోన్లలో మార్పులు, కాపర్‌ టీ వల్ల, రక్తం గూడుకట్టే గుణంలో సమస్యలు, అరుదుగా గర్భాశయ, అండాశయ క్యాన్సర్‌ వంటి ఎన్నో కారణాల వల్ల హెవీ పీరియడ్స్‌ రావొచ్చు. ప్రతి నెలా పీరియడ్స్‌ సమయంలో ఎక్కువగా బ్లీడింగై రక్తం పోవడంవల్ల రక్తహీనత ఏర్పడటం, తద్వారా బలహీనత, నీరసం, ఆయాసం, ఒళ్లు నొప్పులు, ఇన్‌ఫెక్షన్స్‌ వంటి ఇతర సమస్యలు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రక్తహీనత మరీ ఎక్కువగా ఉండి, అశ్రద్ధ చేస్తే అది ప్రాణాపాయస్థితికి దారి తీసే అపాయం ఉంది. కాబట్టి హెవీ పీరియడ్స్‌ని నిర్లక్ష్యం చేయకుండా ఒకసారి గైనకాలజిస్ట్‌ను సంప్రదించండి. హెవీ బ్లీడింగ్‌కు గల కారణాలను తెలుసుకోవడానికి సీబీపీ, ప్లేట్‌లెట్‌ కౌంట్, సీటీ, బీటీ, స్కానింగ్, ప్యాప్‌ స్మియర్‌ వంటి అవసరమైన పరీక్షలు చేయించుకోవాలి. ఆ తర్వాత సమస్యనుబట్టి చికిత్స తీసుకోవడం మంచిది. రక్తహీనత ఉంటే పౌష్టికాహారంతో పాటు ఐరన్‌ మాత్రలు కూడా వేసుకోవాలి.

ఎండాకాలమైనా సరే వేడినీళ్లతో స్నానం చేయడం నాకు అలవాటు. ప్రెగ్నెన్సీ సమయంలో వేడినీళ్లతో స్నానం చేయడం మంచిదేనా? ‘హీట్‌ స్ట్రెస్‌’ అంటే ఏమిటి?
– లహరి, కాకినాడ

ప్రెగ్నెన్సీ సమయంలో వేడి నీళ్లతో స్నానం చెయ్యడంకన్నా గోరువెచ్చని నీళ్లతో చేయడం మంచిది. ఎండాకాలంలో మరీ వేడి నీళ్లతో స్నానం చేయడం వల్ల కొంత సమయం పాటు చెమటలు పట్టి అలసటగా అనిపిస్తుంది. దానివల్ల కడుపులో బిడ్డకు ఎటువంటి హానీ ఉండదు. ఎండలో ఎక్కువసేపు ఉండటం, పని చెయ్యడం, ఊపిరాడకుండా చేసేటటువంటి బిగుతుగా ఉండే బట్టలు ఎక్కువసేపు వేసుకొని ఉండటం, ఎక్కువగా విరామం లేకుండా శారీరక శ్రమ వంటి ఇతర పనుల వల్ల, ఒంట్లో ఉష్ణోగ్రత కంటే బయటి ఉష్టోగ్రత ఎక్కువగా ఉండటం వల్ల కలిగే లక్షణాలను, ఇబ్బందులను ‘హీట్‌ స్ట్రెస్‌’ అంటారు. ఇందులో డీహైడ్రేషన్‌ వల్ల తలనొప్పి, కండరాల నొప్పి, అలసట, కళ్లు తిరగటం, చెమటలు పట్టడం, వికారం, వాంతులు వంటి లక్షణాలు ఉంటాయి.

నా వయసు 29 సంవత్సరాలు. మాకు ఒక బాబు. వాడికి ఒకటిన్నర ఏళ్లు. నా మొదటి కాన్పు సిజేరియన్‌ ద్వారా జరిగింది. అప్పట్లో కోలుకోవడానికి కాస్త టైమ్‌ పట్టింది. ఇప్పుడు రెండో కాన్పుకు వెళ్లాలనుకుంటున్నాం. కాన్పుకూ కాన్పుకూ మధ్య ఎంత గ్యాప్‌ ఉండాలి?
– ఆర్‌. వందన, ఖమ్మం

తొమ్మిది నెలల పాటు గర్భంలో పెరిగే బిడ్డ, తల్లి నుంచి పోషకాలు తీసుకోవడం వల్ల... కాన్పు తర్వాత తల్లిలో అలసట, కండరాల బలహీనత, నడుము నొప్పి, రక్తహీనత, క్యాల్షియం లోపం వంటి సమస్యలు ఉండే అవకాశాలు ఎక్కువ. కాన్పు తర్వాత బిడ్డకు పాలిచ్చేటప్పుడు ఈ ఇబ్బందులు ఇంకా ఎక్కువ అవ్వడం జరుగుతుంది. ఈ బలహీనత నుంచి తల్లి పూర్తిగా కోలుకొని మామూలుగా అవ్వడానికి కనీసం రెండు సంవత్సరాలైనా పడుతుంది. ఇంకా పూర్తిగా కోలుకోకుండానే మళ్లీ గర్భం దాలిస్తే, బలహీనత ఇంకా ఎక్కువగా ఉండి, నడుము నొప్పులు, నీరసం, రక్తహీనత వంటి సమస్యలతో ఇబ్బందిపడాల్సి వస్తుంది. అంతేకాకుండా కడుపులో ఉన్న బిడ్డ కూడా ఎక్కువ బరువు పెరగక పోవడం, నెలలు నిండకుండా కాన్పులు వంటి సమస్యలు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మొదటి కాన్పు సిజేరియన్‌ ద్వారా జరిగితే, గర్భాశయానికి వేసే కుట్లు మాని, మళ్లీ సాధారణస్థితికి రావడానికి కనీసం రెండు సంవత్సరాలు పడుతుంది. ఇంకా తొందరగా గర్భం దాల్చితే బిడ్డ పెరిగే కొద్దీ గర్భాశయం సాగటం జరుగుతుంది. అలాగే ముందు వేసిన కుట్లు పల్చబడి, కుట్ల దగ్గర నొప్పి ఎక్కువగా రావటం, కొన్నిసార్లు నిర్లక్ష్యం చేస్తే కుట్లు తెరుచుకొని గర్భాశయం పగిలి, బిడ్డకి, తల్లికి ప్రాణాపాయం ఉండే అవకాశాలు కూడా ఉంటాయి. ఆపరేషన్‌ అయినవాళ్లకు కాన్పుకి, కాన్పుకి మధ్య మూడు సంవత్సరాలు గ్యాప్‌ ఉంటే తల్లికి, బిడ్డకి మంచిది. లేదంటే కనీసం రెండు సంవత్సరాలైనా గ్యాప్‌ ఉండేలా చూసుకోవాలి.
డా‘‘ వేనాటి శోభ
బర్త్‌రైట్‌ బై రెయిన్‌బో
హైదర్‌నగర్‌ హైదరాబాద్‌ 

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top