పుస్తకం : 13 భారతీయ భాషల తొలికతలు సంకలనం : స.వెం.రమేశ్,
పుస్తకం : 13 భారతీయ భాషల తొలికతలు
సంకలనం : స.వెం.రమేశ్,
ఆర్.ఎం.ఉమామహేశ్వరరావు
పేజీలు: 152 వెల: 150
ప్రతులకు: అన్ని ముఖ్యమైన పుస్తక కేంద్రాలు మరియు ఆర్.ఎం.ఉమామహేశ్వరరావు
20-3-131/ఎ1, శివజ్యోతి నగర్,
తిరుపతి - 517 507
విషయం : ‘తొండనాడు తెలుగు రచయితల సంగం’ ప్రచురించిన పదమూడు దేశ భాషల్లోని తొలి కతల సంకలనం ఇది. తొలికత 1870లో రాయబడిన ఉర్దూ కత అయితే, 1955లో వచ్చిన కశ్మీరి కత చివరిది. ఈ మధ్య కాలక్రమానుసారం వచ్చిన బెంగాలీ, మరాఠీ, మలయాళం, ఒడియా, కన్నడ, గుజరాతీ, హిందీ, తమిళ, కొంకణి, తుళు భాషల తొలి కతలు ఇందులో ఉన్నాయి.
భాషలు వేరైనా, ప్రాంతాలు వేరైనా భారతీయ సాహిత్యపు మూలమొక్కటే. కత ఒక ప్రత్యేక ప్రక్రియగా, ఏయే భాషలో ఎప్పుడు ఆవిర్భవించిందో తెల్సుకోవడం మనల్ని మనం రీ-రీడ్ చేసుకోవడం లాంటిది. గతం పునాది మీద భవిష్యత్తును నిర్మించుకోవడానికి ఉపకరించే విశిష్ట ప్రయోగం ఇది. ఒక్క కశ్మీరి కత తప్ప మిగిలిన కతలన్నీ ఆయా భాషల నుంచి నేరుగా తెలుగులోకి తీసుకురావడం ప్రత్యేకంగా చెప్పవలసిన అంశం.
పదేళ్ల పిల్లవాడు ఆలోచనల జర్నీలో జీవితాన్ని చుట్టి రావడం, మానవత్వం మాత్రమే చివరి వరకు మిగిలేది అనే సత్యం తెల్సుకోవడం ఉర్దూ కత ‘గుజారుహా జమాన’. టాగూరు రాసిన రేవు కథలో గంగమ్మ ఒడ్డున కూచుని పాత సంగతులు నెమరేసుకునే కతకుడు నదిలో ఆడి పాడి, నదిలోనే మునిగిపోయి ముగిసిపోయిన కుసుమ్ కత చెప్తాడు. ఈ బెంగాలీ కతను పోలినదే తమిళ కత ‘గుంటకట్ట రాగిమాను’. తొంభయ్యో నూరో ఏళ్లు ఉన్న రాగిమాను రుక్మిణి కత చెప్తుంది. తన్ను పెళ్లి చేసుకోవాల్సిన నాగరాజన్ మరో పెళ్లి చేసుకోబోతున్నాడని భావించి, నీటిలో మునిగి ఆత్మహత్య చేసుకుంటుంది రుక్మిణి. తొలి తెలుగు రెండు కతల్లో (ఏది అనే ప్రశ్నని వదిలేద్దాం)నూ పోలిక కనిపిస్తుంది. ‘ధన త్రయోదశి’లో విజయలక్ష్మి భర్త వేంకటరత్నంను విశ్వాస ద్రోహం చెయ్యకుండా దిద్దుతుంది. ‘దిద్దుబాటు’లో తిరుగుళ్ల గోపాలరావుకి బుద్ధి వచ్చేట్టు చేస్తుంది భార్య కమలిని. సమకాలిక సమస్యలు, కత నడిపించే తీరులో వైవిధ్యం, సంఘటనలు, సంభాషణలు, మెలో డ్రామా ట్విస్టులు తొలి కతల్లోనే కనబడతాయి. వివిధ భాషల కతలని తెలుగు కతలుగా మలచడానికి అసాధారణమైన కృషి చేశారు అనువాదకులు.
- చింతపట్ల సుదర్శన్
మంచి సంగతులు
పుస్తకం : మీడియా సంగతులు
రచన : గోవిందరాజు చక్రధర్
పేజీలు: 255; వెల: 150 ప్రతులకు: అని ప్రముఖ పుస్తక కేంద్రాలలోనూ.
విషయం : రేపటి చరిత్రకి దినుసును అందిస్తున్న పత్రికారంగ చరిత్ర మీద మనకి ఆసక్తి తక్కువే. నిజానికి పత్రికారంగంలో వచ్చిన పరిణామాలను గమనించడమూ అవసరమే. ఆ ప్రయత్నంలో భాగమే ‘మీడియా సంగతులు’. ప్రముఖ జర్నలిస్ట్, జర్నలిజం పాఠాలు చెప్పిన మాస్టారు గోవిందరాజు చక్రధర్ ఈ పుస్తకం రాశారు. కాబట్టే పత్రికల నేపథ్యం, పత్రికల నాటి స్థానం, వర్తమానంలో ఉన్న స్థానాల గురించి చాలా లోతుగానే చర్చించారు. చక్రధర్ ప్రతికారంగంలోని వెలుగునే కాదు, చీకటిని తడమడానికి కూడా ప్రయత్నం చేశారు.
ప్రింట్ మీడియా తరువాత జరిగిన ఎలక్ట్రానిక్ మీడియా ఆవిర్భావం, ఇంటర్నెట్ గురించి కూడా ఇందులో చదవవచ్చు. అలాగే సాంకేతిక పరిజ్ఞానంతో పాటు పతనంలో కూడా పెరిగిన పోటీని ఇందులో రచయిత నిభాయింపుతోనే అయినా చర్చించారు. ఏ రంగంలో అయినా మార్పు సహజమే. కానీ మార్పునీ పతనాన్నీ వేర్వేరుగా చూడలేకపోతున్న చానెళ్ల, పత్రికాప్రచురణ సంస్థల మీద చ క్రధర్ ప్రదర్శించిన నిరసనను అర్థం చేసుకోవలసిందే. పుస్తకం చివర తెలుగు పత్రికా రచయితల ఫోటోలు ఇవ్వడం రచయిత ఉత్తమ అభిరుచికి నిదర్శనం.
- కల్హణ
కొత్త పుస్తకాలు
అండమాన్ జైలులో స్వాతంత్య్ర వీరులు
మూలం: సుధాంశుదాసు గుప్తా
తెలుగు: పాటూరి రామయ్య
పేజీలు: 130; వెల: 60
2. ముజఫర్ అహ్మద్ ఓ తొలి కమ్యూనిస్టు
రచన: సుచేతన చటోపాధ్యాయ
పేజీలు: 344; వెల: 150
3.నాదమే యోగమని (ప్రపంచ ప్రఖ్యాత సంగీతకారులు)
తమిళం: కృష్ణా డావిన్సి
తెలుగు: ఎజి యతిరాజులు
పేజీలు: 108; వెల: 50
ప్రతులకు: ప్రజాశక్తి బుక్‌హౌస్, చిక్కడపల్లి, హైదరాబాద్-20. ఫోన్: 040-27608107
నాణాలు- నోట్లు
(పుట్టు పూర్వోత్తరాలు)
రచన: కొల్లు మధుసూదనరావు
పేజీలు: 136; వెల: 100
ప్రతులకు: స్వెస్ పబ్లికేషన్స్, 1-6-141/19, విద్యానగర్, సూర్యాపేట-508213. ఫోన్: 9848420070
ఆరుపదుల అనంతర జీవితం
రచన: తెలగరెడ్డి సత్యానందమ్
పేజీలు: 40; వెల: 30
ప్రతులకు: రేవతీ క్రియేటివ్ కమ్యూనికేషన్స్ ప్రై. లి., ఫ్లాట్ 301, మొఘల్ మేన్షన్, ఖైరతాబాద్, హైదరాబాద్-4. ఫోన్: 040-23310670
గురి (వ్యాసాలు)
రచన: గుండెబోయిన శ్రీనివాస్
పేజీలు: 48; వెల: 50
ప్రతులకు: రచయిత, 3-1-74/1/ఎ, కాకతీయ కాలనీ, హన్మకొండ-506011. వరంగల్ జిల్లా. ఫోన్: 9985194697