మంచుఖండంలో.. నారీథాన్ | Snow in the continent | Sakshi
Sakshi News home page

మంచుఖండంలో.. నారీథాన్

Apr 7 2015 11:25 PM | Updated on Sep 2 2017 11:59 PM

మంచుఖండంలో.. నారీథాన్

మంచుఖండంలో.. నారీథాన్

గడ్డ కట్టించే చలి. మంచు దుస్తుల పర్వతాలు. చూపులకు ఎంత సుందరంగా కనిపిస్తుందో కదలడానికి అంత కష్టంగా అనిపించే ప్రాంతం.

గడ్డ కట్టించే చలి. మంచు దుస్తుల పర్వతాలు. చూపులకు ఎంత సుందరంగా కనిపిస్తుందో కదలడానికి అంత కష్టంగా అనిపించే ప్రాంతం. చాలామంది విన్నది, అతి తక్కువ మంది మాత్రమే కన్నది అంటార్కిటికా. అందమైన శ్వేతవర్ణపు ప్రకృతి దృశ్యాల నిలయం. అటువంటి చోట శిఖర సమాన సాహసాన్ని ప్రదర్శించాలనుకున్నారు.. వైద్యురాలైన జూబ్లీహిల్స్ నివాసి డాక్టర్ శిల్పారెడ్డి (35), ఫిట్‌నెస్ ట్రైనర్, గచ్చిబౌలి నివాసి సునీతా తుమ్మలపల్లి (46), జూబ్లీహిల్స్‌లో ఉండే గృహిణి కలిదిండి అనురాధారాజు (47). కొద్దిమందికే సాధ్యమైన అంటార్కిటికా మారథాన్ (42.195కి.మీ) ఇటీవలే పూర్తి చేసిన వీరు సిటీప్లస్‌తో తమ అనుభవాలను పంచుకున్నారిలా..
 ..:: ఎస్.సత్యబాబు
 
హైదరాబాద్ రన్నర్స్ గ్రూప్ సభ్యులం మేం. ముగ్గురం ఇప్పటికే విభిన్న ప్రాంతాల్లో మారథాన్‌లు పూర్తి చేసి ఉన్నాం. అంటార్కిటికా మీద చేసే మారథాన్‌ని లాస్ట్ మారథాన్ అంటారు. ఏడాదికి ఒకసారి దీన్ని నిర్వహిస్తారు. జనరల్‌గా అన్ని కాంటినెంట్స్ చుట్టేయాలనుకునే మారథాన్ రన్నర్స్ 7వది, చివరిగా అంటార్కిటికాను ఎంచుకుంటారు. ప్రస్తుత గ్లోబల్ వార్మింగ్ ఫలిత ంగా అక్కడి అతిపెద్ద గ్లేసియర్స్ (మంచు పర్వతాలు) కనుమరుగు కానున్నాయట. వాటిని ఇప్పుడే చూడాలని ఆశించాం. సో.. మా 3వ కాంటినెంట్‌గా దీనిని ఎంచుకున్నాం.

ఎంట్రీ.. లక్కీ..

ఈ మారథాన్ ఈవెంట్ మార్చి 9న ప్రారంభమైంది. ప్రపంచవ్యాప్తంగా 90 మంది మాత్రమే పాల్గొనే ఈ ఈవెంట్ ఎంట్రీ దక్కడం అంత ఈజీ కాదు. అయితే అన్ని దేశాలకూ ప్రాతినిధ్యం కల్పించాలనే నిర్వాహకుల ఆలోచన, ఇండియా నుంచి అరుదుగా మాత్రమే పార్టిసిపెంట్స్ వచ్చే పరిస్థితుల్లో మాకు అతి కష్టంగానే చోటు దక్కింది. ఈ మారథాన్ కోసం మేం హిల్స్‌లో లాంగ్ రన్స్, జిమ్‌లో ప్రత్యేకంగా స్ట్రెంగ్త్ ట్రైనింగ్ వర్కవుట్స్ చేశాం. మార్చి 1న సిటీ నుంచి బయలు దేరాం.

అడుగుకో అనుభవం.. అపురూప జ్ఞాపకం..

లండన్, అర్జెంటీనాల తర్వాత అంటార్కిటికాకు షిప్‌లో ప్రయాణం. ఆ షిప్ పేరు ఉషువాయె. అతి పెద్దదైన అన్ని వసతులుండే రష్యన్ షిప్ అది. దీన్ని 1987లో తయారు చేశారు. ఇందులో 5 రోజుల ప్రయాణం తర్వాత ఈవెంట్ ప్రారంభమయ్యే చోటుకు చేరుకున్నాం. మార్గమధ్యంలో అంటార్కిటికా, పసిఫిక్ కలిసే చోట రకరకాల హెల్త్ ప్రాబ్లెమ్స్ రావడం, వాటి గురించి ముందస్తు అవగాహన ఉంది కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకున్నాం. అంటార్కిటికా స్వతంత్ర ప్రతిపత్తి ఉన్న ప్రాంతంగా చెప్పవచ్చు. దాదాపు 50 దేశాలకు చెందిన రిసెర్చ్ బేస్‌క్యాంప్స్ అక్కడ మేం చూశాం. అంటార్కిటికా ట్రీటీ (నిబంధన) ప్రకారం.. అక్కడ నివసించడానికి ఎవరికీ అనుమతి ఉండదు. కేవలం పరిశోధకులకు తప్ప, అది కూడా ఒక్కో దేశం నుంచి ఐదారుగురికి మించరు. ఆ పరిశోధకులను కలుసుకోవడం, వారు కనిపెట్టిన అక్కడి విశేషాలను తెలుసుకోవడం మాకు మరిచిపోలేని సందర్భం. అలాగే అక్కడ వాటర్ బాటిల్స్, ఇతర వస్తువుల్ని పడేయడం నిషిద్ధం.
 
మైనస్ 4 డిగ్రీల సెల్సియస్..

మా ఈవెంట్ ప్రారంభమైన సమయంలో మైనస్ 2 రెండు డిగ్రీల సెల్సియస్ టెంపరేచర్ ఉంది. పూర్తి చేసేటప్పటికి అది మైనస్ 4 డిగ్రీలకు పడిపోయింది. మారథాన్ ఉదయం 9 గంటలకు ప్రారంభమై దాదాపు 6.45 గంటల పాటు కొనసాగింది. మేమందరం కాస్త అటూ ఇటూగా ఒకే వ్యవధిలో పూర్తి చేయగలిగాం. ఈ ప్రయాణంలో.. గ్లేసియర్స్ కొంచెం కొంచెం కరుగుతూ సముద్రంలో కలిసిపోవడం చూశాం. అది చూసి మన  భవిష్యత్తుకు ప్రమాద ఘంటికలు మోగిస్తుందనే చేదు వాస్తవాన్ని తెలుసుకున్నాం. ఏదేమైనా ప్రకృతి ప్రేమికులమైన మా ముగ్గురికీ ఈ సాహసయాత్ర మరింత స్ఫూర్తిని అందించింది. అన్ని కాంటినెంట్స్‌లో 8వదిగా ఇంకా అధికారికంగా ప్రకటించని మడగాస్కర్‌లో కూడా మారథాన్‌లు పూర్తి చేయాలనే లక్ష్యం మరింత బలపడింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement