ఎంటర్‌టెయిన్‌మెంట్ కోసం ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్‌పై డిపెండ్ అవుతున్న రోజుల్లో తోలుబొమ్మలాటలా అనుకుంటే మీరు తప్పులో కాలేసినట్టే!
ఎంటర్‌టెయిన్‌మెంట్ కోసం ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్‌పై డిపెండ్ అవుతున్న రోజుల్లో తోలుబొమ్మలాటలా అనుకుంటే మీరు తప్పులో కాలేసినట్టే! లామకాన్‌లో జరిగిన ఈ పప్పెట్ షో చూస్తే తప్పక మీ అభిప్రాయం మార్చుకుంటారు. అనంతపురం నుంచి వచ్చిన ‘వినాయక తోలుబొమ్మలాట’ కళాకారుల బృందం ఇక్కడ లంకిణి శాప విమోచనం, రామరావణయుద్ధం ప్రదర్శించింది. ప్రతి పాత్రను సజీవంగా
చూపించిన తోలుబొమ్మలు ఆహూతులను ఆకట్టుకున్నాయి. తోలుబొమ్మలాటలో తెరపై కదిలే బొమ్మలను మాత్రమే చూస్తాం. కానీ దానికోసం తెరవెనుక చేసే ప్రయత్నం అంతా ఇంతా కాదు. బొమ్మలు తయారు చెయ్యటం నుంచి రంగులు వెయ్యటం, ఆట మొదలు పెట్టిన తర్వాత సంగీతం, నృత్యం, సాహిత్యం, నాటకం.. ఇలా వివిధ కళల సమాహారం. ప్రేక్షకుడి అభిరుచిని బట్టి తనకు నచ్చిన అంశాన్ని ఆస్వాదించే అవకాశం వుంటుంది. అలనాడు ఆముదం దీపాలు, కాగడాల మధ్య ప్రదర్శించిన ఈ ఆటకొంతకాలం పెట్రోమ్యాక్స్ లైట్ల సాయంతో వెలిగింది. ఇప్పుడు సాంకేతికతను అందిపుచ్చుకొని లైటింగ్, సౌండ్ పద్ధతులను కూడా అడాప్ట్ చేసుకుంది.
నైపుణ్యం కావాలి...
తోలుబొమ్మల రూపు రేఖలు, రంగులు, వాటిపై నగిషీ... అన్నీ నిపుణతతో కూడుకున్న అంశాలు. 20 నిముషాల పాటు వున్న ఈ రెండు ప్రదర్శనల్లో 40కు పైగా బొమ్మల్ని వాడారు. ‘జంతు చర్మంతో చేసే ఈ బొమ్మల తయారీకి ఒక నెల సమయం పడుతుంది’ అంటున్నాడు కళాకారుడు శివరాం. శివరాత్రి, దసరా, వినాయకచవితి సందర్భాల్లో వారం రోజులు రాత్రంతా మహాభారత, రామాయణ గాథలు ప్రదర్శించే వాళ్లు. అలా చాలా సేపు సాగే ప్రదర్శనల్లో పద్యం, సూక్తులు, ఊళ్లో వారికి ప్రత్యక్షంగా, పరోక్షంగా మంచిచెడుల సూచనలు, కేతిగాడు, రంగి లాంటి హాస్యపాత్రల ద్వారా కానుకలు ఇచ్చిన వారికి పొగడ్తలు, ఇవ్వని వారికి తెగడ్తలతో కూడిన హాస్య సంభాషణలు వుండేవి. ‘ఈ రోజుల్లో అంత వ్యవధి కష్టం కాబట్టి వాటిని కుదించి గంట, రెండుగంటలకు పరిమితం చేస్తున్నాం’ అని చెబుతున్నాడు కళాకారుడు సిందే గంగిశెట్టి. తాతల కాలం నుంచి వస్తున్న ఈ కళకు ఎక్కువ ఆదరణ లేక... తమ పిల్లలు తోలుబొమ్మలాటను నేర్చుకోవడానికి ఆసక్తి కనబర్చటం లేదని ఆవేదన చెందుతోంది కళాకారిణి వనారస వీరమ్మ. పెళ్లిళ్లు, పుట్టినరోజులకు ఇలాంటి ప్రదర్శనలు ఏర్పాటు చేస్తే తమకు ఇంత అన్నం పెట్టిన వారవుతారు, కళను కాపాడినవారవుతారని అంటోందామె. రామాయణ, మహాభారత గాథలను నేటికీ పల్లెపదాలతో పదిలంగా పంచుతున్న కళారూపాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిది.
ఆకట్టుకుంటాయి...
‘అచ్చమైన తెలుగు భాషే అర్థం కాదు ఇక ఈ పద్యాలు ఎలా అర్థమవుతాయని అని వాపోతుంటారు కొందరు. చక్కని పద్యాన్ని గానం చేసే స్థాయి కళాకారులకు వుంది. ఆ పద్యాన్ని అర్థం చేసుకునే భాషా స్థాయి పెంపొందించుకోవటం ప్రేక్షకుల పని. కొన్ని తరాలుగా ఒక సంస్కృతిని కాపాడుతూ వస్తున్న వాళ్లు తమ భాషను మార్చుకోవలసిన పనిలేదు. మాతృభాషలో నాలుగు మాటలు అర్థం చేసుకోలేని దురవస్థ ప్రేక్షకుడిదే అవుతుంది కానీ కళాకారుడిది కాదు’ అంటున్నారు రీసెర్చ్ స్కాలర్, పప్పెటీర్ గంజి మాధవీలత. ‘తలను గిర్రున రౌండ్‌గా తిప్పే గ్రాఫిక్స్ రోబో పిల్లలకు బాగా నచ్చాడు. అలాంటి చిట్టిపొట్టి బొమ్మలే లైవ్‌లో ఆడుతూ పాడుతూ, డైలాగ్‌లు చెప్తూ ఉంటే పిల్లలను ఆకట్టుకోకుండా ఎందుకుంటాయి. పిల్లలకు మనం చూపించక పోవటం వల్ల ఈ కళలకు దూరం అవుతున్నారు కానీ, ఆకట్టుకునే శక్తి లేక కాదు’ అంటున్నారు ఓ చిన్నారి పేరెంట్ కవిత.


