టెంపుల్స్‌ నుంచి టాయిలెట్స్‌ వరకు | From Temples to Toilets | Sakshi
Sakshi News home page

టెంపుల్స్‌ నుంచి టాయిలెట్స్‌ వరకు

Jan 18 2014 5:19 PM | Updated on Mar 29 2019 9:18 PM

టెంపుల్స్‌ నుంచి టాయిలెట్స్‌ వరకు - Sakshi

టెంపుల్స్‌ నుంచి టాయిలెట్స్‌ వరకు

అగ్గిపుల్ల, కుక్కపిల్ల, సబ్సు బిళ్ల కవితకు కాదేదీ అనర్హం అని మహాకవి శ్రీశ్రీ అంటే, టెంపుల్స్ నుంచి టాయిలెట్స్ వరకు కావేవీ ప్రచారానికి అనర్హం అన్నట్లుగా రాజకీయ పార్టీలు వ్యవహరిస్తున్నాయి.

అగ్గిపుల్ల, కుక్కపిల్ల, సబ్సు బిళ్ల కవితకు కాదేదీ అనర్హం అని మహాకవి శ్రీశ్రీ అంటే,  టెంపుల్స్ నుంచి టాయిలెట్స్ వరకు  కావేవీ ప్రచారానికి అనర్హం అన్నట్లుగా రాజకీయ పార్టీలు వ్యవహరిస్తున్నాయి. వారికి అన్నీ ప్రచార అస్త్రాలే. ఎన్నికలొస్తున్నాయంటే చాలు రాజకీయ పార్టీలకు ఎక్కడలేని  కొత్తకొత్త ఆలోచనలు పుట్టుకొస్తాయి. వీటిలో కులాలు మొదలుకొని  సెంటిమెంట్ల వరకు అన్ని అంశాలు ఉంటాయి.  ఏదో ఒక రకంగా గద్దెక్కాలని రైతులు, మహిళలు, వృద్ధులు, విద్యార్థులు, యువకులు....అందరినీ ఆకర్షించే విధంగా హామీలు గుప్పిస్తుంటారు. అదే క్రమంలో 2014 సార్వత్రిక ఎన్నికలకు కొత్త కొత్త  ఐడియాలతో రాజకీయ పార్టీలు ఓటర్ల ముందుకు రాబోతున్నాయి. కొన్ని పార్టీలు  మహిళ ఓటర్ల కరుణ కోసం కసరత్తులు మొదలుపెడితే, మరి కొన్ని కొత్త ఐడియాల కోసం వెదుకులాటలో ఉన్నాయి. అన్ని పార్టీలకు ఓట్లు రాల్చే ఐడియాలే కావాలి.

ఓ వైపు దేశమంతటా కాంగ్రెస్, మరోవైపు ఢిల్లీలో చీపురుతో ఊడ్చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ, ఈ నేపధ్యంలో బీజేపీ ఓట్లు ఎలా రాబట్టాలా అన్న ఆలోచనలో పడింది.  వినూత్న ఆలోచనలతో ఓటర్ల ముందుకెళ్లాలన్న ఆలోచనలో ఆ పార్టీ నేతలు ఉన్నారు. అయోధ్య రామాలయం నుంచి వారి దృష్టి ఇప్పుడు  మహిళలపై పడింది. దేశంలో  ప్రజా టాయిలెట్ల కొరతను వారు గుర్తించారు. ముఖ్యంగా ఈ సమస్యతో మహిళలు పడే ఇబ్బందులను వారు గమనించారు. దాంతో తాము అధికారంలోకి వస్తే ప్రతి మూడు కిలోమీటర్ల దూరంలో టాయిలెట్లు నిర్మిస్తామని భరోసా ఇచ్చే ప్రయత్నంలో బిజెపి ఉంది.

మహిళల తరువాత  వృత్తిపనులు చేసుకునే వారు, మెకానిక్‌ల వంటి వారు ఓటర్లలో అధిక సంఖ్యలో ఉంటారు.   వారి ఓట్లు  రాబట్టేందుకు వాళ్లకు ప్రత్యేక ధృవీకరణ పత్రాలు  మంజూరు చేసే యోచనలో బిజెపి  ఉంది.  ఇలాంటి ధృవీకరణ పత్రాల  ద్వారా వాళ్లకు ఉపాధి అవకాశాలు మెరుగపడటమే కాకుండా, సంపాదన పెరుగుతుందన్నది బీజేపీ అభిప్రాయంగా ఉంది.

 మరో వైపు యువతను ఆకట్టుకునే ప్రయత్నంలో భాగంగా పదవ తరగతిలో డ్రైవింగ్ అంశాన్ని ఒక సబ్జెక్టుగా పెడితే  ఎలా ఉంటుందన్న ఆలోచనలో కమలనాథులు  ఉన్నారు.  షెడ్యూల్డ్‌ కులాలు,  సమాజంలో అణగారిన వర్గాల పిల్లలకు దీని వల్ల ప్రయోజనం కలుగుతుందన్నది బీజేపీ నమ్మకం. అంతే కాకుండా దళిత పారిశ్రామికవేత్తల్ని ప్రోత్సాహించేందుకు దళిత ఇండియన్‌ ఛాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌ వంటి చర్యలకు చేయూతనిస్తే బాగుంటుందని కూడా  బీజేపీ భావిస్తోంది. 'జర హట్కే'గా ఆలోచించే ఆ పార్టీ మాజీ అధ్యక్షుడు నితిన్‌ గడ్కరీ ప్రస్తుతం పార్టీ విజన్‌ డాక్యూమెంట్‌ రూపకల్పనలో నిమగ్నమై ఉన్నారు.  వినయ్‌ సహస్రబుద్ధి, ప్రొఫెసర్‌ హరిబాబు, ఓంప్రకాశ్‌ కోహ్లి గడ్కరి బృందంలో సభ్యులుగా ఉన్నారు. వీరి బుర్రలలో నుంచి ఇంకా ఏమి కొత్త ఆలోచనలు వస్తాయో వేచి చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement