విభజన చిచ్చుతో కేంద్రానికి సవాలక్ష చిక్కులు


రాష్ట్ర విభజనకు పచ్చజెండా ఊపేసిన కేంద్ర ప్రభుత్వానికి అసలు చిక్కుముడులు ముందున్నాయి. హైదరాబాద్ నగరాన్ని పదేళ్లకు మించకుండా ఉమ్మడి రాజధానిగా ఉంచాలని కేంద్ర హోం మంత్రి షిండే ప్రకటించారు. అప్పటివరకు ఇక్కడి శాంతి భద్రతల బాధ్యత తెలంగాణ గవర్నర్ చూసుకుంటారని కూడా చెప్పారు. వాస్తవానికి హైదరాబాద్ నగరాన్ని కొంతకాలం పాటైనా కేంద్రపాలిత ప్రాంతంగా ఉంచాలన్న సీమాంధ్ర ప్రాంత నాయకుల ప్రతిపాదనలకు జీవోఎం నిర్ద్వంద్వంగా నో చెప్పడంతో కేంద్రానికి చిక్కులు మరింత ఎక్కువ కానున్నాయి. ఇప్పడు ఢిల్లీ తరహాలోనో లేదా అరుణాచల్ ప్రదేశ్ తరహాలోనో ఇక్కడి పాలన కొనసాగించే అవకాశం కనిపిస్తోంది.శాంతిభద్రతలను గవర్నర్ చేతుల్లో పెట్టాలంటే రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లులో కొన్ని మార్పుచేర్పులు చేయడం తప్పనిసరి అవుతుంది. మన రాష్ట్రానికి ఈ బిల్లు ఎంతవరకు అమలయ్యే అవకాశం ఉందన్నది మాత్రం అనుమానమే. ఎందుకంటే, ఢిల్లీ అయితే జాతీయ రాజధాని ప్రాంతం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి చైనా లాంటి ప్రమాదకర దేశంతో సరిహద్దు ఉంది. అందువల్ల ఆ రెండింటికీ శాంతి భద్రతలను కేంద్రం చూసుకుంటుందంటే పెద్దగా అభ్యంతరాలు ఉండవు. కానీ మామూలుగా అయితే శాంతి భద్రతలు, పోలీసింగ్ అనేవి పూర్తిగా రాష్ట్రాల జాబితాలో ఉన్న అంశాలు. కొత్తగా ఏర్పాటయ్యే తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ పోలీసింగ్, శాంతిభద్రతలను వదులుకోడానికి ఎంతవరకు అంగీకరిస్తుందన్న విషయం అనుమానమే. తమ పరిపాలనలో ఉన్న రాష్ట్రంలో కొంత భాగంలో మాత్రం (జీహెచ్ఎంసీ పరిధి) శాంతి భద్రతలు, పోలీసింగును గవర్నర్ ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తారంటే పాలకులు ఎంతమాత్రం సహిస్తారన్నది అనుమానమే. పైపెచ్చు, రాబోయే ఎన్నికలలో దాదాపు రెండు రాష్ట్రాల ప్రజలు (అప్పటికి విభజన ప్రక్రియ ముగిస్తే) కాంగ్రెస్ పార్టీని మట్టి కరిపించడం దాదాపు ఖాయం. అప్పుడు ఈ పార్టీ అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం రూపొందించిన విధి విధానాలను అమలు చేయడం, చేయకపోవడం అనేది కూడా అనుమానమే.శాంతి భద్రతల విషయంలో ఉమ్మడి రాజధాని సరిహద్దులు ఎంత ఉండాలన్నది మరో అతిపెద్ద సమస్య. కేవలం హైదరాబాద్ కమిషనరేట్ పరిధినే చూసుకుంటారా లేదా సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిని కూడా చేరుస్తారా అన్నది స్పష్టం కావాలి. రెండు కమిషనరేట్లనూ ఉమ్మడి రాజధాని పరిధిలోకి తేవాలని, జీహెచ్ఎంసీ పరిధిని పాలనాపరమైన అంశాల కోసం ఉమ్మడిగా నిర్ణయించాలని జీవోఎం తలపెట్టింది. కానీ తెలంగాణవాదులు దీన్ని అంగీకరించడంలేదు. జీహెచ్ఎంసీ పరిధి 625 చదరపు కిలోమీటర్లు కాగా, జనాభా 67 లక్షలు. అదే జంట కమిషనరేట్ల పరిధి 3,818 చదరపు కిలోమీటర్లు అవుతుంది, జనాభా 1.12 కోట్లు అవుతుంది. హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో జీహెచ్ఎంసీ పరిధి వ్యాపించి ఉంది. జంట కమిషనరేట్లు మాత్రం హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోనే ఉన్నాయి. మరి రెండు అంశాలకు రెండు వేర్వేరు పరిధులను ఎలా నిర్ణయిస్తారో పెద్దలే తేల్చాలి.హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ దేశంలోనే పురాతనమైనది. దీన్ని 1847లో నిజాం కాలంలో ఏర్పాటుచేశారు. తర్వాత దీన్ని 1938లో హైదరాబాద్ సిటీ పోలీసు చట్టం కింద పునర్వ్యవస్థీకరించారు. ప్రస్తుతం హైదరాబాద్ కమిషనరేట్ పరిధి 217 చదరపు కిలోమీటర్లు, దాంట్లో జనాభా 42 లక్షలు. ఐదుజోన్లు, 23 డివిజన్లు, 89 పోలీసుస్టేషన్లు ఉన్నాయి. ఇక్కడ మొత్తం 13,113 మంది సిబ్బంది అవసరం కాగా ప్రస్తుతం కేవలం 8,541 మంది మాత్రమే ఉన్నారు. 2012లో నగరంలో 15,073 నేరాలు జరిగాయి. ఇక సైబరాబాద్ కమిషనరేట్li 2003 ఫిబ్రవరిలో 3,601 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఏర్పాటుచేశారు. జనాభా 70 లక్షలుంది. ఇందులో ఐదు జోన్లు, 14 డివిజన్లు, 60 పోలీసు స్టేషన్లు ఉన్నాయి. ఇక్కడ మొత్తం 6,877 మంది సిబ్బంది అవసరం కాగా 5,088 మందే ఉన్నారు. ఇక్కడ 2012లో 16,864 నేరాలు జరిగాయి.ఉమ్మడి రాజధానిలో పోలీసు పరిధి జీహెచ్ఎంసీ పరిధి కంటే దాదాపు ఐదురెట్లు ఉంటుంది. దేశంలో మరెక్కడా ఇలా లేదు. శాంతిభద్రతలను కేంద్రం నియంత్రణలోకి తెస్తే, పోలీసు కమిషనర్లు ఇద్దరికీ గవర్నర్ సూపర్ బాస్ అవుతారు. అంతేకాదు వీరు ముగ్గురూ కలిసి తెలంగాణ ముఖ్యమంత్రి కంటే ఎక్కువ అధికారాలు చలాయించగలరు. కమిషనర్లిద్దరూ కేవలం గవర్నర్ గారికి మాత్రమే బాధ్యులుగా ఉంటే ముఖ్యమంత్రి ఏం చేయాలన్నదీ ప్రశ్నార్థకమే అవుతుంది మరి!!

Read latest Features News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top