వాటర్‌ క్యాన్‌ డ్రిప్‌! | Sakshi
Sakshi News home page

వాటర్‌ క్యాన్‌ డ్రిప్‌!

Published Tue, Nov 5 2019 5:05 PM

Vegetable Farmers Using Water Can Drip Wanaparthy - Sakshi

సేంద్రియ ఇంటిపంటల సాగులో ద్రవ జీవామృతం, ఆవుమూత్రం, జీవన ఎరువులను కూరగాయ మొక్కలకు సులభంగా అందించడానికి ఉపయోగపడే అతి తక్కువ ఖర్చుతో కూడిన పద్ధతి ఇది. పుల్లయ్యగారి బ్రహ్మానందరెడ్డి, అనిత దంపతులు వనపర్తి జిల్లా పెబ్బేరు పట్టణంలో తమ ఇంటి వద్ద పెరట్లో కొన్ని రకాల కూరగాయలు, ఆకుకూరలు సాగు చేయడం రెండు నెలల క్రితం ప్రారంభించారు. తాము నివాసం ఉండే భవనం పక్కనే 40 అడుగుల వెడల్పు, 70 అడుగుల పొడవున ఖాళీ స్థలం(ఎర్ర నేల)లో సేంద్రియ పెరటి తోట సాగు చేస్తున్నారు. ఈ పెరటి తోటకు రోజువారీగా నీటిని, జీవామృతం, జీవన ఎరువులు వంటి ద్రవ రూప ఎరువులను తక్కువ సమయంలో, తక్కువ ఖర్చు, తక్కువ శ్రమతో అందించడానికి ఒక ఉపాయాన్ని ఆలోచించారు. ఇంటిపైన నిర్మించిన వాటర్‌ ట్యాంకు నుంచి నీటిని సరఫరా చేసే పైపునకు గేట్‌ వాల్‌ సిస్ఠం ఏర్పాటు చేసుకొని.. ఇన్‌లైన్‌ డ్రిప్పర్‌ లైన్ల ద్వారా నీటిని కూరగాయ మొక్కలకు అందిస్తున్నారు. రోజువారీగా నీటిని అందించడానికి ఇది పనికొచ్చింది. అయితే, ద్రవ రూప ఎరువులను కూడా నీటితోపాటే అందించేదెలా? అని ఆలోచించారు. తాగునీటి సరఫరా కోసం ఉపయోగించే 20 లీటర్ల వాటర్‌ క్యాన్‌ను ఏర్పాటు చేసి, దీని ద్వారా డ్రిప్‌ లైన్‌ను అనుసంధానం చేస్తూ సునాయాసంగా ద్రవ రూప ఎరువులను సైతం ఇంటిపంటలకు ఇవ్వగలుగుతున్నారు. 

తొలుత నీరు.. తర్వాత ద్రవ రూప ఎరువులు..
మిత్రుడు ప్రకృతి వ్యవసాయదారుడు ప్రవీణ్‌కుమార్‌ రెడ్డి తోడ్పాటుతో అనేక రకాల ప్రయోగాలు చేసే క్రమంలో ఈ ‘లో కాస్ట్‌ ఫర్టిగేషన్‌ సిస్టమ్‌ ఫర్‌ కిచెన్‌/టెర్రస్‌/అర్బన్‌ గార్డెనింగ్‌’ను రూపొందించామని బ్రహ్మానందరెడ్డి తెలిపారు.  వడకట్టిన ద్రవజీవామృతం లేదా ఆవు మూత్రం లేదా అజోస్పిరిల్లమ్, ఫాస్పోబాక్టీరియా వంటి జీవన ఎరువుల ద్రావణాలను 3 రోజులకు ఒక్కో రకాన్ని ఇంటిపంటలకు అందిస్తున్నారు. 20 లీటర్ల వాటర్‌ క్యాన్‌లో 2 నుంచి 4 లీటర్ల ద్రవ జీవామృతం లేదా ఆవు మూత్రం లేదా జీవన ఎరువుల ద్రావణాన్ని కలుపుతారు.

పెరటి తోటలో బ్రహ్మానందరెడ్డి, అనిత 

ద్రవ రూప ఎరువుల సరఫరా ఇలా..
వాటర్‌ క్యాన్‌కు పైన ఎయిర్‌ వాల్వ్‌ బిగించారు. ఎయిర్‌ వాల్వ్‌ మూతను విప్పి.. అందులో నుంచి వాటర్‌ క్యాన్‌లోపలికి ద్రవ రూప ఎరువులను వడకట్టి పోస్తారు. ఆ తర్వాత డ్రిప్‌ ద్వారా నీటిని వదులుతారు. వాటర్‌ క్యాన్‌ లోపలకు నీరు వెళ్లేందుకు కింది భాగం నుంచి ఒక ఇన్‌లెట్, బయటకు నీరు పోవడానికి పై భాగంలో ఒకటి, కింది భాగంలో మరొకటి అవుట్‌ లెట్‌లను బిగించారు. ద్రవ రూప ఎరువులను వాటర్‌ క్యాన్‌ ద్వారా నీటితో కలిపి వెళ్లేలా చేయాలనుకున్నప్పుడు.. క్యాన్‌ పై భాగంలోని అవుట్‌ లెట్‌ ద్వారా నీటిని బయటకు వెళ్లేలా చేస్తారు. అలా చేయడం ద్వారా 10–15 నిమిషాల పాటు ద్రవరూప ఎరువులు నీటితో కొద్దికొద్ది కలిసి ఇంటిపంటలకు సరఫరా అవుతున్నదని బ్రహ్మానందరెడ్డి తెలిపారు. అవుట్‌ లెట్‌ మొదట కింది భాగంలో మాత్రమే ఏర్పాటు చేశానని, అప్పుడు 5 నిమిషాల్లోనే ద్రవ రూప ఎరువు పూర్తిగా వెళ్లిపోయేదన్నారు. క్యాన్‌కు పై భాగంలో అవుట్‌ లెట్‌ ఏర్పాటు చేయడం వల్ల 10–15 నిమిషాల పాటు ద్రవ రూప ఎరువుతో కూడిన నీటిని 70 అడుగుల పొడవు డ్రిప్‌ వరుసలో ఉన్న చివరి మొక్కలకు కూడా అందించగలుగుతున్నామని ఆయన వివరించారు. రసాయనిక అవశేషాల్లేని మిర్చి, వంగ, బీర, సొర, టమాటాలతోపాటు గోంగూర, చుక్క, పాల కూరలను పండించి, బంధుమిత్రులకు కూడా రుచి చూపిస్తున్నామని బ్రహ్మానందరెడ్డి(94411 85563), అనిత సంతోషంగా తెలిపారు. 

Advertisement
 
Advertisement
 
Advertisement