పట్టువిడుపుల్లేని ప్రవక్త

పట్టువిడుపుల్లేని ప్రవక్త


సంక్షిప్తంగా : బిపిన్ చంద్ర పాల్ (నేడు జయంతి)

గాంధీజీతో విభేదించడం అన్న మాట వచ్చినప్పుడు ఆయన సిద్ధాంతాలను వ్యతిరేకించడంగా కాక, ఆ సిద్ధాంతాలలోని సామరస్యక సుతిమెత్తని లక్షణాన్ని అంగీకరించలేకపోవడంగా ఎవరైనా అర్థంచేసుకోవాలి. అలాగే ఆయనను విభేదించిన వారిలోని స్వతంత్రభావాలను తొందరపడి ‘అతివాదం’ అనే వర్గీకరణలోకి చేర్చేముందు అది పూర్తిస్థాయి అతివాదమా లేక ఉమ్మడి లక్ష్యం వైపు సాగుతున్న వైయక్తిక మార్గమా అని జాగ్రత్తగా ఆలోచించాలి.

 

బిపిన్ చంద్ర పాల్ గాంధీజీతో విభేదించారు. గాంధీజీకి దూరం అయిన కొద్దిమంది ముక్కుసూటి ఉక్కుమనుషుల్లో పాల్ కూడా ఒకరు. విమర్శించవలసిన సందర్భంలో మృదువుగా మాట్లాడడం లేదా మౌనం వహించడం ఉద్యమస్ఫూర్తిగా విఘాతంగా పరిణమిస్తుందని పాల్ నమ్మారు. అయితే ఆయన సాగించిన జాతీయోద్యమ పోరాటం గాంధీజీ లక్ష్యాలకు భిన్నమైనది మాత్రం కాదు. ప్రతిఘటనకు పిడిగుద్దులు తప్ప సహాయ నిరాకరణ వంటి మధ్యేమార్గాలు ఉండకూడదన్నారు. అందుకే ఆయన ‘ఫాదర్ ఆఫ్ రివల్యూషనరీ థాట్స్’ గా ప్రఖ్యాతిగాంచారు. ‘పూర్ణ స్వరాజ్యం’, ‘స్వదేశీ ఉద్యమం’, ‘విదేశీ వస్తువుల బహిష్కరణ’... పోరాటం ఏదైనా అందులో పాల్ భాగస్వామ్యం నిక్కచ్చిగా ఉండేది. సుప్రసిద్ధ తాత్విక చింతనాపరుడు శ్రీ అరబిందో ఆయన్ని మహాశక్తివంతులైన జాతీయవాద ప్రవక్తలలో ఒకరిగా అభివర్ణించారు.   

 

ఇరవయ్యవ శతాబ్దపు తొలినాళ్లలో 1905 నుండి 1918 వరకు బ్రిటిష్ ఇండియాలో జాతీయవాద త్రయంగా స్వాతంత్య్ర ఉద్యమాన్ని ప్రభావితం చేసిన లాల్ బాల్ పాల్ లలో ఒకరే బిపిన్ చంద్ర పాల్. ఆయన స్థాపించిన జాతీయోద్యమ ఆంగ్ల వార్తాపత్రిక ‘బందే మాతరం’ ఆయన్ని ఆర్నెల్ల పాటు జైల్లో ఉంచింది. అందులో అరబిందో రాసిన ఒక వ్యాసానికి సంబంధించి వ్యతిరేకంగా సాక్ష్యం ఇవ్వనందుకు బ్రిటిష్ పాలకులు పాల్‌కు విధించిన శిక్ష అది.



బిపిన్ చంద్ర పాల్ 1858 నవంబర్ 7న హబీగంజ్‌లోని (ఇప్పటి బంగ్లాదేశ్‌లోని ప్రాంతం) సంపన్న హిందూ వైష్ణవ కుటుంబంలో జన్మించారు. కలకత్తాలోని చర్చి మిషన్ సొసైటీ కాలేజీలో చదివారు. అక్కడే కొన్నాళ్లు అధ్యాపకునిగా పనిచేశారు. రాజా రామ్మోహన్‌రాయ్ స్థాపించిన ‘బ్రహ్మసమాజం’లో చేరి ఆ సిద్ధాంతాలను ప్రచారం చేశారు. ఆ సమయంలోనే ఒక వితంతువును వివాహమాడారు. ప్రముఖ నాటక, సినీ రచయిత, దర్శకుడు, ‘బాంబే టాకీస్’ వ్యవస్థాపకులలో ఒకరైన నిరంజన్ పాల్ ఈయన కుమారుడే.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top