చివరి దశలో చిరునవ్వుల వరం | the smiley gift at final stage | Sakshi
Sakshi News home page

చివరి దశలో చిరునవ్వుల వరం

Apr 22 2014 11:07 PM | Updated on May 24 2018 1:33 PM

చివరి దశలో చిరునవ్వుల వరం - Sakshi

చివరి దశలో చిరునవ్వుల వరం

ఒకప్పుడు ఆమె ఏ బాదరబందీలూ లేకుండా తిరిగిన కాలేజీ అమ్మాయి. కానీ, క్యాన్సర్ బారిన పడ్డ పిల్లల కోసం పెట్టిన సంరక్షణ కేంద్రంలో స్వచ్ఛంద సేవకురాలిగా పనిచేయడం ఆమె జీవితంలో ఎంతో మార్పు తెచ్చింది.

  ఒకప్పుడు ఆమె ఏ బాదరబందీలూ లేకుండా తిరిగిన కాలేజీ అమ్మాయి. కానీ, క్యాన్సర్ బారిన పడ్డ పిల్లల కోసం పెట్టిన సంరక్షణ కేంద్రంలో స్వచ్ఛంద సేవకురాలిగా పనిచేయడం ఆమె జీవితంలో ఎంతో మార్పు తెచ్చింది. అభం శుభం తెలియని వయసులో క్యాన్సర్ మహమ్మారితో పోరాడుతూ, వాడిపోతున్న పసిమొగ్గల్ని చూసి ఆమె చలించిపోయారు. ఆసుపత్రులు సైతం చేతులెత్తేసిన అభాగ్యుల కోసం ముందుకు వచ్చారు.
 
మరణం కోసం ఎదురు చూస్తున్న ఆ పిల్లలకు చివరి ఘడియల్లో నొప్పి, బాధ తెలియనివ్వకుండా, వీలైనంత సాంత్వన కలిగించే ఇన్‌పేషెంట్ వైద్య వసతి (దీన్నే ‘హాస్పిస్’ అంటారు)కి మిత్రుడు అభిషేక్ తతియాతో కలసి శ్రీకారం చుట్టారు. భారతదేశంలోనే మొట్టమొదటి క్యాన్సర్ హాస్పిస్‌కు ముంబయ్‌లో పునాది వేసిన మాన్‌సీ షా ఎంతోమందికి స్ఫూర్తి ప్రదాత.
 
తొలి తరం ఔత్సాహిక పారిశ్రామికవేత్తలైన మాన్‌సీ షా, అభిషేక్‌లు విభిన్నమైన నేపథ్యాల నుంచి వచ్చారు. ముంబయ్‌లోని ఓ బాలల సంరక్షణ కేంద్రంలో క్యాన్సర్ పీడిత బాలల్ని తొలిసారిగా చూసినప్పుడు వాళ్ల కోసం ‘హాస్పిస్’ను ఏర్పాటు చేయాలన్న ఆలోచన వచ్చిందంటారు మాన్‌సీ షా.

‘‘తీవ్ర అనారోగ్యంతో బాధపడే పిల్లలకు చికిత్సనందించే కేంద్రాలు, సంస్థలు మన దేశంలో అనేకం ఉన్నాయి. కానీ, రోజులు, వారాలే తప్ప అంతకు మించి బతికే అవకాశం లేని పిల్లల కోసం మాత్రం ఎలాంటి కేంద్రాలూ లేవు. మృత్యుముఖంలోని అలాంటి పిల్లలకు బతికిన కొద్ది రోజులూ ప్రశాంతత కల్పించాలన్నదే మా ‘హ్యాపీ ఫీట్ హోమ్’ ఆలోచన’’ అని ఆమె వివరించారు.
 
 రెండేళ్ళ క్రితం కళ్ళెదుట జరిగిన ఓ సంఘటన ఇందుకు ఆమెను ప్రేరేపించింది. ఒరిస్సాకు చెందిన ఓ చిన్నారి కాలిపై క్యాన్సర్ కణితితో వచ్చింది. ఆమెకు తొలి విడత చికిత్స చేసి, తగ్గుతుందని ఇంటికి పంపారు. కానీ, కొన్ని వారాల తరువాత పక్షవాతానికి గురై ఆ అమ్మాయి మళ్ళీ వచ్చింది. ఈ సారి మాత్రం డాక్టర్లు ఆమెకు తగ్గదని చెప్పేశారు. ఆఖరు దశలో ఉన్న ఆ చిన్నారికి సాంత్వన కలిగించే తుది సేవలు అందించడానికి సంరక్షణ కేంద్రంలో వసతులు లేక, ఇంటికి పంపేశారు.

కొద్ది రోజులకు ఆ అమ్మాయి కన్నుమూసింది. ‘‘ఆ అమ్మాయి ముఖం గుర్తుకొచ్చినప్పుడల్లా నా మనసు పిండేసినట్లు అవుతుంది. ఆ భావనే ఈ ‘హాస్పిస్’ ఏర్పాటుకు ముందుకు తోసింది’’ అని మాన్‌సీ షా చెప్పారు. ‘‘డాక్టర్లు పెదవి విరిచేసి, ఇంట్లో వాళ్లందరూ కూడా ఆశలు వదిలేసిన ఆ పిల్లలకు సైతం గౌరవంగా కన్ను మూసే హక్కుందని మా నమ్మకం. అందుకే, మా వంతుగా ఈ ప్రయత్నం చేస్తున్నాం’’ అని ఆమెతో పాటు ఆ సంస్థకు సహ వ్యవస్థాపకుడైన అభిషేక్ అన్నారు.
 
నిజానికి, క్యాన్సర్ బాధితులకు అండగా నిలవడం ముప్ఫై రెండేళ్ళ మాన్‌సీ షాకు కొత్త ఏమీ కాదు. క్యాన్సర్ రోగులైన పిల్లల కోసం నడిపే సంరక్షణ కేంద్రంలో ఉపాధ్యాయురాలిగా, సామాజిక కార్యకర్తగా దాదాపు నాలుగేళ్ళు పనిచేసిన అనుభవం ఆమెకుంది. అక్కడ పనిచేస్తున్నప్పుడే పిల్లల కోసం ఏదైనా చేయాలన్న ఆలోచన ఆమెకు వచ్చింది. మరోపక్క దాదాపు అయిదేళ్ళ పాటు ప్రతిష్ఠాత్మక ‘క్రిసిల్’ సంస్థలో పనిచేసిన ఆమె స్నేహితుడు 28 ఏళ్ళ అభిషేక్ సైతం ఆ కార్పొరేట్ ఉద్యోగాన్ని వదిలేసి, మనసుకు నచ్చింది ఏదైనా చేయాలనుకున్నారు. క్యాన్సర్ ప్రభావంతో రోజులు లెక్కపెట్టే దశలో ఉన్న పిల్లలకు సాంత్వన కలిగించే ఇన్‌పేషెంట్ వసతి సౌకర్యం కల్పించాలని వారిద్దరూ తీర్మానానికి వచ్చారు. అలా వారి ‘హ్యాపీ ఫీట్ హోమ్’ దాదాపు ఏడాది క్రితం ముంబయ్‌లో మొదలైంది.
 
దేశంలోనే తొలిసారిగా చేపట్టిన ఈ క్యాన్సర్ పీడిత చిన్నారుల ‘హాస్పిస్’ కోసం ఆ స్నేహితులిద్దరూ ముంబయ్‌లోని ‘లోక్‌మాన్య తిలక్ మున్సిపల్ జనరల్ హాస్పిటల్’ (సియోన్ హాస్పిటల్)తో జట్టు కట్టారు. దాదాపు పది నెలలకు పైగా శ్రమించి, తగిన ఏర్పాట్లతో ‘హాస్పిస్’ను ప్రారంభించారు. మరణానికి సమీపించిన పిల్లలకు ఇలా ‘ప్యాలియేటివ్ కేర్’ను అందించే అంతర్జాతీయ సంస్థ అయిన ‘ఐ.సి.పి.సి.ఎన్’ వద్ద తమ కేంద్రాన్ని కూడా రిజిస్టర్ చేయించారు. ముంబయ్‌లోని ధారవిలో సియోన్ హాస్పిటల్‌కు అనుబంధ విభాగమైన ఆసుపత్రిలో ఈ సంస్థకు కొంత స్థలం కేటాయింపు కూడా జరిగింది.
 
 ఈ ప్రాజెక్టును సాకారం చేసే కృషిలో భాగంగా ఈ స్నేహితులిద్దరూ తమ ఉద్యోగాలకు స్వస్తి చెప్పి, పైసా కూడా ఆదాయం రాని ఈ పనిలోనే పూర్తిగా మునిగిపోయారు. అలాగే, జీవితపు చరమదశలోని పిల్లలకు ఉపశమనం కలిగించే ఈ సేవలను ఉచితంగానే అందించాలని తీర్మానించుకున్నారు. ‘‘ఈ కార్యక్రమం చేపట్టింది డబ్బులు సంపాదించడం కోసం కాదు. ఊపిరితో ఉన్నన్నాళ్ళూ పిల్లలు ఉల్లాసంగా, ఉత్సాహంగా గడపడం కోసం మేము చేయగలిగినదంతా చేయాలనుకుంటున్నాం’’ అని మాన్‌సీ షా చెప్పారు. మంచి ఆశయమే కదూ!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement