విమల దేవోభవ

Teachers Day special on teacher vimala Kaul - Sakshi

టీచర్స్‌ డే (సెప్టెంబర్‌ 5) సందర్భంగా...

చదువు రావడం వేరు. బాగా రావడం వేరు. చదువు చెప్పడం వేరు, బాగా చెప్పడం వేరు. మంచి చదువు మంచి జీవితాన్ని ఇస్తుంది. అయితే అందరికీ మంచి చదువు అందుతుందా? అందేలా చేశారు విమలా కౌల్‌. తన చుట్టూ ఉన్న పేద పిల్లల కోసం స్వయంగా ఓ పాఠశాలే ప్రారంభించారు.

విమలా కౌల్‌ పుట్టింది, పెరిగింది ఢిల్లీలో. ఆమె హిస్టరీలో పోస్ట్‌గ్రాడ్యుయేట్‌. ధన్‌బాద్‌లోని కార్మెల్‌ స్కూల్‌లో ఇంగ్లిష్‌ టీచర్‌గా పనిచేశారు. రిటైర్మెంట్‌ తరువాత 1993లో ఢిల్లీకి మారిపోయింది వారి కుటుంబం. ఢిల్లీలోని సరితా విహార్‌లో ఉండేవారు. రోటరీ క్లబ్‌లో చురుగ్గా ఉండేవారు విమల, ఆమె భర్త. ఓసారి రోటరీ క్లబ్‌ సభ్యులు సరితా విహార్‌కు దగ్గరలో ఉన్న మదన్‌పూర్‌ ఖాదర్‌ గ్రామానికి వెళ్లి పిల్లలకు బిస్కెట్లు, ఇతర తినుబండారాలు పంచుతున్నప్పుడు ఒక సంఘటన జరిగింది.

ఆ గ్రామంలోని  ఓ పెద్దావిడ.. విమలాకౌల్‌ దగ్గరకు వచ్చి... ‘మీరు పిల్లలకు తినిపిస్తున్నారు మంచిదే, అలాగే వాళ్లకు తమ తిండి తాము సంపాదించుకునేదెలాగో నేర్పించండి’ అన్నది. ఆ పెద్దావిడ మాటలే తనలో ఆలోచనను రేకెత్తించాయంటారు విమలాకౌల్‌. ‘‘మేము ఏ పిల్లలకైతే తినుబండారాలిచ్చామో వారిని కూర్చోబెట్టి ఎవరు ఏయే క్లాస్‌లు చదువుతున్నారని అడిగితే ఆశ్చర్యకరమైన విషయాలు బయటపడ్డాయి. వాళ్లలో సరిగా బడికి పోతున్న వాళ్లు ఒక్కరూ లేరు. వెళ్తున్న వారిలో దాదాపుగా ఎవరికీ తప్పుల్లేకుండా ఒక వాక్యం రాయడం రాదు. ఇంగ్లిష్‌లోనే కాదు, సొంత భాష హిందీలో రాయడం కూడా రావడం లేదు. వాళ్లకు చదువు చెప్పాలని అప్పుడే నిర్ణయించుకున్నాను’’ అంటారు విమల.

మన పాఠశాల విద్యావ్యవస్థ నాన్‌ డిటెన్షన్‌ సిస్టమ్‌లో నడుస్తున్నందు వల్ల చదువు వచ్చినా రాకపోయినా హాజరు ఉంటే చాలు వారిని పాస్‌ చేసి పై తరగతులకు పంపిస్తారు. అలా ఎనిమిది, తొమ్మిదో తరగతుల పిల్లలు కూడా వారి క్లాస్‌ టెక్ట్స్‌బుక్‌ నుంచి ఒక్క లెక్కనూ సరిగ్గా చేయలేకపోవడాన్ని గమనించిన విమలాకౌల్‌... వారికి ఇంగ్లిష్, గణితం, సోషల్‌ స్టడీస్, పర్యావరణ శాస్త్రం బోధిస్తున్నారు. ఇందుకోసమే ఒక స్కూల్‌కూడా ప్రారంభించారు.

మొదట చౌపాలిలో ఐదుగురు పిల్లలతో మొదలైంది ఆమె స్కూల్‌ ‘గుల్దస్త’ గుల్దస్త అంటే పుష్పగుచ్ఛం అని అర్థం. విమలాకౌల్‌ కోరుకున్నట్లే ఆ స్కూల్లోని పిల్లలు ఆమె శిక్షణలో పూల రెక్కల్లా విచ్చుకున్నారు. మరింత మంది పిల్లలకు చేరువలోకి తేవాలనే ఉద్దేశంతో స్కూల్‌ని తాము నివసిస్తున్న సరితా విహార్‌లోకి మార్చారు. కొద్దిరోజుల్లోనే 150 మంది చేరారు. ఇంట్లోనే నడపవచ్చనుకున్న స్కూలుని కాలనీ బయటకు తీసుకెళ్లక తప్పని స్థితి వచ్చింది విమలాకౌల్‌కి. ఇంతమంది పిల్లల గోల భరించలేకపోతున్నామని ఆరోపించారు ఇరుగుపొరుగు వాళ్లు. ఒకావిడ అయితే ఏకంగా వాళ్ల ఇంటి ముందు నిరాహార దీక్షకు దిగింది.

స్థానిక కమ్యూనిటీ సెంటర్‌లో పాఠాలు చెప్పాలంటే కమిటీ సభ్యులు ససేమిరా అన్నారు. ఇక చేసేదేమీ లేక కాలనీ పార్కులో పాఠాలు చెప్పడం మొదలుపెట్టారు. అక్కడ కూడా అదే సమస్య. ఆ పరిసరాల్లోని ఇళ్లవాళ్ల నుంచి మళ్లీ అభ్యంతరాలు. అలా మూడు పార్కులు మారారు. చివరికి మున్సిపల్‌ పార్కులో దాదాపుగా పదేళ్లకు పైగా స్కూలు నడిచింది. ఎండలకు, ఢిల్లీ చలికి తగినట్లు ఆయా కాలాల్లో టైమింగ్స్‌ మారుస్తూ క్లాసులు నిర్వహించేవారు విమలా కౌల్‌.

ఆమె శ్రమ చూసిన మదన్‌ మోహన్‌ మాలవ్యా మిషన్‌ ఎన్‌జీవో 2011లో స్కూలుని దత్తత తీసుకుంది. అప్పటి నుంచి స్కూలు నాలుగు గదుల అద్దె భవనంలో కొనసాగుతోంది. ఇన్ని కష్టాలు పడుతూ సాగినప్పటికీ ఆమె శిక్షణలో పిల్లలు చదువులో ఎప్పుడూ వెనకబడలేదు. గుల్దస్తలో చదువుకున్న అరవై మంది విద్యార్థులు ప్రాథమిక విద్య తర్వాత మంచి స్టాండర్డ్‌ ఉన్న స్కూళ్లలో సీటు తెచ్చుకోగలిగారు. ఆ స్కూళ్లలో క్లాస్‌ టాపర్‌లుగా నిలుస్తున్నారు కూడా.

తాను నాటిన మొక్క
పేదరికం కారణంగా ఎవరి బాల్యమూ వసివాడిపోకూడదని, సరైన మార్గదర్శనం లేకపోవడం కారణంగా పిల్లల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారకూడదనేది విమలాకౌల్‌ ఆకాంక్ష. స్కూలు ప్రారంభించిన తరవాత పదిహేనేళ్లకు అంటే... 2009లో విమలా కౌల్‌ భర్త హరిమోహన్‌ కౌల్‌ మరణించారు. (ఆయన బిట్స్‌పిలానిలో ఇంజనీరింగ్‌ చదివి, ఇండియన్‌స్కూల్‌ ఆఫ్‌ ధన్‌బాద్‌లో ప్రొఫెసర్‌గా పనిచేసి రిటైరయ్యారు. స్కూలు నిర్వహణలో విమలా కౌల్‌కి సహాయంగా ఉండేవారు). 

అయితే భర్త పోవడం వల్ల తన జీవితంలో ఏర్పడిన శూన్యాన్ని కూడా పిల్లలతోనే భర్తీ చేసుకున్నారామె. అప్పటి నుంచి ఆమెలో కొత్త ఆలోచన మొదలైంది. ఎవరు ఉన్నా లేకపోయినా... తాను నాటిన గుల్దస్త మొక్క వాడిపోకూడదు.. అనుకున్నారు. అందుకోసం 2012లో ఎన్‌జీవో వసుంధరి సొసైటీ ఫర్‌ సోషల్‌ యాక్షన్‌ ప్రారంభించారు. ఇప్పుడు ఆ స్కూలు వసుంధరి– మదన్‌ మోహన్‌ మాలవ్యా సంస్థ సంయుక్తంగా నిర్వహణలో ఉంది.

ఆత్మీయతే ఆదుకొంది
విమలాకౌల్‌కి ఈ పాతికేళ్లలో స్కూలు నిర్వహణలో ఎదురైన సవాళ్లన్నీ ఒక ఎత్తయితే... 2000 సంవత్సరం మరీ గడ్డుకాలం. తాను వేతనం లేకుండా పని చేస్తుంది, కానీ ఇతర ఖర్చులు తప్పడం లేదు. విద్యార్థులు పెరిగే కొద్దీ టీచర్ల సంఖ్య పెరగక తప్పదు. వారికి వేతనాలివ్వాలి. తన దగ్గరున్న డబ్బు ఖర్చయిపోయింది. దాంతో స్కూలు మూసేయక తప్పదనే నిర్ణయానికి వచ్చారామె.

ఇంకా సర్వీస్‌ చేయాలంటే తాను ఒక్కర్తెగా చెప్పదగినంత మందికి పాఠాలు నేర్పించడం ఒక్కటే తన ముందున్న మార్గం అనుకున్నారామె. స్కూలు మూసేస్తానని ప్రకటించారు కూడా. ఒక మంచి పనికి సమాజంలో ఆదరణ ఉంటుందని నిరూపణ అయిన సమయమది. ఆమె ఆ మాట అన్నారో లేదో వెంటనే... ఆమె స్నేహితులు, బంధువులు, శ్రేయోభిలాషులు ముందుకొచ్చారు. స్కూలు మూత పడకుండా విరాళాలతో ఆదుకున్నారు.

ఆర్డర్‌ ఇవ్వకనే ఆహారం వచ్చింది
గుల్దస్త్‌ విద్యార్థుల్లో ఒకమ్మాయి ఇప్పుడు అదే స్కూల్లో టీచర్‌గా చదువు చెప్తోంది. ఒక కుర్రాడు కంప్యూటర్స్‌లో డిగ్రీ చేసి అదే స్కూల్లో కంప్యూటర్‌ కోర్సు నేర్పిస్తున్నాడు. మరో కుర్రాడు మెకానిక్‌గా మంచి సంపాదనతో స్థిరపడ్డాడు. వీరందరికంటే విమలాకౌల్‌ను భావోద్వేగానికి గురి చేసిన ఓ స్టూడెంట్‌ ఉన్నాడు. అతడు చైనీస్‌ రెస్టారెంట్‌లో మేనేజర్‌గా పని చేస్తున్నాడు. ఓ రోజు ఆమె రెస్టారెంట్‌కెళ్లింది, ఆమె ఆర్డర్‌ చేసే లోపు ఆహారం వచ్చింది. ‘మా సార్‌ పంపించారు’ అని ఆమె ముందు పెట్టి వెళ్లిపోయాడు సర్వర్‌. ఆశ్చర్యం నుంచి తేరుకుని ఎవరై ఉంటారా అని ఆలోచిస్తూ భోజనం పూర్తి చేశారామె. బిల్లు అడిగినప్పుడు ‘మేడమ్‌ నేను కట్టేశాను’ అంటూ బయటికొచ్చాడో కుర్రాడు. వచ్చీ రాగానే ఆమె పాదాలను తాకి నమస్కరించాడు.

అతడు ఒకప్పటి ఆమె స్టూడెంట్‌. ఆ కుర్రాడిని దగ్గరకు తీసుకుంటూ.. ‘నేను రిటైరైన తర్వాత సమాజానికి ఏదైనా చేయాలని గ్రామాలు, మురికి వాడల్లో తిరుగుతున్నప్పుడు మదన్‌పూర్‌లోని ఒక పెద్దావిడ ‘వాళ్ల తిండి వాళ్లు సంపాదించుకునేటట్లు తయారు చెయ్యి’ అని నాకు చెప్పింది. ఆ మాటల స్ఫూర్తితోనే సరిగ్గా చదువురాని పిల్లలను చేరదీసి చదువు చెప్తున్నాను. నా దగ్గర అక్షరాలు దిద్ది, నీ తిండి నువ్వు సంపాదించుకోవడమే కాకుండా, చదువు చెప్పిన గురువుకి అన్నం పెట్టేటంత పెద్దవాడివయ్యావు’ అని కన్నీళ్ల పర్యంతమయ్యారామె. తాను నాటిన మొక్క వృక్షమయ్యాక ఆ నీడన సేదదీరుతున్నంత ఆనందం ఆమె కళ్లలో అప్పుడు!
 

వారి జీవితాలు గాడిన పడ్డాయి!
‘‘నేను చదువు చెప్తున్న పిల్లల అభ్యున్నతే నాకు గొప్ప రివార్డు. ఇక ఇతర అవార్డులెందుకు? నా పిల్లలు ఎందరో పెద్ద పెద్ద ఆర్గనైజేషన్‌లలో ఉద్యోగాలు చేసుకుంటూ సంతోషంగా జీవిస్తున్నారు. నా దగ్గరకు వచ్చిన పిల్లల్లో చాలామందిలో అసాధారణమైన తెలివితేటలుండేవి. వారికి సరైన మార్గదర్శనం చేస్తే జీవితాలు గాడిన పడతాయని నమ్మాను. వారంతా నేను కోరుకున్నట్లే వికసించారు. పేద పిల్లలకు చదువు చెప్పాలనుకున్న రోజు... ‘ఈ ప్రయత్నంలో ఒక్కరి జీవితమైనా బాగుపడితే నా జన్మ ధన్యమవుతుంద’నుకున్నాను. ఇన్నేళ్లలో ఎంతోమంది పిల్లలకు బాల్యాన్ని ఇవ్వగలిగాను. వారికి భవిష్యత్తు దారి చూపించగలుగుతున్నాను. అదే నాకు సంతోషం’’. – విమలాకౌల్, అవిశ్రాంత ఉపాధ్యాయురాలు

వీళ్లందరూ నా పిల్లలే!
విమలాకౌల్‌ వ్యక్తిగత జీవితంలో ఒడిదొడుకులేవీ లేకుండా సాగిపోయింది. సమాజం కోసం జీవించాలని, సమాజానికి ఏదైనా చేయాలని మొదలు పెట్టిన ప్రయత్నంలో లెక్కకు మించిన ఆటంకాలు ఎదురయ్యాయి.  అన్నింటినీ అధిగమిస్తూ ముందుకు సాగడమే ఆమె విజయరహస్యం. లోకసభ టీవీ, సిఎన్‌ఎన్‌ ఐబిఎన్, బీబీసీ చానెళ్లు ఆమె సేవలను పరిచయం చేస్తూ ప్రత్యేక కార్యక్రమాలను ప్రసారం చేశాయి. అవార్డులు కూడా ఇచ్చాయి. ఆమెకు పిల్లల్లేని విషయాన్ని గుర్తు చేసినప్పుడు చిరునవ్వుతో ‘‘వీళ్లంతా నా పిల్లలే కదా’’ అంటారామె క్లాసులోని పిల్లలను చూపిస్తూ.  ‘రోజంతా వీరి మధ్యనే సంతోషంగా గడుపుతాను. ఇక నాకు ఎవరూ లేరని ఎందుకనుకుంటారు’ అని తిరిగి ప్రశ్నిస్తారు.

– వాకా మంజులారెడ్డి

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top