యుద్ధవేదం... మధుర గానం... | Sakshi
Sakshi News home page

యుద్ధవేదం... మధుర గానం...

Published Wed, Aug 24 2016 10:59 PM

యుద్ధవేదం... మధుర గానం...

ఒకనాడు శ్రీకృష్ణుడు పాండవులను వెంటబెట్టుకుని, అంపశయ్య మీద ఉన్న భీష్మపితామహుడిని దర్శించి, ‘తాతా! నీ మనుమలకు ధర్మబోధ చెయ్యి’ అన్నాడు. శ్రీకృష్ణుని మాటలకు చిరునవ్వుతో భీష్మపితామహుడు, ‘జగన్నాటక సూత్రధారీ! చతుర్దశ భువనాలనూ సృష్టించి, పోషించి, లయం చేసే పరాత్పరుడవు, జగదాచార్యుడవు. నీ సమక్షంలో నేను పాఠం చెప్పడమంటే, గురువుగారి సమక్షంలో శిష్యుడు పాఠం చె ప్పినట్లుంటుందయ్యా’ అన్నాడు. అదీ శ్రీకృష్ణతత్వం. అలా భీష్ముడంతటి వాడు స్వయంగా శ్రీకృష్ణుడిని జగదాచార్యా అని సంబోధించాడు. (ఉషశ్రీ భారతం నుంచి)


జగద్గురువు, జగదోద్ధారకుడు, జగదాచార్యుడు, గీతాచార్యుడు... ఎన్ని నామాలతో శ్రీకృష్ణపరమాత్ముడిని స్మరించినా తనివి తీరదు. దశావతారాలలో ఒక్క కృష్ణావతారాన్ని మాత్రమే సంపూర్ణావతారంగా చెప్పారు. మిగిలిన అవతారాలను అంశావతారాలుగా వివరించారు. కృష్ణస్తు భగవాన్ స్వయమ్... కృష్ణుడు స్వయంగా భగవంతుడు... అని శ్రీకృష్ణుని స్తుతించారు.


యుద్ధ వేదం: మహాభారతంలో కురుపాండవుల మధ్య కురుక్షేత్ర యుద్ధం జరిగింది. ఆవలి పక్షంలో ఉన్న కురు, గురు వృద్ధులను చూసిన అర్జునుడికి వైరాగ్యం వచ్చింది. తాను యుద్ధం చేయలేనన్నాడు. చేతిలో గాండీవం జారిపోతోందన్నాడు. తనను పెంచి పెద్ద చేసిన తాతలను, విద్యాబుద్ధులు నేర్పిన గురువులను తాను సంహరించలేనన్నాడు. ఆ మాటలకు శ్రీకృష్ణపరమాత్ముడు నవ్వురాజిల్లెడు మోముతో, భ గవద్గీత ప్రబోధించాడు. అంతే. అర్జునుడు గాండీవం అందుకున్నాడు. శత్రు సంహారం చేశాడు. అందుకే కృష్ణుని పుట్టినరోజు మనకు పండుగ అయ్యింది. సాక్షాతు పరమాత్ముడు భగవంతుడై, భగవంతుడు శ్రీకృష్ణుడై మానవజాతి సంక్షేమానికి ఉపకరించేలా సమగ్రమైన మార్గదర్శక సూత్రాలను ‘భగవద్గీత ’ గా అందించి జగద్గురువు అయ్యాడు.


మధుర గానం: శ్రీకృష్ణుని పేరులోనే ఒక ఆకర్షణ ఉంది. కర్షతి ఇతి కృష్ణ... అంటే ఆకర్షించేవాడు అని అర్థం. శ్రీకృష్ణునిలాగే, భగవద్గీత కూడా అందరినీ ఆకర్షిస్తూనే ఉంటుంది. ఇది మానవజాతిని శాసిస్తుంది. ఆ శాసనాన్ని భగవంతుడు తియ్యగా గానం చేశాడు. కఠినమైన పాఠాన్ని శిష్యులకు సులభంగా అర్థమయ్యేలా చెప్పగల నైపుణ్యం గురువులకే ఉంటుంది. ఆ గురువులకే గురువు అయిన శ్రీకృష్ణుడు జగద్గురువు అయ్యాడు.


కాల జ్ఞానం: అర్జునుడికి శ్రీకృష్ణుడు బోధించిన భగవద్గీత మొత్తం ఉపనిషత్తుల సారమే. మానవజాతికి కావలసిన ఇహపరమైన మానవ ధర్మాలన్నింటినీ బోధించిన సమగ్రమైన సరళమైన గ్రంథం. మాన వజాతికి కావలసిన భక్తి జ్ఞాన వైరాగ్యాలను, ధైర్యాన్ని, మానసిక స్థైర్యాన్ని, కార్యశీలతను, వ్యక్తిత్వ వికాసానికి కావలసిన జ్ఞానాన్ని బోధించాడు శ్రీకృష్ణుడు. ఏ కాలంలోనైనా పనికొచ్చే విషయాలన్నింటినీ కేవలం 700 శ్లోకాలలో చెప్పాడు. ప్రాంత ం, కాలం అనే నియమం లేకుండా జగత్తులో ఎవరికైనా, ఎక్కడైనా పనికొచ్చే మార్గనిర్దేశం చే సేవాడు జగద్గురువు. శ్రీకృష్ణుడు భగవద్గీతలో బోధించిన అంశాలు సర్వకాల సర్వావస్థలలో సర్వ మానవాళికీ ఆచరణయోగ్యంగా ఉంటాయి కనుకనే ఆయన జగద్గురువు అయ్యాడు.


కర్మ ఫలం: ‘మానవజాతికి పిరికితనం పనికిరాదు. హృదయ దౌర్బల్యాల వల్ల ఏమీ సాధించలేం’ అని కృష్ణపరమాత్మ ఇచ్చిన ఉపదేశం, ఏకాలంలోనైనా, ఎవరికైనా ఉపయోగపడుతుంది. ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఆందోళన పడకుండా, ఫలితం కోసం ఆశపడకుండా, ఆ పనిని శ్రద్ధగా ఆచరిస్తే, మంచి ఫలితాలొస్తాయి.. అనే  దానికి ‘కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన...’ శ్లోకం ఇస్తున్న సందేశం.


స్థిత యజ్ఞం: ‘‘మనసులో చెలరేగే కోరికలను అక్కడే అణగద్రొక్కి ఆత్మయందే అన్నిటినీ అనుభవించగలవాడు స్థితప్రజ్ఞుడు. క్లేశాలకు కుంగడు, సుఖాలు మీదపడినా లొంగడు. భయం, క్రోధం, రాగం అనేవాటిని దరిచేరనివ్వడు’’ అని చెబుతూ మనిషి కోర్కెలను ఏ విధంగా అదుపులో ఉంచుకోవాలో వివరించి జగద్గురువు అయ్యాడు.

 

మార్గ దర్శనం: సాధారణంగా లోకంలో జనసామాన్యం తమ కంటె ఉత్తములైన వారినే అనుసరిస్తారు. అందుచేతనే ఈ ముల్లోకాలలో చెయ్యవలసింది యేదీ లేకపోయినా, వాంఛించేది లేకపోయినా జ్ఞానులు నిరంతరం కర్మ చేస్తూనే ఉండాలి. అలా కర్తవ్యం నిర్వర్తించకపోతే అందరూ సోమరులవుతారు. అందువల్ల లోక నాశనం కాకతప్పదు. అలానే జ్ఞానులు కర్మ చేస్తూ అజ్ఞానులకు మార్గదర్శకులు కావాలని బోధించి జగద్గురువు అయ్యాడు.


‘‘ఈ కర్మ అంతా నా వల్లే జరిగిందనే భావం ఉండకూడదు. పైగా జరిపిన కర్మకు ఫలం కావాలనే ఊహ ఉండకూడదు. ఈ దృష్టితోనే ఎందరో తమ కర్తవ్యాన్ని నిర్వర్తించి మోక్షపదం చేరారు’’ అని పలికి శ్రీకృష్ణుడు జగద్గురువు అయ్యాడు. - డా. పురాణపండ వైజయంతి, ఫీచర్స్ ప్రతినిధి, సాక్షి

 

నడిపించే శక్తే.. గురువు
గురువు త్రిమూర్త్యాత్మకంగా ఉండాలి. శిష్యులలోని అజ్ఞానాన్ని పోగొట్టి, నడిపించే శక్తి కలిగి ఉన్నవాడు గురువు. గు అంటే చీకటి అని, రు అంటే పోగొట్టేవాడు అని. అజ్ఞానమనే చీకటిని పారద్రోలగలిగేవాడు గురువు అని శాస్త్రం చెబుతోంది. తన సందేశం ద్వారా మొత్తం ప్రపంచాన్ని నడిపించగలిగినవాడిని జగద్గురువు అంటారు. శ్రీకృష్ణుడు బోధించిన భగవద్గీతతో ఆయన జగద్గురువు అయ్యాడు.      - డా. పాలపర్తి శ్యామలానందప్రసాద్

Advertisement
Advertisement