పల్లవెళ్లిపోయింది

పల్లవెళ్లిపోయింది


కదిలించే పల్లవి జీవితాన్నే కదిలిస్తుంది. తేజం ఉన్న పల్లవి... నిస్తేజంగా ఉన్న జీవితాన్ని పరుగులెత్తిస్తుంది. ఉల్లాసం ఉన్న పల్లవి... చరణాలలో ఉత్తేజం నింపుతుంది. పల్లవే లేకపోతే చరణాలు నడవగలుగుతాయా? కొత్తకొత్త లోకాలను చూడగలుగుతాయా? ఈ పల్లవి ఎంత స్వార్థపరురాలు! తనైతే కొత్త లోకాన్ని చూడ్డానికి వెళ్లిపోయింది. చరణాలను చలనరహితం చేసింది.  అవును... పల్లకెళ్లిపోయింది. సినారే అనే పల్లవెళ్లిపోయింది.∙సాక్షి ఫీచర్స్‌ డెస్క్‌

గోగులు పూచె గోగులు కాచె ఓ లచ్చగుమ్మాడి గోగులు దులిపె వారెవరమ్మా ఓ లచ్చ గుమ్మాడి... పల్లె పదాన్ని కొనగోట పలికించి కులికిన ఆ పల్లవి వెళ్లిపోయింది. నోమి నోమన్నలాల నోమన్నలాల సందామామా సందామామ పొద్దు వాలక ముందే పోదారి రాయే తూరుపోళ్ల బుల్లెమ్మ తూరుపోళ్ల బుల్లెమ్మ... ఊరి చెణుకులను కలంలో నింపుకుని జగమంతా చల్లిన ఆ పల్లవి వెళ్లిపోయింది. అటు చూస్తే చార్మినారు ఇటు చూస్తే జామా మసీదు ఆ వంక అసెంబ్లి హాలు ఈ వంక జూబిలి హాలు రిమ్‌జిమ్‌ రిమ్‌జిమ్‌ హైదరాబాద్‌ రిక్షావాలా జిందాబాద్‌... సిటీలో షికారు చేయించి, పాయా షేర్వాల ఘుమఘుమలనీ బన్‌ బిస్కట్ల బరువు రుచిని అలవాటు చేసి, మణికట్టు మీద ఇంత అత్తరు చార వేసి వదిలిన ఆ పల్లవి వెళ్లిపోయింది. ఈ రేయి తీయనిది ఈ చిరుగాలి మనసైనది ఈ హాయి మాయనిది ఇంతకు మించి ఏమున్నది.అహా... తేనెను ఊటగా చేసుకొని మాటలో మకరందం నింపుకుని చీకటి రాతిరిలో కూడా వెన్నెల సవ్వడులను వినిపించగలిగిన ఆ పల్లవి వెళ్లిపోయింది. భలే మంచి రోజు పసందైన రోజువసంతాలు పూచే నేటి రోజు... ప్రతి మంచి సందర్భానికి మనసు నిండుగా పాడుకునేలా ఒక పాటను పదిలంగా ఇచ్చి ఆహ్లాదాన్ని ఎల్లెడలా పంచిన ఆ పల్లవి వెళ్లిపోయింది.సింగిరెడ్డి నారాయణరెడ్డి, సి. నారాయణరెడ్డి, సినారె... పాత తరానికి కొత్త తరానికి మిగిలిన ఆఖరు వారధి ఆయన. పాట పరువు, మర్యాద బెసకకుండా జాగ్రత్తగా భుజాలపై మోసి దాని బరువు పెంచిన కవి ఆయన. పండితులకు, పామరులకు మధ్య సమన్వయ స్థాయిలో పాటను నిలబెట్టి శృంగారం, కరుణ, ఎడబాటు, నీతి బోధన, వియోగం, విషాదం ఏదైనా సరే హత్తుకునేలా చెప్పి వచ్చింది రెండు మూడు మజిలీల బాటసారి కాదు సుదీర్ఘ యానం చేయగల పాటసారి అని నిరూపించిన పథికుడాయన. ఆయన చాలా గొప్ప పాటలు రాసి ఉండవచ్చు. కొన్ని ఉత్త పాటలు రాసి ఉండవచ్చు. కాని చెత్త పాటలు మాత్రం రాయలేదన్న పేరు తెచ్చుకున్న సమర్థ కలంధారి ఆయన.

సాహిత్యంలో సినారె గొప్పకవి. కాని కొందరి దృష్టిలో మాత్రం ఆయన అంతకు మించిన గొప్ప సినీకవి.ఎన్టీ రామారావు పట్టుపట్టి ఇద్దరు కవులను సినిమా రంగానికి పరిచయం చేశారు. ఒకరు సినారె. మరొకరు వేటూరి. ఇద్దరూ ఎన్టీఆర్‌ ఆశీస్సులతో రంగంలో నిలబడినవారే. ఆబాలానికీ గోపాలానికీ తమ బలం నిరూపించినవారే. ఆయితే వేటూరి ఫాస్ట్‌ పాసింజర్‌లా చాలా స్టేషన్లలో ఆగుతూ ఆ ప్రయాణికులను అకామడేట్‌ చేయడంలో భాగంగా కొన్ని నాసిరకం పాటలు రాశారు. కాని సినారె ఎక్స్‌ప్రెస్‌ రైలులా ఆచి తూచి, ఎంచుకున్న స్టేషన్లలోనే ఆగుతూ ఆ ప్రొడక్షన్‌ హౌస్‌లకే తాననుకున్న దర్శకులకే పని చేస్తూ సినీ కవిగా ఎప్పుడూ చావు కొని తెచ్చుకోకుండా కన్నులొట్టపోకుండా పూర్ణరూపంతో నిలబడగలిగారు. బహుశా అందుకు కారణం ఆయనకు ఫుల్‌టైమ్‌ అధ్యాపక వృత్తి ఉండటం, యూనివర్సిటీ అధ్యాపకునిగా స్థిరమైన సంపాదన ఉండటం, సాహితీకృషిలోనూ దినదినప్రవర్థమానమైన గుర్తింపు లభిస్తూ ఉండటం... కనుక పాటను ‘ఛాయిస్‌’గా ఉంచుకునే చాన్స్‌ ఆయనకు ఉండింది. వేటూరికి అది లేదు. వేటూరికి పాటే హోల్‌టైమ్‌ ప్రొఫెషన్‌. కనుక తన వద్దకు బంగారు కంచం పట్టుకొచ్చినవారికి పంచభక్ష్య పరమాన్నాలు పెట్టారు... సత్తు ప్లేటు తెచ్చినవారికి సద్దన్నం పడేశారు.

కాని సినారెది స్టాండర్డ్‌ మీల్స్‌. అది రుచిగా ఉంటుంది. ఆకలీ తీరుస్తుంది.

 

తరియింతును నీ చల్లనిచరణమ్ముల నీడలోన  పూలదండ ఓలే కర్పూర కళికవోలే... ఈ ‘కర్పూర కళిక’ సినారె మార్క్‌. ఆయన సినిమా పాటలు రాయడానికి అర్రులు చాచి ఉంటే ‘గులేబకావళి కథ’ కంటే ముందే వచ్చిన ఒకటీ అరా అవకాశాలను ఆబగా అందిపుచ్చుకునేవారు. కాని హుందాగా ఉండాలి... సినీ రంగంలో హుందాగా కొనసాగాలి అని ముందే నిశ్చయించుకున్నారు. అందువల్ల తొలి సినిమాతో అడుగుపెడితే అందులోని అన్ని పాటలు రాయడం ద్వారా అడుగు పెట్టాలని ‘గులేబకావళి కథ’ ద్వారా అడుగు పెట్టారు.

అప్పటికే ఆయనకు సినిమా రంగంలో మిక్కిలినేని, గుమ్మడి, అక్కినేని గాఢమైన స్నేహితులు. అయితే అవకాశం మాత్రం ఎన్టీ రామారావే ఇచ్చారు. అగాధాలకు చేరే సత్తా కొన్ని చేపలకు ఉన్నా అవి సముద్రంలో సూర్యకాంతి సోకినంత మేరనే తిరుగాడుతుంటాయి. సినారె కూడా సాహిత్యంలోకాని, సినిమాలో కాని సగటు పాఠకుణ్ణి, కాస్త పైస్థాయి పాఠకుణ్ణి మాత్రమే దృష్టిలో పెట్టుకొని రచన చేయగలరు అని ఎన్టీఆర్‌ కనిపెట్టారు. ఒంటరి అయిపోయాను మరి ఇంటికి ఏమని పోను?... ఒక్కోసారి పాటకు ఈపాటి సులువైన పదాలు సరిపోతాయి. సినారె అవి అలవోకగా అందించగలరు. వెల్‌కమ్‌ చెప్పడానికి ఇంకేమి కావాలి?మరి బి.ఎన్‌.రెడ్డిలాంటి వాళ్లకు ఏం కావాలి? ఆయన పెద్ద దర్శకుడు. దేవులపల్లి కృష్ణశాస్త్రి వంటి కవుల చేతి పానకాలనీ మల్లాది రామకృష్ణశాస్త్రి వంటి ఉద్దండుల పాయసాలను రుచి చూసినవారు. ‘పూజాఫలం’ సినిమాకు సినారెను పిలిచి లిట్మస్‌ టెస్ట్‌ పెట్టారు. ఎందుకంటే బి.ఎన్‌.రెడ్డికి పాట రాసినవాడు ఎవరికైనా రాయగలడు. ఏ టెస్ట్‌ అయినా పాస్‌ కాగలడు. పైగా సంగీత దర్శకుడు సాలూరి రాజేశ్వరరావు. ఇద్దరు మేధావుల మధ్య సినారె. భళారె అని అనిపించుకోక తప్పదు. సందర్భం చెప్పారు. పియానో పాట. పియానో రీడ్స్‌ మీద జమున వేళ్లు కదలాడిస్తూ పాట పాడాలి. సినారె వేళ్లు కూడా పేపర్‌ మీద కదలాడుతూ పాట రాశాయి.పగలే వెన్నెల జగమే ఊయల కదిలే ఊహలకే కన్నులుంటే.... పాస్‌ అయ్యాడు గురుడు. మరి? వచ్చింది ఎవరు? శబ్ద మేధావి.. గద్య మేధావి... సందర్భానుసారంగా సృజనను మెరిపించగల కలం మేధావి. కాని ఆ పాట కాదు. అంతకన్నా సుందరమైన లలితమైన భావం అవసరమైన పాట అదే సినిమాలో మరో చోట అవసరమైంది. కలం నిదుర లేచింది. నిన్న లేని అందమేదో నిదుర లేచెనెందుకో నిదుర లేచెనెందుకో... సినారె వచ్చాడట... బి.ఎన్‌.కు రాశాడట... సాలూరి ట్యూన్‌ కట్టాడట... ట్రైనింగ్‌ పూర్తయ్యి జాబ్‌ రెగ్యులరైజ్‌ అయ్యింది.

ఇక మిగిలిందంతా కెరీరే.సరే ఇది చూడండి. భానుమతి వచ్చారు. ఎన్టీఆర్‌ పి.బి.శ్రీనివాస్‌లను తెచ్చారు. తను, పి.బి.శ్రీనివాస్‌ పాడుతుండగా తన మీద ఎన్టీఆర్‌ మీద డ్యూయెట్‌ పిక్చరైజ్‌ చేయాలట. అందుకు సినారె పాట రాయాలట. భానుమతి సంగతి తెలిసిందేగా. ఆమె స్వయంగా రైటర్, డైరెక్టర్, యాక్టర్, సింగర్‌.. ఇంకా అనేకం. ఆమె సూపర్‌ ఇగో ఎదురుగా సినారె క్రియేటివ్‌ ఇగో ఢీకొట్టి నిలవాల్సి వచ్చింది. సినిమా: వివాహ బంధం. సినారె పాట రాశారు. నీటిలోనా నింగిలోన నీవే ఉన్నావులే కనులలోన కలలోన కలసి ఉన్నాములే... ‘కవి గారూ... ఎంత సింపుల్‌గా హాయిగా రాశారండీ’... భానుమతి రామకృష్ణ ప్రశంస. అది ఆస్కార్‌ రెడ్‌కార్పెట్‌ వాక్‌కు ఏమాత్రం తక్కువ కాదు. పి.బి.శ్రీనివాస్‌ వచ్చాడు కాబట్టి ఇంకో గాయకుడు కె.బి.కె.మోహనరాజును కూడా చెప్పుకుందాం. ‘పూలరంగడు’లో ఆయన తన మొదటి పాట పాడాడు. ఆ పాటతోనే గుర్తుండిపోయాడు. ఈ ‘గుర్తు’ను ఇచ్చింది సినారె. ఈ పద గుబాళింపును ఇచ్చింది సినారె. చిగురులు వేసిన కలలన్నీ సిగలో పూలుగ మారినవి మనసున పొంగిన అలలన్నీ మమతల తీరం చేరినవి...అసలు సినారె అంటే డ్యూయెట్స్‌. డ్యూయెట్స్‌ అంటే సినారె. సినిమా ఇండస్ట్రీలో వచ్చిన బ్లాక్‌ అండ్‌ వైట్‌ టాప్‌ టెన్‌ డ్యూయెట్స్‌ తీస్తే అందులో రెండైనా సినారెవి ఉంటాయి. హీరో హీరోయిన్ల సరస సంభాషణ, సున్నితమైన శృంగార వ్యక్తీకరణ, మాటకు మాట జవాబు... వీటిని రాయడంలో సినారె సిద్ధహస్తులు. అందుకనే ఎస్‌.భావనారాయణ, డివిఎస్‌ రాజు, దుక్కిపాటి మధుసూదనరావు, తమ్మారెడ్డి కృష్ణమూర్తి నిన్న మొన్నటి ఎస్‌.గోపాలరెడ్డి వరకు ఎందరో ప్రొడ్యూసర్లు ఆయన చేత డ్యూయెట్స్‌ రాయించుకునేవారు. దుక్కిపాటి మధుసూదనరావు ‘చదువుకున్న అమ్మాయిలు’ సినిమా కోసం సాలూరి మ్యూజిక్‌లో ఒక పాటకు అవకాశం ఇచ్చారు. అది ట్యూన్‌కు చేసిన పాట. సాలూరి రాజేశ్వరరావు సన్నని గొంతులో ట్యూన్‌ను ‘తానాన’ లో వినిపించారు.‘తనినన తానిన తనినన తనినని తానీ తానానతానా’...రాసే ముందు కండిషన్‌ కూడా పెట్టారు. ‘లఘువులన్న చోట లఘువు... గురువులున్న చోటు గురువు’ తప్పనిసరి. సినారె క్షణంలో రాశారు.‘కిలకిల నవ్వులు చిలికిన– పలుకును నాలో బంగారువీణ కరగిన కలలే నిలిచిన – విరిసెను నాలో మందారమాల’... కిలకిల, చిలికిన, కరిగిన, నిలిచిన.... పదాలను ఔపోసన పట్టినవాడికే సాధ్యం. ఇదే దుక్కిపాటి ‘ఆత్మీయులు’ సినిమాలో మరో అవకాశం ఇచ్చారు. వాణిశ్రీ, అక్కినేని హీరో హీరోయిన్లు. హీరోయిన్‌ తన మనసులోని మాటను ‘చేమంతి’ని మిషగా పెట్టి చెప్పాలి. సాలూరి ట్యూన్‌ సిద్ధం చేశారు. పదాలను సినారె సిద్ధం చేయడం ఎంత సేపు? ఓ... చామంతీ ఏమిటే ఈ వింత– ఈ చినదానికి కలిగెనేల గిలిగింత మేని పులకింత...

ఇదే సాలూరి సంగీతంలో ‘కులగోత్రాలు’ సినిమా కోసం సినారె రాసిన ఈ పాటను మాత్రం ఎలా మర్చి పోగలం? చెలికాడు నిన్నే రమ్మని పిలువ చేరరాలేవా ఇంకా సిగ్గు నీకేలా... ఇక డ్యూయెట్లకు విషమ పరీక్ష ఎన్టీఆర్‌ పెట్టారు.‘దానవీరశూరకర్ణ’లో దుర్యోధనుడికి డ్యూయెట్‌ కావాలన్నారు. అంత వరకూ దుర్యోధనుడు విలన్‌. సినిమాల్లో అతడు కనిపించడమే తప్ప అతడి భార్య ఎవరో పిల్లలెవరో సంసారం ఏమిటో ఎవరికీ తెలియదు. అలాంటిది దుర్యోధనుడికి ప్రియురాలిని పెట్టి పైగా పాట కూడా పెట్టడమా? ఇది సినారెకు చిత్రంగా అనిపించింది. విచిత్రంగా అనిపించింది. అదే పల్లవిగా మారింది. చిత్రం భళారే విచిత్రం చిత్రం అయ్యారే విచిత్రం నీ రాచ నగరుకు రారాజును రప్పించుటే విచిత్రం పిలువకనే ప్రియవిభుడే విచ్చేయుటే విచిత్రం.... ‘ఆడా– మగా’ పాడే డ్యూయెట్లు సరే ‘మగా– మగా’ పాడే డ్యూయెట్లలో కూడా సినారె సిద్ధహస్తులు. ‘మంచి మిత్రులు’లోని పాట దీనికి ఉదాహరణ. అందులో ఇద్దరు స్నేహితులు చాలా రోజుల తర్వాత కలుస్తారు. కలిసే ముందు రోజు వారికి ఎక్సయిట్‌మెంట్‌ పెరిగిపోతుంది. దానిని పాట రూపంలో చూపాలి.సినారె కలం అందుకున్నారు. ఎన్నాళ్లో వేచిన ఉదయం ఈనాడే ఎదురవుతుంటే ఇన్నినాళ్లు దాగిన హృదయం ఎగిసి ఎగిసి పడుతుంటే ఇంకా తెరవారదేమో ఈ చీకటి విడిపోదేమి... సినారె కలం చీకట్లను చీల్చిన వీచికదాసరి యుగం వచ్చింది ‘తూర్పు–పడమర’ తెచ్చింది.అది తమిళంలో బాలచందర్‌ సినిమా. తెలుగులో దాసరి నారాయణరావు రీమేక్‌ చేశారు. తమిళంలో ఉన్న ఒక పాటను యథాతథంగా వాడదామని నిర్మాతలు అన్నారు. దాసరి కూడా ఓకే అన్నారు. కాని సినారె వినలేదు. సంగీత దర్శకుడు రమేశ్‌నాయుడు కూడా వినలేదు. అంతకుమించిన మంచి పాటను సొంతపాటను ఇస్తాం అని చెప్పారు. సత్తా ఉన్నవాళ్లు పట్టు పట్టనే కూడదు. పట్టారా పాట హిట్‌ కాక తప్పదు.శివరంజని నవరాగిణి వినినంతనే నా తనువులోని అణువణువు కరిగించే అమృతవాహిని... ఇదే సినిమాలో ‘తూర్పు పడమర ఎదురెదురు’ పాటను కూడా సినారె రాశారు. అందులోనే ‘కాలమనే గేలానికి చిక్కి’... అనే ఎక్స్‌ప్రెషన్‌ ఉంది. అలాంటిది విన్నప్పుడు శభాషో అనాలనిపిస్తుంది... సాహో అని పొగడాలనిపిస్తుంది. దాసరి– సినారె– రమేశ్‌నాయుడుల కాంబినేషన్‌ మేజిక్‌ ఆ తర్వాత కూడా పని చేసింది. దాసరి దర్శకత్వంలో వచ్చిన ‘శివరంజని’ సినిమాలో హీరో హరిప్రసాద్‌ హీరోయిన్‌ జయసుధను పొగిడే సోలో ఉంది. అప్పుడూ సినారె కలం పరుగులు తీసింది. అభినవ తారవో నా అభిమాన తారవో శివరంజనీ... శివరంజనీ...చక్రవర్తి దెబ్బకు కె.వి.మహదేవన్, వేటూరి ఉధృతికి సినారె కొంచెం మసక కమ్మినవారయ్యారనేది వాస్తవం. సినారె కవిగా, వైస్‌ చాన్స్‌లర్‌గా ఎంతో బిజీగా ఉన్నా ఆయన అంతరాత్మ పరితపించేది మంచి పాట కోసమే. ఆ సమయంలో ఈ ఇరువురినీ ఆదుకున్నది భార్గవ్‌ ఆర్ట్‌ ప్రొడక్షన్స్‌. ఎస్‌.గోపాలరెడ్డి ఆధ్వర్యంలో వచ్చిన అన్ని సినిమాల్లో సినారె పాటలు రాశారు. అవి కెవి మహదేవన్‌ బాణీలలో పడి సూపర్‌ డూపర్‌ హిట్‌ అయ్యాయి. వంగతోట కాడ ఒళ్లు జాగ్రత్త నంగనాచి ముళ్లు తొంగి తొంగుంటాయ్‌ నాటుకుంటే తీయాలంటే నీ తరమా నా తరమా... ‘మంగమ్మ గారి మనవడు’లో ఈ పాట ఎంత హిట్టో ‘మా పల్లెలో గోపాలుడు’లో ఈ పాట ఇంకా హిట్టు. రాణీ రాణెమ్మ ఆనాటి నవ్వులు ఏవమ్మా నీ వేడుక చూడాలని నీ ముంగిట ఆడాలని ఎన్నెన్ని ఆశలతో ఎగిరెగిరి వచ్చానమ్మా.... అయితే ఇదే సందర్భంలో కె.విశ్వనాథ్‌కు వేటూరికి వచ్చిన ‘దూరం’ సినారెకు లాభించింది. ‘శంకరాభరణం’, ‘సప్తపది’ సినిమాల తర్వాత కొంతకాలం పాటు వేటూరి విశ్వనాథ్‌కు పాటలు రాయలేదు. ఆ సందర్భంలోనే విశ్వనాథ్‌ ‘సిరివెన్నెల’ను వెలికి తీయాల్సి వచ్చింది. ‘సీనియర్‌‘ అవసరమైనప్పుడు సినారె చేత పాటలు రాయించుకోవాల్సి వచ్చింది. ‘స్వాతి ముత్యం’లో అలా సినారె రాసిన పాటలు పెద్ద హిట్‌ అయ్యాయి.వటపత్ర సాయికీ వరహాల లాలి రాజీవ నేత్రునికి రతనాల లాలి... సువ్వి సువ్వి సువ్వాలమ్మా సీతాలమ్మా... మనసు పలికే మౌనగీతం నీవే మమతలొలికే స్వాతిముత్యం నీవే... ఆ తర్వాత సినారె ‘స్వయంకృషి’, ‘స్వాతి కిరణం’ సినిమాలకు కూడా కె.విశ్వనాథ్‌ కోసం పాటలు రాశారు. ‘స్వాతి కిరణం’ కోసం రాసిన ‘సంగీత సాహిత్య సమలంకృతే’..., ‘ప్రణతి ప్రణతి ప్రణతి ప్రణవ నాద జగతికి’... పెద్ద హిట్‌ అయ్యాయి.

కొత్త నీరు వస్తుంది. కొత్త నీరు రావాలి. సిరివెన్నెల, వెన్నెలకంటి, భువనచంద్ర, సాహితి, జొన్నవిత్తుల, చంద్రబోస్‌ వంటి తర్వాతి తరం కవులు వచ్చారు. ఇందరు ఉన్నా సినారె పాట సినారెను వెతుక్కుంటూ వస్తూనే ఉంది. నిర్మాత ఆర్‌. రమణమూర్తి దర్శకత్వంలో వచ్చిన ‘నీరాజనం’ కేవలం సినారె, సంగీత దర్శకుడు ఓపి నయ్యర్‌ కోసమే తీశారా అని అనిపిస్తుంది. హిందీలో అంత గొప్ప సంగీత దర్శకత్వం వహిస్తే అందులోనే పూర్తి పాటలు సినారె తప్ప మరొకరు రాయలేరు అని నిశ్చయానికి రావడం వింత లేదు. ‘నీరాజనం’ మ్యూజికల్‌ హిట్‌.నిను చూడక నేనుండలేను... నిను చూడక నేనుండలేను... ఘల్లు ఘల్లున గుండె ఝల్లున పిల్ల ఈడు తుళ్లి పడ్డదీ... మనసొక మధు కలశం పగిలే వరకే అది నిత్య సుందరం... జనం వీటిని పాడుకున్నారు. జనాన్ని ఊపేసిన సినారె చివరి హిట్‌ పాట ‘ఒసే రాములమ్మ’లో ఉంది. దాసరి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా తెలంగాణ ప్రాంత నేపథ్యంలో ఉంటుంది. తెలంగాణ అంటే సినారె జన్మస్థలి. ఇక ఆ కలానికి ఎలా ఉంటుందో తెలుసు కదా ఆకలి. ఓ ముత్యాల రెమ్మ ఓ మురిపాల కొమ్మ ఓ పున్నమి గుమ్మ ఓ పుత్తడి బొమ్మఓ రాములమ్మ... ఓ రాములమ్మ...సినారె ఇప్పుడు వ్యక్తిగానే కవిగా, సినీ కవిగా పెద్ద వారయ్యారు. ఇంకా చెప్పాలంటే పాట కంటే కూడా పెద్ద వారయ్యారు. ‘అరుంధతి’ వంటి సినిమాల్లో ఆయన అతి అరుదుగా పాట రాసినా తెలుగు సినిమాలో ఒక మంచి సందర్భం, ఆయన మాత్రమే రాయగల సందర్భం ఆయన తలుపు తట్టలేకపోయింది. మరణించే నాటికి ఆయన రాయగా రికార్డ్‌ అయిన పాటలు కేవలం ఒకటీ రెండు మాత్రమే ఉన్నాయి. అయినప్పటికీ ఏం పర్వాలేదు. ఆ కలం ఎందుకు పుట్టిందో ఆ పనిని సంపూర్తిగా నెరవేర్చగలిగింది. ఆ పల్లవి ఎక్కడ మొదలైందో అంతకు వంద యోజనాల దూరం దాటగలిగింది. వినే చెవి ఉన్న ప్రతి చోటకూ ఆయన పాట చేరింది. కొట్టుకునే గుండె ఉన్న ప్రతి ఒక్కరికీ ఆయన పదాల ప్రతి స్పందన అందింది. ఉత్తుత్తిన అనే మాట కాదు. నిజంగానే సినారెతో ఒక శకం ముగిసింది. సినీ స్వర్ణయుగపు ఉజ్వల పతాకం అవనతం జరిగింది. ఒక పల్లవి వెళ్లిపోయింది. ఒక పాటల పల్లకీ వెళ్లిపోయింది. తన చరణాల జాడలను వదిలి ఒక పల్లవి మరెప్పుడూ తిరిగిరాని చోటుకు తరలి వెళ్లిపోయింది. మృత్యువు కవికి మాత్రమే. పాట చిరంజీవి.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top