సిరి అరవై... వెన్నెల దొరవై

సిరి అరవై... వెన్నెల దొరవై - Sakshi


పదిమందికి నచ్చే పాట రాయాలనుకున్నావు.

పదిమంది మెచ్చే పాటగా దేవుడు రాయించాడు.

నీ పల్లవికి పల్లకీ కట్టి, నీ చరణాల ధూళిని ఊరేగించి

నిన్ను బోయీలుగా మోసిన నీ జగమంత కుటుంబం ఒకే పాట పాడుతోంది

నీ పాట చిరకాలం బతకాలని...

పాటంత ఆయుష్షు నువ్వు పోసుకోవాలని!

మా సిరి నువ్వు. మా వెన్నెల నువ్వు.


 

ఇంగ్లిష్ తేదీల ప్రకారం రేపు ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి పుట్టినరోజు.  ఆ సాహితీ తపస్వి రచనల్లో తమకిష్టమైన సినీ గీతాల గురించి... ఆయనతో ప్రయాణించిన పదిమంది దర్శకులు పంచుకున్న ఆత్మీయ అభిప్రాయమాలిక.

 

ఆదిభిక్షువు... వాడినేది కోరేది?... సిరివెన్నెల
‘‘సీతారామశాస్త్రికి అప్పుడే షష్టి పూర్తంటే, ఆశ్చర్యంగా ఉంది. టెలిఫోన్స్‌లో ఉద్యోగం చేస్తూ, చిక్కనైన కవిత్వం రాస్తూ నా దగ్గరకు వచ్చిన చేంబోలు వారి అబ్బాయి రూపం, స్వరం నాకు ఇప్పటికీ గుర్తే. ‘భరణి’ అని కలం పేరుతో రాస్తుంటే, హాయిగా అమ్మానాన్న పెట్టిన పేరుతోనే పాటలు రాయమన్న సంగతీ గుర్తే. మా ‘సిరివెన్నెల’ సినిమా ఆదిగా శాస్త్రి ఎన్నో ఆణిముత్యాలందించారు. ఆయన రాసిన ప్రతి పాటా నాకు ఇష్టమే. ఏదని చెప్పను? ‘ఆదిభిక్షువు వాడినేది కోరేది...’ చెప్పనా? ‘అందెల రవమిది పదములదా...’ చెప్పనా? నా సినిమా కాకపోయినా, ‘నేనున్నాను’కు రాసిన ‘ఏ శ్వాసలో చేరితే...’ చెప్పనా? ఏమని చెప్పను? ఎన్నని చెప్పను? ఇన్ని పాటల పరిమళాలు సినీ సాహిత్యానికి అద్దినందుకు శాస్త్రిని అభినందించనా? ఈ షష్టిపూర్తి వేళ ఆశీర్వదించనా? ఈ పద్మావతీ

 సీతారాముల కోసం ఆ ఆదిభిక్షువునేది కోరేది... చిరాయురస్తు!’’    - కె. విశ్వనాథ్

 

దివిని తిరుగు మెరుపులలన  సామజ వరగమనా... లాయర్ సుహాసిని‘‘ప్రతి లైను చివరా ‘సామజవరగమనా’ ఉండేలా ఓ డ్యూయట్ కావాలని సీతారామశాస్త్రిని అడిగితే, చాలా అవలీలగా ఈ పాట రాసిచ్చేశాడు. ఆ సాహిత్యానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అత్యద్భుతంగా బాణీ కట్టారు. ఈ సినిమా పేరు చెబితే అందరికీ ఈ పాటే గుర్తుకొస్తుంది.’’    - వంశీ

 

ముసుగు వేయొద్దు మనసు మీద... ఖడ్గం‘‘అసలు సీతారామశాస్త్రిగారి పాటల్లో నచ్చింది ఒక్కటి చెప్పమంటే, చాలా చాలా కష్టం. చిటికెలో పది, ఇరవై పాటలు చెప్పగలను నేను. జగమంత కుటుంబం నాది, అలనాటి రామచంద్రుని కన్నింట సాటి, మేఘాలలో తేలిపొమ్మన్నది, జర జర, నువ్వు... నువ్వు... నువ్వే.. నువ్వు... ఇలా చాలా పాటలున్నాయి. అయితే వీటన్నింటిలో నేను బాగా దగ్గరితనం ఫీలయ్యే పాట అంటే మాత్రం ‘ఖడ్గం’లోని ‘ముసుగు వేయొద్దు మనసు మీద’ పాటే చెప్పాలి. అందులోని ఫిలాసఫీ అంతా నాదే. అసలు మనసుకు ముసుగు వేసుకుని ఎందుకు బతకాలంటూ గొప్ప ఫిలాసఫీని మోడ్రన్ వాయిస్‌లో చెప్పిన పాట ఇది. అసలు నేనూ, శాస్త్రిగారు కలిస్తే వచ్చే పాటలన్నీ ఇంతే ఓపెన్‌గా, వయొలెంట్‌గా, టెర్రిఫిక్‌గా ఉంటాయి. ఈ పాటల విషయంలో నేను ఆత్మనైతే, ఆయన పరమాత్మ.’’    

 - కృష్ణవంశీ

 

చిలకా... ఏ తోడు లేక ఎటేపమ్మ ఒంటరి నడక...  శుభలగ్నం‘‘ప్రతి ఒక్కరి హృదయంలోకి సూటిగా దూసుకెళ్లిపోయి స్థిరపడిపోయిన అద్భుతమైన పాట ఇది. ఆరాటం, పోరాటం, ఆత్రుత... ఇలా మనిషిలో ఉండే రకరకాల భావోద్వేగాలకు, మానసిక పరిస్థితులకు దర్పణం పట్టేలా ఆత్రేయలాగా చిన్న చిన్న పదాలతో సాహిత్యం రాశారు సీతారామశాస్త్రి. అందుకే పాట సెన్సేషనల్ హిట్టయ్యింది... నందీ అవార్డు సాధించింది.’’

 - ఎస్వీ కృష్ణారెడ్డి

 

ఏ శ్వాసలో చేరితే... నేనున్నాను‘‘సిరివెన్నెలగారు ఏ పాట రాసినా, ఆ పాటకు విపరీతమైన రెస్పెక్టు వచ్చేస్తుంది.. వెయిటూ పెరిగిపోతుంది. నా సినిమాలకు చాలా మంచి పాటలు రాసిచ్చారాయన. ‘నేనున్నాను’ కోసం రాసిన ‘ఏ శ్వాసలో చేరితే’ పాట ఎక్స్‌ట్రార్డినరీ. ఈ పాట తయారీ వెనుక చిన్న కథ ఉంది. సాహిత్యం రాస్తే బాణీ కడతానని కీరవాణిగారు, లేదు లేదు... ముందు బాణీ ఇచ్చేసేయమని శాస్త్రిగారు చాలాసేపు చిన్నపిల్లల్లా వాదులాడుకున్నారు. శాస్త్రిగారు పుస్తకాల బీరువాలో ఆయన రాసిన ‘‘కృష్ణా నిన్ను చేరింది... అష్టాక్షరిగా మారింది... ఎలా ఇంత పెన్నిధి... వెదురు తాను పొందింది...’’ అనే కవిత కనబడింది. ఈ కవిత ప్రేరణతో పాట రాయమని శాస్త్రిగారిని అడిగితే ఈ పాట రాసిచ్చారు. ‘నేనున్నాను’ విజయంలో ఈ పాట పాత్ర ఎంత ఉందో అందరికీ తెలుసు. కె. విశ్వనాథ్‌గారి లాంటి మహానుభావుడు ఈ పాట గురించి నన్ను చాలా మెచ్చుకున్నారు.’’

 - వి.ఎన్ ఆదిత్య

 

నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని... గాయం‘స్వయంవరం’ సినిమాకి మొదట నేనే దర్శకుణ్ణి. అప్పుడు సీతారామశాస్త్రిగారితో పాటలు రాయించుకున్నా. ఆ తర్వాత నేను బయటికొచ్చేశా. సీతారామశాస్త్రిగారితో పాటలు రాయించుకునే అదృష్టం తర్వాత నాకు కలగలేదు. ఆయన పాటలన్నీ నా కిష్టమే. ముఖ్యంగా ‘సిరివెన్నెల’ పాటలు. ‘గాయం’లోని ‘నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని’ పాటను మాత్రం లెక్కలేనన్ని సార్లు విన్నా. ఎప్పుడు విన్నా రోమాలు నిక్కబొడుచుకుంటాయి.’’

 - చంద్రసిద్ధార్థ్

 

బోటనీ పాఠముంది... మేటనీ ఆట ఉంది... శివ‘‘నేను సిక్త్స్ క్లాస్‌లో ఉండగా ‘శివ’ రిలీజైంది. ‘బోటనీ పాఠముంది... మేటనీ ఆట ఉంది..’ పాటకు చాలా బాగా కనెక్ట్ అయిపోయా. పాట అంటేనే తెలీని నాకు అప్పటి నుంచీ పాటతో పరిచయం మొదలైంది. సిరివెన్నెల గారి పాటలతోనే పెరుగుతూ వచ్చా. నేను కాలేజ్ ఏజ్‌లో ఉండగా వచ్చిన ‘గులాబి’లోని ‘ఈ వేళలో నీవు ఏం చేస్తు ఉంటావు’ పాట అయితే నా మనసు దోచేసింది. ‘మురారి’లోని పెళ్లి పాట అయితే తెలుగునాట ప్రతి పెళ్లి వీడియోలోనూ కంపల్సరీ అయిపోయింది. ఇలా జీవితంలో ఏ సందర్భం తీసుకున్నా ఆయన పాట ఉండి తీరాల్సిందే. ఆయన మొన్ననే షష్టి పూర్తి ఫంక్షన్ చేసుకున్నారు. కానీ నాకు తెలిసి ఆయనకు పదహారేళ్లే. ‘ఓకే బంగారం’ సినిమాలో ‘మెంటల్ మది’ పాట వింటే ఆయన మది ఎంత యూత్‌లో ఉందో అర్థమవుతుంది. ప్రస్తుతం నేను నాగార్జున-కార్తీలతో తీస్తున్న సినిమాకు అన్ని పాటలూ ఆయనే రాస్తున్నారు.’’

 - వంశీ పైడిపల్లి

 

ఎవరో ఒకరు ఎపుడో అపుడు... అంకురం‘‘గాంధీ ఫిలాసఫీని అద్భుతంగా ఒడిసిపట్టిన పాట ఇది. ఏ ప్రయాణమైనా, ఏ పోరాటమైనా ఒక్క మనిషితోనే మొదలవుతుంది. అది నువ్వే కావాలి... ఆ తర్వాత మిగతా వారంతా నిన్ను అనుసరిస్తారు. ఇలా ఉద్బోధిస్తూ, ఉత్తేజపరుస్తూ ‘ఎవరో ఒకరు...’ పాట రాశారు శాస్త్రి. ఇప్పటికీ, ఎప్పటికీ ఇన్‌స్పైరింగ్ సాంగ్. నేను డెరైక్ట్ చేసిన ‘శ్రీకారం’లో కూడా ‘మనసు కాస్త కలతపడితే మందు ఇమ్మని మరణాన్ని అడగాలా?...’ అంటూ మంచి పాట రాశారు.’’

 - సి.ఉమా మహేశ్వరరావు

 

ఎందుకే ఇలా గుండె లోపల... సంబరం ‘ఈ పాట కోసం 20 పేజీల నోట్స్ రాసుకు న్నారు. హీరో మనసులోని భావ సంచలనాన్ని అణువణువునా ఈ పాటలో ఆవిష్కరించారు. ‘చెంతే ఉన్నా సొంతం కావని నిందించే కన్నా నన్నే నేను వెలివేసుకుని దూరం అవుతున్నా’ లాంటి గొప్ప వాక్యాలు రాశారు.’’    - దశరథ్

 

గోపికమ్మ... చాలును లేమ్మా... ముకుంద

 

‘ముకుంద’లో పాటలన్నీ గురువుగారివే. ముఖ్యంగా ‘గోపికమ్మ’ పాట హైలైట్. ధనుర్మాసంలోని పాశురాలను ఒక పాటలో ఒదిగేటట్టు రాయడం శాస్త్రిగారికే చెల్లింది. ఆయన పాటల్లో నేను ఎక్కువగా వినేది ‘సిరివెన్నెల’లోని ‘ఆది భిక్షువు వాడినేది కోరేది’.    - శ్రీకాంత్ అడ్డాల

 

సంభాషణ: పులగం చిన్నారాయణ


 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top