ఆడువారం కాదు ఆడించేవారం కావాలి

Special chit chat with uttam kumar reddy wife padamavathi - Sakshi

ఆకాశంలో సగం అంటారు. నేల మీద ఇవ్వడానికి ఇంత రాద్ధాంతమా?అయినా రిజర్వేషన్‌ అనేది ఒకరు ఇవ్వడమేంటి? అది మహిళల హక్కు కదా! ఆడవాళ్లకు అధికారం ఇచ్చినప్పుడల్లా ‘వెనక మగవాళ్లు ఉంటారు’ అంటారు! పేరు మాది.. పరపతి వాళ్లదా? ఇది మారాలి. మేము ఆడువారుగా మిగిలిపోకూడదు. అభివృద్ధి మర ఆడించేవారం కావాలి.

ఆడవాళ్లు ఇండిపెండెంట్‌గా ఉండాలి అనే ఆలోచన, ఆచరణ  ఉన్న కుటుంబ నేపథ్యం మాది.   అమ్మ (ఉమాదేవి రెడ్డి) వాళ్లది గద్వాల్‌ సంస్థానం. సంస్థానంలో ఆడపిల్లలకు  పన్నెండో తరగతి వరకే చదివే వెసులుబాటు ఉండేది. ఆ సంప్రదాయాన్ని సవాలు చేస్తూ మా అమ్మ ఆ టైమ్‌లోనే  హంగర్‌ స్ట్రయిక్‌ చేసింది. డిగ్రీ చదవాలని. స్ట్రయిక్‌ సక్సెస్‌ అయింది. డిగ్రీ కోసం అమ్మ హైదరాబాద్‌ వెళ్లింది. సంస్థానం రూల్‌ బ్రేక్‌ అయిపోవడంతో  మా అమ్మ వాళ్ల కజిన్‌ ముదితారెడ్డి ఫస్ట్‌ ఫిమేల్‌ ఇంజనీరింగ్‌ గ్రాడ్యుయేట్‌ ఫ్రమ్‌ ఉస్మానియా యూనివర్సిటీ క్రెడిట్‌ సాధించింది. నాన్న (ధనుంజయ్‌ రెడ్డి) వాళ్లవైపూ అంతే. మాకు ఆరుగురు మేనత్తలు. మా తాత  ఆడపిల్లలకు కచ్చితంగా ఉన్నత చదువులు ఉండాలని ఆరాటపడేవారు. ఊళ్లోని ఆడపిల్లల తల్లిదండ్రులకు నమ్మకం పెరగడానికి  మా మేనత్తలను హాస్టల్లో ఉంచి చదివించారు.  ఆడవాళ్లు సొంతంగా ఆలోచించాలి.. స్వతంత్ర నిర్ణయాలు తీసుకోవాలనే ప్రొగ్రెసివ్‌ థాట్స్‌ మా కుటుంబంలో అప్పటి నుంచే ఉన్నాయని చెప్పడానికి ఈ ప్రస్తావన. మా పేరెంట్స్‌ ఇద్దరూ స్ట్రాంగ్‌ ఫెమినిస్ట్స్‌.  మేం ముగ్గురం ఆడపిల్లలమే. అయ్యో కొడుకు లేడే అని అమ్మానాన్నా  ఎప్పుడూ దిగులు పడలేదు. అసలు అలాంటి ఆలోచనే చేయలేదు.  మా ఇంట్లో జెండర్‌ మోరల్స్‌ లేవు. మా నాన్న వంట చేస్తారు.. మా అంకుల్స్‌ వంట చేస్తారు. ఫలానా పని ఆడపిల్లలు చేయాలి.. ఫలానా పని మగపిల్లలు చేయాలి అన్న విభజన లేదు. ఇవన్నీ  మమ్మల్ని స్ట్రాంగ్‌ విమెన్‌గా తీర్చిదిద్దాయి. 

షుడ్‌ బీ ఎ గుడ్‌ సిటిజన్‌.. 
అమ్మా, నాన్న ఇద్దరూ జిడ్డు కృష్ణమూర్తి ఫాలోవర్స్‌. దానివల్లా.. ప్లస్‌ నాన్న ( ఫారెస్ట్‌ ఆఫీసర్‌) ట్రాన్స్‌ఫర్స్‌ వల్లా  మా చదువుకి ఇబ్బంది కలగకూడదని మమ్మల్ని రిషీవ్యాలీ స్కూల్లో చేర్పించారు. ఇంట్లో కాని, స్కూల్లో కాని మాకు పోటీతత్వం కన్నా బాధ్యతను నేర్పారు. వందకు నలభై మార్కులు వచ్చినా, వందకు ఎనభై మార్కులు వచ్చినా అదే క్యాడ్‌బర్రీ చాక్‌లెట్‌ ఇచ్చేవారు. గుడ్‌ అంటూ వెన్ను తట్టేవారు. షుడ్‌ బీ ఎ గుడ్‌ సిజిజన్‌ ఫ‹స్ట్‌. సామర్థ్యం మేరకు  పని చేసుకుంటూæ వెళ్లిపోవడమే.. ఫలితం గురించి ఆలోచించకూడదు అని చెప్పేవారు. అదే మనసులో నాటుకుపోయింది.. అలవాటుగా మారింది. పర్సనాలిటీగా డెవలప్‌ అయింది. అందుకే ఎవరు ఏ కామెంట్‌ చేసినా పట్టించుకోను. దానికి సమాధానం చెప్తూ కూర్చుంటే చేస్తున్న పని కుంటుపడుతుంది.  ఇంట్లో దేనికీ రిస్ట్రిక్షన్‌ ఉండేది కాదు. ఎంత స్వేచ్ఛనిచ్చేవారంటే చదువు, వేసుకునే బట్టలు, లైఫ్‌ పార్ట్‌నర్‌ అన్నీ మా చాయిసే. ఆరింటికల్లా ఇంటికి వచ్చేయాలి, బాయ్స్‌తో మాట్లాడొద్దు అన్న కట్టుబాట్లు,నియమనిబంధనలు ఉండేవి కావు. బస్సుల్లో తిరిగేదాన్ని. బైక్‌ రైడింగ్, కార్‌ డ్రైవింగ్‌ చేసేదాన్ని. అమ్మానాన్న   మా స్పేస్‌ను గౌరవించేవారు.  ఈ విషయంలో మా పేరెంట్స్‌కి లాట్స్‌ ఆఫ్‌ థాంక్స్‌. నాన్నెప్పుడూ ఒకే మాట చెప్పేవారు.. చెప్తారు కూడా.. ‘‘నీకు నువ్వే జవాబుదారీ. ఇంకెవరికీ కాదు. నీకు నీ పట్ల డౌట్‌ ఉండకూడదు.  నమ్మకం ఉండాలి. నీ ఆలోచనలు, ఆచరణ నీకు కరెక్ట్‌ అనిపిస్తే చాలు  సొసైటీని కన్విన్స్‌చేయాల్సిన అవసరం లేదు’ అని. ఆ మాటనే ఇప్పటికీ ఫాలో అవుతాను. అమ్మానాన్న,  రిషీ వ్యాలీలో వాతావరణమే నాకు ఇన్సిపిరేషన్‌.

ఉత్తమ్‌తో సాహచర్యం..
ఉత్తమ్‌ వాళ్ల ఫాదర్‌ పురుషోత్తమ్‌ మామయ్య, మా నాన్న ఇద్దరూ చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్‌. అట్లా మా రెండు కుటుంబాలకు ముందు నుంచే పరిచయం, రాకపోకలు, ఫ్రెండ్‌షిప్‌ ఉన్నాయి.  ఉత్తమ్‌ ప్రపోజ్‌ చేశారు.  ఇంట్లో వాళ్లూ ఓకే అన్నారు. పెళ్లయిపోయింది.  మా ఇద్దరిదీ సర్వీస్‌ ఓరియెంటెడ్‌ మనస్తత్వమే.  ఎయిర్‌ఫోర్స్‌  తర్వాత ఉత్తమ్‌కు  రాష్ట్రపతి భవన్‌లో ఏడీసీగా జాబ్‌ ఇచ్చారు. ఆయన దాంట్లో.. నేను  ఆర్కిటెక్ట్‌గా ఎవరి పని వాళ్లం చేస్తూ పోయాం.  

వారసత్వం..
ఆ మాట చాలా విచిత్రంగా అనిపిస్తుంది మాకు. మనం చేసిన పనుల ఫలితం, ఇన్సిపిరేషన్‌ను మించిన లెగసీ ఏముంటుంది? పిల్లలు, వారసత్వం గురించి ఇప్పటి వరకు మమ్మల్ని ఎవరూ అడగలేదు. ఈవెన్‌ మా ఫ్యామిలీస్‌లో కూడా. ఫస్ట్‌ టైమ్‌ మీ నుంచే వింటున్నా. మా వాళ్లకు మా పర్పస్‌ ఏంటో తెలుసు. అది ఫుల్‌ఫిల్‌ కావాలనే విష్‌ చేస్తారు తప్ప ఇంకేమీ ఆలోచించరు.అయినా పిల్లలుంటేనే తల్లిదండ్రులు.. లేకుంటే కాదు అనేమీ రూల్‌ లేదు కదా.. బాధ్యత ఫీలయ్యే ప్రతివాళ్లలో పేరెంట్స్‌ ఉంటారు. 

సాధించాల్సినవి.. 
లోకల్‌బాడీస్‌లో మహిళలకు యాభై శాతం రిజర్వేషన్‌ ఉంది. అయినా ఇంకా పూర్తిస్థాయి చైతన్యం రాలేదనిపిస్తుంటుంది. మీటింగ్స్‌కి ఆయా స్థానాల్లో ఉన్న ఆడవాళ్ల తరపున మగవాళ్లే హాజరవుతుంటారు. అది నా కంటపడ్డప్పుడల్లా చెప్తుంటా.. ఆడవాళ్లే రావాలి అని. మహిళలు తన నిర్ణయాలు తాను తీసుకునేలా ఎంపవర్‌ కావాలి. విధాన నిర్ణాయక శక్తిగా ఎదగాలి.  గ్రామ స్థాయి నుంచి పట్టణం దాకా ప్రతిచోట  మహిళల సేఫ్టీ, హెల్త్‌ గవర్నమెంట్‌ ప్రయారిటీ కావాలి. మొబైల్‌ క్లినిక్, మహిళా కౌన్సిలర్లు ఇలా ప్రతిచోటా హైలెవెల్‌ టీమ్‌ ఒకటి ఉండాలి. వాటి సాధన మీదే నా ఫోకస్‌.  అన్నీ చేసుకోగల శక్తి ఉన్నవాళ్లకంటే ఏమీ చేసుకోలేని నిస్సహాయులకు  సాయం చేయడానికి ముందుకొస్తా.  నీడీ పీపుల్‌కి హెల్ప్‌ చేస్తే వచ్చే ఆత్మసంతృప్తే వేరు. ఆర్కిటెక్ట్‌.. ఎంట్రప్రెన్యూర్‌.. పొలిటీషియన్‌.. సందర్భాన్ని బట్టి ఆయా రోల్స్‌లో హండ్రెడ్‌పర్సెంట్‌ ఎఫర్ట్స్‌పెట్టాను. పెడ్తాను. సో.. అన్నీ ఇష్టమైన రెస్పాన్స్‌బులిటీసే. బేసిగ్గా నేను కర్మయోగిని.

చిన్నప్పుడు కోపంతో  మేం అరుస్తుంటే మా అమ్మ మమ్మల్ని తిట్టకుండా తన కోపమే తన శత్రువు అంటూ పద్యాలు చదివేది. అప్పుడు అది మాకు ఫన్నీగా అనిపించేది కాని తర్వాత అర్థమైంది  దాని ఎఫెక్ట్‌ ఎలాంటిదో (నవ్వుతూ).  

పద్మావతి హైదరాబాద్‌ జేఎన్‌టీయూలో ఆర్కిటెక్చర్‌ చదివారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని ఎన్నో ఇన్‌ఫ్రాక్చర్‌ ప్రాజెక్ట్స్‌లో పనిచేశారు. హైదరాబాద్‌లోని ఫెర్నాండేజ్‌ ఆసుపత్రి ఆమె చేపట్టిన నిర్మాణమే. ఇలాంటివింకా అనేకం. ఇంజనీరింగ్‌ విద్యార్థులెందరికో మార్గదర్శిగా ఉన్నారు. వొకేషనల్‌ ట్రైనింగ్‌ ప్రొగ్రామ్స్‌ను నిర్వహిస్తుంటారు. మహిళా స్వయం సహాయక బృందాలకూ శిక్షణా తరగతులను ఏర్పాటు చేస్తుంటారు. 

– ఇంటర్వ్యూ: సరస్వతి రమ

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top