గూడు చెదిరిన పిచుక కోసం

Sparrows Are Becoming Extinct Due To Pollution - Sakshi

కాలుష్యం వల్ల పిచ్చుకలు అంతరించిపోతున్నాయి. గ్లోబల్‌వార్మింగ్‌కి ఇదో సూచిక అని పర్యావరణ మేధావులు హెచ్చరిస్తున్నారు. అది విని ఎవరికి వారు చింతిస్తున్నారు. కాని ఆ తర్వాత తీరికలేని పనుల్లో పడి ఆ విషయాన్ని మర్చిపోతున్నారు. అయితే యాభైఏడేళ్ల రాకేష్‌ ఖత్రీ మాత్రం ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నాడు. ఢిల్లీవాసి అయిన రాకేష్‌ ఖత్రీ ఇప్పుడు దేశమంతటా పిచ్చుక గూళ్లు ఏర్పాటు చేయాలని, పిచ్చుకలను కాపాడాలని కంకణం కట్టుకున్నాడు.

స్కూళ్లలోనూ, గృహసముదాయాల్లోనూ వర్క్‌షాపులను ఏర్పాటు చేస్తూ పిచ్చుకల కోసం గూళ్లను నిర్మిస్తున్నాడు. ‘చిన్నప్పుడు స్కూల్‌ నుంచి ఇంటికి రాగానే టెర్రస్‌ మీదకు పరిగెత్తేవాడిని. అక్కడ మా స్నేహితులతో కలిసి పక్షులకు గింజలు వేసేవాణ్ణి. వాటితో ఎంత సమయం గడిచేదో కూడా తెలిసేది కాదు. కొన్ని రోజులయ్యాక పిచ్చుకలు మా ఇంటి బాల్కనీల్లో, కిటికీల్లో, స్విచ్‌బోర్డుల్లో గూళ్లు కట్టుకునేవి. ఆ గూళ్లను, అవి కట్టుకునే విధానాన్నీ గమనిస్తూ ఉండేవాడిని’ అని తన చిన్ననాటి రోజులను గుర్తు చేసుకుంటారు రాకేష్‌.

భవిష్యత్తు తరానికి పిచ్చుకేది?
‘పిచ్చుక గూడు ఓ జ్ఞాపకమే కానుందా.. ఈ విషయం అర్ధమయ్యాక ఆవేదనే మిగిలింది’ అంటాడు రాకేష్‌. మీడియాలో పనిచేసే ఖత్రీ 2008లో చేస్తున్న ఉద్యోగాన్ని విడిచిపెట్టి కృత్రిమ గూళ్లు నిర్మించడం ద్వారా పిచ్చుకల సంరక్షణ కోసం పని చేయడం మొదలుపెట్టాడు. ఇప్పటివరకు లక్షకు పైగా గూళ్లు నిర్మించాడు. ప్రతి నెలా నగరం చుట్టూ చల్లడానికి పిచ్చుల కోసం ధాన్యం కొనుగోలు చేస్తుంటాడు. ‘పిచ్చుకల పరిరక్షకుడిని అని చెప్పడం నా ఉద్దేశ్యం కాదు. పిచ్చుకల ప్రాముఖ్యత గురించి భవిష్యత్తు తరానికి అవగాన కల్పించడమే నా లక్ష్యమైంది’ అని చెబుతారు ఖత్రీ.

వర్క్‌షాప్‌ల ద్వారా అవగాహన
నాలుగు ఏళ్ల కిందట తన భార్య మోనికా కపూర్, కొడుకు అనిమేష్తో కలిసి ఎకోరూట్స్‌ ఫౌండేషన్‌ ఏర్పాటు చేశాడు. కుటుంబంతో కలిసి పక్షుల కోసం గూళ్లు తయారుచేసేందుకు వర్క్‌షాప్స్‌ను ఏర్పాటు చేసి యువతరంలో అవగాహన కల్పిస్తున్నాడు. పాఠశాలలు, కార్పొరేట్‌ ఆఫీసులు, గృహసముదాయాలలో ఇప్పటి వరకు రెండున్నర లక్షలకు పైగా వర్క్‌షాపులను నిర్వహించారు. ‘ఆధునిక ఇళ్ల నిర్మాణాలు పిచ్చుకలకు చోటు కల్పించని విధంగా ఉంటున్నాయి. మన పూర్వీకులు ఇంటి పై కప్పు పైన, వాకిళ్లలో గింజలు, పప్పులు ఆరబెట్టుకునేవారు. అవి పిచ్చుకలను ఆకర్షించేవి. ఇప్పుడు.. అన్నీ ప్యాకెట్లలో కొంటున్నాం. బయట గింజలు ఆరబెట్టే పరిస్థితులే లేవు. పిచ్చుకల అదృశ్యానికి ఇది కూడా కారణం’ అంటారు రాకేష్‌.

గూడు కోసం గోడు
ఆహార గొలుసులో పక్షులది ప్రధాన పాత్ర. పత్తి, ఎండిన ఆకులు, గడ్డి వంటి వ్యర్థాలను గూళ్లుగా ఉపయోగించుకుంటాయి అవి. అందువల్ల వాటి ఉనికి తప్పనిసరి. పిచ్చుకుల ఉనికి అవసరాన్ని చెప్పే వర్క్‌షాప్‌కు హాజరయ్యే వ్యక్తుల సంఖ్యను చూసుకొని వారితో కలిసి వెదురుకర్రలు, గడ్డి, దారాలు, జనపనార సంచులు, రీ సైకిల్‌ టెట్రాప్యాక్‌లు వంటి పరికరాలతో పిచ్చుకగూళ్లు నిర్మించడానికి పూనుకుంటాడు రాకేష్‌. వాటిని అందరికీ పంచుతాడు. దీనికి ముందు కొబ్బరి చిప్పలు, వార్తాపత్రికలు, జనపనార సంచులు.. మొదలై వాటితో పిచ్చుక గూళ్లను తయారు చేయడానికి రోజుల తరబడి ట్రయల్స్‌ వేసి, విఫలమయ్యాడు రాకేష్‌. అనేక గూళ్ల నిర్మాణాలు చేయగా 2012లో ఒక గూడు ఆకారం వచ్చింది. దానినే ఇప్పుడు అందరికీ నేర్పిస్తున్నాడు.

‘ఢిల్లీలో మయూర్‌ విహార్‌ ప్రాంతంలో వంతెన కింద గూడు కట్టుకోవడానికి పిచ్చుకల బృందం ప్రయత్నిస్తున్నట్లు గుర్తించాను. మరుసటి రోజు కొంతమంది కార్మికులు గూడు ఉన్న రంధ్రం వద్ద సిమెంట్‌ చేయడం చూశాను. వాళ్లను అడిగితే ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లి అడగమని పంపించారు. ఆఫీసర్‌ని చాలా ఒప్పించిన తర్వాత అక్కడ గూళ్లు ఏర్పాటు చేయడానికి అనుమతి వచ్చింది. గూళ్లను ఏర్పాటు చేయడంతో కొద్ది రోజుల్లోనే అక్కడకు చాలా పిచ్చుకలు వచ్చాయి’ అని సంబరంగా ఆ సంఘటనను గుర్తుచేసుకుంటారు రాకేష్‌. పిచ్చుకలను కాపాడాలనే అతని అంకితభావానికి లండన్‌లోని హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌ (2008) అంతర్జాతీయ గ్రీన్‌ ఆపిల్‌ అవార్డుతో సహా పలు ప్రశంసాపత్రాలను అందచేసింది. గూళ్లను చేత్తో తయారు చేసే అతి ఎక్కువ వర్క్‌షాప్‌లను నిర్వహించినందుకు ఈ ఏడాది లిమ్కాబుక్‌ ఆఫ్‌ రికార్డ్‌లో చేరారు రాకేష్‌ఖత్రీ.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top