సిరిధాన్యాలను ఇప్పుడైనా విత్తుకోవచ్చు!

small grains Cereals can be sown anytime - Sakshi

స్ప్రింక్లర్లుంటే రబీలోనూ సాగు చేసుకోవచ్చు

అటవీ చైతన్య ద్రావణంతో ఆరు నెలల్లో బంజరు భూమినీ సారవంతం చేయొచ్చు

‘సాక్షి’తో ముఖాముఖిలో అటవీ వ్యవసాయ నిపుణులు డాక్టర్‌ ఖాదర్‌ వలి

ఆరోగ్య సిరులను అందించే సిరిధాన్య పంటలను వర్షాకాలంలో నీటి వసతి లేని బంజరు భూముల్లోనూ సాగు చేయవచ్చని, స్ప్రింక్లర్లు ఏర్పాటు చేసుకుంటే ఈ కాలంలో కూడా నిశ్చింతగా సాగు చేసుకోవచ్చని అటవీ వ్యవసాయ నిపుణుడు, స్వతంత్ర ఆహార – ఆరోగ్య నిపుణుడు డా. ఖాదర్‌ వలి(మైసూర్‌) తెలిపారు. ఇటీవల రంగారెడ్డి జిల్లా షాబాద్‌లో ధ్యానహిత హైస్కూల్‌లో జరిగిన సదస్సులో పాల్గొనడానికి వచ్చిన ఆయన ‘సాక్షి’తో ముచ్చటించారు.

కొర్రలు, సామలు, ఊదలు, అండుకొర్రలు, అరికలను అనుదినం ప్రధాన ఆహారంగా తింటూ కషాయాలు తాగుతూ వేలాది మంది సంపూర్ణ ఆరోగ్యాన్ని సంతరించుకుంటున్నారని.. ఈ దశలో రైతులు ఈ సిరిధాన్యాలను విరివిగా సాగు చేయటం అవసరమని ఆయన అన్నారు. అయితే, ఎప్పుడు విత్తుకున్నా.. కోత సమయంలో వర్షాలు లేకుండా ఉండేలా  జాగ్రత్తపడాలన్నారు. పొలంలో స్ప్రింక్లర్లు ఉండి, కోత కోసిన పనలు వర్షానికి తడవకుండా దాచుకోవడానికి తగినంత పెద్ద గోదామును సమకూర్చుకోగలిగిన రైతులు ఏ కాలంలోనైనా సిరిధాన్యాలను సాగు చేయవచ్చన్నారు.

అండుకొర్రలు 70–80 రోజుల పంటైతే అరికలు 6 నెలల పంట. ఫిబ్రవరిలోగానే అన్ని పంటలూ చేతికి వచ్చేలా, అందుకు తగిన పంటలను మాత్రమే వేసుకోవాలన్నారు. 5 ఎకరాలున్న రైతు ప్రతి ఎకరంలోని 75 సెంట్లలో ఒక రకం సిరిధాన్యం సాగు చేస్తూ.. మిగతా 25 సెంట్లలో పప్పుధాన్యాలు, నువ్వు, కుసుమ వంటి నూనెగింజ పంటలతోపాటు బంతి, ఆముదం మొక్కలను సాళ్లు సాళ్లుగా విత్తుకోవాలన్నారు. అప్పుడు ఆ 5 ఎకరాల్లో 5 రకాల సిరిధాన్యాలతోపాటు మధ్యలో ఇతర పంటలు వేసుకోవాలన్నారు.  

స్ప్రింక్లర్లతో వారానికో తడి చాలు..
వారానికోసారి 25–30 నిమిషాల పాటు సాయంత్ర వేళలో స్ప్రింక్లర్లతో నీటిని చల్లుకునే అవకాశం కల్పించుకోగలిగిన రైతులు ప్రస్తుత రబీ పంట కాలంలో కూడా సిరిధాన్యాలను నిశ్చింతగా సాగు చేసుకోవచ్చని డా. ఖాదర్‌ అన్నారు. రసాయనిక ఎరువులు, పురుగుమందులు వాడనవసరం లేదన్నారు. పశ్చిమ కనుమల్లో నుంచి తెచ్చిన కోటానుకోట్ల జాతుల సూక్ష్మజీవ రాశితో కూడిన ‘అటవీ చైతన్య’ ద్రావణాన్ని సాయంత్ర వేళలో పంట భూమిపై పిచికారీ చేస్తే సిరిధాన్యాలతోపాటు పప్పుధాన్యాలు, నూనెగింజలను ఒకే పొలంలో పక్కపక్కనే సాళ్లుగా విత్తుకొని సాగు చేసుకోవచ్చని తెలిపారు.

బంజరు భూమినీ సారవంతం చేయొచ్చు
రాళ్లతో నిండిన బంజరు భూమిపై అయినా వారానికోసారి సాయంత్ర వేళలో అటవీ చైతన్యాన్ని పిచికారీ చేస్తే 3 నెలల్లోనే ఆ భూమి సారవంతంగా పంటల సాగుకు అనుగుణంగా మారుతుందన్నారు. ఎండ తగలని సాయంత్ర సమయాల్లోనే అటవీ చైతన్య ద్రావణాన్ని పిచికారీ చేయాలన్నారు. ఇందులోని సూక్ష్మజీవ రాశి భూమి లోపలికి చొచ్చుకువెళ్లి భూమిని సారవంతం చేస్తాయన్నారు. తాను మైసూరు దగ్గరలో 8 ఎకరాల బంజరు భూమిని తీసుకొని ఈ పద్ధతుల్లో అనేక ఏళ్లుగా సిరిధాన్యాలు, ఇతర పంటలు పండిస్తున్నామని, ఎవరైనా సందర్శించవచ్చన్నారు. అటవీ చైతన్యం లీటరు తీసుకున్న రైతు 21 రోజులకోసారి తిరిగి తయారు చేసుకుంటూ జీవితాంతం వాడుకోవచ్చని, ఇతర రైతులకూ పంపిణీ చేయవచ్చన్నారు. పావు కేజీ సిరిధాన్యాల పిండి, 50 గ్రాముల బెల్లం/తాటి బెల్లంతో పాటు ఒక లీటరు అటవీ చైతన్య ద్రావణాన్ని 20 లీటర్ల నీటి కుండలో కలిపి.. వారం రోజులు పులియబెడితే.. అటవీ చైతన్యం తయారవుతుంది.

పందులను పారదోలే సరిహద్దు పంటగా అరిక
అరికల పంటను పొలం చుట్టూ 15 అడుగుల వెడల్పున సరిహద్దు పంటగా వేసుకుంటే.. అడవి పందుల నుంచే కాకుండా ఏనుగుల బారి నుంచి పంటలను కాపాడుకోవచ్చని డా. ఖాదర్‌ తెలిపారు. అరిక ఆకుల నుంచి వెలువడే ప్రత్యేక వాసనలు జంతువులను పంట పొలాల దరి చేరకుండా చూస్తాయన్నారు.

అందుబాటులో అటవీ చైతన్య ద్రావణం
రంగారెడ్డి జిల్లా షాబాద్‌లోని ధ్యానహిత హైస్కూల్‌ ఆవరణలో రైతులకు అటవీ చైతన్య ద్రావణాన్ని లీటరు చొప్పున డా. ఖాదర్‌ పంపిణీ చేశారు. అటవీ చైతన్యం కోసం షాబాద్‌ ధ్యానహితకు చెందిన దత్తా శంకర్‌(86398 96343)ను లేదా మైసూరుకు చెందిన అటవీ కృషి నిపుణుడు బాలన్‌ కృష్ణన్‌(97405 31358)ను సంప్రదించవచ్చు.


 రైతుకు అటవీ చైతన్య ద్రావణం సీసాను అందజేస్తున్న డా. ఖాదర్‌ వలి

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top