పోషక ధాన్యాలు..ఏటా మూడు పంటలు!

Special Story Of Small Grains Cultivation Techniques - Sakshi

చిరుధాన్యాల(పోషక ధాన్యాల)పై విజయనగరం ఎ.ఆర్‌.ఎస్‌.లో 65 ఏళ్లుగా పరిశోధనలు

ప్రతికూల వాతావరణాన్ని తట్టుకొని ఎటువంటి పరిస్థితుల్లో అయినా స్థిరమైన దిగుబడినివ్వడంతోపాటు అధిక పోషక విలువలు కలిగి ఉన్నందున చిరుధాన్య పంటలు రైతులు, వినియోగదారులు, వ్యవసాయ శాస్త్రవేత్తలను ఇటీవల కాలంలో అధికంగా ఆకర్షిస్తున్నాయి. అందువల్లనే మిల్లెట్స్‌ పేరు ‘పోషక ధాన్యాలు’ (న్యూట్రి గ్రెయిన్స్‌)గా, ‘సిరిధాన్యాలు’గా మారిపోయింది. కరువు కాలాల్లోనూ మెట్ట పొలాల్లో నాలుగు వర్షాలొస్తే పండే పంటలివి. ఇవి మన ప్రాంతానికి కొత్త పంటలేవీ కాదు. అయితే, ప్రజల్లో ఆరోగ్యదాయకమైన ఆహారంపై చైతన్యం పెరుగుతున్నకొద్దీ సిరిధాన్యాలు పండించే బక్కచిక్కిన మెట్ట రైతులు ఫోకస్‌లోకి వస్తున్నారు. వాళ్లు పండించగలిగిన ఈ పంటలకు గౌరవంతోపాటు గిరాకీ కూడా పెరుగుతోంది. సంపన్న రైతులు, డెల్టా రైతులు కూడా వీటి వైపు చూస్తున్నారు. విజయనగరంలోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం(ఎ.ఆర్‌.ఎస్‌.) గత 65 ఏళ్లుగా పరిశోధనలు చేస్తున్నది. ఏడాదిలో మూడు పంటలూ పండించుకోవచ్చని, పప్పుధాన్యాలు, నూనె గింజలతో కలిపి కూడా పండించుకోవచ్చని డా. పాత్రో చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాల రైతులందరికీ ఉపయోగపడే చిరుధాన్యాల సాగు పద్ధతులు, మేలైన విత్తన రకాలు తదితర వివరాలు.. ఈ వారం ‘సాగుబడి’ పాఠకులకు ప్రత్యేకం.. 

తొమ్మిదెకరాల విస్తీర్ణంలో విజయగరం జిల్లా గాజులరేగలోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం(ఎ.ఆర్‌.ఎస్‌.) చిరుధాన్యాల (పోషక ధాన్యాల / సిరిధాన్యాల) రైతుల సేవకు చిరునామాగా మారింది. 1954 నుంచి రాగులు, కొర్రలు, సామలు, అండుకొర్రలు, ఊదలు, అరికలు, ఒరిగెలు వంటి పంటలపై విస్తృతంగా పరిశోధనలు జరుగుతున్నాయి. ఖరీఫ్, రబీ, వేసవి కాలాల్లో మూడు పంటలు పండిస్తూ.. ఏటా 15–20 టన్నుల నాణ్యమైన చిరుధాన్యాల విత్తనోత్పత్తి చేస్తున్నారు. రైతులకు ఇచ్చేటప్పుడు ఎటువంటి తెగుళ్లు సోకని బ్రీడ్‌ ఇవ్వాలి కాబట్టి ప్రతీది ఇక్కడ పరీక్ష జరిపిన తరువాతనే రైతుకు అందిస్తారు. విత్తనాలను ఉభయ తెలుగు రాష్ట్రాలతోపాటు ఒరిస్సా, పశ్చిమబెంగాల్, చత్తీస్‌ఘడ్‌ వంటి పొరుగు రాష్ట్రాల్లో రైతులకు కూడా సరఫరా అవుతున్నాయి. 33 వ్యవసాయ పరిశోధన స్థానాల్లోకెల్లా విజయనగరం ఎ.ఆర్‌.ఎస్‌.కు ఉత్తమ పరిశోధనా స్థానంగా 2016లో అవార్డు దక్కింది. ఇక్కడ అయిదుగురు సైంటిస్టులున్నారు. 

విజయగరం ఎ.ఆర్‌.ఎస్‌.

చిరుధాన్య పంటలన్నీ స్వాభావికంగా నేలలో ఉండే అతి తక్కువ పోషకాలు, వనరులను మాత్రమే ఉపయోగించుకొని ప్రతికూల పరిస్థితులను తట్టుకొని కూడా.. అత్యంత పోషక విలువలున్న పంట దిగుబడులనిస్తాయని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న విజయనగరం ఎ.ఆర్‌.ఎస్‌. అధిపతి, ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్‌ టి. శామ్యూల్‌ సంపత్‌ కుమార్‌ పాత్రో తెలిపారు. డెంకాడ మండలంలో రైతు కుటుంబంలో జన్మించిన ఆయనతోపాటు తోడబుట్టిన వారందరూ శాస్త్రవేత్తలే కావడం విశేషం. 

ఏటా మూడు పంటలు..
చిరుధాన్య పంటలను ఏడాదిలో మూడు కాలాల్లోనూ పండించవచ్చు. జూన్‌–సెప్టెంబర్, అక్టోబర్‌–జనవరి, ఫిబ్రవరి–ఏప్రిల్‌ నెలల మధ్య రాగులు, కొర్రలు, సామలు, అండుకొర్రలు, ఊదలు, అరికలు, ఒరిగెలు సాగు చేసుకోవచ్చని డా. పాత్రో తెలిపారు. పరిశోధనా స్థానంలో చిరుధాన్యాల శుద్ధి కేంద్రం ఈ ప్రాంత గిరిజన, గిరజనేతర రైతులకు సేవలందిస్తోంది. రైతుల బృందాలు, స్వచ్ఛంద సంస్థల ద్వారా రైతులకు చిరుధాన్యాలు, వేరేశనగ బ్రీడర్‌ సీడ్‌ను అందించి.. విత్తనోత్పత్తిలో శిక్షణ ఇస్తున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో రైతులకు సీడ్‌ కొరత లేకుండా చేయగలిగారు. రైతు ఆర్థికంగా నిలదొక్కుకోవాలంటే  వ్యవసాయంతో పాటు కోళ్లు, కూరగాయలు, పండ్ల తోటల పెంపకంతోపాటు చేపల చెరువులు, పశుపోషణ అవసరమని డా. పాత్రో సూచిస్తున్నారు. ఇందుకోసమే మధ్యప్రదేశ్‌ నుంచి కడక్‌నా«ద్‌ కోళ్లను తెప్పించి రైతులకు అందిస్తున్నారు. 

బిస్కెట్లు, చాక్లెట్ల తయారీపై శిక్షణ
రైతులు ముడి చిరుధాన్యాలను తెచ్చుకొని కిలోకు రూ. 5 నుంచి 10 వరకు చెల్లించి ఈ యూనిట్‌లో శుద్ధి చేయించుకోవచ్చు. రెండు రోజుల శిక్షణా శిబిరాల ద్వారా రాగితో బిస్కెట్లు, చాక్లెట్లు తయారు చేయడం నేర్పిస్తున్నారు. ఒక్కొక్కరికీ ఫీజు రూ. 5 వేలు. 30 మంది బ్యాచ్‌గా వస్తే శిక్షణ ఇస్తారు. ఇక్కడ తయారైన బిస్కెట్లను గిరిజన హాస్టల్స్‌లో విద్యార్థులకు అందిస్తున్నారు. హోం సైన్స్‌ నిపుణురాలు ఇటీవల నియమితులవడంతో ఈ సేవలను మరింత విస్తరించనున్నామని డా. పాత్రో తెలిపారు. అండుకొర్ర, కొర్ర, సామ, ఊద, రాగి విత్తనాలు అందుబాటులో ఉన్నాయి. వివరాలకు.. 96765 86576, 08922–225983.

ఒండ్రు నేలలకు కొర్ర కయ్య
ప్రపంచవ్యాప్తంగా అధికంగా పండించే చిరుధాన్యాల పంటల జాబితాలో రెండోది కొర్ర. తక్కువ వర్షపాతం ఉండే ప్రాంతాల్లోనూ పెరుగుతుంది. కొర్ర పంటకు ఖరీఫ్‌లో ప్రత్యేకంగా నీరు పెట్టాల్సిన అవసరం లేదు. నాలుగు వర్షాలు పడితే చాలు. ఎక్కువగా వర్షాభావ పరిస్థితులుంటే, నాటిన 35–30 రోజుల్లో మొదటి తడి, 40–45 రోజుల్లో రెండో తడి ఇస్తే పంట దిగుబడి పెరుగుతుంది. మంచి డ్రైనేజీ సదుపాయం గం ఒండ్రు నేలలు బాగా అనుకూలం. నీరు నిలువ ఉండే నేలలు అనుకూలించవు. అధిక నీటి ఎద్దడిని తట్టుకోలేదు. ఏపీలో జూలైలో విత్తుతారు. 

విత్తే పద్ధతి : వరుసల మధ్య 25–30 సెం.మీ. దూరం ఉంచాలి. వరుసలో మొక్కల మధ్య 8–10 సెం.మీ. దూరం ఉంచాలి. వరుసలలో నాటడానికి 8–10 కిలోలు/హెక్టారుకు, వెదజల్లడానికి 15 కిలోలు/హెక్టారుకు విత్తనం కావాలి.

కొర్రలో మేలైన రకాలు : ఎస్‌.ఐ.ఎ. 3085, 3088 (సూర్యనంది), 3156, 3087, 326, లేపాక్షి, నరసింహరాయ, కృష్ణదేవరాయ, పి.ఎస్‌.4 రకాలు అధిక దిగుబడినిచ్చే కొత్త రకాలు. 

ఎస్‌.ఐ.ఎ. 3085 రకం పంట కాలం 80–85 రోజులు. హెక్టారుకు 20–30 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. అగ్గి తెగులు, గింజ బూజు తెగుళ్లను తట్టుకుంటుంది. ఎస్‌.ఐ.ఎ. 3088 (సూర్యనంది) రకం 70–75 రోజుల్లో హెక్టారుకు 20–25 క్వింటాళ్ల దిగుబడినిస్తుంది. ఎస్‌.ఐ.ఎ. 3156 రకం 80–83 రోజుల్లో హెక్టారుకు 23–25 క్వింటాళ్ల దిగుబడినిస్తుంది. 

 కొర్ర రకం బూజు, తుప్పు తెగుళ్లను, నీటి ఎద్దడిని తట్టుకుంటుంది. 80–85 రోజులు పంటకాలం. అత్యధిక దిగుబడినిస్తుంది. పి.ఎస్‌–4  పెద్ద కంకులు, ఎక్కువ పిలకలు పెడుతుంది. టి.ఎన్‌.ఎ.యు. 186 రకం నీటి ఎద్దడిని తట్టుకుంటుంది. ఎక్కువ పిలకలు పెడుతుంది. దిగుబడి మధ్యస్థంగా ఉంటుంది. డి.హెచ్‌.ఎఫ్‌. 109–3 రకం 86–88 రోజుల పంట. అధిక దిగుబడి రకం. నాటడానికి అనుకూలం. పి.ఎస్‌. 4 అన్ని పరిస్థితులనూ తట్టుకుంటుంది. 

కొర్ర+వేరుశనగను 2:1, కొర్ర+కందిని 5:1, కొర్ర+పత్తిని 5:1 (రాయలసీమ ప్రాంతం).. ఈ నిష్పత్తిలో కొర్రలో అంతర పంటలు వేసుకోవచ్చు. 20–40 క్వింటాళ్ల పశుగ్రాసం కూడా లభిస్తుంది. 

అండుకొర్రకు 200 ఎం.ఎం. వర్షం చాలు
విజయనగరం ఎ.ఆర్‌.ఎస్‌.లో 65 ఏళ్లుగా చిరుధాన్యాలపై పరిశోధనలు జరుగుతున్నప్పటికీ.. అండుకొర్ర పంటపై గత ఏడాది నుంచే పరిశోధనలు ప్రారంభించారు. దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి సేకరించిన వంద అండుకొర్ర రకాలను తెచ్చి పరిశోధనలు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాలకు బిటి 6, బిటి 4 అండుకొర్ర రకాలు అనువైనవని గుర్తించినట్లు డా. పాత్రో తెలిపారు. వర్షాకాలంలో అండుకొర్రకు సోకే ఆకు ముడత, పాముపొడ తెగుళ్లు, వేసవి పంటలో వచ్చే తుప్పు తెగులును కూడా ఈ రెండు రకాలు తట్టుకుంటాయి. వీటి పంట కాలం 85 రోజులు. అండుకొర్రలను సాళ్ల మధ్య 60 సెం.మీ., మొక్కల మధ్య 10 సెం.మీ. దూరంలో విత్తుకుంటే మంచిదని, దుబ్బుకు 15–20 పిలకలు వస్తాయి. 

అతితక్కువగా 200 ఎం.ఎం. వర్షపాతం ఉన్నా, భూమిలో నుంచి అతి తక్కువ పోషకాలను మాత్రమే తీసుకొని అండుకొర్ర పెరుగుతుంది. వర్షాకాలంలో నీరు పెట్టాల్సిన పని లేదు. నాలుగు వర్షాలు పడితే చాలు. రబీ, వేసవి కాలపు పంటలకు.. తేలిక నేలల్లో 3–4 తడులు ఇస్తే చాలు. రేగడి నేలల్లో అయితే 3 తడులు చాలు. చిరుధాన్యాల్లో మిగతా పంటలన్నిటికన్నీ తక్కువ వనరులతో పెరిగే పంట అండుకొర్రే. 

ఎకరానికి దుక్కిలో 4 టన్నుల మాగిన పశువుల ఎరువు వేస్తే చాలన్నారు. ఎకరానికి 650 నుంచి 800 కిలోల అండుకొర్ర ధాన్యం దిగుబడి వస్తుంది. ఈ ధాన్యాన్ని మరపట్టిస్తే నికరంగా వచ్చే బియ్యం పరిమాణం పంట కాలాన్ని బట్టి మారుతుంది. ఖరీఫ్‌లో పండిన అండుకొర్రలు వంద కిలోలకు 50 కిలోల బియ్యం వస్తాయి. రబీలో పండినవైతే 45%, వేసవిలో పండినవైతే 40% మాత్రమే బియ్యం వస్తాయి. ఈ గింజలు తేలికగా ఉండటమే కారణం. ఉత్తరాంధ్ర జిల్లాల్లో చిరుధాన్యాలను రెండో పంటగా, వేసవి పంటగా ఎక్కువగా పండిస్తారు. 

నెమళ్లు, టర్కీకోళ్లకు బాగా ఇష్టమైన ఆహారం అండుకొర్ర. పచ్చి / ఎండు గడ్డి కోసం కూడా సాగు చేస్తారు. నిటారుగా గాని, నేలను పాకుతూ పెరుగుతుంది. కాండానికి నేల తగిలిన చోట వేర్లు పుడతాయి. కణుపుల వద్ద కొంచెం నూగు ఉంఉటంది. మెట్ట ప్రాంతంలో ఇసుక కలిసి ఉండే నేలల్లో, ఉదజని సూచిక 5.0– 6.5 ఉన్న భూముల్లో బాగా పండుతుంది. ఇసుక నేలలు, తేలికపాటి నేలల్లో కూడా పెరుగుతుంది. బాగా నీరు ఉండే ప్రాంతంలో లేక ఎడారి ప్రాంతంలో పెరుగుతుంది. పంట కాలంలో రెండు సార్లు వాన పడితే చాలు. అండుకొర్ర అతి త్వరగా పక్వానికి వస్తుంది కాబట్టి పశుగ్రాసంగా కూడా వాడుతారు. హెక్టారుకు 40–50 క్వింటాళ్ల పశుగ్రాసం వస్తుంది. బాగా కరువు సంభవించిన లేదా ఎక్కువ చలికి గురైన అండుకొర్ర గడ్డిని మాత్రం పశువుకు మేతగా వాడరాదని డా. పాత్రో తెలిపారు. అలాంటప్పుడు అండుకొర్ర మొక్కలో నైట్రేట్‌లు విషం స్థాయిలో ఉంటాయన్నారు.  

నేల సంరక్షణకు అండుకొర్ర..
నేలను సంరక్షించుకోవడానికి కూడా అండుకొర్ర పంటను పండించవచ్చు. ఈ పంట వేర్లు నేలకు అల్లుకుపోతాయి. అందువల్ల నేల కోతకు గురికాకుండా ఉంటుంది. అంతేకాదు, లెడ్, జింక్‌ వంటి ధాతువులు తగు మోతాదులో అండుకొర్ర కాండంలో, వేర్లలో ఉంటాయి. అందుచేత ఈ పంటను కలుషితమై సాగుకు యోగ్యం కాకుండా పోయిన నేలలను బాగు చేయడానికి కూడా పండిస్తారు. బాతులు, జింకలు, కివీ పక్షులు,పావురాలు, టర్కీ పక్షులు వంటి వాటికి ఈ గింజలు ఎక్కువగా ఆహారంగా వాడుతారు. 

అండుకొర్ర విత్తనాలు ఆరేళ్లున్నా పాడుకావు
అండుకొర్ర పంటను కర్ణాటకలో రైతులు వరుసలలో వేసుకోవడానికి ఎకరానికి 5 కేజీల విత్తనం వాడుతారు. అండుకొర్రను పొద్దుతిరుగుడు, మొక్కజొన్న, సోయ, చిక్కుడు, బఠాణీతో కూడా కలిపి పండించవచ్చు. వరుసల మధ్య తక్కువ దూరం ఉంటే కలుపును సునాయాసంగా నివారించవచ్చు. అండుకొర్ర పంట 60–70 రోజులకు చేతికి వస్తుంది. విత్తనాలు 6 ఏళ్లు దాచుకున్నా పాడు కావు.

వరికి... ఊద
మన దేశంలోని అనేక రాష్ట్రాల్లో, చైనాలో కూడా ఊద పంటను వరి పంటకు ప్రత్యామ్నాయంగా ఆహార పంటగా పండిస్తున్నారు. ఇతర చిరుధాన్యాలతో పోల్చితే ఊద తక్కువ కాలపరిమితి కలిగిన పంట. ఊదలను అమెరికా, జపాన్‌ దేశాల్లో గడ్డి పంటగా పండిస్తారు. ఇతర చిరుధాన్యాల మాదిరిగానే ఊదలు మనుషులకు, పశువులకు మంచి ఆరోగ్యాన్నిస్తుంది. 
ఖరీఫ్‌లో తేమను పట్టి ఉంచే నేలలు ఊదల సాగుకు అనుకూలం. సమశీతోష్ట, ఉష్ణమండలాల్లో బాగా బతుకుతుంది. అధిక ఉష్ణోగ్రతలను తట్టుకోగలదు. సముద్ర మట్టం నుంచి 2700 మీ. వరకు ఎత్తున్న ప్రదేశాల్లో పెంచుకోవచ్చు. 
వరుసల మధ్య 25 సెం.మీ., మొక్కల మధ్య 10 సెం.మీ. దూరంలో విత్తుకోవాలి. వరుసత్లో విత్తుకోవడానికి హెక్టారుకు 6–10 కిలోలు, వెదజల్లుకోవడానికి 12–15 కిలోల విత్తనం సరిపోతుంది. విత్తనాలు వేసుకునే 2–3 వారాల ముందు మాగిన పశువుల ఎరువు హెక్టారుకు 5 టన్నులు చొప్పున వేసుకోవాలి. డి.హెచ్‌.బి.ఎం.93–3 రకం 90–95 రోజుల పంట. హెక్టారుకు 22–24 క్వింటాళ్ల దిగుబడినిస్తుంది. ఈ రకాన్ని ఏ రాష్ట్రంలో అయినా పండించవచ్చు. 

కో(కెవి) 2, కో–2 రకాలను తమిళనాడులో ఎక్కువ పండిస్తున్నారు. డి.హెచ్‌.బి.ఎం.93–3, డి.హెచ్‌.బి.ఎం. 93–2 కర్ణాటకలో సాగు చేస్తున్నారు. ఆగ్రో బాక్టీరియం, రేడియోబాక్టర్, అస్పర్జిల్లస్‌ అవమోరీతో విత్తన శుద్ధి చేసుకోవాలి. ఊద పంటకు సాధారణంగా నీరు అందించాల్సిన అవసరం తక్కువగా ఉంటుంది. కానీ, వర్షాభావ పరిస్థితులు ఎక్కువ రోజులు ఎదురైనప్పుడు మొదటి తడి నాటిన 25–30 రోజులకు, రెండో తడి కంకి వచ్చే దశ 45–50 రోజులకు ఇచ్చుకోవాలి. రెండుసార్లు అంతరకృషి, ఒకసారి చేతితో మొక్కల మధ్య కలుపు తీస్తే చాలు. ఊద + చిక్కుళ్లను 4:1 నిష్పత్తిలో పండించవచ్చు. పంట పండినప్పుడు వెంటనే పంట కోయాలి. మొక్క మొదలతో కోసుకొని, వారం రోజుల పాటు చేనులో ఉంచి, బాగా ఎండిన తరువాత ఎడ్ల సహాయంతో తొక్కించాలి. పంట దిగుబడి హెక్టారుకు 12–15 క్వింటాళ్లు. గడ్డి 20–25 క్వింటాళ్లు వస్తుంది. 


విజయనగరం ఎ.ఆర్‌.ఎస్‌.లో చిరుధాన్యాల ప్రాసెసింగ్‌ యంత్రాలు 

నీటి ఎద్దడిని అరికడుతుంది
అరిక ఎక్కువగా వేడి , పొడి వాతావరణంలో సాగుకు అనుకూలం. నీటి ఎద్దడిని బాగా తట్టుకునే గుణం ఉండటం వల్ల తక్కువ వర్షపాతం (40–50 సెం.మీ.) కురిసే ప్రాంతాల్లోనూ పండించవచ్చు. లోతైన భూములు, సారవంతమైన నేలలు అనుకూలం. సేంద్రియ ఎరువులు పంట పెరుగుదలకు యోగ్యమైనవి.  

రుతుపవనాలు వచ్చే ముందే విత్తటం లాభదాయం. జూన్‌ మధ్య నుంచి జూలై వరకు నాటుతారు. సాగర్, నాగార్జున, కో–4 అధిక దిగుబడినిచ్చే అరిక రకాలు. వరుసల మధ్య 22.5 సెం.మీ. మొక్కల మధ్య 10 సెం.మీ. దూరం ఉండేలా విత్తుకోవాలి. వరుసల్లో నాటడానికి హెక్టారుకు 10 కేజీలు, వెదజల్లడానికి హెక్టారుకు 15 కేజీల విత్తనం అవసరం. దుక్కిలో హెక్టారుకు 5–7.5 టన్నుల పశువుల ఎరువుతోపాటు జీవన ఎరువులు కలిపి వేసి కలియదున్నాలి. 

అరికలో మంచి రకాలు.. జె.కె.–13 (95–100 రోజులు. హెక్టారుకు 22–33 క్విం. దిగుబడి. కాండపు ఈగ, కాటుక తెగులును తట్టుకుంటుంది), జె.కె.–100 (100–105 రోజులు, హెక్టారుకు 19–20 క్విం. దిగుబడి. కాండపు ఈగ, కాటుక తెగులును తట్టుకుంటుంది), జె.కె.–65 (105–110 రోజులు. హెక్టారుకు 23–25 క్వింటాళ్ల దిగుబడి. కాండపు ఈగ, కాటుక తెగులును తట్టుకుంటుంది), డి.పి.ఎస్‌. 9–1 (105–110 రోజులు. హెక్టారుకు 27–30 క్విం. దిగుబడి. కాండపు ఈగను తట్టుకుంటుంది), ఇందిర కోడో–1 (100–105 రోజులు. హెక్టారుకు 22–25 క్విం. దిగుబడి. ఆలస్యంగా విత్తుకోవడానికి అనుకూలం), చత్తీస్‌ఘడ్‌ కోడో–2 (95–100 రోజులు. హెక్టారుకు 25–26 క్విం. దిగుబడి. పురుగులను తట్టుకుంటుంది). జవహర్‌ కోడో–137 (100–105 రోజులు. హెక్టారుకు 26–29 క్విం. దిగుబడి. అంతర పంటకు కూడా ఉపయోగపడుతుంది. కరువును, కాండపు ఈగను, బూడిద తెగులును తట్టుకుంటుంది). 

అరిక + కంది.. అరిక + మినుము / పెసలు.. అరిక + సోయా పంటలను 2:1 సాళ్లలో అంతర పంటలుగా విత్తుకోవచ్చు. మొదటి తడి నాటిన 30 రోజులకు, రెండో తడి నాటిన 40–45 రోజులకు ఇవ్వాలి. నీటి ఎద్దడి తీవ్రత, నేల రకాన్ని బట్టి ప్రతి 4–7 రోజుల వ్యవధిలో తడి పెట్టాలి. భారీ వర్షాలప్పుడు పొలంలో ఎక్కువ నీరు ఉండకుండా చూసుకోవాలి. 

నీటి నిల్వకు సామవేదం
సామ పంట అధిక ఉష్ణోగ్రతను, నీటి ఎద్దడిని, అధిక నీటినిల్వను తట్టుకుంటుంది. తేలిక నేలలు, ఎర్ర నేలల్లో నేల ఉదజని సూచిక కొద్దిగా ఆమ్లత్వం కలిగిన, తటస్థ నేలలు అనుకూలం. ఏపీలో జూన్‌ మధ్యలో ఖరీఫ్‌ పంట విత్తుతారు. 
ఒ.ఎల్‌.ఎం.–208 (100–105 రోజులు. హెక్టారుకు 12–15 క్విం. దిగుబడి. కాండపు ఈగను తట్టుకుంటుంది), ఒ.ఎల్‌.ఎం.–217 (105–110 రోజులు. హె. 15–16 క్వింటాళ్ల దిగుబడి. తుప్పు తెగులు, విత్తన మసి తెగులును తట్టుకుంటుంది. కొంతవరకు పాముపొడ తెగులును తట్టుకుంటుంది),  జె.కె.–36, బి.ఎల్‌–36(90–95 రోజులు. హె. 12–14 క్వింటాళ్ల దిగుబడి. నీటి వసతి ఉన్న చోట కూడా విత్తుకోవచ్చు), డి.హెచ్‌.ఎల్‌.ఎం.–36–3 (95–100 రోజులు, హె. 14–16 క్వింటాళ్లు దిగుబడి. నెమ్మదిగా పక్వానికి వస్తుంది) రకాలు తెలుగు రాష్ట్రాల్లో మంచి దిగుబడినిస్తాయి. వరుసల మధ్య 22.5 సెం.మీ., మొక్కకు మొక్కకు మధ్య 10 సెం.మీ. దూరం ఉండాలి. వరుసల్లో విత్తడానికి హెక్టారుకు 8 కేజీలు, వెదజల్లడానికి 12 కేజీల విత్తనం కావాలి. జీవన ఎరువులతో విత్తన శుద్ధి చేసుకోవాలి. వర్షాల్లేని కాలంలో మొదటి నీటి తడిని నాటిన 25–30 రోజులకు, రెండో నీటి తడిని నాటిన 45–50 రోజులకు ఇవ్వాలి. సామ+మినుమును 2:1, సామ+నువ్వులు/కందిని 2:1, సామ+కందిని 2:1 నిష్పత్తిలో సామలో అంతరపంటలుగా వేసుకోవచ్చు. 

బెట్టను తట్టుకునే పంట.. రాగి
రాగి పంటను తేలిక, బరువు నేలల్లోనూ సాగు చేయవచ్చు. నీరు నిల్వ ఉండే భూములు పనికిరావు. పునాస బురద చోడి పంటను ఏప్రిల్‌/మే నెలల్లో, ఖరీఫ్‌ పంటను జూన్‌/జూలై మాసాల్లో వర్షాధారంగాను, రబీ పంటను నంవంబర్‌/డిసెంబర్‌ మాసాల్లో నీటి ఆధారంగా సాగు చేసుకోవచ్చు. చంపావతి(వి.ఆర్‌.708) రకం 80–85 రోజుల్లో ఎకరానికి పది క్వింటాళ్ల దిగుబడినిస్తుంది. బెట్టను తట్టుకుంటుంది. అగ్గితెగులును తట్టుకోలేదు. ముందస్తు ఖరీఫ్‌లో బురద చోడిగా ఖరీఫ్‌ వరి సాగుకు ముందు సాగు చేసుకోవచ్చు. భారతి (వి.ఆర్‌.762) రకం అన్నికాలాలకూ పనికి వస్తుంది. 110–115 రోజులు. ఎకరానికి 11–12 క్వింటాళ్ల దిగుబడి. అగ్గితెగులును కొంతరవకు తట్టుకుంటుంది. శ్రీచైతన్య, తెల్లరాగులు (హిమ), సువర్ణముఖి రకాలు సాగులో ఉన్నాయి. వరుసల మధ్య 30 సెం.మీ., మొక్కల మధ్య 8–10 సెం.మీ. దూరంలో వేసుకోవాలి. నారుపోసి నాటుకోవాంటే 2.5 కిలోల విత్తనాన్ని 4 సెంట్ల నారుమడిలో పెంచి, ఎకరం పొలంలో నాటుకోవాలి. నేరుగా వెదజల్లే పద్ధతిలో విత్తుకోవాలంటే ఎకరానికి 3–4 కిలోల విత్తనం అవసరం. ప్రతి 8 వరుసల రాగి పంటకు, రెండు వరుసల కంది పంటను వేసుకుంటే హెక్టారుకు అదనంగా రూ. 5,850 ఆదాయం వస్తుంది. వరి మాగాణుల్లో, వరి కోతకు వారం రోజుల ముందు చోడి విత్తనాలను 24 గంటలు నానబెట్టి, నీడలో ఆరబెట్టి, చల్లుకుంటే ఖర్చు తగ్గుతుంది. 

ఇప్పుడు పెద్ద రైతులూ మా దగ్గరకు వస్తున్నారు!
65 ఏళ్లుగా మా పరిశోధనా కేంద్రంలో చిరుధాన్యాలపై పరిశోధనలు జరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఈ సంవత్సరం వీటి పేరును ‘పోషక ధాన్యాలు’గా మార్చింది. సిరిధాన్యాలను గతంలో చాలా బీద రైతులే పండించేవారు. మా పరిశోధనా స్థానానికి బీద రైతులే వచ్చేవారు. ఇప్పుడు పరిస్థితి మారింది. మైదాన ప్రాంతాల్లో ఉండే పెద్ద రైతులు కూడా కార్లలో వస్తున్నారు. ప్రతీ రైతు తమ పొలంలో మిల్లెట్స్‌ను పండించేందుకు మక్కువ చూపిస్తున్నారు. వీటికి నేడు బాగా డిమాండ్‌ పెరిగింది. వాల్‌మార్ట్‌ కంపెనీ వారు కూడా విజయనగరం వచ్చి సిరిధాన్యాలను కొనుగోలు చేస్తున్నారు. వరి బియ్యం మాదిరిగానే సిరిధాన్యాలకు కూడా కొనుగోలు చేస్తున్నారు. గత ఏడాది నుంచి అండుకొర్రలపై కూడా పరిశోధనలు చేస్తున్నాం. సిరిధాన్యాల మేలైన విత్తనాలను రైతులకు అందిస్తున్నాం. ప్రాసెసింగ్‌ సేవలందిస్తున్నాం. బిస్కెట్లు, చాక్లెట్ల తయారీపై కూడా శిక్షణ ఇస్తున్నాం. 
– డాక్టర్‌ టి. శామ్యూల్‌ సంపత్‌ కుమార్‌ పాత్రో 
(97010 23194), అధిపతి, ప్రధాన శాస్త్రవేత్త, విజయనగరం వ్యవసాయ పరిశోధనా స్థానం

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top