నువ్వూ నేనూ ఒకటే

Review of Aluri Bhairagi Jebu Donga Book - Sakshi

కథాసారం

అకస్మాత్తుగా తన జేబు ఎవరో లాగినట్లయ్యి వెనక్కు తిరిగాడు. అతని కుడిచెయ్యి దానంతటదే ఏదో వస్తువునో జంతువునో పట్టుకున్నది. ఆ గుడ్డివెలుతురులో మెల్లగా తానొక కుర్రవాడి చెయ్యి పట్టుకొని వున్నానని గ్రహించాడు.
అతను తెనాలి స్టేషనులో ప్లాట్‌ఫారం మీద కూచుని వున్నాడు. పేరు ప్రసాదరావు. మెడ్రాసువెళ్లే మెయిలు కోసం ఎదురుచూస్తున్నాడు. ఎవరినో పంపించటానికి వచ్చాడు.
రాత్రి తొమ్మిది గంటలవుతున్నది. బండి రావటానికి అరగంట టైమున్నది. ముందు జాగ్రత్త వున్న ప్రయాణీకులు అప్పుడే ప్లాట్‌ఫారం మీద నిండారు.
ప్రసాదరావు గొంతుకు కూర్చుని వున్నాడు. అతనికి కొంచెం దూరంలో పక్కచుట్ట మీద కుదురుగా కూర్చునివున్నారు పూర్ణచంద్రరావు. ఆయనకు కొంచెం దూరంలో ఆయన భార్య చతికిలబడి వున్నది. ఆమె ఒక మాంసపు ముద్ద. వాళ్లిద్దరిని చూడగానే లక్ష్మీదేవి దయ వాళ్లమీద లేకపోలేదని తోస్తుంది. పూర్ణచంద్రరావు గారికి మెడ్రాసులో ఏదో మంచి ఉద్యోగం అయిందట. గంపెడు సామాన్లతో బండి ఎక్కడానికి సిద్ధంగా వున్నారు.
పూర్ణచంద్రరావు ఇందాకటినుంచి ఏదో మాట్లాడుతూనే వున్నారు. అతను ఊకొడుతూనే ఉన్నాడు. చేయబోయే ఉద్యోగం సంగతి, ఇళ్లు దొరకటం ఎంత కష్టమో, ఆంధ్రుల అరవల తగాదాల సంగతి... ఆఖరుకు ఆయన ఏం చెబుతున్నది కూడా వినటం మానేశాడు అతను. అతని ధ్యాసంతా ఒక బలవత్తరమైన సమస్యపై కేంద్రీకరించబడి వున్నది. సమస్య కొత్తదేమీ కాదు. వయస్సు వచ్చిన దగ్గర్నించీ బాధిస్తున్న సమస్యే. అర్జెంటుగా కొంత డబ్బు కావలసి ఉన్నది. డబ్బు ఎప్పుడూ కావలసిందే! కాని ఇప్పుడు ప్రత్యేకంగా అవసరం వచ్చింది.
అతను ఆ సాయంత్రమే వెళ్లి పూర్ణచంద్రరావుగారిని డబ్బు అడిగాడు. ఆయన ఇస్తాననిగానీ, ఇంత ఇస్తాననిగానీ చెప్పలేదు. లేదనీ చెప్పలేదు. అందువల్ల అతను ఆశ పెట్టుకొనే ఉన్నాడు. కాని పక్షంలో లేదని చెప్పేవాడేగా? ఈ ఆశతోనే ఆ సాయంత్రమంతా ఆయనతో గడిపాడు. కాని మళ్లా డబ్బు ప్రస్తావన రాలేదు. అతనికి ఆ ప్రస్తావన తెచ్చే సాహసం లేదు. అసలు వచ్చి అడిగినందుకే పశ్చాత్తాప పడుతున్నాడు. అందువల్ల అతను మనస్సు ఎక్కడో పెట్టుకుని కాళ్లు గుదులు పట్టిన గుర్రంలా, ఉరకలెత్తుతున్న పూర్ణచంద్రరావు వాగ్దాటిని భరించాడు. అప్పటికీ చాలక తమతో బాటు స్టేషనుకు కూడా రమ్మన్నాడు. విసుగెత్తి తప్పుక పోదామని చూశాడుగానీ వీలుపడలేదు. డబ్బు లేక, ఉద్యోగం లేక డబ్బు అడగటానికి వచ్చిన వాడిమీద డబ్బు ఉండి, మంచి ఉద్యోగం ఉండి, అప్పు పెట్టగలిగిన వానికుండే ఆధిక్యత పూర్ణచంద్రరావుకు అతని మీద ఉంది.
జరుగుతున్నదంతా అతనికి ఒక కల మాదిరిగా ఉంది. ఎందువలనోగాని అతను ఆ డబ్బు అడగడానికి వచ్చిందీ, డబ్బు లేక కష్టాలు అనుభవించపోతున్నదీ తానేనని భావించలేకపోతున్నాడు. కాని ఒక ప్రక్క ఇదంతా తనకు సంభవించిందేనని తెలుసు. ఈ విధంగా అతను కొంతకాలం నుంచి రెండు ప్రపంచాల్లో జీవిస్తున్నాడు. అందులో ఒక ప్రపంచం రెండోదాన్ని దూరం నుంచి మాత్రమే చూస్తున్నది. ఈ రెండు ప్రపంచాలకూ వంతెనలాగా డబ్బు అవసరం. 
సాయంత్రం పూర్ణచంద్రరావు మాటలు వింటూనే అతను డబ్బు దొరకటానికి ఇతర మార్గాలన్నీ ఆలోచించాడు. ఒక్కొక్క మార్గాన్నీ తీసుకుని పూర్వపరాలన్నీ ఆలోచించి, నిదానంగా ఒక్కొక్కదానికీ నీళ్లు వదులుకున్నాడు. ఆఖరుకు ఏమార్గం అనుసరించినా లాభం లేదని తెలుసుకున్న తర్వాత ఒక రకమైన ప్రశాంతిలో పడ్డాడు. అప్పుడు అతని మనస్సు ఇదివరకు అతను ఎన్నడూ గమనించని విషయాలు గమనించసాగింది. మాట్లాడేటప్పుడు పూర్ణచంద్రరావుగారి మూతి వంకరగా ఒక ప్రక్కగా ఎందుకుపోతుందా అని ఆశ్చర్యపడసాగాడు. ఈ విషయాన్ని ఇదివరకు ఎందుకు గమనించలేదా అనుకున్నాడు.
అతని అవ్యక్తంలో కదులుతున్న నీడ కొంచెం చిక్కనయింది. ఇంటివాడి ముఖం కనిపించింది. ‘ఏమండీ రెండు నెలల అద్దెబాకీ!’ కానీ అది అంత కష్టమైన విషయం కాదు. ఇంటివాణ్ని ఎలాగో మాటలతో సరిపుచ్చవచ్చు. ఇబ్బంది కిళ్లీకొట్టువాడితోనే. ఇరవై ఏడు రూపాయలు. వాడి కొట్టెంత కొట్టు? వాడికి తన మీద ఎంత నమ్మకం? ఉలకడు. పలకడు. మొన్న మాత్రం ‘బాబుగారూ! లెక్క యిచ్చారు కారు. కొంచెం ఇబ్బందిగా ఉంది’ అన్నాడు. ‘కొంచెం’ అన్నాడంటే ఎంత ఇబ్బందిగా ఉండి ఉండాలి!
అతను గొంతుక్కూర్చున్న వాడల్లా కదిలాడు. నడుము నొప్పిపట్టినట్టుంది. భారమంతా మోయటం వల్ల కుడికాలు బొటనవ్రేలు నరం లాగుతున్నది.
అకస్మాత్తుగా బ్రహ్మాండమైన కెరటంలా బాహ్య స్మృతి అతనిమీద విరుచుకు పడింది. బండి వస్తున్నట్లుంది. ప్లాట్‌ఫారం రూపం మారిపోయింది. వందలకొలది తలకాయలు లేచి నుంచున్నాయి. క్రింద కూర్చున్న అతనికి తన చుట్టూ భూమిలోంచి లెక్కలేనన్ని చెట్లు మొలుచుకొచ్చి చూస్తుండగానే పెరిగి పెద్దవై ఆకాశమంత ఎత్తయినట్టు తోచింది. ఒక్క అరక్షణంలో అతనికీ, ఆ సాయంత్రం గడిచిన గడియలకూ సంబంధం తెగిపోయి మధ్య అఘాతం ఏర్పడింది. పూర్ణచంద్రరావుగారి ‘బండి వస్తున్నది. లే’ కేకతోపాటు, తనంతటతానే లేచి నుంచున్నాడు. వందల కాళ్లూ చేతులూ పెట్టెల దరవాజాల దగ్గర కొట్టుకోసాగినై. అతను నడవ నవసరం లేకపోయింది. గట్టిగా ఊపిరి పీల్చి తెప్పరిల్లి చూచేటప్పటికి రెండవ తరగతి పెట్టె ముందు కమ్మీలు పట్టుకొని నిలబడివున్నాడు. లోపల ఒక సీటు మీద బెడ్డింగు సగం పరుచుకొని పూర్ణచంద్రవుగారి భార్య నిండుగా కూచుని వున్నది. పూర్ణచంద్రరావు వాకిట్లో నిలబడి ఏదో చెపుతూ జేబులో చెయ్యిపెట్టాడు. అతని దృష్టంతా చేతిమీదే వున్నది. ఆ చేయి మెల్లగా తన చేతిలో ఏదో పెట్టింది. ఐదు రూపాయల నోటు. అతను ఏమీ మాట్లాడలేకపొయ్యాడు. అతని మనసులో మొట్టమొదట కలిగిన భావం వద్దందామని. కానీ వద్దనలేక పొయ్యాడు.
డబ్బు మీది ఆశ వలన కాదు. ఐదు రూపాయలు అతన్ని గట్టెక్కించలేవు. వద్దనే శక్తి లేకనే మాట్లాడకుండా ఊరుకున్నాడు. ఇది ఒక అవమానం కింద లెక్కగాదు. ఇప్పుడు ఆయన ఐదు ఇచ్చినా వంద ఇచ్చినా ఒకటే. ఆ ఐదు తను తేలిగ్గా తిరిగి వచ్చివేయొచ్చు. కాని ఇచ్చినాయన బాధపడినట్టు మొఖం పెట్టడం, ఇద్దరి మధ్యా తప్పనిసరిగా పెంచుకోవలసిన ద్వేషం, ఇవన్నీ తలచుకునేటప్పటికి అతనికి అసహ్యం వేసింది. ఆ పరిస్థితిలో అభిమానం ఒక ఆడంబరంగా తోచింది. ఇంకొకప్పుడయితే ఇలాంటిది జరిగిన పక్షంలో నొచ్చుకుని ఉండేవాడేమో? ఇప్పుడు అలా అనిపించలేదు. సాయంత్రం నుంచి జరుగుతున్నదానికి క్రమానుగతమైన పర్యవసానంలా తోచింది.
రైలు కూతవేసింది. పూర్ణచంద్రరావు వెళ్లొస్తానని చెప్పారు. చెయ్యి ఊపటానికి కూడా సిగ్గు వేసింది. దూరంగా చీకట్ల సుడిగుండంలో మాయమవుతున్న మొఖాలను చూస్తూ నిలబడ్డాడు. ఒక నిమిషం తరువాత అక్కడ ఏమీలేదు.
అతను వెనక్కు తిరిగి, ఆ యాతన నుంచి బయటపడి, వంతెన మెట్లు ఎక్కసాగాడు. ఇక ఇప్పుడు తొందర లేదు. మెల్లగా ఇష్టం వచ్చినప్పుడే గదికి చేరుకోవచ్చు. 
అకస్మాత్తుగా రాత్రి యొక్క సమ్మోహన విద్యుత్సS్పర్శ అనుభవించాడు. నగరమంతా మెలకువకూ నిద్దరకూ మధ్యనున్న సరిహద్దు ప్రాంతంలా ఉంది. ఈపాటికి ఎక్కువమంది నిద్రపోయి ఉండరు. అంతా నిద్రల నీలవనంలో ప్రవేశించటానికి వుంకిస్తూ వుండి వుంటారు. ఈ నీడల నాటకరంగం మీద జీవితపు మెరకపల్లాల్లోంచి వచ్చిన వాళ్లందరూ ఒకే హోదాతో నిలబడతారు. ఇక్కడ విభేదాలు లేవు. ఈ కౌగిలి అందరికీ ఒకేరకపు శాంతినిస్తుంది. ఇక్కడ యాచన లేదు. లేదనటం లేదు. అవమానం లేదు. ఈ వాకిలి దగ్గరకు వచ్చినవాడెవ్వడూ ఉత్తచేతులతో తిరిగి వెళ్లడు. ఇదే రోజువారీగా చేసే యాత్రల గమ్యస్థానం.
అకస్మాత్తుగా తన జేబు ఎవరో లాగినట్లయ్యి వెనక్కు తిరిగాడు. అతని కుడిచెయ్యి దానంతటదే ఏదో వస్తువునో జంతువునో పట్టుకున్నది. ఆ గుడ్డివెలుతురులో మెల్లగా తానొక కుర్రవాడి చెయ్యి పట్టుకొని వున్నానని గ్రహించాడు.
ఆ కుర్రవాడికి 14, 15 ఏళ్లుంటాయ్‌. అతను నడిచివచ్చిన చీకటంత నల్లగా ఉన్నాడు. వీడికేదో జబ్బు అనుకొనేటంత సన్నగా వున్నాడు. ఆకలి మొఖం మీద తాటికాయంత అక్షరాలలో రాసివున్నది. చిరిగిన చొక్కా వేసుకొని వున్నాడు. వాడి కుడిచేతిలో అతని జేబులోంచి ఇప్పుడే తీసిన ఐదు రూపాయల నోటు నలిగి గట్టిగా చిక్కుకుని వున్నది. వాడు దాన్ని ప్రపంచమంతా లాక్కోటానికి వచ్చినా వదలకుండా వుండేటంత దృఢనిశ్చయంతో పట్టుకొని వున్నాడు.
ఆ కుర్రవాడు క్రమంగా అతని దృష్టిలోంచి కరిగిపోయి, అతని నిర్దాక్షిణ్యాన్ని దూషిస్తున్నట్టూ, దేశకాలాలు మరిపించి ఉక్కిరి బిక్కిరి చేశాడు. క్రమేపీ ద్వేషం లేని కోపం, ప్రత్యేకమైన లక్ష్యం లేని జాలి, జాలితో కూడుకున్న అసహ్యం, ఇంకా అనేక మనోభావాలు విరుచుకుపడి అతని మనఃస్థితిని ముంచెత్తాయి. వాటి బరువు క్రింద అల్లల్లాడిపొయ్యాడు. వాటి బ్రహ్మాండమైన ఆకారం ముందు అతను విశ్వరూపాన్ని సందర్శించిన వానిలా తన అల్పత్వాన్ని గుర్తించాడు. ఒక్క క్షణం అతను అన్ని మెట్టపల్లాలు అధిగమించి ఆ కుర్రవాడితో సంపూర్ణ తాదాత్మS్మం అనుభవించాడు. తనే జేబుదొంగననీ, ఆ కుర్రవాడి జేబు తనే కొట్టినట్టూ అనుకున్నాడు. ఈ విశాల భూతలం మీద కళ్లు తెరచిన రోజునుంచీ నేటి వరకూ ఎన్నడూ అనుభవించని ఏకత్వాన్ని ఆ క్షణంలో సాధించగలిగాడు. అతనికిప్పుడు ప్రపంచమంటే అసంతృప్తి లేదు.
అకస్మాత్తుగా ఆ కుర్రవాడి భుజం మీద చెయ్యి వేసి బుజ్జగించాలనీ, దగ్గరకు తీసి లాలించాలనీ కోరిక కలిగింది. కుర్రవాడి చెయ్యి వదిలి భుజం మీద చెయ్యి వేయటానికి చెయ్యిజాచాడు. కుర్రవాడు గిరుక్కున పిల్లిలా వెనక్కు తిరిగి చీకటిలో మాయమయ్యాడు. వాడు ఐదు రూపాయల నోటును గుప్పెటతో అలాగే పట్టుకొని వున్నాడు.
అతడు కుర్రవాడు మాయం కావడం చూస్తూ నిలబడ్డాడు.
కవీ కథకుడూ ఆలూరి బైరాగి (1925–1978) ‘జేబుదొంగ’ కథకు సంక్షిప్త రూపం ఇది. సంక్షిప్తం: సాహిత్యం డెస్క్‌. ఇందులోని చిక్కటి కవిత్వాన్ని అనుభవించాలంటే మాత్రం పూర్తి పాఠం చదవాల్సిందే. ‘ఆగమ గీతి’, ‘నూతిలో గొంతుకలు’ కవితా సంపుటాలు, ‘దివ్య భవనం’ కథాసంపుటి బైరాగి ప్రసిద్ధ రచనలు.
 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top