కలల్లో కాటుక

Rabindranath Tagore Kabuliwala Story - Sakshi

కథాసారం

మిని ఒక్క క్షణం కూడా మాట్లాడకుండా వుండలేదు. 
మిని పుట్టాక భాష నేర్చుకోటానికి ఒకే సంవత్సరం వ్యయపరిచింది. ఆ తర్వాత ఒక్క క్షణం కూడా మౌనంతో వృథా చేసేది కాదు. వాళ్ల అమ్మ కసురుతూ దాని నోరు మూయిస్తూ వుంటుంది. ఆ పని నేను చెయ్యలేను.ప్రొద్దున్నే నా నవలలో పదిహేడో ప్రకరణం వ్రాయడం మొదలెట్టాను. మిని వస్తూనే– ‘నాన్నా, దర్వాన్‌ రామదయాళ్‌ కాకిని కాకాయ్‌ అంటాడు, వాడికేమీ తెలియదు కదూ!’ అంటూ మొదలెట్టింది. నా అభిప్రాయం కోసం ఎదురుచూడకుండా నా కాళ్ల దగ్గిర కూర్చుని, ఆడుకోవటం మొదలెట్టింది. నా ప్రకరణంలో ప్రతాపసింహుడప్పుడు కాంచనమాలను తీసుకుని, అర్ధరాత్రి కారాగృహంలోని పై గవాక్షంలోనుంచి నదీప్రవాహంలోకి దూకుతున్నాడు.

మా యిల్లు వీధి ప్రక్కనే. హఠాత్తుగా మిని కిటికీ దగ్గరకు పరుగెత్తి, ‘‘కాబూలీవాలా’’ అని కేకెయ్యటం మొదలెట్టింది. మాసిపోయిన పంచె, తలపాగా, భుజాన సంచి, చేతిలో రెండు ద్రాక్ష పెట్టెలున్న పొడుగాటి కాబూలీవాలా వీధిలోంచి వెడుతున్నాడు. ‘నా పదిహేడో ప్రకరణం ఇక పూర్తి అవదు’ అనుకున్నాను.మిని కేకలకు కాబూలీవాలా నవ్వుతూ వెనక్కి తిరిగి వస్తూండగానే– అది మాత్రం లోపలింట్లోకి పరుగెత్తింది. దాని మనస్సులో ఒక మూఢనమ్మకం– ఆ సంచిలో వెతికితే తనలాంటి ఇద్దరు ముగ్గురు పిల్లలు దొరుకుతారని. కాబూలీవాలా నాకు సలాంచేసి నుంచున్నాడు. ప్రతాపసింహ్, కాంచనమాల పరిస్థితి ఎంత విషమంగా ఉన్నప్పటికీ– ‘అతణ్ని లోపలికి పిలిచి, అతడి దగ్గర ఏదో ఒకటి కొనకపోతే బాగుండదు’ అనుకున్నాను.

కొనటం అయింది. అబ్దుల్‌ రహమాన్, రష్యా, ఇంగ్లీషు మొదలైనవారిని తీసుకుని సంభాషణ జరగసాగింది.లేచి వెళ్లిపోయేటప్పుడు– ‘‘బాబూ, మీ అమ్మాయి ఎక్కడికెళ్లింది?’’ అని అడిగాడు.మిని అకారణ భయాన్ని పోగొట్టాలనే అభిప్రాయంతో దాన్ని తీసుకునివచ్చాను. నా కాళ్లకు చుట్టేసుకుని, కాబూలీ సంచీకేసి సందేహంగా చూస్తూ నుంచుంది. కాబూలీ సంచిలోనుంచి కిస్‌మిస్, ఆప్రికాట్లు దానికివ్వబోయాడు. అది తీసుకోలేదు. తొలిపరిచయం ఈ విధంగా జరిగిపోయింది.కొన్నాళ్లయాక ఒక రోజున అవసరమైన పని మీద బయటికి వెళ్లబోతూ చూసేసరికి మా అమ్మాయి గుమ్మానికి దగ్గిరగా ఉన్న బెంచీమీద కూర్చుని అనర్గళంగా మాట్లాడేస్తోంది– కాబూలీవాలాతో. మిని అయిదు సంవత్సరాల జీవితానుభవంలో తండ్రి తప్ప ఇంత ఓర్పుగా వినే శ్రోత ఎన్నడూ లభించలేదు. దాని ఒడి బాదం, కిస్‌మిస్‌లతో నిండివుంది. ‘‘దానికివన్నీ ఎందుకిచ్చావు?’’ అని ఒక అర్ధరూపాయి ఇచ్చాను. తీసుకుని సంచీలో వేసుకున్నాడు.

ఇటీవల అతడు ఇంచుమించు ప్రతిరోజూ వస్తూ, పిస్తా బాదం లంచమిస్తూ మిని లేత హృదయాన్ని తన వైపుకు త్రిప్పుకున్నాడు. శరత్కాలపు ప్రాతఃవేళ ఒక వయస్కుడు, ఒక వయస్సురాని బాలిక పరిహాసాలు చూస్తుంటే ముచ్చటగా వుండేది.వారిద్దరూ అలవాటుగా మాట్లాడుకునే మాట వుంది. మినిని రహమత్‌– ‘‘పాపా! నువ్వు అత్తారింటికి ఎప్పుడూ వెళ్లవా?’’ అని అడుగుతూండేవాడు.బెంగాలీ ఆడపిల్లలకు పుట్టినప్పట్నుంచీ ‘అత్తవారిల్లు’ అనే పదం పరిచితమైనదే. మేము కొంచెం ఆధునికులం కావటం వల్ల పసిదానిని అత్తవారింటి గురించిన పరిజ్ఞానం వుండేట్లుగా తయారుచెయ్యలేదు. అంచేత రహమత్‌ ఉద్దేశాన్ని గ్రహించగలిగేది కాదు. ఏదో ఒక సమాధానం చెప్పకుండా ఊరుకోవటం దాని స్వభావానికి విరుద్ధం. ‘‘నువ్వు అత్తారింటికి వెడతావా?’’ అని అడిగేది. రహమత్‌ ఊహమాత్రుడైన మామగారిని ఉద్దేశించి, ‘‘నేను మామగారిని చంపేస్తాను’’ అనేవాడు. మిని ఆ అపరిచిత జీవుని దురవస్థ ఊహించుకుని విపరీతంగా నవ్వేది...

ప్రతి సంవత్సరం మాఘమాసం మధ్యలో రహమత్‌ తమ దేశం వెడుతూంటాడు. ఆ సమయంలో బాకీలు వసూలు చేసుకోవటంలో హడావిడిగా వుంటాడు. ఇంటింటికి తిరుగుతూ వుండాలి. అయినా మినికి ఒకసారి కనపడిపోతూవుండేవాడు. ప్రొద్దున్నే రాలేకపోతే చీకటిపడ్డాకయినా వచ్చేవాడు. చీకటిగదిలో ఆ వదులుచొక్కా, పైజమా ధరించిన పొడుగాటి కాబూలీవాలాను చూస్తుంటే మనస్సులో ఒక భయం తలెత్తుతుంది. కాని, మిని ‘‘కాబూలీవాలా, ఓ కాబూలీవాలా’’ అంటూ పరుగెత్తుకురావటం చూస్తుంటే మనస్సంతా ప్రసన్నమయ్యేది.ఒకరోజు ప్రొద్దున్నే నా చిన్నగదిలో కూర్చుని ప్రూఫ్‌ దిద్దుకుంటున్నా. వీధిలో పెద్ద గోల వినిపించింది.పరిశీలనగా చూశాను– రహమత్‌ను ఇద్దరు పోలీసులు కట్టి తీసుకువస్తున్నారు. అతడి వెనకాల కుతూహలురైన కుర్రాళ్ల గుంపు. రహమత్‌ చొక్కా నిండా నెత్తురు మరకలు, పోలీసువాని చేతిలో నెత్తురుతో తడిసిన కత్తి. గుమ్మం బయటికి వెళ్లి, ఏమిటి విషయం అని అడిగాను. మా పొరుగున ఉండే వ్యక్తి రామ్‌పురీ శాలువా కొనుక్కున్న తాలూకు కొంత బాకీ ఉన్నాడు రహమత్‌కు. అబద్ధమాడి అతడా బాకీని ఒప్పుకోలేదు. మాటా మాటా పెరిగి, రహమత్‌ అతణ్ణి కత్తితో పొడిచాడు. ఈ సమయంలో ‘‘కాబూలీవాలా’’ అని పిలుస్తూ మిని బయటికి వచ్చింది. అమాంతం – ‘‘నువ్వు అత్తారింటికి వెడుతున్నావా?’’ అని అడిగేసింది.

రహమత్‌ నవ్వుతూ– ‘‘అక్కడికే వెడుతున్నాను. మామగార్ని చావకొట్టేవాణ్నే. కాని ఏం చెయ్యను? చేతులు కట్టేశారు’’ అన్నాడు. కత్తిపోట్లు పొడిచి గాయపరిచిన నేరానికి, రహమత్‌కు కొన్ని సంవత్సరాల కారాగారవాస శిక్ష విధించబడింది. అతడి సంగతి ఒక విధంగా మరిచిపోయాం. మిని తన వెనుకటి నేస్తాన్ని మరిచిపోయి, మొదట్లో మా బగ్గీతోలే నబీతో సావాసం పెట్టుకుంది. వయసు పెరుగుతున్నకొద్దీ స్నేహితులకు బదులు స్నేహితురాండ్రను సంపాయించుకుంటూ వచ్చింది. అంతదాకా యెందుకు– తన తండ్రి వ్రాసుకుంటూ కూర్చునే గదిలో కూడా కన్పించటం లేదు... కొన్నియేళ్లు గడిచిపోయాయి. మినికి వివాహ సంబంధం నిశ్చయమైంది. పూజా సెలవుల్లోపల దాని వివాహం అయిపోతుంది. మా యింటి ఆనందలక్ష్మి పుట్టింటిని చీకటి చేసి, పతి గృహానికి ప్రయాణమై వెడుతుంది.

యింట్లో తెల్లవారీ తెల్లవారకముందే సన్నాయి మ్రోగుతోంది. ఆ సన్నాయి ఏదో నా హృదయంలో నరాలమీదినుంచి జాలిగా మ్రోగుతోంది. ఇవాళ మా మిని వివాహం. ప్రొద్దుటినుంచి ఒకటే సందడి. జనం రావటం పోవటం. మెల్లా అంతా వెదురు వాసాలతో పందిరి వేసి చాందినీ కట్టివుంది. ఇంట్లో వరండాలో ఛాండ్లర్సు వ్రేలాడకడుతున్న టంగ్‌ టంగ్‌ ధ్వనులు విన్పిస్తున్నాయి. నేను నా వ్రాతగదిలో కూర్చుని, ఖర్చుపద్దులు చూసుకుంటున్నాను. ఈ సమయంలో రహమత్‌ వచ్చి, సలాంచేసి నుంచున్నాడు. మొదట్లో గుర్తుపట్టలేకపోయాను. అతడి ఆ సంచీలేదు. పొడుగాటి జుట్టు లేదు. శరీరంలో వెనుకటి బిగువు లేదు. ‘‘ఏం రహమత్‌! యెప్పుడు వచ్చావ్‌?’’ ‘‘నిన్న సాయంత్రం జైలు నుంచి విడుదలయాను’’ఆ మాట వినేసరికి చెవులకేదో టక్‌న కొట్టినట్లయింది. ఏ ఖూనీకోరునీ ప్రత్యక్షంగా చూడలేదు. మనస్సంతా ముడుచుకుపోయినట్లయింది. ఈ శుభప్రదమైన రోజున ఈ వ్యక్తి ఇక్కడినుంచి వెళ్లిపోతే బాగుండనిపించసాగింది. ‘‘ఇవాళ ఇంట్లో ఒక శుభకార్యం వుంది. కొంచెం పని తొందరలో వున్నాను’’ అన్నాను. వెళ్లిపోవటానికి ఉద్యుక్తుడయి, ‘‘పాప నొకసారి చూడటానికి వీలు లేదా?’’ అని అడిగాడు. అతడి మనస్సులో మిని ఇంకా పాపగానే ఉందన్న విశ్వాసం ఉన్నట్లుంది. అంతేకాదు, పూర్వపు స్నేహాన్ని గుర్తుంచుకొని, పెట్టెడు ద్రాక్ష, కాగితపు పొట్లంలో కాసిని కిస్‌మిస్, బాదం– బహుశా తమ దేశీయుడైన ఎవరో మిత్రుని దగ్గర తీసుకుని వచ్చాడనుకుంటా. 

‘‘ఇవాళ ఇంట్లో పని వుంది. యెవరినీ కలుసుకోటానికి వీలుండదు’’ అన్నాను.అతడు నా ముఖంకేసి చూశాడు. ‘బాబూ సలాం’ అని బయటికి వెళ్లిపోయాడు. నా మనస్సుకి బాధ కలిగింది. వెనక్కి పిలుద్దామని అనుకున్నాను. చూస్తే అతడే తిరిగి వస్తున్నాడు. ‘‘ఈ ద్రాక్ష, కాసిని కిస్‌మిస్‌ బాదం పాపకి యివ్వండి’’ అన్నాడు.వాటికి ఖరీదు ఇవ్వబోయేసరికి, నా చెయ్యి పట్టుకుని ‘‘తమది గొప్పదయ. నాకు డబ్బు ఇవ్వకండి బాబూ. మీకొక చిన్నపాప ఉన్నట్లే నాకూ మా దేశంలో ఒక చిన్న పాప ఉంది. నేను దాని ముఖాన్ని తలుచుకుని మీ అమ్మాయికి కాసిని తియ్యటి పళ్లు తీసుకుని వచ్చాను’’ అన్నాడు. తన వదులుచొక్కా లోపలికి చెయ్యి పోనిచ్చి, నలిగి మురికిగా ఉన్న ఒక కాగితం ముక్క పైకి తీశాడు. జాగ్రత్తగా మడతలు విప్పి, నా టేబుల్‌ ముందు యెదురుగా పట్టుకున్నాడు. కాగితం మీద ఓ చిన్న చేతిముద్ర. ఫొటోగ్రాఫ్‌ కాదు, తైలవర్ణ చిత్రం కాదు, చేతికి కొంచెం కాటుక పూసి, కాగితం మీద దాని ముద్ర తీసుకున్నాడు. తన కూతురి స్మృతిచిహ్నాన్ని హృదయంలో పెట్టుకుని, రహమత్‌ ప్రతి సంవత్సరం కలకత్తా వస్తాడు. అతి కోమలమైన ఆ చిన్న శిశు హస్తస్పర్శ, వియోగవ్యధాభరితుడైన అతడి హృదయానికి కాస్త హాయిని కలిగిస్తున్నట్లుంది. అది చూసేసరికి నా కళ్లల్లో నీళ్లు తిరిగాయి. అతడొక పళ్లు అమ్ముకునే వ్యక్తి, నేను గౌరవం గల బెంగాలీ గృహస్థుణ్ణి అన్న సంగతి మరిచిపోయాను. అతడెవరో నేనూ అతణ్నే. అతడూ తండ్రీ, నేనూ తండ్రినే.

పర్వతగృహవాసిని అయిన అతడి చిన్నిపార్వతి చేతిముద్రలు మా మినినే జ్ఞాపకం తెచ్చాయి. తక్షణం అతణ్ణి అంతఃపురంలోకి తీసుకువెళ్లాను. అంతఃపురంలోంచి అభ్యంతరాలు వచ్చాయి. వేటినీ పట్టించుకోలేదు. ఎర్రటి పట్టుచీర ధరించి, చందన తిలకాన్ని దిద్దుకుని, పెళ్లికూతురి వేషంలో ఉన్న మిని సిగ్గుపడుతూ నా ప్రక్కకి వచ్చి నుంచుంది. ‘‘పాపా! నువ్వు అత్తారింటికి వెడతావా?’’ అని అడిగాడు. మినికి ఇప్పుడు, ‘అత్తారిల్లు’ అన్నదానికి అర్థం తెలుసు. వెనుకటిలాగా సమాధానం చెప్పలేకపోయింది. మిని వెళ్లిపోయాక, రహమత్‌ నిట్టూర్పు విడిచి, తన కూతురు కూడా ఈలోగా పెద్దదయి వుంటుందనీ, ఆమెతో కూడా క్రొత్తగా పరిచయం చేసుకోవలసివుంటుందనీ, ఆమెను సరిగ్గా చిన్ననాటి పాపగానే పొందలేననీ స్పష్టంగా గ్రహించగలిగాడు. నేనొక నోటు తీసి రహమత్‌ కిచ్చాను. ‘‘మీ దేశంలోని మీ అమ్మాయి దగ్గిరకు వెళ్లు. మీ తండ్రికూతుళ్ల కలయికలోని ఆనందానుభూతి మీ అమ్మాయికి శుభాన్ని చేకూరుస్తుంది’’ ఆ డబ్బు అతడికి ఇచ్చి, ముందు అనుకున్న వేడుక ఖర్చుపట్టీలోంచి ఒకటి రెండు భాగాలు తగ్గించవలసి వచ్చింది. ఎలక్ట్రిక్‌ బల్బులన్నీ వెలిగించలేకపోయాను. కాని మంగళకాంతిలో శుభమహోత్సవం ఉజ్జ్వలమయింది. 

రవీంద్రనాథ్‌ టాగూర్‌ (1861–1941) కథ ‘కాబూలీవాలా’ సంక్షిప్త రూపం ఇది. రచనాకాలం: 1892. దీన్ని మద్దిపట్ల సూరి తెలుగులోకి అనువదించారు.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top