breaking news
ravindranath tagore
-
నెహ్రూకు ఠాగూర్ రాసిన లేఖ చూశారా!
సాక్షి, న్యూడిల్లీ: రవీంద్రనాథ్ ఠాగూర్ భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూకు రాసిన లేఖను లోక్‌సభ సభ్యులు శశిథరూర్ శనివారం పంచుకున్నారు. నెహ్రూ బయోపిక్ తనని ఎంతగానో ఆకట్టుకుందంటూ ఠాగూర్ తన చేతితో రాసిన లేఖను శనివారం ట్విటర్ షేర్ చేసి నాటి జ్ఞాపకాలను మరోసారి గుర్తు చేశారు. 1936 ఠాగూర్ తన చేతితో రాసిన లేఖ అని ఎంపీ తన పోస్టులో వెల్లడించారు. ‘1936లో నెహ్రూ ఆత్మకథ చదివిన తరువాత గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్, పండిట్ నెహ్రూకు ఇచ్చిన అసాధారమైన గమనిక ఇది’ అని ట్విటర్లో థరూర్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ లేఖ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ పోస్టుకు ఇప్పటి వరకు దాదాపు 7 వేలకు పైగా లైక్‌లు, వందల్లో కామెంట్స్ వచ్చాయి. ఎంపీ పోస్టుకు నెటిజన్లు ఫిదా అవుతూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. నాటి మధుర జ్ఞాపకాన్ని పంచుకున్నందుకు థరూర్‌కు నెటిజన్లు ధన్యవాదాలు తెలుపుతున్నారు. ఠాగూర్ రాసిన కొన్ని కవితలలోని ఫేమస్ కొట్స్ షేర్ చేస్తున్నారు. ‘ఈ రోజు వరకు ప్రపంచంలోని అత్యంత తెలివైన అసాధారమైన వ్యక్తి ఠాగుర్’, ‘అందుకే ఠాగూర్ మాటలలో, పనులలో మాస్టర్’ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ‘‘ప్రియమైన జవహర్లాల్, నేను మీ గొప్ప ఆత్మకథ పుస్తకాన్ని చదవడం ముగించాను. మీ విజయానికి నేను మంత్రముగ్థుడినయ్యాను. అది నన్ను చాలా ఆకట్టుకుంది. అంతేగాక మిమ్మల్ని చూసి గర్వపడుతున్నాను. మానవత్వపు లోతైన భావాల వైపు ఈ పుస్తకం నడిపిస్తుంది. ఇది వాస్తవాల చిక్కులను అధిగమించి మమ్మల్ని గొప్ప వ్యక్తి వైపుకు నడిపిస్తుంది. మీ రవీంద్రనాథ్ ఠాగూర్’’ అంటూ ఠాగూర్ రాసుకొచ్చిన ఈ లేఖ మే 31, 1936 నాటిదని ఎంపీ పేర్కొన్నారు. This was Gurudev Rabindranath Tagore’s note to Pandit Nehru after reading his autobiography in 1936. Extraordinary and exquisite. pic.twitter.com/46PtaVJixG — Shashi Tharoor (@ShashiTharoor) July 30, 2020 -
కలల్లో కాటుక
మిని ఒక్క క్షణం కూడా మాట్లాడకుండా వుండలేదు. మిని పుట్టాక భాష నేర్చుకోటానికి ఒకే సంవత్సరం వ్యయపరిచింది. ఆ తర్వాత ఒక్క క్షణం కూడా మౌనంతో వృథా చేసేది కాదు. వాళ్ల అమ్మ కసురుతూ దాని నోరు మూయిస్తూ వుంటుంది. ఆ పని నేను చెయ్యలేను.ప్రొద్దున్నే నా నవలలో పదిహేడో ప్రకరణం వ్రాయడం మొదలెట్టాను. మిని వస్తూనే– ‘నాన్నా, దర్వాన్ రామదయాళ్ కాకిని కాకాయ్ అంటాడు, వాడికేమీ తెలియదు కదూ!’ అంటూ మొదలెట్టింది. నా అభిప్రాయం కోసం ఎదురుచూడకుండా నా కాళ్ల దగ్గిర కూర్చుని, ఆడుకోవటం మొదలెట్టింది. నా ప్రకరణంలో ప్రతాపసింహుడప్పుడు కాంచనమాలను తీసుకుని, అర్ధరాత్రి కారాగృహంలోని పై గవాక్షంలోనుంచి నదీప్రవాహంలోకి దూకుతున్నాడు. మా యిల్లు వీధి ప్రక్కనే. హఠాత్తుగా మిని కిటికీ దగ్గరకు పరుగెత్తి, ‘‘కాబూలీవాలా’’ అని కేకెయ్యటం మొదలెట్టింది. మాసిపోయిన పంచె, తలపాగా, భుజాన సంచి, చేతిలో రెండు ద్రాక్ష పెట్టెలున్న పొడుగాటి కాబూలీవాలా వీధిలోంచి వెడుతున్నాడు. ‘నా పదిహేడో ప్రకరణం ఇక పూర్తి అవదు’ అనుకున్నాను.మిని కేకలకు కాబూలీవాలా నవ్వుతూ వెనక్కి తిరిగి వస్తూండగానే– అది మాత్రం లోపలింట్లోకి పరుగెత్తింది. దాని మనస్సులో ఒక మూఢనమ్మకం– ఆ సంచిలో వెతికితే తనలాంటి ఇద్దరు ముగ్గురు పిల్లలు దొరుకుతారని. కాబూలీవాలా నాకు సలాంచేసి నుంచున్నాడు. ప్రతాపసింహ్, కాంచనమాల పరిస్థితి ఎంత విషమంగా ఉన్నప్పటికీ– ‘అతణ్ని లోపలికి పిలిచి, అతడి దగ్గర ఏదో ఒకటి కొనకపోతే బాగుండదు’ అనుకున్నాను. కొనటం అయింది. అబ్దుల్ రహమాన్, రష్యా, ఇంగ్లీషు మొదలైనవారిని తీసుకుని సంభాషణ జరగసాగింది.లేచి వెళ్లిపోయేటప్పుడు– ‘‘బాబూ, మీ అమ్మాయి ఎక్కడికెళ్లింది?’’ అని అడిగాడు.మిని అకారణ భయాన్ని పోగొట్టాలనే అభిప్రాయంతో దాన్ని తీసుకునివచ్చాను. నా కాళ్లకు చుట్టేసుకుని, కాబూలీ సంచీకేసి సందేహంగా చూస్తూ నుంచుంది. కాబూలీ సంచిలోనుంచి కిస్మిస్, ఆప్రికాట్లు దానికివ్వబోయాడు. అది తీసుకోలేదు. తొలిపరిచయం ఈ విధంగా జరిగిపోయింది.కొన్నాళ్లయాక ఒక రోజున అవసరమైన పని మీద బయటికి వెళ్లబోతూ చూసేసరికి మా అమ్మాయి గుమ్మానికి దగ్గిరగా ఉన్న బెంచీమీద కూర్చుని అనర్గళంగా మాట్లాడేస్తోంది– కాబూలీవాలాతో. మిని అయిదు సంవత్సరాల జీవితానుభవంలో తండ్రి తప్ప ఇంత ఓర్పుగా వినే శ్రోత ఎన్నడూ లభించలేదు. దాని ఒడి బాదం, కిస్మిస్లతో నిండివుంది. ‘‘దానికివన్నీ ఎందుకిచ్చావు?’’ అని ఒక అర్ధరూపాయి ఇచ్చాను. తీసుకుని సంచీలో వేసుకున్నాడు. ఇటీవల అతడు ఇంచుమించు ప్రతిరోజూ వస్తూ, పిస్తా బాదం లంచమిస్తూ మిని లేత హృదయాన్ని తన వైపుకు త్రిప్పుకున్నాడు. శరత్కాలపు ప్రాతఃవేళ ఒక వయస్కుడు, ఒక వయస్సురాని బాలిక పరిహాసాలు చూస్తుంటే ముచ్చటగా వుండేది.వారిద్దరూ అలవాటుగా మాట్లాడుకునే మాట వుంది. మినిని రహమత్– ‘‘పాపా! నువ్వు అత్తారింటికి ఎప్పుడూ వెళ్లవా?’’ అని అడుగుతూండేవాడు.బెంగాలీ ఆడపిల్లలకు పుట్టినప్పట్నుంచీ ‘అత్తవారిల్లు’ అనే పదం పరిచితమైనదే. మేము కొంచెం ఆధునికులం కావటం వల్ల పసిదానిని అత్తవారింటి గురించిన పరిజ్ఞానం వుండేట్లుగా తయారుచెయ్యలేదు. అంచేత రహమత్ ఉద్దేశాన్ని గ్రహించగలిగేది కాదు. ఏదో ఒక సమాధానం చెప్పకుండా ఊరుకోవటం దాని స్వభావానికి విరుద్ధం. ‘‘నువ్వు అత్తారింటికి వెడతావా?’’ అని అడిగేది. రహమత్ ఊహమాత్రుడైన మామగారిని ఉద్దేశించి, ‘‘నేను మామగారిని చంపేస్తాను’’ అనేవాడు. మిని ఆ అపరిచిత జీవుని దురవస్థ ఊహించుకుని విపరీతంగా నవ్వేది... ప్రతి సంవత్సరం మాఘమాసం మధ్యలో రహమత్ తమ దేశం వెడుతూంటాడు. ఆ సమయంలో బాకీలు వసూలు చేసుకోవటంలో హడావిడిగా వుంటాడు. ఇంటింటికి తిరుగుతూ వుండాలి. అయినా మినికి ఒకసారి కనపడిపోతూవుండేవాడు. ప్రొద్దున్నే రాలేకపోతే చీకటిపడ్డాకయినా వచ్చేవాడు. చీకటిగదిలో ఆ వదులుచొక్కా, పైజమా ధరించిన పొడుగాటి కాబూలీవాలాను చూస్తుంటే మనస్సులో ఒక భయం తలెత్తుతుంది. కాని, మిని ‘‘కాబూలీవాలా, ఓ కాబూలీవాలా’’ అంటూ పరుగెత్తుకురావటం చూస్తుంటే మనస్సంతా ప్రసన్నమయ్యేది.ఒకరోజు ప్రొద్దున్నే నా చిన్నగదిలో కూర్చుని ప్రూఫ్ దిద్దుకుంటున్నా. వీధిలో పెద్ద గోల వినిపించింది.పరిశీలనగా చూశాను– రహమత్‌ను ఇద్దరు పోలీసులు కట్టి తీసుకువస్తున్నారు. అతడి వెనకాల కుతూహలురైన కుర్రాళ్ల గుంపు. రహమత్ చొక్కా నిండా నెత్తురు మరకలు, పోలీసువాని చేతిలో నెత్తురుతో తడిసిన కత్తి. గుమ్మం బయటికి వెళ్లి, ఏమిటి విషయం అని అడిగాను. మా పొరుగున ఉండే వ్యక్తి రామ్‌పురీ శాలువా కొనుక్కున్న తాలూకు కొంత బాకీ ఉన్నాడు రహమత్‌కు. అబద్ధమాడి అతడా బాకీని ఒప్పుకోలేదు. మాటా మాటా పెరిగి, రహమత్ అతణ్ణి కత్తితో పొడిచాడు. ఈ సమయంలో ‘‘కాబూలీవాలా’’ అని పిలుస్తూ మిని బయటికి వచ్చింది. అమాంతం – ‘‘నువ్వు అత్తారింటికి వెడుతున్నావా?’’ అని అడిగేసింది. రహమత్ నవ్వుతూ– ‘‘అక్కడికే వెడుతున్నాను. మామగార్ని చావకొట్టేవాణ్నే. కాని ఏం చెయ్యను? చేతులు కట్టేశారు’’ అన్నాడు. కత్తిపోట్లు పొడిచి గాయపరిచిన నేరానికి, రహమత్‌కు కొన్ని సంవత్సరాల కారాగారవాస శిక్ష విధించబడింది. అతడి సంగతి ఒక విధంగా మరిచిపోయాం. మిని తన వెనుకటి నేస్తాన్ని మరిచిపోయి, మొదట్లో మా బగ్గీతోలే నబీతో సావాసం పెట్టుకుంది. వయసు పెరుగుతున్నకొద్దీ స్నేహితులకు బదులు స్నేహితురాండ్రను సంపాయించుకుంటూ వచ్చింది. అంతదాకా యెందుకు– తన తండ్రి వ్రాసుకుంటూ కూర్చునే గదిలో కూడా కన్పించటం లేదు... కొన్నియేళ్లు గడిచిపోయాయి. మినికి వివాహ సంబంధం నిశ్చయమైంది. పూజా సెలవుల్లోపల దాని వివాహం అయిపోతుంది. మా యింటి ఆనందలక్ష్మి పుట్టింటిని చీకటి చేసి, పతి గృహానికి ప్రయాణమై వెడుతుంది. యింట్లో తెల్లవారీ తెల్లవారకముందే సన్నాయి మ్రోగుతోంది. ఆ సన్నాయి ఏదో నా హృదయంలో నరాలమీదినుంచి జాలిగా మ్రోగుతోంది. ఇవాళ మా మిని వివాహం. ప్రొద్దుటినుంచి ఒకటే సందడి. జనం రావటం పోవటం. మెల్లా అంతా వెదురు వాసాలతో పందిరి వేసి చాందినీ కట్టివుంది. ఇంట్లో వరండాలో ఛాండ్లర్సు వ్రేలాడకడుతున్న టంగ్ టంగ్ ధ్వనులు విన్పిస్తున్నాయి. నేను నా వ్రాతగదిలో కూర్చుని, ఖర్చుపద్దులు చూసుకుంటున్నాను. ఈ సమయంలో రహమత్ వచ్చి, సలాంచేసి నుంచున్నాడు. మొదట్లో గుర్తుపట్టలేకపోయాను. అతడి ఆ సంచీలేదు. పొడుగాటి జుట్టు లేదు. శరీరంలో వెనుకటి బిగువు లేదు. ‘‘ఏం రహమత్! యెప్పుడు వచ్చావ్?’’ ‘‘నిన్న సాయంత్రం జైలు నుంచి విడుదలయాను’’ఆ మాట వినేసరికి చెవులకేదో టక్‌న కొట్టినట్లయింది. ఏ ఖూనీకోరునీ ప్రత్యక్షంగా చూడలేదు. మనస్సంతా ముడుచుకుపోయినట్లయింది. ఈ శుభప్రదమైన రోజున ఈ వ్యక్తి ఇక్కడినుంచి వెళ్లిపోతే బాగుండనిపించసాగింది. ‘‘ఇవాళ ఇంట్లో ఒక శుభకార్యం వుంది. కొంచెం పని తొందరలో వున్నాను’’ అన్నాను. వెళ్లిపోవటానికి ఉద్యుక్తుడయి, ‘‘పాప నొకసారి చూడటానికి వీలు లేదా?’’ అని అడిగాడు. అతడి మనస్సులో మిని ఇంకా పాపగానే ఉందన్న విశ్వాసం ఉన్నట్లుంది. అంతేకాదు, పూర్వపు స్నేహాన్ని గుర్తుంచుకొని, పెట్టెడు ద్రాక్ష, కాగితపు పొట్లంలో కాసిని కిస్మిస్, బాదం– బహుశా తమ దేశీయుడైన ఎవరో మిత్రుని దగ్గర తీసుకుని వచ్చాడనుకుంటా. ‘‘ఇవాళ ఇంట్లో పని వుంది. యెవరినీ కలుసుకోటానికి వీలుండదు’’ అన్నాను.అతడు నా ముఖంకేసి చూశాడు. ‘బాబూ సలాం’ అని బయటికి వెళ్లిపోయాడు. నా మనస్సుకి బాధ కలిగింది. వెనక్కి పిలుద్దామని అనుకున్నాను. చూస్తే అతడే తిరిగి వస్తున్నాడు. ‘‘ఈ ద్రాక్ష, కాసిని కిస్మిస్ బాదం పాపకి యివ్వండి’’ అన్నాడు.వాటికి ఖరీదు ఇవ్వబోయేసరికి, నా చెయ్యి పట్టుకుని ‘‘తమది గొప్పదయ. నాకు డబ్బు ఇవ్వకండి బాబూ. మీకొక చిన్నపాప ఉన్నట్లే నాకూ మా దేశంలో ఒక చిన్న పాప ఉంది. నేను దాని ముఖాన్ని తలుచుకుని మీ అమ్మాయికి కాసిని తియ్యటి పళ్లు తీసుకుని వచ్చాను’’ అన్నాడు. తన వదులుచొక్కా లోపలికి చెయ్యి పోనిచ్చి, నలిగి మురికిగా ఉన్న ఒక కాగితం ముక్క పైకి తీశాడు. జాగ్రత్తగా మడతలు విప్పి, నా టేబుల్ ముందు యెదురుగా పట్టుకున్నాడు. కాగితం మీద ఓ చిన్న చేతిముద్ర. ఫొటోగ్రాఫ్ కాదు, తైలవర్ణ చిత్రం కాదు, చేతికి కొంచెం కాటుక పూసి, కాగితం మీద దాని ముద్ర తీసుకున్నాడు. తన కూతురి స్మృతిచిహ్నాన్ని హృదయంలో పెట్టుకుని, రహమత్ ప్రతి సంవత్సరం కలకత్తా వస్తాడు. అతి కోమలమైన ఆ చిన్న శిశు హస్తస్పర్శ, వియోగవ్యధాభరితుడైన అతడి హృదయానికి కాస్త హాయిని కలిగిస్తున్నట్లుంది. అది చూసేసరికి నా కళ్లల్లో నీళ్లు తిరిగాయి. అతడొక పళ్లు అమ్ముకునే వ్యక్తి, నేను గౌరవం గల బెంగాలీ గృహస్థుణ్ణి అన్న సంగతి మరిచిపోయాను. అతడెవరో నేనూ అతణ్నే. అతడూ తండ్రీ, నేనూ తండ్రినే. పర్వతగృహవాసిని అయిన అతడి చిన్నిపార్వతి చేతిముద్రలు మా మినినే జ్ఞాపకం తెచ్చాయి. తక్షణం అతణ్ణి అంతఃపురంలోకి తీసుకువెళ్లాను. అంతఃపురంలోంచి అభ్యంతరాలు వచ్చాయి. వేటినీ పట్టించుకోలేదు. ఎర్రటి పట్టుచీర ధరించి, చందన తిలకాన్ని దిద్దుకుని, పెళ్లికూతురి వేషంలో ఉన్న మిని సిగ్గుపడుతూ నా ప్రక్కకి వచ్చి నుంచుంది. ‘‘పాపా! నువ్వు అత్తారింటికి వెడతావా?’’ అని అడిగాడు. మినికి ఇప్పుడు, ‘అత్తారిల్లు’ అన్నదానికి అర్థం తెలుసు. వెనుకటిలాగా సమాధానం చెప్పలేకపోయింది. మిని వెళ్లిపోయాక, రహమత్ నిట్టూర్పు విడిచి, తన కూతురు కూడా ఈలోగా పెద్దదయి వుంటుందనీ, ఆమెతో కూడా క్రొత్తగా పరిచయం చేసుకోవలసివుంటుందనీ, ఆమెను సరిగ్గా చిన్ననాటి పాపగానే పొందలేననీ స్పష్టంగా గ్రహించగలిగాడు. నేనొక నోటు తీసి రహమత్ కిచ్చాను. ‘‘మీ దేశంలోని మీ అమ్మాయి దగ్గిరకు వెళ్లు. మీ తండ్రికూతుళ్ల కలయికలోని ఆనందానుభూతి మీ అమ్మాయికి శుభాన్ని చేకూరుస్తుంది’’ ఆ డబ్బు అతడికి ఇచ్చి, ముందు అనుకున్న వేడుక ఖర్చుపట్టీలోంచి ఒకటి రెండు భాగాలు తగ్గించవలసి వచ్చింది. ఎలక్ట్రిక్ బల్బులన్నీ వెలిగించలేకపోయాను. కాని మంగళకాంతిలో శుభమహోత్సవం ఉజ్జ్వలమయింది. రవీంద్రనాథ్ టాగూర్ (1861–1941) కథ ‘కాబూలీవాలా’ సంక్షిప్త రూపం ఇది. రచనాకాలం: 1892. దీన్ని మద్దిపట్ల సూరి తెలుగులోకి అనువదించారు. -
యాభై రెండు సెకన్ల జీవితం
పద్ధతి గల జీవితానికి లయ ఉంటుంది. లక్ష్యం ఉంటుంది. ఆ లయ, లక్ష్యం పైకి కనిపించకపోవచ్చు. కానీ మనిషిని చూసి చెప్పేయొచ్చు. ఆఫీస్ టైమ్ అయిపోతోందనీ, మీటింగ్ టైమ్ మించిపోతోందని పద్ధతిగల మనుషులు ఎప్పుడూ పరుగులు తీయరు. సరిగ్గా సమయానికో, సమయం కన్నా ముందుగానో సిద్ధంగా ఉంటారు. సంస్థ నియమ నిబంధనలకు బద్ధులై ఉంటారు. వ్యక్తిగతంగా కూడా కొన్ని నియంత్రణలను ఏర్పరచుకుంటారు. ఇలాంటివారు వాయిదాలు అడగరు. వాదనలు పెట్టుకోరు. ఒక పని ఫలానా సమయానికి పూర్తవ్వాలని ఆదేశాలొస్తే, లేదా తమకై తాము అనుకుంటే ఆరు నూరైనా ఆ సమయానికి పని పూర్తి చేసేస్తారు. అది ఏ పనైనా, ఎంతటి పనైనా అంతే. ఉదా: ‘జన గణ మన’ గీతాన్ని పాడడం సరిగ్గా 52 సెకన్లలో పూర్తి చేయాలన్నది చట్టంలోని ఒక నియమం. ‘ఆ.. ఆలోపే పాడేస్తే ఏముందిలే, యాభై రెండు సెకన్లు దాటితే ఏమౌతుందిలే’ అని పద్ధతి, క్రమశిక్షణ ఉన్నవారు అనుకోరు. కచ్చితంగా యాభై రెండు సెకన్లకు జన గణ మన పూర్తయ్యేలా సాధన చేస్తారు. సాధన మానవ జీవితాన్ని లయబద్ధం చేస్తుంది. లక్ష్యాన్ని ఏర్పరచి ముందుకు నడిపిస్తుంది. దైవ సన్నిధికి మనసు చేర్చడానికి కూడా ఇదే విధమైన సాధన అవసరం. ‘జన గణ మన’ ప్రస్తావన ఎటూ వచ్చింది కనుక ఒక చిన్న విషయం. 1911లో ఇదే రోజు భారత జాతీయ కాంగ్రెస్ కలకత్తా సమావేశంలో జన గణ మన గీతాన్ని తొలిసారిగా ఆలపించారు. రాసింది ఎవరో తెలుసు కదా. విశ్వకవి రవీంద్రనాథ్ టాగూర్. ఆయన డిసెంబర్ 11న గీత రచన చేస్తే, డిసెంబర్ 27న ఆ రచన.. పాట రూపం దాల్చింది. -
రవీంద్రుడు గొప్ప తత్వవేత్త
ఎందరికో స్ఫూర్తి ప్రదాత ‘విశ్వకవి’ పదానికి నిజమైన అర్థం ప్రముఖ సాహితీవేత్త, సినీనటుడు గొల్లపూడి మారుతీరావు రాజరాజనరేంద్రనగర్ (రాజానగరం) : విశ్వకవి రవీంద్రనా«థ్ ఠాగూర్ గొప్ప తత్వవేత్తని ప్రముఖ సాహితీవేత్త, సినీనటుడు గొల్లపూడి మారుతీరావు తెలిపారు. ఆయన రచనల్లో భాషా భేదం లేకుండా ఎందరో కవులను ప్రభావితం చేస్తూ ‘విశ్వకవి’ పదానికి నిజమైన అర్థంగా నిలిచారని కొనియాడారు. ఆదికవి నన్నయ యూనివర్సిటీలో తెలుగు శాఖ ఆధ్వర్యంలో ఏపీ ఉన్నత విద్యా మండలి, ఎన్టీఆర్ ట్రస్టుల సహకారంతో ఏర్పాటు చేసిన రెండు రోజుల జాతీయ సదస్సును శనివారం ఆయన జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు. తాను 13వ ఏట నుంచే కథలు రాయడం ప్రారంభించానని గొల్లపూడి చెబుతూ తన రచనలపై రవీంద్రుని ప్రభావం ఏ విధంగా పడిందో తెలియజేశారు. చిన్న వయస్సు కావడంతో కొత్త కథలు రాయడానికి సరైన అంశం దొరికేది కాదన్నారు. ఈ తరుణంలో రవీంద్రుని రచనలతో పరిచయం ఏర్పడి, రచనలు చేసేందుకు సబ్జెక్టు కోసం వెదుకులాడవలసిన పరిస్థితి లేకుండా పోయిందన్నారు. ఈ విధంగా ఆయన రచనల ప్రభావం ఏపీలోనే కాకుండా విశ్వమంతా వ్యాపించిం దని తెలిపారు. వాస్తవికతకు అద్దం పట్టే విధంగా ఆయన రచనలు ఉంటాయన్నారు. ఏన్నో రచనల ద్వారా ఎందరికో చైతన్యదీప్తిగా నిలిచిన ఆయనకు 52వ ఏట వచ్చిన ‘నోబుల్ బహుమతి’తోనే గుర్తింపు వచ్చిందన్నారు. అప్పటి వరకూ బెంగాల్లో ఆయనను, ఆయన రచనలను తిట్టని వారు లేరన్నారు. మన ఇంట్లో వారి గొప్పతనం మనకు తెలియదు, పొరుగు వారు పొగిడినప్పుడే అన్నట్టు ఆసియాలో నోబుల్ బహుమతి అందుకున్న తొలి రచయితగా గుర్తింపు వచ్చిన తరువాతే రవీంద్రుడిని, ఆయన రచనలను జగమంతా గుర్తించిందన్నారు. చలం, కృష్ణశాస్త్రి వంటి రచయితలు కూడా ఆయనను అనుసరించేవారని తెలిపారు. నేనింకా పేషెంట్‌నే! జాతీయ సదస్సుగా నిర్వహిస్తున్న ఇక్కడ చిన్న పొరబాటు జరిగిందంటూ గొల్లపూడి అందరినీ ఆశ్చర్యపరిచారు. ‘ఆహ్వాన పత్రం, బ్యానర్లలో తన పేరుకు ముందు డాక్టర్ అని పెట్టారు కానీ, నేను ఇంకా పేషెంట్‌నే’ నంటూ చమత్కరించి, నవ్వించారు. తెలుగు సాహిత్యంపై రవీంద్రుని రచనల ప్రభావం ఎక్కువగానే ఉంటుందని ముఖ్యఅతిథి నన్నయ వర్సిటీ వీసీ ఆచార్య ఎం.ముత్యాలునాయుడు అన్నారు. సదస్సు ప్రత్యేక సంచికను ఆవిష్కరించారు. అనంతరం రవీంద్రుడు రచించి, స్వయంగా ఆలపించిన జాతీయ గీతం వీడియోను ప్రదర్శించారు. ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య కె.ఎస్.రమేష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో బెనారస్ హిందూ యూనివర్సిటీ రిటైర్డ్ ఆచార్యులు జోశ్యుల సూర్యప్రకాశరావును ఘనంగా సన్మానించారు. రిజిస్ట్రార్ ఆచార్య ఎ. నరసింహారావు, బెనారస్ హిందూ యూనివర్సిటీ ఆచార్యులు బూదాటి వెంకటేశ్వర్లు, పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ రిటైర్డ్ ఆచార్యులు సి.మృణాళిని, బీఈడీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె.సుబ్బారావు, డీ¯ŒS ఆచార్య ఎస్.టేకి, సదస్సు కన్వీనర్ డాక్టర్ కె.వి.ఎ¯ŒS.డి.వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. పద్యాలు చదవడం వల్లే రచయితనయ్యా : గొల్లపూడి రాజరాజనరేంద్రనగర్ (రాజానగరం) : ‘చిన్నతనంలో పద్యాలు చదవమని నా తల్లి చెబుతూ ఉండేది, నేను అలాగే చేసేవాడిని, అందుకనే 13వ ఏటే రచయితను కాగలిగాను’ అని ప్రముఖ సాహితీవేత్త, సినీ నటుడు గొల్లపూడి మారుతీరావు అన్నారు. ఆదికవి నన్నయ యూనివర్సిటీకి వచ్చిన ఆయన శనివారం స్థానిక విలేకరులతో మాట్లాడారు. నేడు పాఠశాలల్లో విద్యార్థులకు పద్యాలు గురించి చెప్పడం మానేసి, ఆంగ్ల భాష రుద్దుడు కార్యక్రమం ఎక్కువగా జరుగుతోందని వ్యాఖ్యానించారు. తెలుగు పద్యం పదికాలాల పాటు గుర్తుండిపోతుందని, పద్యం ద్వారానే భాష మాధుర్యం తెలుస్తుందన్నారు. తెలుగు భాష ఎంతో మధురమైనదని, ఆ మాధుర్యాన్ని పిల్లలకు బాల్యం నుంచే అందించవలసిన అవసరం ఉందన్నారు. నేడు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంను తప్పనిసరి చేయాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రస్తావిస్తూ... చిరుప్రాయం నుంచి తెలుగు భాషను అభ్యసన చేయడం వల్ల వారి హృదయాలలో అది చెరగని ముద్రగా నిలిచిపోతుందన్నారు. ప్రస్తుతం తెలుగు మీడియం లేకుండా చేసే పరిస్థితులు తలెత్తాయంటూ గొల్లపూడి ఆవేదన చెందారు. -
యంగ్ టాగూర్!
బుక్ షెల్ఫ్ బాల్యంలాగే యవ్వనానికి విలువైన జ్ఞాపకాలు ఉంటాయి. విశ్వకవి రవీంద్రుడు తన యవ్వనంలో ఎలా ఉండేవాడు? అందరిలాగే అల్లరిగా ఉండేవాడా? రిజర్వ్డ్గా ఉండేవాడా? ఆ మహాకవి యవ్వనంలో విశేషాలు ఏమిటి? కవి కాని వారు కూడా కవిత్వం రాస్తే... పోనీలే పాపం అంటూ కవిత్వం పరుగెత్తుకు వస్తుంది! అలాంటిది విశ్వకవి ప్రేమకవిత్వం రాస్తే? కవిత్వం ఇంద్రధనసై విరుస్తుంది కదా! మరి ఆయన ఎప్పుడైనా ఎవరైనా అమ్మాయికి ప్రేమలేఖ రాశారా?...యంగ్ టాగూర్ అనగానే ఇలాంటి విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తి మనలో సహజంగానే ఉంటుంది. సుధీర్ కాకర్ రాసిన ‘యంగ్ టాగూర్...ది మేకింగ్స్ ఆఫ్ ఏ జీనియస్’ పుస్తకం చదివితే ‘యంగ్ టాగూర్’ గురించి ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు. ఈ పుస్తకం విశ్వకవి యవ్వన ప్రపంచాన్ని మన ముందు ఆవిష్కరిస్తుంది. టాగూర్ పద్నాలుగు సంవత్సరాల వయసులో ఉండగా అమ్మ చనిపోవడం, ఒంటరితనం, వదిన కాదంబరితో అనుబంధం, భారతీయ విలువలకు, పాశ్చాత్య ప్రపంచానికి మధ్య సమన్వయం సాధించుకోవడానికి చేసే ప్రయత్నం మాత్రమే కాక యవ్వనంలోని రవీంద్రుడి అంతఃప్రపంచాన్ని చూపారు. తాను సృజనశీలి కావడానికి రవీంద్రుడు ఏర్పర్చుకున్న దారి కనిపిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే సృజనశీలతకు నిలువెత్త్తు మనిషి అయిన రవీంద్రుడి వెనుక ఉన్న అసలు సిసలు మనిషిని ఈ పుస్తకంలో చూడవచ్చు.