పాత(ర) ధాన్యం... పోషకం

Prepare the advance care and keep the grain storage - Sakshi

పాతరోచితం

‘పాతర’ అనే మాట నేటి తరానికి  కొత్తగా అనిపించినా, తరతరాల నుండి వినిపిస్తున్న పాత మాటే. భూమిని తవ్వి అందులో ధాన్యాన్ని లేదా ఏదైనా వస్తువును పెట్టి మళ్లీ మట్టిని కప్పేదాన్ని ‘పాతర’ అని అంటారు. ఖరీఫ్‌ సీజన్‌లో రైతులు పండించిన పంటను కళ్లాల్లోకి తెచ్చి నూర్పులు చేస్తారు. ఏడాది పొడుగునా కుటుంబం తినేందుకు సరిపడే ధాన్యం దాచుకునేందుకు, పెళ్లీ, పేరంటాలు, గ్రామదేవతా ఉత్సవాలు వంటి శుభ కార్యాలలో బియ్యం కొరత లేకుండా ముందస్తు జాగ్రత్తగా పాతర వేసి ధాన్యం నిల్వ ఉంచుకుంటారు.  సంక్రాంతి అనంతరం కళ్లాల్లోని ధాన్యలక్ష్మిని పూజించి ఇంటికి తెచ్చి వాటిని పాతర వేస్తారు.

అలా మే నెలాఖరు వరకు పాతర్లలో ధాన్యం నిల్వ చేస్తారు. అనంతరం బయటకు తీసిన ధాన్యాన్ని ఎండలో ఆరబెట్టి మిల్లు చేస్తారు. ఇలా పాతర వేసిన బియ్యం నాణ్యంగా, ఆరోగ్యకరమైన పోషక విలువలుండేలా, రుచికరంగా ఉంటాయని పాత తరం వారు చెబుతున్నారు. సంక్రాంతి నుండి నెల రోజుల పాటు నిత్యం పాతరను ఆవుపేడతో ఆవుపేడతో అలుకుతారు. ఉదయం, సంధ్యవేళల్లో రంగురంగుల ముగ్గులతో అలకంరించి, వాటిపై గొబ్బెమ్మలు పెట్టి ధాన్యలక్ష్మీ అవతారంగా భావించి దీపారాధన చేస్తారు.

పాతర వేయడంలో ఆంతర్యం ఇదే...
పాతర ధాన్యం తిన్న పాపలు పుష్టిగా ఉంటారని గ్రామీణ ప్రాంతాల్లో నానుడి ప్రచారంలో ఉంది. ఈ ధాన్యం ఆరోగ్యవంతంగా ఉండటమే కాకుండా భూస్వాముల ప్రతిష్టకు గౌరవం తెచ్చేవిగా చెబుతారు.  గ్రామీణ ప్రాంతాల్లో ఉండే రైతులు అధికంగా పూరింట్లో నివాసం ఉండేవారు. జనవరి నెల నుంచి మే, జూన్‌ నెల వరకు అగ్ని ప్రమాదాలు సంభవించే సమయంలో ఆరుగాలం శ్రమించి పండించిన పంట ఇళ్లల్లో దాచిన సమయాల్లో అగ్నికి ఆహుతి కాకుండా ముందస్తు జాగ్రత్తగా ఇళ్ల ముందు గొయ్యి తీసి అందులో ధాన్యం ఉంచడం వల్ల అవి సురక్షితంగా ఉండే అవకాశం ఉంటుంది.

మే నెలలో అధికంగా వివాహాలు, గ్రామదేవత ఉత్సవాలు రోజుల తరబడి నిర్వహించే నేపథ్యంలో ఇంటికి వచ్చిన అతిథులకు, స్నేహితులకు, బంధువులకు మూడు పూటలా భోజనాలు అవసరమైనపక్షంలో వెంటవెంటనే పాతర్ల నుండి అవసరం మేర ధాన్యం తీసి వినియోగించేవారు. అంతేకాకుండా కరువు కాటకాలు ఏర్పడిన సమయంలో పాతర్లలో ధాన్యం వినియోగించేవారు.
– మద్దిలి కేశవరావు, సాక్షి, ఇచ్ఛాపురం రూరల్‌

పాతర ఎత్తును బట్టి...
గ్రామాల్లో రైతుల ఇళ్ల ముందు వేసిన పాతర ఎంత ఎత్తులో ఉంటే ఆతను ఎన్ని ఎకరాల భూస్వామిగా అప్పట్లో నిర్ధారించేవారు. అంతేకాదు, సదరు రైతు హుందాకు చిహ్నంగా పాతరను చెప్పవచ్చు. ఆ ఏడాది పొడవునా అన్నదాతగా ఆ రైతుకు గౌర మర్యాదలు దక్కేవి.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top