వెన్నంటే రూపాలు

Parama Ghosh Launched Its Own Clothing Brand In 2015 Under The Name Parama - Sakshi

కేన్వాస్‌ మీదే చిత్రకళ ఉండాలని నియమం ఏముంది? బ్లౌజ్‌ వెనుక భాగాన్ని కూడా కళాత్మక వేదిక చేయొచ్చు. దేశీయమైన కళను అక్కడ వ్యక్తం చేయవచ్చు. వీపునే ఒక చిత్ర ప్రదర్శనగా మార్చవచ్చు. కలకత్తా లాయర్‌ పరమఘోష్‌ ఫ్యాబ్రిక్‌ డిజైనర్‌గా చేస్తున్న ప్రయోగం ఇది.

ఫ్యాషన్‌ డిజైనర్‌ అనకుండా ఫ్యాబ్రిక్‌ డిజైనర్‌ అనడంలోనే ఉంది ‘పరమ’ ప్రత్యేకత. ఆ స్పెషాలిటీ తెలుసుకోవాలంటే పరమ డిజైన్స్‌ని ఒకసారి పరిశీలించాలి. పరమఘోష్‌ కలకత్తా వాసి. లా చదువుకుంది. న్యాయవాద వృత్తిలో తీరకలేని పని ఆమెది. కానీ, తనలోని కళాతృష్ణకు జీవం పోయాలనుకుంది. అనుకున్నది సాధించింది. అందమైన కళారూపాలతో చేనేతలను అందంగా తీర్చిదిద్దుతోంది. 2015లో ‘పరమ’ పేరుతో సొంత క్లాతింగ్‌ బ్రాండ్‌ను ప్రారంభించింది. న్యాయవాది నుంచి డిజైనర్‌ వరకు వేసుకున్న ఆమె మార్గం కళాత్మకం.

►స్త్రీ ఔన్నత్యాన్ని చాటే డిజైన్లు చేనేత బ్లౌజులుగా, చీర కొంగు సింగారాలుగా ముచ్చటగొలుపుతుంటాయి. కలకత్తా కాళీ, తల్లీబిడ్డల అనుబంధం , గ్రామీణ మహిళ సింగారం, నృత్యభంగిమలు.. ఒకటేమిటి మానవ మూలాలను పరమ ఘోష్‌ డిజైన్లు వెలికితీస్తాయి. అందమైన కవిత్వం ఫ్యాబ్రిక్‌  మీద సహజసిద్ధమైన రంగులతో పెయింటింగ్‌గా, ఎంబ్రాయిడరీగా రూపుదిద్దుకుంటుంది.  

►పగటిపూట న్యాయసంబంధిత విషయాలతో పోరాటం చేయడం, రాత్రి సమయాల్లో చేనేతపై మేజిక్‌ సృష్టించడం. ఇవి రెండూ విరుద్ధమైనవి. దీని గురించి ప్రస్తావిస్తే.. ‘‘మొదట్లో ఈ డిజైన్స్‌తో చేసిన బ్లౌజులు, చీరలు అమ్మకానికి పెట్టలేదు. మా కుటుంబసభ్యులు, బంధుమిత్రులకు గిఫ్ట్‌గా ఇచ్చేదాన్ని. లేదంటే వాళ్లే కోరి మరీ నాచేత డిజైన్‌ చేయించుకునేవారు. నేను డిజైన్‌చేసిన దుస్తులను ధరించి నాకే ఫొటోలు పెట్టేవారు. ఫేస్బుక్‌లో పోస్ట్‌ చేసేవారు. అలా నా డిజైన్స్‌ మరో ప్రపంచానికి చేరువ చేశాయి. పుస్తకాలు, సంగీతం, చిత్రాలు, ప్రదేశాలు, ప్రజలు ఇవన్నీ నన్ను ఆకట్టుకున్న అంశాలే. వీటినే డిజైన్స్‌లో చూపిస్తుంటాను.

►‘ఫ్యాబ్రిక్‌ పైన కొత్త రాతలు రాయడం అనేది నాకున్న పిచ్చి. మన మూలాల్లో దాగున్న కళను తీసుకురావాలనే ప్రయత్నం. ‘పరమ’ అంటే సంతోషం. ఆ సంతోషాన్ని నలుగురికి పంచాలన్నదే నా తాపత్రయం. ఆ ఆలోచనతోనే ఒక చిన్న స్టార్టప్‌ వెంచర్‌ని ప్రారంభించాను. దీని ద్వారా నా వ్యక్తిత్వం ప్రతిబింబించడం సంతోషంగా ఉంది.’

►నా చిన్నప్పుడు స్కూల్‌కి వెళ్లడానికి రోజూ ఏడ్చేదాన్నట. దాంతో మా అమ్మ నన్ను ఆర్ట్‌ క్లాస్‌కు పంపారు.  నాటి నుంచి రంగులకన్నా నా జీవితాన్ని ఏదీ ప్రభావితం చేయలేదు. ఇంద్రధనుస్సు, రంగు రంగుల గాజులు, నా క్రేయాన్స్‌ పెట్టె, ఒక చిన్న గాజు పాత్ర, సీతాకోకచిలుకలు, కథల పుస్తకాలు.. ఇవే నన్ను అనుసరిస్తూ వచ్చాయి. పెయింటింగ్‌ నాకు ఊపిరిని ఇచ్చింది. చిత్రాలు, కథలే నన్ను అమితంగా ప్రభావితం చేసేవి.’

►‘నాలుగేళ్ల క్రితం ‘పరమ’ను బ్రాండ్‌గా పరిచయం చేశాను. ఎనిమిదేళ్లు అందుకు తగిన ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాను. మొదట్లో చాలా భయపడ్డాను. కానీ, రాత్రింబవళ్లు వర్క్‌ చేశాను. ఎగ్జిబిషన్స్‌ ఏర్పాటు చేశాను. అందుకు మా అమ్మ నాకు సపోర్ట్‌గా ఉన్నారు. క్రియేషన్‌ పార్ట్‌లో మా ప్యామిలీ మెంబర్స్‌ ఎవరూ వేలు పెట్టరు. కానీ, బిజినెస్‌ పార్ట్‌గా మా హజ్బెండ్‌ హెల్ప్‌ ఉంటుంది.’

►స్త్రీ అంటే వంట చేయడం వరకే కాదు అది ఒక పార్ట్‌ మాత్రమే. మనకంటూ ఒక గుర్తింపు ఉండాలి. మన చేసే పని ప్రత్యేకమైనదై ఉండాలి. ఆ ప్రత్యేకత నేను ఎంచుకున్న మార్గంలో ఉంది. నా ఆర్ట్‌ మీద నాకు నమ్మకం ఉంది. అదే నన్ను నిలబెడుతుంది.
పరమ ఘోష్‌ డిజైనర్, కలకత్తా

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top