ఈమె పిలిస్తే నెమళ్లు వస్తాయి

Odisha village woman journey from protecting peacocks - Sakshi

వన దేవత

ఒరిస్సాలోని తూర్పు ప్రాంతంలో ఉన్న గంజాం జిల్లాలో ప్రమీలా బిసోయిని ‘దేవ మాత’ అని పిలుస్తారు. దానికి కారణం ఆమెకు మహిమలు ఉండటం కాదు. మహిమల కంటే ఎక్కువ అనదగ్గ పర్యావరణ స్పృహ ఉండటం. 71 ఏళ్ల ప్రమీలా బిసోయి గంజాం జిల్లాలో ‘పాకిడి’ గిరిశ్రేణుల్లోని విస్తారమైన అటవీ సంపదకు చౌకీదారు. గత పద్దెనిమిదేళ్లుగా ఒరిస్సా ప్రభుత్వం అక్కడి స్త్రీల స్వయం సమృద్ధికి మొదలెట్టిన ‘స్త్రీశక్తి’ అనే కార్యక్రమంలో ఉత్సాహంగా దూకిన బిసోయి నెమ్మదిగా ఆ స్త్రీలను తరలిపోయిన అడవిని తిరిగి పిలవడానికి ఉద్యుక్త పరిచింది.

‘నేను ఈ ప్రాంతానికి నవవధువుగా వచ్చినప్పుడు అడవి ఎంతో పచ్చగా ఉండేది. ఝరులు సంవత్సరం మొత్తం పారేవి. పక్షులు కిలకిలలాడేవి. దాదాపు ముప్పై నలభై ఏళ్ల కాలంలో చెట్లు నరికేయడం వల్ల అంతా పోయింది. మళ్లీ ఆ అడవిని చూడాలని నిశ్చయించున్నాను’ అంటుంది ప్రమీలా. మొత్తం 1970 హెక్టార్లలో అటవీ శాఖ ఆధీనంలో ఉన్న ఆ అడవిలో బిసోయి చేసిన మొదటి పని స్త్రీశక్తి పథకంలో ఉన్న స్త్రీలను చాలామందిని అడవిని ఒక కంట కనిపెట్టి ఉండమని చెప్పడం. వీరు ఎప్పుడైతే కాపలాకు నిలిచారో కలప దొంగలు ఆ వైపు చూడటానికి భయపడసాగారు. ఇక ఈ స్త్రీలే రంగంలో దిగి తిరిగి చెట్లు నాటారు. రాళ్లను తవ్వుకొని పోవడంతో ఏర్పడ్డ గుంతలను పూడ్చారు. డొంకల్లో పూడికలు తీశారు. కొద్ది సంవత్సరాల్లోనే అడవి పెరిగింది. అప్పుడు వచ్చిన తొలి అతిథే– నెమలి.

అడవి తరగడంతో మాయమైపోయిన నెమలి ఎప్పుడైతే అడవి పెరిగిందో తిరిగి వచ్చింది. ఆడనెమళ్లు సాధారణంగా వెదురుపొదల్లో గుడ్లు పెడతాయి. అందుకని బిసోయి అడవిలో విస్తారంగా వెదురు నాటించింది. ఆ వెదురు ఇంత నుంచి అంత పెరిగింది. ఒక నెమలి రెండు నెమళ్ల నుంచి ఇవాళ పాకిడి అడవిలో రెండు వేల నెమళ్లు తమ తావు ఏర్పరుచుకున్నాయి. భారతదేశంలో ఇంత పెద్ద నెమళ్ల శాంక్చరీ మరొకటి లేదు. ‘నెమళ్ల వల్ల ఒక్కోసారి పంటలు దెబ్బ తింటాయి. అయినా మేము వాటిని ఏమీ అనం. అవి మాలో భాగం అనుకుంటాము’ అంటుంది బిసోయి. బిసోయి చేసిన ఈ కృషి ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌కు తెలిసింది. ఆయన ఏకంగా ఆమెకు అదే ప్రాంతానికి చెందిన ‘అస్కా’ పార్లమెంట్‌ సీట్‌ ఇచ్చారు. ఆమె ఘనవిజయం సాధించి ఎం.పి అయ్యింది. తను ఎలా ఉందో అలాగే ఆ గిరిజన ఆహార్యంలోనే పార్లమెంట్‌కు హాజరయ్యింది. ఒరిస్సా భాషలో అక్కడ మాట్లాడి కరతాళధ్వనులు అందుకుంది. ఇటువంటి స్త్రీలు ఒక వందమంది ఉంటే చాలు ఈ దేశం వనసందోహం తప్పక అయి తీరుతుంది.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top