ఒక్కటైనారు ముక్కోటి భక్తులు

Mukkoti devotees joined together - Sakshi

దేవుడి కోసం ఇంతలా ఎప్పుడూ భక్తులు తపించి పోలేదు. అయోధ్య రాముడి కోసం రాజకీయ భక్తులు, శబరిమల అయ్యప్ప కోసం కోర్టు తీర్పు భక్తులు, షిర్డీ సాయి కోసం న్యూ ఇయర్‌ భక్తులు, తిరుమల శ్రీవారి కోసం బలవన్విరమణ అర్చక భక్తులు.. వీళ్లంతా క్రిస్మస్‌ తాత మోసుకొచ్చే కానుకల మూట కోసం నిన్న మొన్నటి వరకు ఎదురు చూసిన పసి పిల్లల్లా ఆశగా వేచి ఉన్నారు. 

జీసస్‌.. ఇంత మంచి భక్తిమాసం ఎప్పుడైనా వచ్చిందా! వెచ్చని చలి అని కాదు. కేకు ముక్కల్లో మగ్గిన తియ్యని ద్రాక్ష పరిమళం అని కాదు. ముక్కోటి దేవతలు కదా ఎప్పుడూ ఒక్కటవుతారు. ఈ డిసెంబరులో ముక్కోటి భక్తులు ఏకమయ్యారు. ఎవరి దర్శనం కోసం వాళ్లు. ఎవరి విజ్ఞప్తుల కోసం వాళ్లు. ఎవరి తీర్పుల కోసం వాళ్లు. దేశమంతటా భువి నుంచి దివికి వెలుగులు విరజిమ్మే వేడుకల తోరణాలే! రంగురంగుల వేడుకోళ్ల వినతి పత్రాలే! 

షిర్డీలో ఈ ఏడాది ‘న్యూ ఇయర్‌ దర్శనాలు’ వారం ముందుగానే.. నిన్న క్రిస్మస్‌ రోజున మొదలయ్యాయి. ఇకనుంచి ఇదే సంప్రదాయం. ఏటా డిసెంబర్‌ 31–జనవరి 1 మధ్య ఉండే ఇరవై నాలుగు గంటల వ్యవధి భక్తుల దర్శనానికి మరీ ఇరుకైపోవడంతో ఆలయ సీఈవో రుబల్‌ అగర్వాల్‌ దర్శనభాగ్యాన్ని ఏడు ‘ఇరవై నాలుగు గంటల నిడివి’కి పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. క్రిస్మస్‌ నుంచి జనవరి ఫస్ట్‌ వరకు జరిగే ఈ దర్శనోత్సవాలకు ‘షిర్డీ ఫెస్టివల్‌’ అని పేరు పెట్టారు. ఆలయ ప్రాంగణంలో సంగీత కచేరీలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ ప్రథమ దర్శనోత్సవాలకు ఒడిశా నుంచి సుబ్రత్, నాశిక్‌ నుంచి వినయ కులకర్ణి, కర్ణాటక నుంచి అనిల్‌కుమార్‌ మిస్కిన్, షిర్డీ గాయకుడు సుధాంశు లోకేగావ్‌కర్, ముంబై నుంచి రవీంద్ర పింగ్లే వస్తున్నారు. ‘స్వరాంజలి సంగీతం బృందం’ ముంబై నుంచి ఇప్పటికే షిర్డీ చేరుకుంది. వీళ్లే కాదు, భక్తుల ‘ఆరగింపు సేవ’కు కొత్త సోలార్‌ కిచెన్‌ పొగలు కక్కుతూ ఉంది. 

అటువైపున శబరిమలకు కూడా ఈ డిసెంబరులో భక్తుల తాకిడి ఎక్కువైంది. అయితే అది కోర్టు కారణంగా కొత్తగా తయారైన భక్తుల తాకిడి మాత్రమేనని అనుకోవాలి. వారి సౌకర్యార్థం ‘ట్రావన్‌కోర్‌ దేవస్వం బోర్డు’ తను చేయగలిగింది చేస్తున్నప్పటికీ, ‘పంబ’లో మకాం వేసిన సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ జి.కార్తికేయన్‌ అంతకుమించే చేయవలసి వస్తోంది. ఆదివారం మదురై బయల్దేరి, మధ్యలో శబరిమల దర్శనానికి వచ్చిన యాభై ఏళ్లలోపు మహిళా భక్తులు పదకొండు మందిని.. కోర్టు తీర్పును వ్యతిరేకిస్తున్న భక్తులు అడ్డగించడంతో కార్తికేయన్‌ అండ్‌ టీమ్‌ సురక్షితంగా వెనక్కు పంపించవలసి వచ్చింది. పట్టింపుల భక్తులకు, పంతంపట్టి వస్తున్న భక్తులకు మధ్య ఘర్షణ.. సంక్రాంతి వచ్చిపోతే కానీ సమసిపోయేలా లేదు.

ఢిల్లీలో కూడా డిసెంబర్‌ ఎప్పుడూ ఇంత ‘వేడి’గా లేదు. సుప్రీంకోర్టు ముందు గొంతుక్కూర్చుని తీర్పు కోసం ఎదురుచూస్తున్న అయోధ్య భక్తుల నిరసన నిట్టూర్పులు ఈ క్లైమేట్‌ ఛేంజ్‌కి కారణం. అయితే ఆలయ నిర్మాణానికి భక్తులు త్వరపడుతున్నంతగా జడ్జీలు హైరానా పడడం లేదు. అక్టోబర్‌లో ఫైల్‌ టేబుల్‌ మీదకు వచ్చినప్పుడు, ఆ ఫైల్‌ని జనవరి మొదటి వారంలోకి గిరాటు వేశారు చీఫ్‌ జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌. మొదటి వారంలో కూడా ఏ డేటో చెప్పలేదు. మొన్న డిసెంబర్‌ 24న డేటొచ్చింది జనవరి 4న అని. ‘ఇదంతా కాదు. వెంటనే ఆర్డినెన్స్‌ తెచ్చి, అయోధ్యలో రామాలయ నిర్మాణం మొదలుపెట్టాలి’ అని ఆర్‌.ఎస్‌.ఎస్‌. చీఫ్‌ మోహన్‌ భాగవత్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘అడుక్కోవాల్సి వస్తోంది. రామాలయం మా హక్కు కాదా’ అని ఆర్‌.ఎస్‌.ఎస్‌. కార్యదర్శి భయ్యాజీ జోషీ ఆవేదన చెందుతున్నారు. ‘ఆలయ నిర్మాణానికి ఈ శీతాకాల సమావేశాల్లో ప్రభుత్వం ఆర్డినెన్స్‌ తీసుకురాకుంటే వచ్చే ఎన్నికల్లో ప్రజలు తామేమిటో చూపిస్తారు’ అని వి.హెచ్‌.పి. వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ అలోక్‌ కుమార్‌ హెచ్చరిస్తున్నారు. ఆగ్రహం వ్యక్తం చెయ్యడానికి, ఆవేదన చెందడానికి, హెచ్చరించడానికి బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షాకు అవకాశం లేదు కాబట్టి, ‘అంతే కదా. రామాలయ నిర్మాణం జాతి ప్రజల అభిమతం కదా. బీజేపీ ఉన్నది అందుకే కదా’ అని మాత్రం అనగలుగుతున్నారు. ‘బీజేపీ మాత్రమే రామాలయాన్ని నిర్మించగలదు. వేరెవ్వరూ నిర్మించలేరు’ అని ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి ఆదిత్యానాథ్‌ అంటున్నారు. సాధ్యాసాధ్యాలను చూడనివ్వదు కదా భక్తి పారవశ్యం! జనవరి 4న అని కోర్టు ఇచ్చిన తేదీ ‘తుది తీర్పు’ ఇవ్వడం కోసం కాదు.

కనీసం వాదోపవాదాలను వినడానికీ కాదు. ఎప్పటి నుంచి ‘తను వింటుందో’ ఆ తేదీ చెప్పడం కోసం. అయోధ్యలోని ఆ 2.77 ఎకరాల వివాదా స్పద స్థలం ఎవరిదన్నది తేల్చి చెప్పడానికి కోర్టు 16 పిటిషన్‌లను విచారించవలసి ఉంది. అవన్నీ హిందూ భక్తులవి, ముస్లిం భక్తులవి.  అలా రామభక్తులు సుప్రీంకోర్టు వైపు చూస్తుంటే, ఇక్కడ తిరుమల వారసత్వ అర్చక భక్తులు ‘తిరుమల తిరుపతి దేవస్థానం’ (టీటీడీ) .. కోర్టు తీర్పుపై ఎలా స్పందిస్తుందా అని ఎదురు చూస్తున్నారు. టీటీడీలో సాధారణ ఉద్యోగుల పదవీ విరమణ వయసు (65 ఏళ్లు) నిబంధన టీటీడీలో వారత్వంగా ఉన్న అర్చకులకు వర్తించదని హైదరాబాద్‌ హైకోర్టు ఈ నెల 14న తీర్పు చెప్పింది. తీర్పుకు కారణం ఉంది. తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వారసత్వ అర్చకులుగా ఉన్న శేషాద్రిని, మురళిని అరవై ఐదేళ్లు నిండిన కారణంగా విధుల్లోంచి విరమింప చేస్తున్నట్లు ఈ ఏడాది జూన్‌లో టీటీడీ ఉత్తర్వులు జారీ చేసింది. (తిరుచానూరు ఆలయ నిర్వహణ కూడా టీటీడీ కిందికే వస్తుంది). టీటీడీ పరిధిలో ఇలా వారసత్వ అర్చకత్వంలో నాలుగు కుటుంబాలు ఉన్నాయి. వాటిల్లో టీటీడీ ప్రధాన అర్చకులుగా పని చేసిన రమణ దీక్షితులు కుటుంబం కూడా ఒకటి. టీటీడీ ఇచ్చిన పదవీ విరమణ ఉత్తర్వులపై శేషాద్రి, మురళి కోర్టును ఆశ్రయించిన ఈ కేసులోనే.. టీటీడీ తీర్మానాలు ఇలా ప్రత్యేకమైన కేటగిరీలో ఉన్న అర్చకులకు వర్తించవు అని కోర్టు తీర్పు చెప్పింది. కోర్టు తీర్పును శిరసావహించి ఆ ఇద్దరినీ, వారితో పాటు తన రిటైర్‌మెంట్‌ రూల్స్‌ పరిధిలోకి వచ్చిన రమణ దీక్షితుల్ని టీటీడీ తిరిగి తీసుకుంటుందా, లేక తను కూడా వాదన మొదలు పెడుతుందా? ఇప్పటికింకా నిర్ణయమైతే జరగలేదు. 

దేవుడి కోసం ఇంతలా ఎప్పుడూ భక్తులు తపించి పోలేదు. అయోధ్య రాముడి కోసం రాజకీయ భక్తులు, శబరిమల అయ్యప్ప కోసం కోర్టు తీర్పు భక్తులు, షిర్డీ సాయి కోసం న్యూ ఇయర్‌ భక్తులు, తిరుమల శ్రీవారి కోసం బలవన్విరమణ అర్చక భక్తులు.. వీళ్లంతా క్రిస్మస్‌ తాత మోసుకొచ్చే కానుకల మూట కోసం నిన్న మొన్నటి వరకు ఎదురు చూసిన పసి పిల్లల్లా ఆశగా వేచి ఉన్నారు. అందరికీ అన్నీ లభించాలి. అగునుగాక. తథాస్తు. ఆమెన్‌. 
∙మాధవ్‌ శింగరాజు
∙ 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top