స్వాతి గారు

A Moral binary story - Sakshi

నిందితురాలి గురించి చెబుతున్నప్పుడు పోలీసులు ‘తమదైన శైలి’కి  భిన్నంగా మర్యాదకరమైన భాషను ఉపయోగిస్తుండగా.. ‘తనది కాకూడని శైలి’లో మీడియా అమర్యాదకరమైన రీతిలో నిందితురాలిని ఆడిపోసుకుంటోంది. విచారణ జరగక ముందే నిందితురాలిని పరమ దుర్మార్గురాలిగా చిత్రీకరించే ‘మోరల్‌ బైనరీ’ ఇది!

ఈసబెల్‌ అయాండే చిలీ సంతతి అమెరికన్‌ రచయిత్రి. ‘భూత నిలయం’, ‘మృగ నగరం’ అని అర్థం వచ్చే రెండు నవలల్తో తొలిసారి ఈసబెల్‌ పేరు అందరికీ తెలిసింది. భూత నిలయంలో భూతాలు ఉండవు. మృగ నగరంలో మృగాలు ఉండవు. మానవ జీవితంలోని సహజ భావనలే ఆ భూతాలు, మృగాలు. ‘మేజికల్‌ రియలిజం’ ఆమె రచనాశైలి. అంటే ఏం లేదు. కల్పన కల్పనలా ఉండదు. వాస్తవం వాస్తవంలా ఉండదు. పుస్తకంలోని పేజీల్లోపల ఏం జరగాలో అదే జరుగుతుంది. రచయిత్రి వచ్చి జరిపించరు. మోరల్‌ బైనరీస్‌ ఉండవు.

తప్పు, ఒప్పు తప్ప ఇంకేం అయ్యేందుకు అవకాశమే లేదనే ఆలోచనకు ప్రభావితం చెయ్యడం మోరల్‌ బైనరీ. అది ఉండదు ఈసబెల్‌ రచనల్లో. ఈసబెల్‌ నవలలతో సమానంగా ఆమె మాట ఒకటి బాగా వాడుకలో ఉంది. ‘వాట్‌ ఐ ఫియర్‌ మోస్ట్‌ ఈజ్‌ పవర్‌ విత్‌ ఇంప్యూనిటీ. ఐ ఫియర్‌ అబ్యూజ్‌ ఆఫ్‌ పవర్, అండ్‌ ది పవర్‌ టు బ్యూజ్‌’.  శిక్షల నుంచి మినహాయింపు పొందిన అధికారం అంటే ఆమెకు భయం. అధికారం ఇచ్చి, నువ్వేం చేసినా శిక్ష ఉండదని చెప్తే అధికారం దుర్వినియోగం అయ్యే అవకాశాలు ఉంటాయి. దుర్వినియోగం చెయ్యడానికే నీకీ అధికారం అని చెప్పినట్లూ అవుతుంది. అదీ ఈసబెల్‌ భయం.

‘పవర్‌ విత్‌ ఇంప్యూనిటీ’ని చట్టం ఎవరికీ ఇవ్వదు. తీసుకుంటారంతే! ఎందుకు తీసుకుంటారూ అంటే.. అధికారం ఉంది కాబట్టి తీసుకోవాలనిపిస్తుందేమో. పోలీసులకు అధికారం ఉంటుంది. న్యాయ వ్యవస్థకు అధికారం ఉంటుంది. ప్రజాప్రతినిధులకు అధికారం ఉంటుంది. ప్రజలకు ఏమైనా చెయ్యాలంటే అధికారం ఉండాలి కనుక ఉండే అధికారాలివన్నీ. అంతే తప్ప, అధికారం ఉంది కదా అని ప్రజల్ని ఏమైనా చెయ్యడానికి ఉండే అధికారాలు కావు.

మీడియా కూడా మిగతావాటిలా తనకూ అధికారం ఉందనుకుంటుంది.  నిజానికి మీడియాకు ప్రజల తరఫున తనకై తానుగా తీసుకున్న ‘సుమోటో’ లాంటి హక్కు తప్ప, ప్రభుత్వం ఇచ్చిన అధికారం ఏమీ ఉండదు. కానీ ఉందనుకుంటుంది! ఉందనుకున్న ఆ అధికారంతో ఒక్కోసారి జడ్జిలా తీర్పులు ఇస్తుంటుంది. పోలీసులా ప్రశ్నలు వేస్తుంటుంది. బాబాలా ప్రవచనాలు చెబుతుంటుంది. పొలిటీషియన్‌ల మీద సెటైర్‌లు వేస్తుంది. ఏ విషయాన్నైనా తను తప్పనుకుంటే తప్పనిపించేలా చెబుతుంది. తను ఒప్పనుకుంటే ఒప్పనిపించేలా చెబుతుంది. తను దారుణం అనుకుంటే దారుణం అనిపించేలా చెబుతుంది. ఇదే ‘మోరల్‌ బైనరీ’.  దారుణాన్ని దారుణం అని చెప్తే చాలు. దారుణంగా చెప్పాలా!

భాషను మార్చుకుంటున్న ఏజ్‌లో ఉన్నాం మనం. ‘తమదైన శైలిలో విచారించగా..’ అని పోలీసుల గురించి మీడియా చెప్పడం కూడా సరికాదు. పోలీసుల అధికార దుర్వినియోగాన్ని ఒక శైలిగా సూత్రీకరించడం అది. నాగర్‌కర్నూల్‌లో భర్త హత్య కేసు విషయంలో స్వాతిని అరెస్ట్‌ చేసిన వార్తను చెబుతున్నప్పుడు మీడియా.. ప్రియుడి మోజులో పడి భర్తను చంపిందనీ, భర్త ప్లేసులో ప్రియుడితో దర్జాగా పుణే చెక్కేద్దామనుకుందనీ, సిగ్గు లేదనీ, శరం లేదనీ.. అసలు ఆడ మనిషే కాదనీ తిట్టిపోస్తుంటే.. పోలీసు అధికారులు మాత్రం ఈ కేసు గురించి మీడియాకు వివరాలు ఇస్తూ.. స్వాతిని అనేకసార్లు ‘స్వాతి గారు ఇలా చేశారు’, ‘స్వాతి గారు అలా చేశారు’ అని ఎంతో మర్యాదగా మాట్లాడుతూ తమకు తెలియకుండానే నేరానికి ‘ఫీల్‌గుడ్‌’ నేరేషన్‌ ఇవ్వడం టీవీలో చూస్తున్నవాళ్లందరికీ కొత్తగా అనిపించింది.

పోలీసులపై సదభిప్రాయం కూడా కలిగించింది. సమాజాన్ని మెరుగు పరచాలని నిరంతరం పరుగులు తీస్తుండే మీడియా.. ఒక రోజు సెలవు పెట్టయినా తన పద్ధతులను మెరుగు పరచుకునే ఆలోచనలు చేస్తే.. వార్త, వార్తలా ఉంటుంది. రచనల్లోని ‘మేజికల్‌ రియలిజం’.. వార్తలు చెప్పడంలో కనిపించకూడదు. కనిపిస్తే అది ‘పవర్‌ విత్‌ ఇంప్యూనిటీ’నే అవుతుంది.

అబార్షన్‌ వార్తల్ని రాసేటప్పుడు జర్నలిస్టులు ఎంత సున్నితంగా ఆలోచించాలో ‘నేర్పించే’ సెషన్‌ ఒకటి ‘గ్లోబల్‌ హెల్త్‌ స్ట్రాటజీస్‌’ ఆధ్వర్యంలో ఈమధ్య న్యూఢిల్లీలో జరిగింది. పిండాన్ని పిండమనే రాయండి తప్ప శిశువు అని రాయకండనీ, రాసేటప్పుడు తప్పొప్పుల ‘మోరల్‌ బైనరీస్‌’ ఇవ్వకండనీ ఆ సెషన్‌లో చెప్పారు. నేరుగా చెప్పండి తప్ప వేరుగా చెప్పకండి అన్నారు. కరెక్టు మాట. అబార్షన్‌ని అబార్షన్‌ అని చెబితే చాలు. ‘దేవుడితో ఆటలు’ (ప్లేయింగ్‌ విత్‌ గాడ్‌) అనక్కర్లేదు. గర్భాన్ని ఉంచుకుంటే గర్భాన్ని ఉంచుకున్నట్లు చెబితే చాలు. ‘మాతృత్వాన్ని కాపాడుకోవడం’ (సేవింగ్‌ మదర్‌హుడ్‌) అనక్కర్లేదు.
- మాధవ్‌ శింగరాజు

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top