మోపిదేవి సుబ్రహ్మోత్సవాలు

Mopidevi Brahmotsavam special - Sakshi

ఆంధ్రప్రదేశ్‌ కృష్ణాజిల్లాలోని మోపిదేవిలో ప్రసిద్ధపు ణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీసుబ్రహ్మణ్యేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలకు రాష్ట్ర నలుమూలల నుంచి పెద్దఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. ప్రతిఏటా ఈ వార్షిక బ్రహ్మోత్సవాలు మాఘమాసంలో 5రోజులపాటు వైభవోపేతంగా నిర్వహిస్తారు. అందులో భాగంగా మూడవరోజు రథోత్సవం నిర్వహించడం జరుగుతుంది. ఈ ఏడాది కూడా ఈ నెల 9 నుంచి 13వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవోపేతంగా నిర్వహించనున్నారు. 

కోరికలు తీర్చే కార్తికేయుడు 
స్వామివారిని దర్శించుకున్న భక్తుల కోర్కెలు నెరవేరతాయని అచంచల విశ్వాసం. ముఖ్యంగా వివాహం కానివారు, సంతానం లేనివారు, ఆర్థికంగా ఇబ్బందులున్నవారు, శత్రుభయం వెంటాడుతున్నవారు, రాహు, కేతు, కుజ, సర్పదోషాలున్నవారిని స్వామివారు కొంగు బంగారమై ఆదుకుంటారు. పుట్టు వెంట్రుకలు, చెవిపోగులు, అన్నప్రాశన, నామకరణం, అక్షరాభ్యాసం, రుద్రాభిషేకాలు, నిత్యకళ్యాణం చేయించుకుంటారు. 

ముడుపుల మల్లి
ఆలయ ప్రాంగణంలో శతాబ్దాల నాటి నాగమల్లి వృక్షం ఉంది. నాగమల్లి వృక్షం పువ్వు వేయిపడగలతో లోపల లింగాకారంతో ప్రకాశిస్తుంది. ఏడాదికి రెండుసార్లు మాత్రమే పువ్వులు విచ్చుకుంటాయి. భక్తులు తమ కోర్కెలు తీర్చాలని కోరుతూ వృక్షానికి ముడుపులు కడతారు. పిల్లల కోసం మహిళలు ఊయలు కట్టి ఊపుతూ బిడ్డలను ప్రసాదించాలని కోరుకుంటారు. 

పుట్టలో పాలు పోసిన తర్వాతనే...
ఆలయానికి వచ్చిన ప్రతి ఒక్కరూ తొలుత పుట్టలో పాలుపోసిన తరువాతనే స్వామివారిని దర్శించుకోవడం విశేషం. పుట్ట కలుగు మోపిదేవి నుంచి దక్షిణకాశీ పెదకళ్లేపల్లి శ్రీ దుర్గా నాగేశ్వర స్వామివారి ఆలయం వరకు ఉన్నట్లు ప్రచారంలో ఉంది.

బ్రహ్మోత్సవ విశేషాలు
నేటి ఉదయం ప్రభాతసేవ, ప్రాతఃకాలార్చనలు, పంచామృతస్నపన, నిత్యహోమం, బలిహరణ, నీరాజన మంత్ర పుష్పాలతో పూజలు సాయంత్రం 3.30 గంటలకు  ప్రత్యేకంగా అలంకరించిన ‘శేష వాహనం’పై రావివారిపాలెం వరకు గ్రామోత్సవం 6.30 గంటలకు ఉత్సాహంగా ఎదురుకోలు ఉత్సవం ఉంటుంది. రాత్రి 8గంటలకు స్వామివారి దివ్య కళ్యాణమహోత్సవం అత్యంత భక్తి శ్రద్ధలతో మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ వైభవంగా నిర్వహిస్తారు. ఇచ్చట ముత్యాల తలంబ్రాలు వినియోగిస్తారు. అనంతరం ‘నందివాహనం’పై ఊరేగిస్తారు. 11వ తేదీ సోమవారం ఉదయం ప్రభాతసేవ, ప్రాతఃకాలార్చనలు, పంచామృతస్నపన, నిత్యహోమం, బలిహరణ, నీరాజన మంత్రపుష్పాలతో పూజలు, అనంతరం రాత్రి 8 గంటలకు మిరుమిట్లు గొలిపే విద్యుత్‌కాంతుల మధ్య ప్రత్యేకంగా అలంకరించిన రథంపై ఆసీనులైన శ్రీ వల్లీదేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారిని గ్రామంలో ఊరేగిస్తారు. 12వ తేదీ మంగళవారం ఉదయం ప్రభాతసేవ, ప్రాతఃకాలార్చనలు, పంచామృతస్నపన, నిత్యహోమం, బలిహరణ, నీరాజనమంత్రపుష్పాలతో పూజలు, 9 గంటలకు వసంతోత్సవం, అవభృధస్నానోత్సవం, శ్రీ సుబ్రహ్మణ్యమాల దీక్షావిరమణ కార్యక్రమం, పూర్ణాహుతులు, అనంతరం స్వామివారి ప్రత్యేక వాహనంపై గ్రామోత్సవం ఉంటుంది. మద్యాహ్నం 3 గంటలకు వేద విద్వత్‌సభ–పండిత సభ నిర్వహించి పండితులను దేవస్థానం తరపున ఘనంగా సత్కరిస్తారు. రాత్రి 7 గంటలకు శమీవృక్షపూజ, రాత్రి 8 గంటలకు ‘మయూర వాహనం’పై స్వామివారిని రావివారిపాలెం వరకు గ్రామోత్సవం నిర్వహించిన అనంతరం ధ్వజావరోహణ కార్యక్రమం ఉంటుంది. 13వ తేదీ బుధవారం ఉదయం ప్రభాతసేవ, ప్రాతఃకాలార్చనలు, పంచామృతస్నపన, నీరాజన మంత్రపుష్పాలతో పూజలు, 10 గంటలకు సుబ్రహ్మణ్య హవనం అనంతరం తీర్థప్రసాదాలు అందిస్తారు. రాత్రి 7 గంటలకు ద్వాదశ ప్రదక్షణలు, 8గంటలకు శ్రీస్వామివారి పుష్పశయ్యాలంకృత పర్యంక సేవతో  కార్యక్రమాలు ముగిస్తారు.
– ఉప్పల సుబ్బారావు, సాక్షి, మోపిదేవి

మాఘంలో ఎందుకంటే..? 
సుమారు 100 సంవత్సరాల క్రితం మార్గశిర మాసంలోనే స్వామివారి బ్రహ్మోత్సవాలు నిర్వహించేవారు. ఆ రోజుల్లో కురుస్తున్న భారీవర్షాలకు రథోత్సవానికి, స్వామివార్ల ఊరేగింపునకు అంతరాయం ఏర్పడటంతో నాటి జమిందారు ఆలయ ధర్మకర్త, ఆలయ ప్రధానార్చకులు బుద్దు రామమ్మూర్తి సంయుక్త నిర్ణయంతో మాఘ మాసానికి మార్పుచేశారు. మార్గశిర మాసంలో నిర్వహించే ఉత్సవాలను చిన్న పవిత్రోత్సవాలుగా నిర్వహిస్తున్నారు. నాటి నుంచి శాస్త్రోక్తంగా మాఘమాసం శుక్లపక్షం చవితితో ప్రారంభించి స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవోపేతంగా ఐదు రోజులపాటు నిర్వహించడం పరిపాటిగా మారింది.
– బుద్దు పవన్‌కుమార్‌ శర్మ ఆలయ ప్రధానార్చకులు 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top