దేవుడే అడిగినా

Madhav Singaraju Article On Nirbhaya Case - Sakshi

సందర్భం

‘‘పాపం ఆ పిల్లలకు మీరైనా క్షమాభిక్ష ప్రసాదించవచ్చు కదా’’ అని నిర్భయ తల్లి ఆశాదేవిని సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది ఇందిరా జైసింగ్‌ అడిగినప్పుడు.. ‘‘దేవుడే వచ్చి అడిగినా నేను క్షమించను’’ అని ఆశాదేవి అన్నారంటే.. దేవుడిక్కూడా వాళ్లను క్షమించమని సిఫారసు చేసే హక్కు లేదని ఆమె గట్టిగా చెప్పడమే.

మాధవ్‌ శింగరాజు
ఉరిశిక్ష పడిన ‘నిర్భయ’ దోషులు చరిత్రలో కలిసిపోడానికి మెడ దగ్గరి ఎముక ‘టప్‌’మన్నంత క్షణకాల సమయం చాలు. ఆ క్షణం తర్వాత ఎవరైనా మాట్లాడేందుకేమీ ఉండదు. ఎవరికీ గుర్తొచ్చేందుకూ ఏమీ ఉండదు. ‘ముఖేశ్‌ సింగ్‌ అండ్‌ కో’ ఏమీ భగత్‌సింగ్‌ అండ్‌ టీమ్‌ కాదు.. మార్చి 23న బ్రిటిష్‌ ప్రభుత్వం వారిని ఉరితీసిందని ఏటా చెప్పుకుని ఘనమైన నివాళి ఘటించడానికి. ఫిబ్రవరి 1న ఉదయం 6 గంటలకు ‘నిర్భయ’ దోషులకు ఉరి అంటున్నారు కాబట్టి.. ఆ రోజు మనం నిద్రలేచి ఏ ఏడుగంటలకో పేపర్లోనో, టీవీలోనో వార్తను చూసి..  ‘ఉరి తీసేశారా..’ అనుకుంటాం తప్ప, షాక్‌ కొట్టినట్లుగా ‘అయ్యో ఉరి తీసేశారా!’ అని పెద్దగా అరుస్తూ చేతిలోని టీ కప్పును మీద ఒలకబోసుకోం. వాళ్లేమీ స్వాతంత్య్ర సంగ్రామ యువ కిశోరాలు కాదు. వాళ్లను ఉరితీశారన్న వార్తను చూసి మనం కోమాలోకి వెళ్లిపోడానికి. మన సంగతి అలా ఉంచండి. నిర్భయ తల్లి ఆశాదేవి మాత్రం ఈసారి కోమాలోకి వెళ్లిపోయేట్లే ఉన్నారు.

వాళ్ల ఉరి తేదీ ఫిబ్రవరి 1 నుంచి మళ్లీ కనుక వాయిదా పడితే! శుక్రవారం ఆమెది దాదాపుగా అదే పరిస్థితి. ఢిల్లీ కోర్టు ఉరిని వాయిదా వేసిందని తెలియగానే నిస్పృహ ఆమె కళ్లలోంచి ఉబికి ఉబికి వచ్చింది. ‘హమే బస్‌ తారీఖ్‌ పే తారీఖ్‌ మిల్‌ రహీ హై’ (తేదీ తర్వాత తేదీ మాత్రమే మాకు లభిస్తోంది) అని ఆక్రోశించారు. ‘‘నా కూతుర్ని పాడు చేసినట్లే, ఆ నలుగురూ న్యాయదేవతనూ పాడు చేస్తున్నారు’’ అని వేదన పడ్డారు. ప్రతిసారీ ఆమెకు ఇలాగే అవుతోంది. కోర్టు శిక్షను విధించినప్పుడు తన కూతురికి న్యాయం జరిగిందని కళ్లు తుడుచుకోవడం, శిక్ష అమలు వాయిదా పడగానే తన కూతురికి అసలు ఎప్పటికైనా న్యాయం జరుగుతుందా అని కన్నీళ్లు పెట్టుకోవడం! నవ్విస్తే అంతలోనే నవ్వి, ఏడిపిస్తే అంతలోనే ఏడ్చే పిల్లలా తయారైంది ఆమె మానసిక స్థితి. జనవరి 22 ఉదయం 7 గంటలకు ఉరిని ఖరారు చేస్తూ ఈ నెల 7న కోర్టు డెత్‌ వారంట్‌ జారీ చెయ్యగానే తన ఏడేళ్ల పోరాటం ఫలించిందనే నిర్భయ తల్లి అనుకున్నారు.

ఆ లోపలే ఉరి ఫిబ్రవరి అనే మాట! ఉరికి తీహార్‌లో ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. తలారి కూడా తాళ్లు పేనుకుని కూర్చున్నాడు. దోషుల బరువుకన్నా యాభై కిలోలు ఎక్కువ బరువున్న ఇసుక బస్తాలను ‘ఉరి తీసి’ పరీక్షించుకున్నారు. కుటుంబ సభ్యులొచ్చి  చివరి చూపు చూసి వెళ్తున్నారు. ఇక అంతా అయిపోయినట్లే.. మిగిలింది అంతిమశ్వాసే అనుకుంటుండగా.. మరోసారి ఉరి వాయిదా. ఇంత సాగతీత ఏమిటని నిర్భయ తల్లి హృదయం క్షోభించడం న్యాయమే. అయితే చట్టం తీసుకుంటున్న సమయం కూడా ఆ తల్లికి న్యాయం చేయడానికే. మూడేళ్ల క్రితమే 2017 మే 5 న సుప్రీంకోర్టు.. ‘ఉరే సరి’ అని కింది కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. అదే సమయంలో ఉరిని తప్పించుకునేందుకు దోషులకు చట్టంలో ఉన్న మూడు దారులను కూడా చూపించింది. మొదటిది రివ్యూ పిటిషన్‌. అది ఫలించకపోతే క్యురేటివ్‌ పిటిషన్‌. అదీ నిష్ఫలం అయితే క్షమాభిక్ష పిటిషన్‌. మొదటి రెండు పిటిషన్‌లు సుప్రీంకోర్టులో వేసేవి.

క్షమాభిక్ష పిటిషన్‌ రాష్ట్రపతికి సమర్పించుకునేది. దోషులు నలుగురూ ఒకేసారి ఒక దాని తర్వాత ఒకటిగా ఈ మూడు దారుల్లోనూ వెళ్లిపోయి, అక్కడ కూడా వాళ్లకేమీ దక్కకపోయుంటే ఈ సరికి బహుశా ఉరి అమలు జరిగి ఉండేది. కానీ అలా జరగలేదు. మొదట ముఖేశ్‌ సింగ్, వినయ్‌ శర్మ, పవన్‌ గుప్తా ఏమాత్రం జాప్యం లేకుండా రివ్యూ పిటిషన్‌లు వేశారు. వేసిన ఏడాది తర్వాత 2018 జూలై 9న సుప్రీంకోర్టు వాటిని తిరస్కరించింది. అక్షయ్‌ ఠాకూర్‌ ఒక్కడూ 2019 డిసెంబర్‌ 10న రివ్యూ పిటిషన్‌ వేశాడు! నిజానికి సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన నెలలోపే రివ్యూ పిటిషన్‌ వెయ్యాలి. అయితే బలమైన కారణాలేవో చూపించి అక్షయ్‌ తరఫు న్యాయవాదులు ఆలస్యంగా రివ్యూ పిటిషన్‌ వేశారు. వేసిన ఎనిమిది రోజుల్లోనే అది తిరస్కరణకు గురైంది. ఇక ఈ నలుగురికీ మిగిలిన రెండో దారి క్యురేటివ్‌ పిటిషన్‌. గత ఏడాది జనవరి 9న ముఖేశ్‌ సింగ్, వినయ్‌ శర్మ క్యురేటివ్‌ పిటిషన్‌ను పెట్టుకున్నారు. కోర్టు వాటిని ఐదు రోజులకే (జనవరి 14న) తిరస్కరించింది.

అక్షయ్‌ ఠాకూర్, పవన్‌ గుప్తా అసలు క్యురేటివ్‌ పిటిషనే పెట్టుకోలేదు. రివ్యూ పిటిషన్‌లా నెలలోపు కాకుండా, ఉరి తేదీ లోపు ఎప్పుడైనా క్యురేటివ్‌ పిటిషన్‌ వేసుకోవచ్చు. ఇప్పుడు మళ్లీ ఫిబ్రవరి 1న ఉరి అన్నారు కాబట్టి ఆ లోపు అక్షయ్, పవన్‌ క్యురేటివ్‌ పిటిషన్‌ పెట్టుకునే వీలు ఉంటుంది. ఆ తర్వాత ఇక ఈ నలుగురికీ మిగిలి ఉండే ఏకైక మార్గం రాష్ట్రపతి క్షమాభిక్ష. ముఖేశ్‌ సింగ్‌ ఒక్కడే ఈ జనవరి 14న  క్షమాభిక్ష కోరాడు. రాష్ట్రపతి దానిని జనవరి 17నే తిరస్కరించారు. క్షమాభిక్షను తిరస్కరించిన తర్వాత ఉరి తీయడానికి కనీసం వ్యవధి 14 రోజులు ఉండాలి కనుక రెండో డెత్‌ వారెంట్‌ ఫిబ్రవరి 1 అయింది. తక్కిన ముగ్గురూ రాష్ట్రపతికి పిటిషన్‌ పెట్టుకోలేదు.వీళ్లలో ఒకరో ఇద్దరో లేక ముగ్గురూనో క్షమాభిక్ష పిటిషన్‌ పెట్టుకుని, ఆ పిటిషన్‌ ఢిల్లీ ప్రభుత్వానికి, ఢిల్లీ కేంద్ర పాలిత ప్రభుత్వానికి వెళ్లి, అక్కడి నుంచి రాష్ట్రపతికి చేరి, ఆయన ఒక నిర్ణయం తీసుకుంటే.

ఆ తీసుకున్న తేదీ నుంచి ఉరి మళ్లీ పద్నాలుగు రోజులు వాయిదా పడుతుంది.ఒకే నేరంలో దోషులుగా నిర్థారణ అయినవారిని విడివిడిగా ఉరి తీసిన సందర్భాలు గతంలో లేవు కాబట్టి.. చివరి మూడు దారులనూ ఉపయోగించుకున్న ముఖేశ్‌ సింగ్‌ కూడా.. క్యురేటివ్‌ పిటిషన్, రాష్ట్రపతి క్షమాభిక్ష పిటిషన్‌ వెయ్యని అక్షయ్‌ ఠాకూర్, పవన్‌ గుప్తా; క్యురేటివ్‌ పిటిషన్‌ వేసినా, క్షమాభిక్ష పిటిషన్‌ వెయ్యని వినయ్‌ శర్మల మార్గాలన్నీ మూసుకుపోయే వరకు క్షణాలను లెక్కపెడుతూ ఉండవలసిందే. ఈ నలుగురితో పాటు క్షణాలను లెక్కిస్తూ ఉన్న ఐదో వ్యక్తి నిర్భయ తల్లి ఆశాదేవి. అక్షయ్, ముఖేశ్, వినయ్, పవన్‌.. ఈ ఏడాది జనవరి ఏడున డెత్‌ వారంట్‌ వచ్చినప్పటి నుంచి మాత్రమే క్షణాలను లెక్కిస్తూ ఉంటే.. ఆశాదేవి, ఏడేళ్లుగా దోషుల చివరి క్షణాల కోసం ఎదురుచూస్తూ ఉన్నారు.

►ఇందిరా జైసింగ్‌ విజ్ఞప్తిని పెద్ద మనసుతో అర్థం చేసుకుంటే కనుక.. ఈ దేశంలో రోజుకు 90 మంది తల్లులు తమ కూతుళ్లపై అత్యాచారం చేసిన దోషులకు క్షమాభిక్ష ప్రసాదించడానికి క్యూలో నిలబడవలసి వస్తుంది. ప్రభుత్వ లెక్కల ప్రకారమే.. దేశంలో రోజూ సగటున తొంభై రేప్‌లు జరుగుతున్నాయి మరి!

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top