నిండుకుండ వంటిది నిరాడంబరత | Like the simplicity of the whole pot | Sakshi
Sakshi News home page

నిండుకుండ వంటిది నిరాడంబరత

Jul 24 2014 11:55 PM | Updated on Sep 2 2017 10:49 AM

నిండుకుండ వంటిది నిరాడంబరత

నిండుకుండ వంటిది నిరాడంబరత

నిరాడంబరత అనేది దేహ బాహ్య స్వరూపానికి సంబంధించింది కాదు. అది అంతర్గతమైన లక్షణం. నిరాడంబరత అంటే ఏమీ తెలియని ఒక నిర్లిప్త స్థితి కాదు, అన్నీ తెలిసిన సంపూర్ణ స్థితి.

 హైందవం
 
నిరాడంబరత అనేది దేహ బాహ్య స్వరూపానికి సంబంధించింది కాదు. అది అంతర్గతమైన లక్షణం. నిరాడంబరత అంటే ఏమీ తెలియని ఒక నిర్లిప్త స్థితి కాదు, అన్నీ  తెలిసిన సంపూర్ణ స్థితి. శివుడు, ఆంజనేయుడు, షిర్డీసాయిల నిరాడంబర అభివ్యక్తి నుంచి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉన్నాయి.
 
మహాదేవుడు:  నివాసం శ్మశానం. కంఠహారం సర్పం. ఆయుధం త్రిశూలం. ఆసనం పులిచర్మం. ఇదీ శివుడి నిరాడంబర బాహ్యరూపం. కానీ, దీని అంతరార్థం వేరు. శివుడు ధరించిన త్రిశూలం సత్వ, రజ, తమో గుణాలకు సంకేతం. శరీరంపై సర్పాలు జీవాత్మలు. భస్మం పరిశుద్ధతకు ప్రతీక. ఆసనమైన పులిచర్మం కోరికలను త్యజించమనే సూచిక.
 
వినయ హనుమ: అతి బలవంతుడు హనుమంతుడి జీవన విధానం కూడా ఎంతో నిరాడంబరమైంది. ఎంత శక్తి సంపన్నుడైనా ఎంతో నిరాడంబరంగా ఉన్నాడు. సుగ్రీవుడు, జాంబవంతుల ముందు కూడా వినయంతోనే మెలిగాడు. ‘జై హనుమాన్’ అని ఎక్కడా తనకు జేజేలు కొట్టించుకోలేదు. ‘జై శ్రీరామ్’ అంటూ తన నిరాడంబరతను ప్రకటించుకున్నాడు.
 
బాబా ప్రేమ తత్వం: షిర్డీ సాయిబాబా అత్యంత నిరాడంబర జీవితం గడిపారు. ఒక జుబ్బా, కఫనీ, సట్కా, తంబరి మాత్రమే ఆయన ఆస్తులు. భక్తులు ఇచ్చిన కానుకలను కూడా తిరిగి వారికే అత్యంత ప్రేమగా పంచేసేవారు. బాబాని దర్శించుకునేందుకు నిత్యం వందలమంది భక్తులు వచ్చేవారు. అయినా, పనులన్నీ సొంతంగానే చేసుకునేవారు. భిక్షాటన చేసి భోజనం చేసేవారు. లెండి బావి నుంచి స్వయంగా నీళ్లు తోడి మొక్కలను పెంచేవారు. ఎక్కడికి ప్రయాణమైనా కాలినడకే తప్ప, ఎలాంటి వాహనాలనూ ఉపయోగించలేదు.

ఫకీరులా కనిపించే బాబాకు భగవద్గీత, బైబిల్, ఖురాన్ కరతలామలకం. తన ముందు నిలబడ్డవాడు భక్తుడా మూర్ఖుడా అనే తేడా లేకుండా అందరికీ ప్రేమతత్వాన్ని పంచారు బాబా. సాయి నిరాడంబర జీవన సందేశం కూడా అదే. నిండుకుండ తొణకదు అంటారు. నిరాడంబరత కూడా నిండు కుండలాంటిదే. విజ్ఞానమూ, బలమూ పెరుగుతున్న కొద్దీ మనిషి నిండుకుండలా మారిపోవాలి. నిరాడంబరత అలవర్చుకోవాలి.
 
- సురేష్‌బాబా
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement