కొత్త ఇల్లు

Funday Special Story World - Sakshi

కథా ప్రపంచం

నెత్తి మీద ఏదైనా ఆపద వచ్చిపడితేనేగాని మనిషికి భగవంతుడు జ్ఞాపకానికి రాడు. మతగురువు ఎన్నిసార్లు విషయ లంపటత్వం కూడదని చెప్పినా వినక, ఆయూబ్‌ఖాన్‌ నవయవ్వనంలో ఉన్న కూతురూ, పదేళ్ల వయసు గల కొడుకూ వారం తిరగకుండా చనిపోయి, తన గడ్డంలో తెల్లవెంట్రుక కనపడిన తర్వాత తన జీవితాన్ని మార్చుకునే అందుకు ప్రయత్నం ప్రారంభించాడు. జీవిత విధానం మార్చుకున్న నాటి నుంచి ఆయూబ్‌ఖాన్‌ తాను ప్రస్తుతం నివసిస్తూ ఉన్న ఇల్లు కూడా మార్చాలి అని నిశ్చయించుకున్నాడు. ఆయూబ్‌ఖాన్‌ పెద్దలందరూ ఆ ఇంట్లో నివసించి అతనిలాగానే విషయ లంపటులై జీవితం గడిపారు. అందువల్ల ఆ ఇంటిలో నివసించినంత కాలమూ భగవదారాధన వైపు దృష్టిపోదని అతని అభిప్రాయం.

అందువల్ల తాను ఒక వేరే ఇల్లు అద్దెకు తీసుకుని, తనకు పైతృకంగా సంక్రమించిన ఇంటిని తన చివరి ఉంపుడుగత్తె నాజియాకు ఇచ్చి వేశాడు. నాజియాకు కూడా తన సౌందర్యం మీద పూర్వం ఉన్నంత నమ్మకం లేకపోవడం వల్ల ఆ ఇంటితోనే సంతోషించి, చేపను వలలో నుంచి వదిలిపెట్టింది. ఆయూబ్‌ఖాన్‌ తన నివాసార్థం కొత్త ఇల్లు కట్టించడం ప్రారంభించాడు. నమాజు చేసిచేసి అలసిపోయి విశ్రాంతి అవసరమని తోచగానే కొత్త ఇల్లు ఎంతవరకు తయారైందో చూడటానికి బయలుదేరేవాడు. అందువల్ల అతని మనసుకు చాలా కులాసా చిక్కేది. ఇల్లు తొందర తొందరగా తయారవడం చూసి భగవంతుడు తన ప్రార్థనలను అంగీకరిస్తున్నాడని అనుకున్నాడు. తన భుజాల మీద ఉన్న పాపభారం తేలిక అయిపోయిందనుకున్నాడు. ఆ కొత్త ఇంటికీ, అతని ఆత్మిక జీవితానికీ ఒకరకపు అవినాభావ సంబంధం ఏర్పడిపోయింది. అందుకు తనలో తాను ఆశ్చర్యపడుతూ ఉండేవాడు.

తొందరగా ఇల్లు కట్టించే భారాన్ని తన ఏజెంటు ముమిద్‌ఖాన్‌కు అప్పగించాడు. శరవేగంతో ఇల్లు పూర్తి చేయించాలని చెప్పాడు. ‘‘ముమిద్‌ఖాన్‌! డబ్బు కోసం నువ్వు వెనుకాడవద్దు. ఎంత డబ్బు కావాలన్నా, అప్పు తెచ్చి అయినా సరే ఇస్తాను. ఫకీరు జీవితం గడపడం కోసం నేను ఈ ఇల్లు కట్టించుకుంటున్నాను. ఒక్కరోజు ఆలస్యమైనా నా మనసుకు ఎంతో బాధ కలుగుతుంది’’ అని చెప్పాడు.
ప్రతిరోజూ సాయంత్రం ఆయూబ్, ముమిద్‌ఖాన్‌లు ఇలాంటి మాటలే మాట్లాడుకుంటూ ఉండేవాళ్లు.
‘‘కప్పు వేయించడానికి ఎన్ని రోజులు పడుతుంది?’’
‘‘పదిహేను రోజులు’’
‘‘గోడలకు సున్నం వేయించడం? తొందరగా పూర్తి చెయ్యాలి.’’
‘‘చిత్తం. అలాగే..’’
ఆయూబ్‌ఖాన్‌ చీకటి పడిన తర్వాత మోటరెక్కి అద్దె ఇంటికి వెళ్లిపోయాడు.
ఇది జరిగిన మర్నాడు ఆయూబ్‌ఖాన్‌ మళ్లీ మామూలుగా ఇల్లు చూడటానికి వచ్చాడు.
‘‘నవాబ్‌గంజ్‌లో ఒక ఇల్లు పూర్తి చేసిన కొందరు మేస్త్రీలనూ, కూలీలనూ మన పనికి పిలిచాను. వాళ్లు చాలా తెలివైన వాళ్లు. పది రోజుల్లోనే ఇల్లు పూర్తి చేస్తారు’’ అని ముమిద్‌ చెప్పాడు.
‘‘మంచి పని చేశావు’’ అంటూనే ఆయూబ్‌ఖాన్‌ ఇంటి చుట్టూ తిరగడం ఆరంభించాడు. నిన్నటికీ, ఈ రోజుకీ మధ్య జరిగిన అభివృద్ధి గురించి ముమిద్‌ బోధపరుస్తూ, పక్కన ఉన్న మేస్త్రీలను చూపించి ‘‘వీళ్లు ఈ రోజున కొత్తగా పనిలోకి వచ్చినవాళ్లు’’ అని పరిచయం చేశాడు.
మేస్త్రీలు యజమానికి వంగి సలామ్‌ చేశారు. ‘‘తమ ఆరోగ్యం బాగా ఉన్నదా?’’ ఒక మేస్త్రీ కుశల ప్రశ్న వేశాడు.
ఆయూబ్‌ఖాన్‌ అతనికేమీ జవాబు చెప్పలేదు. అతని దృష్టి అంతా ఇంకొకవైపు ఉంది. ఆ మేస్త్రీలకు కొంచెం దూరంలో ఒక నవ యవ్వనవతి కూలి పని చేస్తోంది. తనవంక తదేకధ్యానంగా చూస్తూ ఉన్న ఆయూబ్‌ను చూసి ఆ పిల్ల చిరునవ్వు నవ్వింది. ఆయూబ్‌ఖాన్‌ శరీరంలో విద్యుత్తు ప్రవహించినట్లనిపించింది. ముఖం ఎర్రబారింది.
‘‘ఈ సున్నం బాగాలేదని మేస్త్రీలు తగాదా పెడుతున్నారు. మంచి సున్నం ఇంకొక కంపెనీలో తెప్పిస్తే బాగుంటుంది’’ అన్నాడు ముమిద్‌.
ఆయూబ్‌ఖాన్‌ అందుకేమీ జవాబు చెప్పలేదు. ఇల్లు కూడా పూర్తిగా చూడలేకపోయాడు. ఎటు చూసినా అతనికి ఆ పిల్ల సౌందర్యమే కనిపించసాగింది. మేస్త్రీలూ, ఆ పిల్లా అందరూ తమ తమ పనుల్లో నిమగ్నమై ఉన్నారు. ఆయూబ్‌ఖాన్‌ శరీరం స్వాధీనం తప్పిపోసాగింది. గుండెల్లో తుఫాను రేగింది. ఆ తుఫాను ముందు తన పరిస్థితి గడ్డిపరకలా ఉందని తెలుసుకున్నాడు.
‘‘కాని దీనికంతకూ కారణం? నేను అనేక వందలమంది నవయువతుల సౌందర్యాన్ని అనుభవించిన వాణ్ణి. మరి ఈ సైతాను– ఈ కూలిపిల్లను చూసినప్పుడు నాలో కలిగిన మార్పు కొత్తగా ఉందే. ఇది ప్రేమ కాదు. ఇది సౌందర్యం కాదు. ఇది కామవాసనా జనితమైన హృదయోద్వేగం కాదు’’ అనుకుంటూ గబగబా ఇంటికి వెళ్లిపోయాడు. రెండుసార్లు నమాజ్‌ చేశాడు. భగవద్ధ్యానం ప్రారంభించాడు. ఆ కూలిపిల్ల మాత్రం అతని కళ్లకు కట్టినట్టు కనబడుతూనే ఉంది. అయితే అంతమాత్రంచేత అతని ధ్యానం భగ్నం కాలేదు. అందువల్ల అది భగవంతునికి కూడా ఇష్టమే అనుకున్నాడు. కళ్ల వెంట నీళ్లు కార్చాడు. ‘‘ఆశ్చర్యం, ఆశ్చర్యం’’ అని పెద్దగా అరిచాడు.
ఉదయం నిద్రలేచాడు. తాను మారిపోయాననుకున్నాడు. సాధారణ దుస్తులు ధరించడం అంతకు పూర్వం శిక్షగా భావించేవాడు. కాని, ఆనాడు అతనికి ఆ దుస్తులు చాలా అందంగా కనిపించాయి. మనసుకు కులాసాగా ఉందనుకున్నాడు. ఫలహారం తెచ్చిన నౌకరును ప్రేమగా పలకరించాడు. అందుకు నౌకరు కూడా ఆశ్చర్యపడ్డాడు. చీవాట్లు లేకుండా అతను ఎప్పుడూ తిరిగి పోలేదు. ఆ రోజు తనతో పని ఉండి వచ్చిన వారందరితోనూ చాలా ఆప్యాయంగా మాట్లాడాడు.
సాయంత్రం కొత్త ఇల్లు చూడటానికి బయలుదేరాడు. ఆ రోజు కూలీల దగ్గరకుపోయి కూర్చున్నాడు. కూలీలతో తానే మాట్లాడటం ఆరంభించాడు. తాను కూడా ఆ కూలీలలో ఒకడినే అనుకున్నట్లుగా ప్రవర్తించాడు. ఒక ముసలి మేస్త్రీ కష్టపడి పని చేస్తూ ఉంటే చూశాడు. అతనంటే మరీ జాలిపడ్డాడు. అతని పక్కకు చేరి కూర్చున్నాడు.
‘‘ఏమోయి నవ్వు కూడా ఇక్కడికి ఇవాళే పనికి వచ్చావా?’’
‘‘కాదు బాబూ! చాలా రోజుల్నుంచి ఇక్కడే పనిచేస్తున్నాను.’’
‘‘మరి నువ్వు ఇవాళే కనబడుతున్నావేం?’’
‘‘బీదవాళ్లను ఎవరు చూస్తారు బాబూ!’’
ముసలివాడన్న మాటకు ఆయూబ్‌ఖాన్‌ను కోసం రాలేదు. తాను కూడా వాళ్లలో ఒకడనైపోదామనుకున్నాడు. కూలీలకూ, తనకూ మధ్యనున్న ఇనుపగోడను పగలగొట్టేయాలనుకున్నాడు.
‘‘పాపం, నువ్విక్కడ నెల్లాళ్ల నుంచి పనిచేస్తున్నా నేను ఇవాళే నిన్ను చూస్తున్నాను. ధనవంతుడు స్వర్గానికి పోవడం, ఒంటె సూదిబెజ్జంలో నుంచి దూరిపోవడం వంటిదని మహమ్మద్‌ సాహెబ్‌ ఎందుకు చెప్పాడో ఇప్పుడు నాకు బోధపడుతోంది. ఇంతవరకు నా జీవితాన్ని చాలా విశృంఖలంగా గడిపాను. ఈ మధ్య నా ఇద్దరు బిడ్డలూ ఒకే వారంలో గతించారు. ఆనాటి నుంచి భగవంతుని ధ్యానించడం ప్రారంభించాను. భగవంతుని మరచిపోయినవాడి గతి గురించి ఏం చెబుతాం?’’
‘‘నిజం బాబూ! ఈ లోకమే భగవంతునిది. అట్టి భగవంతుణ్ణి మరచిపోతే ఈ లోకంలో ఉండడమెలా?’’
‘‘అందువల్లనే ఆ పాత ఇల్లు కూడా వదిలేసి, ఈ కొత్త ఇంట్లో కాపురముండి భగవద్ధ్యానం చేసుకుందామనుకుంటున్నాను. ఈ ఇంట్లో బీదతనాన్ని అనుభవిస్తూ జీవితం గడపాలనుకుంటున్నాను.’’ అంటూ ఆయూబ్‌ఖాన్‌ ఏదో ఆలోచిస్తూ నిశ్శబ్దంగా ఉండిపోయాడు. ముసలివాడు తన పని ప్రారంభించాడు. ముసలివాడూ, ఆయూబ్‌ఖాన్‌ ప్రాణస్నేహితులైపోయారు.
అక్కడి నుంచి మెల్లగా లేచి ఆ కూలిపిల్ల దగ్గరకు పోయాడు. ఆ పిల్ల ఆయూబ్‌ఖాన్‌ను చూసి ఒక చిరునవ్వు నవ్వి తన పని తాను చేయసాగింది. ఆ చిరునవ్వు అతనికి ఎంతో సంతోషాన్నిచ్చింది. ఆ చిరునవ్వులో ప్రేమా, సహానుభూతీ అతనికి కనిపించాయి. ‘‘ఆ చిరునవ్వులో ఉన్న శక్తి భాషలో ఎక్కడ ఉంటుంది? అయినా ఆ కూలిపిల్లను నేను ప్రేమించడమేమిటి?’’ అని ఆలోచించాడు. ప్రాణిమాత్రులనల్లా ప్రేమించడం నేర్చుకోవాలని కూడా అనుకున్నాడు.
ఆనాటి నుంచి కూలీలతో మనసువిప్పి మాట్లాడటం అలవరచుకున్నాడు. ఆ మాటల్లో అతనికొక ఆనందం కలిగేది. ఆ ఆనందంతోనే భగవంతుని ఎదుట నమాజు చేసేవాడు. ఆ కూలిపిల్లను చూసినప్పుడల్లా అతనిలో ఏదో ఒక విచిత్రానుభూతి కలుగుతూ ఉండేది.
ఇల్లు కట్టడం పూర్తయింది. గోడలకు సున్నం వేస్తున్నారు. ఆయూబ్‌ఖాన్‌ ఇల్లు చూడటానికి వచ్చాడు. ముసలి మేస్త్రీ ‘‘ఏమి బాబూ! ఇంట్లో ఐదు గదులు కట్టిస్తున్నారు. మీరు ఎప్పుడూ నమాజు చేసుకుంటూ ఉంటారు. మీకు రెండు గదులు చాలు. మిగతా గదుల్లో ఎవరుంటారు? మీరు పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు?’’ అని అడిగాడు.
ఆయూబ్‌ఖాన్‌ నవ్వాడు. జవాబివ్వలేదు. ఆయూబ్‌ఖాన్‌ భార్య ఐదేళ్ల కిందట చనిపోయింది. అప్పట్లో ఆయూబ్‌ఖాన్‌కు పెళ్లి చేసుకోవలసిన అవసరం కూడా లేకపోయింది. మేస్త్రీ అన్న మాట కూడా నిజమే. రెండో పెళ్లి చేసుకుంటే తప్పేమిటి? మొదటి భార్యను కష్టపెట్టాను గనుక రెండో భార్యను సంతోషపెడితే–
కూలిపిల్ల కనబడింది. ఆయూబ్‌ఖాన్‌ ఆ పిల్లను పలకరించి మాట్లాడటం ఆరంభించాడు. లేచి ఆ పిల్ల పని చేస్తూ ఉన్న చోటికి వెళ్లాడు. ఆ పిల్ల తన భార్య అయితే ఎలా ఉంటుందో చూద్దామని అతనికి అభిలాష కలిగింది. ఆ మాటలూ, ఈ మాటలూ మాట్లాడుతూ ఆ పిల్లవంక తదేక ధ్యానంగా ఒక అరగంటసేపు చూశాడు. అతని కళ్ల ముందు కొత్త ఇల్లూ కొత్త జీవితం తాండవమాడసాగాయి. తను నమాజు చేస్తూ ఉంటే తన భార్య ఉండి ఉండి గదిలోకి వచ్చి చూసి పోతూ ఉంటుంది. అప్పుడామె కళ్లు ఎలా ఉంటాయోనని ఆమె కళ్ల వంక చూశాడు. ఇద్దరూ కలసి కులాసాగా షికారుకు పోతే అక్కడ సూర్యాస్తమయం అయితే ఆమె ఆనందంతో తన భుజం మీద చెయ్యి వేస్తుంది. అప్పుడు ఆ చెయ్యి శోభ ఎలా ఉంటుందోనని ఆ పిల్ల చేతి వంక పదినిమిషాలు చూశాడు. రకరకాల మధుర భావాలు! మధుర స్మృతులు! తీయని తలపులు! మెల్లగా ఇంటికి వెళ్లాడు. నమాజు చెయ్యబోతే మనస్కరించడం లేదు. ఏదోవిధంగా నమాజు బలవంతాన పూర్తి చేశాడు. భగవద్ధ్యానం చెయ్యబోతే మనసు ఏకాగ్రంగా లేదు. కొత్త ఇల్లు, కొత్త జీవితం, కొత్త భార్య తలపులే.
మంచం మీద శరీరం వాల్చాడు. ‘ఏమిటి ఈ మార్పు? ధ్యానమగ్నుణ్ణి కాలేకపోతున్నాను. ఈ కొత్త తుపానులో భగవంతుణ్ణి మరచిపోతానా?’ అనుకుంటూ కళ్లు మూశాడు. ఆ కూలిపిల్ల రెండు కళ్లూ తనను ఆహ్వానిస్తున్నాయి. ఆమె స్మరణ మాత్రం చేతనే నమాజు చెయ్యలేకపోతున్నాను. తీరా రేపు ఆమె దగ్గరకు వస్తే, అని ఆలోచించాడు. ఆమెను తాను స్వీకరించడం భగవంతునికి ఇష్టం లేదేమోనని ఇంకో ఆలోచన. మనసు ఆగడం లేదు. ఆవేశం అధికమైపోతోంది. కళ్లు మూస్తే... ఆ పిల్ల కళ్లు...
‘ఆ పిల్లను వివాహం చేసుకోవడమా లేదా... అది ఒక సమస్య. ఆమెను వివాహమాడటమే మంచిది. అయితే, బంధువులందరూ అంగీకరిస్తారా? కూలిపిల్ల కదూ? బంధువుల కోసం ఆలోచిస్తే బంధువులు సమాజం పేరుతో నిర్దోషులను కూడా రోజూ కొరత వేయిస్తున్నారు. అందువల్ల వాళ్ల కోసం లెక్క చెయ్యకూడదు. కూలిదాన్ని పెళ్లి చేసుకున్నాడని ఇంటి నౌకర్లు కూడా ఎగతాళి ప్రారంభిస్తారేమో! బహుజనాభిప్రాయం మార్చడం ఎలా? లాఠీ చూపించి అభిప్రాయం మార్పించగలమా? ఒకరు ఎగతాళి చేస్తారని మనం ఏ పని మానేస్తున్నాం? ఆత్మశుద్ధిగా మనం చేసే పనికి ఇంకొకరి అభిప్రాయంతో పనేమిటి?’
ఇలా ఆలోచిస్తూనే ఉన్నాడు. నౌకరు టీ తీసుకురావడం ఆలస్యమైంది. నౌకరును పిలిచి టీ తీసుకుని రమ్మన్నాడు. నౌకరు టీ తీసుకు రాలేదు గనుక, ఈ వివాహం సుఖకరం కాదనుకున్నాడు.
ఏవేవో ఆలోచనలు!!
అర్ధరాత్రిదాకా అలాగే కాలం గడిపి చివరకు నిద్రపోయాడు.
తెల్లవారింది. కొత్త ఇల్లు చూడటానికి పోవాలి. కూలీలు పనిని ప్రారంభించి ఉంటారు.
తన కొత్త జీవితం ఎలా ఉండాలో, ఉంటుందో, అది కూడా ఆలోచించుకోవాలి. ఏమీ ఆలోచన తెగడం లేదు. మోటారు కొత్త ఇంటికి చేరింది.
కూలీలంతా పెద్దపెద్దగా నవ్వుతూ ఏదో మాట్లాడుకుంటున్నారు. ఆయూబ్‌ఖాన్‌ కారు దిగి ముసలి మేస్త్రీ దగ్గరకు వెళ్లాడు. ముసలి మేస్త్రీ ‘‘ఆ పిల్ల వెళ్లిపోయింది బాబూ! రెండు రోజులు కూలి కూడా వదిలేసి వెళ్లిపోయింది’’ అన్నాడు.
ఏ పిల్ల?
ఆయూబ్‌ఖాన్‌కు ఆ పిల్ల పేరు కూడా తెలియదు. అయినా ఆ కూలిపిల్లేనేమో అనుకున్నాడు.
‘‘ఆ పిల్లేనండి. తమను చూసి నవ్వుతూ ఉంటుంది.’’
‘‘ఎలా వెళ్లిపోయింది?’’
‘‘మిఠ్ఠూగాడు తనకు కాన్పూరులో ఇల్లుందనీ, కూలి చేసి తిండి సంపాదించి పెడతాననీ చెప్పాడు. దానికి వాడి మీద ఆసక్తి కలిగింది. వాడితో అది లేచిపోయింది బాబూ!’’ ముసలి కూలి జవాబు చెప్పాడు.
‘‘కూలి ఎందుకు వదిలిపెట్టింది?’’
‘‘మాకేం తెలుసు బాబూ!’’
ఆయూబ్‌ఖాన్‌ తల తిరిగిపోయింది. ముఖం వెలవెలబోయింది. మెల్లగా వెళ్లి తన కారులో కూర్చున్నాడు.
‘‘ఇంటికి నడుపు’’ అన్నాడు డ్రైవరుతో. కారు ముందుకు సాగింది. ఆయూబ్‌ఖాన్‌ వెనక్కు తిరిగి కొత్త ఇంటివైపు చూశాడు.
ఉర్దూ మూలం : మహమ్మద్‌ ముజీబ్‌
తెలుగు : వేమూరి ఆంజనేయశర్మ

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top