సాహోరే.. క్యాబీ!

The first transgender to run the cab - Sakshi

తన లైఫ్‌కి తనే టర్నింగ్‌ ఇచ్చుకుంది

మేఘనా సాహును ‘నువ్వసలు ఆడదానివేనా?’ అన్నట్లు చూశారు. ఆ చూపును పట్టించుకోలేదు మేఘన. సమాధానం తనకు తెలియకపోతేనే కదా! చూపుల్ని వదిలి, మలుపుల్ని చూసుకుంది. స్టీరింగ్‌ అందుకుంది.

‘హాయ్‌ మేఘనా! నువ్వు అమ్మాయివా? అబ్బాయివా?’ సంశయంగా, సంకోచంగా అడిగింది లావణ్య. ‘అమ్మాయినే. ఒకప్పుడు మాత్రం అబ్బాయిని’.. ఇబ్బందిగా బదులిచ్చింది మేఘన. ‘ఏమో! అమ్మాయిలాగ డ్రస్‌ వేసుకుంటున్నావ్‌ కానీ నిన్ను చూస్తే అస్సలు అమ్మాయివి అనే అనిపించవు’.. అదోలా ముఖం పెట్టింది మరో కొలీగ్‌ ప్రవీణ. ‘నేను అమ్మాయిలా కనిపించినా, అబ్బాయిలా కనిపించినా మనం కలిసి పని చేయడానికి, కలిసి చేస్తున్న పనికీ అదేమీ ఇబ్బంది కాదు కదా’ అంది మేఘన. ఆ మాటను ఆమె స్థిరంగా అన్నప్పటికీ, ఆమె స్వరంలో సన్నటి బాధ చిగురుటాకులా వణికింది.

చుట్టూ చూపుల ప్రశ్నలు
లావణ్య, ప్రవీణ మౌనంగా ఉండిపోయారు. వెంటనే కంప్యూటర్‌లో ముఖం పెట్టేసి, తమ పనిలో మునిగిపోయారు. కొలీగ్స్‌ ఆ సంగతే మర్చిపోయి ఉండొచ్చు. మేఘన మనసును మాత్రం చెప్పలేనంత నిస్పృహ ఆవరించింది. అది ఫార్మా కంపెనీ. అందరూ చదువుకున్న వాళ్లే. అయినా తన పట్ల కొందరి ప్రవర్తనలో ఉండాల్సిన సభ్యత లోపించింది. అది ఏ ఫ్యాషన్‌ మాల్‌లో జారి పడిపోయిందో, కెరీర్‌ పరుగుల్లో అవసరం లేదని వాళ్లే వదిలేసుకున్నారో ఏమో తెలియదు.

ఏది వదిలేసుకున్నప్పటికీ మంచికో చెడుకో పక్క మనిషి గురించిన ఆరా తీసే తత్వం మాత్రం వదిలిపోలేదు. ఇంటి నుంచి కాలు బయట పెట్టినప్పటి నుంచి మళ్లీ ఇల్లు చేరే వరకు మేఘనపై రకరకాల చూపులు. వాటిని తట్టుకోవడానికి ఆమె సిద్ధమైంది, ఆ చూపులకు అలవాటు పడిపోయింది కూడా. అయితే పరిచయం లేని వాళ్ల చూపులను పట్టించుకోవడం మానేసినంత తేలిక కాదు.. రోజూ సహోద్యోగుల నుంచి ఎదురయ్యే చూపుల వివక్షను ఎదుర్కోవడం.

అవే ఇప్పుడు ప్రశంసలు
అది ఒరిస్సా రాజధాని భువనేశ్వర్‌ నగరం. స్విఫ్ట్‌ డిజైర్‌ కారులో డ్రైవింగ్‌ సీట్‌లో ఉంది మేఘనా సాహు!  ఓలా కంపెనీతో టై అప్‌ అయిందా క్యాబ్‌. మేఘనను ఇప్పుడు ‘నువ్వు అమ్మాయివేనా’ అని అడిగేవాళ్లు లేరు. ఒంటరిగా క్యాబ్‌లో ప్రయాణిస్తున్న ఆడవాళ్లు ‘హమ్మయ్య ఫర్వాలేదు’ అని ఊపిరి పీల్చుకుంటున్నారు. మగవాళ్లు డ్రైవింగ్‌ సీట్‌ వైపు చూసి ‘మన నగరం కూడా జెండర్‌ ఫ్రీ అవుతోంది.. గుడ్‌’ అనుకుంటున్నారు.

ఆ క్యాబ్‌ ఎక్కింది మీడియా పీపుల్‌ అయితే వెంటనే ‘క్యాబ్‌ నడుపుతున్న తొలి ట్రాన్స్‌జెండర్‌’ అని ఓ స్టోరీ రాసేస్తున్నారు. అలా మేఘన గురించి ఒడిశా పత్రికలు రాస్తున్నాయి. జాతీయ చానళ్లు ప్రసారం చేస్తున్నాయి. స్ఫూర్తి పొందడానికి చిన్న సంఘటన చాలు. అది సంతోషాన్నిచ్చేదయినా,  మనసును గిచ్చి మెలిపెట్టేదయినా.. అని అనుకుంటూ ఉంటుంది మేఘన.. తన పాత ఉద్యోగంలో ఎదురైన ప్రశ్నల్ని తలచుకుని. మరొకరికి స్ఫూర్తినివ్వడానికి చిన్న పనైనా చాలు అనుకుంటోంది ఇప్పుడు.


కొడుకు సాయిశుభమ్‌, భర్త వాసుదేవ్‌తో మేఘన..

తడబడితే నిలబడలేం
మేఘనా సాహు ఎంబీఎ చదివింది. ఆ కోర్సు ఒక పనిని సమర్థంగా నిర్వహించడం ఎలాగో నేర్పిందామెకి. సమాజం నుంచి అంతకంటే పెద్ద పాఠం నేర్చుకుందామె.. ‘తడబడితే నిలబడలేం’ అని.  జీవించడానికి తన గౌరవాన్ని పణంగా పెట్టాల్సిన పని లేదని కూడా తెలుసుకుంది. ఇప్పుడు క్యాబ్‌ డ్రైవర్‌గా నెలకు ముప్పై వేలకు తక్కువ కాకుండా సంపాదిస్తోంది.

ట్రాన్స్‌జెండర్‌ల పట్ల సానుభూతి, గౌరవం ఉన్న, ట్రాన్స్‌జెండర్‌ పీపుల్‌ హక్కుల కోసం పోరాడుతున్న వాసుదేవ్‌ యాక్టివిస్టును పెళ్లి చేసుకుంది. ఆరేళ్ల పిల్లాడికి తల్లిగా మాతృత్వపు మధురిమలను ఆస్వాదిస్తోంది మేఘనా సాహు. భర్తకు మొదటి భార్య వల్ల పుట్టిన కొడుకునే ఆమె తన కొడుకుగా పెంచుతోంది. భార్య నుంచి విడాకులు తీసుకున్న తర్వాత వాసుదేవ్‌కి మేఘనతో పరిచయం అయింది. ఆ పరిచయం పెళ్లిగా మారింది.
- మంజీర

నా కోసం.. సడలించారు!
నాకు డ్రైవింగ్‌ లైసెన్స్‌ పెద్ద సమస్య అయింది. ట్రాన్స్‌జెండర్‌లకు కమర్షియల్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఇవ్వడానికి నిబంధనలు అంగీకరించలేదు. ఆర్‌టిఓ అధికారులు నా డ్రైవింగ్‌ స్కిల్స్‌ని ఒకటికి రెండు సార్లు పరీక్షించారు. డ్రైవర్‌గా మారాలనుకున్న నా నిర్ణయాన్ని పెద్ద మనసుతో గౌరవించి వారి విచక్షణాధికారంతో నిబంధనలను సడలించారు.
– మేఘనా సాహు, క్యాబీ

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top