నాడీ నారాయణి

Doctor Srilatha Interview With Sakshi

పరిచయం  డాక్టర్‌ శ్రీలత

అనారోగ్యం నుంచి ఆరోగ్యం వరకు సాగే ప్రయాణంలో రోగికి తోడుగా ఉండేవాళ్లే వైద్యులు. వైద్యవృత్తికి గౌరవం కూడా అదే. అంతే తప్ప ‘ఒకగంటకు ఎంత మంది పేషెంట్లను క్లియర్‌ చేస్తారు’ అని అడిగే కమర్షియల్‌ హాస్పిటళ్లలో ఎలా పని చేయాలి? అంటారు డాక్టర్‌ శ్రీలత. పేషెంట్‌ తన జేబు చూసుకుని భయకుండా ధైర్యంగా డాక్టర్‌ దగ్గరకు రాగలగాలి.

సామాన్యులకు అలాంటి ధైర్యాన్ని కల్పించడంతోపాటు ఆల్టర్నేటివ్‌ మెడిసిన్‌ ఎంత ప్రభావవంతంగా పని చేస్తుందో సమాజానికి తెలియచేయాలనేదే నా లక్ష్యం’’ అంటున్న డాక్టర్‌ శ్రీలత ‘సాక్షి’తో తన లక్ష్యాలను, జీవితాశయాలను, వ్యక్తిగత వివరాలను పంచుకున్నారు.

‘‘మీకు నెలకు లక్షల్లో జీతం ఇస్తున్నాం. కాబట్టి మీరు రోజుకు కనీసం ఇంత మంది పేషెంట్లను చూస్తేనే మాకు గిట్టుబాటవుతుంది’ అనే హాస్పిటళ్లలో డాక్టర్‌లకు అంకిత భావంతో పని చేయాలని ఉన్నా కూడా సాధ్యం కాదు. అక్కడ పేషెంట్‌ చెప్పింది వినడానికి ఒక అసిస్టెంట్, డాక్టర్‌ సూచనలను పేషెంట్‌కు వివరించడానికి మరో అసిస్టెంట్‌ ఉంటారు. డాక్టర్‌ పేషెంట్‌ కోసం కేటాయించేది ఒక నిమిషం నుంచి ఒకటిన్నర నిమిషాలు మాత్రమే. డాక్టర్‌ వచ్చేటప్పటికే అసిస్టెంట్‌లు పేషెంట్‌ను బెడ్‌ మీద రెడీగా ఉంచుతారు. డాక్టర్‌ చెక్‌ చేయడానికి వస్తారు. పేషెంట్‌ ఏదో చెప్పబోతారు. కానీ డాక్టర్‌ వినిపించుకోరు. చెకప్‌ చేసిన డాక్టర్‌ హడావుడిగా వచ్చి తన సీట్లో కూర్చుంటారు.

పేషెంట్‌ డ్రస్‌ సరిచేసుకుని డాక్టర్‌ ఎదుట కూర్చునేటప్పటికే పేషెంట్‌ మెడికల్‌ ఫైల్‌లో డాక్టర్‌ ఏదో రాసి ఉంటారు. ‘ఈ మందులు వాడండి’ అని మాత్రమే చెబుతారు. ఐదు వందల నుంచి వెయ్యి రూపాయలు కన్సల్టేషన్‌ తీసుకున్న స్పెషలిస్ట్‌ డాక్టర్‌ పేషెంట్‌తో మాట్లాడే ఏకైక వాక్యం అదొక్కటే అయి ఉంటుంది చాలా సందర్భాల్లో. పేషెంట్‌ ఇంకా ఏదో అడగడానికి నోరు విప్పేలోపు అసిస్టెంట్‌ వచ్చి వెలుపలికి నడవమని సగౌరవంగా దారి చూపిస్తారు. అప్పటికే కర్టెన్‌కి అవతల మరో పేషెంట్‌ను బెడ్‌ మీద రెడీ చేసి ఉంటారు కూడా.

డాక్టర్‌ లేచి ఆ పేషెంట్‌ దగ్గరకు వెళ్లిపోవడంతో ఇక చేసేదేమీ లేక పేషెంట్‌ నోటి వరకు వచ్చిన అనేక సందేహాలను గొంతులోనే అదిమిపెట్టుకుని బయటకు వచ్చేయడం జరుగుతుంటుంది. ‘వైద్యం అంటే ఇది కాదు’ అంటారు శ్రీలత. ఒక్కో పేషెంట్‌కి కనీసం పది నిమిషాలయినా కేటాయించకపోతే పేషెంట్‌కీ డాక్టర్‌కీ మధ్య అనుబంధం ఎలా ఏర్పడుతుంది అని ప్రశ్నిస్తారామె. ఒక్కోసారి ఒక పేషెంట్‌కే అరగంట టైమ్‌ కేటాయించాల్సి ఉంటుంది. ‘కన్సల్టేషన్‌ ఫీజును టైమ్‌తో కొలవడమంత నేరం మరొకటి ఉండదు. అది వైద్య వృత్తికే అవమానం. వైద్యం పేదవారిని భయకంపితుల్ని చేయరాదు’ అంటారామె.

అప్పుడు వినలేదు
‘‘మా నాన్న దశరథరామయ్య ఇండస్ట్రియల్‌ ఆఫీసర్‌గా కడప, కర్నూలు, అనంతపురం, నెల్లూరుల్లో పని చేశారు. భగవంతుడు మనను ఒక పొజిషన్‌లో ఉంచేటప్పుడే సమాజానికి తిరిగి ఇవ్వాల్సిన బాధ్యతను కూడా మన మీద పెడతాడు. ఆ బాధ్యత నిర్వర్తించకపోతే దేవుడు మనకిచ్చిన పొజిషన్‌ని అగౌరవ పరచడమే అనేవారాయన. ఆయన తాను నమ్మినట్లే జీవించారు. నాన్నకు నన్ను డాక్టర్‌ని చేయాలనే కోరిక ఉండేది. అభిమానంగా వైద్యం చేస్తే పేషెంట్‌లు డాక్టర్‌ను అమితంగా ప్రేమిస్తారు. దేవుడిలాగ చూస్తారు... అని నాకు నచ్చచెప్పేవారాయన. నాకు సైన్సంటే భయం. దాంతో నేనే నాన్నను కన్విన్స్‌ చేసి కామర్స్‌ చదివాను. కామర్స్‌లో చేరిన తర్వాత కూడా ఆయన పబ్లిక్‌ సర్వెంట్‌ ఉద్యోగమైతే ప్రజలకు సేవ చేస్తున్నామనే సంతోషం ఉంటుందనేవారు.

ఆయన కోరిక ప్రకారం సివిల్స్‌ రాద్దామనే ఆలోచన కలిగింది. అప్పుడే నాన్నకు బ్రెయిన్‌ హెమరేజ్‌ వచ్చింది. మూడు నెలలు కోమాలో ఉన్నారు. ఉన్న ఇల్లు అమ్మేసి వైద్యం చేయించాం. టెస్టులకు, ట్రీట్‌మెంట్‌కి లక్షలు ఖర్చయ్యాయి కానీ ఆయన మాకు దక్కనే లేదు. ఆయన మరణం నా జీవిత గమనాన్ని మార్చేసింది. కుటుంబాన్ని, నన్ను నేను నిలబెట్టుకోవడమనే బాధ్యత నా ఎదురుగా నిలిచింది. ఎంబీఏ తర్వాత సాప్‌ కోర్సు చేసి సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగంలో చేరాను. ఏడాదికి లక్షల ప్యాకేజ్‌తో మా జీవితం గాడిన పడింది. మా వారు కూడా సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో మంచి పొజిషన్‌లో ఉన్నారు. అలాంటి సమయంలో నా లైఫ్‌ నేను కూడా ఊహించని విధంగా మరో మలుపు తీసుకుంది.

అందరూ తీర్పరులే!
మా వారితో ఆన్‌సైట్‌లో జర్మనీ వెళ్లాను. నాకు పిల్లలు పుట్టలేదని అప్పటికే అన్ని వైపుల నుంచి ఒత్తిడి మొదలై ఉంది. ఒక మహిళ తల్లికాకపోతే మన సమాజం కూడా తన వంతుగా సలహాలు, తీర్పులిచ్చేస్తుంది. ఆ మానసిక ఒత్తిడితోనే నాకు మల్టిపుల్‌ అబార్షన్‌లయ్యాయి. పిల్లల కోసం కార్పొరేట్‌ వైద్యంలో టెస్ట్‌లకే లక్షల రూపాయలయ్యాయి. అలాంటి సిచ్యుయేషన్‌లో జర్మనీలో ఆక్యుపంక్చర్‌ ట్రీట్‌మెంట్‌ నన్ను మార్చేసింది. ఒక సిట్టింగ్‌లో మైగ్రేన్, ఫ్రోజన్‌ షోల్డర్‌ సమస్యలు తగ్గిపోవడం... చూశాక నాకూ ట్రై చేద్దామనిపించింది.

ఒకసారి చేయించుకున్న తర్వాత దేహంలో మార్పులు స్పష్టంగా తెలిశాయి. దాంతో మొండిగా కంటిన్యూ చేశాను. కన్సీవ్‌ అయిన తర్వాత నేను ఆక్యుపంక్చర్‌తోపాటు న్యూఢిల్లీలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీ నుంచి ఎన్‌డిడివై ఆల్టర్నేటివ్‌ మెడిసిన్‌ కోర్సు చేశాను. డాక్టర్‌ ఫజులూర్‌ రెహమాన్‌ని ఫాదర్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఆక్యుపంక్చర్‌. చెన్నైలో ఆయన దగ్గర ట్రైనింగ్‌ తీసుకున్నాను.

సేవా స్పృహ ఉండాలి
మా పూర్వీకులు ఆయుర్వేద వైద్యం చేసేవాళ్లు. కుటుంబంలో సంప్రదాయంగా వస్తున్న వైద్యానికి నా వైపు నుంచి అంతరాయం కలగకుండా ఉండటానికే భగవంతుడు నా జీవితాన్ని ఇలా మలుపు తిప్పాడని అనుకుంటాను. అలాగే వైద్యానికి ఇంత ఫీజు నిర్ణయించడం వైద్యశాస్త్రంలోనే లేదు. చెరకు బండి వాళ్లు, కూరగాయల వాళ్లు వంద ఇస్తే అంతే తీసుకుంటాను. సంపన్నులు ధారాళంగా ఇవ్వగలుగుతారు. భగవంతుడు మన దగ్గరకు సంపన్నులైన పేషెంట్‌లను పంపించాడంటే మన జీవికకు ఆయనే ఒక భరోసా కల్పిస్తూ, పేదవారికి సేవ చేయమని చెప్తున్నాడని అర్థం. రోగానికి పేదరికం, సంపన్నత అనే తేడా ఉండదు. ఆ స్పృహ వైద్యుడికి ఉండాలి. మా నాన్న కోరుకున్నట్లు మంచి వైద్యురాలిగా పేరు తెచ్చుకోవడంతోపాటు మనదేశంలో తక్కువ ఖర్చుతో వైద్యవిధానాలున్నాయని తెలియచెప్పడమే నా జీవితాశయం’’ అన్నారు డాక్టర్‌ శ్రీలత.
ఇంటర్వ్యూ : వాకా మంజులారెడ్డి
ఫొటోలు: నోముల రాజేశ్‌ రెడ్డి

చట్రంలోకి వెళ్లలేదు
ఇప్పుడు చాలా హాస్పిటళ్లలో ఆక్యుపంక్చర్‌ విభాగాన్ని పెడుతున్నారు. అయితే వాళ్లడిగినట్లు గంటకి ఇంత మందిని చూడాలనే నియమానికి నేను వ్యతిరేకం. పైగా ఈ వైద్యవిధానంలో కొన్ని రకాల సమస్యలకు వైద్యాన్ని కొన్ని సమయాల్లోనే చేయాల్సి ఉంటుంది. పదకొండు నుంచి మధ్యాహ్నం మూడు వరకు విరామం ఇవ్వాలి. ఆ టైమ్‌లో నేను ట్రీట్‌మెంట్‌ చేయను... అంటే హాస్పిటళ్లు అంగీకరించవు. అందుకే ఆ చట్రంలోకి వెళ్లలేదు. ఈ వైద్యం చేయాలంటే డాక్టర్‌ కూడా లైఫ్‌స్టైల్‌ను మార్చుకోవాలి. ఇది అగస్త్య మహాముని ప్రాక్టీస్‌ చేసిన వైద్యవిధానం.

వైద్యులు రోజూ సముద్ర స్నానం చేయాలి. సముద్ర స్నానం అన్ని చోట్లా సాధ్యం కాదు కాబట్టి రాత్రి ఏడు గంటల సమయంలో ఇంట్లో అర బకెట్‌ నీటిలో మూడు కప్పుల ఉప్పు కలిపి ఆ నీటితో తలారా స్నానం చేయాలి. మరో నియమం ధ్యానం. పేషెంట్‌ల నుంచి డాక్టర్‌లకు నెగెటివ్‌ ఎనర్జీ ప్రసారమవుతుంటుంది. రోజూ ఉదయం ధ్యానం చేసి డాక్టర్‌లు తమలో పాజిటివ్‌ ఎనర్జీని నింపుకోవాలి. ఇవన్నీ పాటించాలంటే సోషల్‌ లైఫ్‌ని కొంత త్యాగం చేయక తప్పదు. పేషెంట్‌ కళ్లలో కనిపించే సంతోషంకంటే మరేదీ ఎక్కువ కాదు.
– డాక్టర్‌ శ్రీలత

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top