ప్రశ్నపత్రమేదైనా జవాబు.. ఓటే!

Dileep Reddy Article On Voters - Sakshi

సమకాలీనం

పాలక పక్షాల నోటికొచ్చింది సమాచారం! విడదీయరాని ఆర్థిక బంధాలతో వాటికి ఊడిగం చేస్తున్న పచ్చ ప్రసారమాధ్యమాలు అసత్యాలు, అర్థసత్యాలను వ్యాప్తి చేస్తున్నాయి. అసలు ప్రజాభిప్రాయంతో నిమిత్తం లేకుండా, ఇదే ప్రజాభిప్రాయమంటూ వండి వారుస్తున్నాయి. పాలకుల నోటికి హద్దు లేదు. నిన్న ఒక మాట నేడు ఒక మాట! ఎన్నికల ముందొక మాట, తర్వాత మరో బాట! ఓటరుకిది పరీక్షా సమయం. పరీక్షలెన్నయినా, ప్రశ్న పత్రాలేవైనా జవాబు ఒకటే, ఓటే!

ఎక్కడో పోయి పోరాటాలు చేయడం కాదు, నీలోనే ఉన్న అరిషడ్వర్గాలనే అంతఃశ్శత్రు నిర్మూలనకు నడుంకట్టు, అంతా మంచే జరు గుతుంది అంటారు తాత్వికులు. మనిషిలోని కామ, క్రోధ, మోహ, లోభ, మద, మాత్సర్యా లనే ఆరు అవలక్షణాల్ని అదుపు చేయగలిగితే అంతా జయించినట్టే అనేది దానర్థం. జానపద గాథల్లో, మన సినిమాల్లో చూపించినట్టు వేరె వరో ఉద్ధారకులు జాతిని తీర్చిదిద్దడానికి ఆకాశం నుంచి ఊడిపడరు! ఎవరిని వారు సంస్కరించుకొని, అంతా బుద్ధిగా నడుచుకుంటే సమా జం దానంతట అదే బాగవుతుందని తాత్పర్యం. బుద్ధి మందగించి వాటిని చెలరేగనిచ్చినపుడు మనిషైనా, సమాజమైనా పతనం అంచు లకు జారడమే! ఏదైనా అంతే! ధర్మాధర్మాలు అన్ని యుగాల్లోనూ ఉన్నాయి. వాటి నిష్పత్తిలో హెచ్చుతగ్గులే యుగధర్మాల్ని మార్చాయి, రాను రాను దిగజార్చాయి. ఇప్పుడు ఎన్నికల్నే తీసుకుందాం, ఓటరు బలహీనతపైన పాలకులు, పాలకపక్షాలు చేసే రాజకీయ విన్యాసాలు  జుగుప్సాకరంగా ఉంటున్నాయి.

ఎన్నిక ఎన్నికకు మరింత దిగజారుడు తనం తేటతెల్లమౌతోంది. తెలుగు సమాజంలో ఇదివరకు ఏ ఎన్నిక ల్లోనూ లేనంతగా ‘కులం’ ఈసారి జడలు విప్పుకుంటోంది. ఆర్థిక ప్రలో భాలతో ఏమైనా చేయొచ్చన్న విచ్ఛలవిడితనంతో ‘డబ్బు’ ఏరులై పారు తోంది. పగ్గాల్లేని అహంకారం వల్ల ఇంగితం విడిచిన ‘అధికారం’ ఏపీలో అరాచకాలు సృష్టిస్తోంది. అర్హుల తొలగింపు, అనర్హుల జోడింపులతో అసలు ఓటరు ‘అస్థిత్వమే’ ప్రమాదంలో పడింది. పరిస్థితి చక్కదిద్దే బాధ్యత విస్మరిస్తున్న ‘వ్యవస్థల వైఫల్యాలు’ రాజ్యాంగ స్ఫూర్తినే పరిహ సిస్తున్నాయి. నిజాల్ని నిలువునా పాతరేసి చెలరేగుతున్న అబద్ధపు ఆధి పత్యం ‘సమాచార వెల్లువ’ను సందేహాస్పదం చేస్తోంది. ఇవే, నేడు మన ఎన్నికల్ని, స్థూలంగా ప్రజాస్వామ్యాన్ని పట్టిపీడిస్తున్న అరిషడ్వర్గాలు. సదా అప్రమత్తత, ఈ అరిష్టాల గుర్తింపు, దుర్గుణాలకు లొంగకపోవ డమే ఇప్పుడు ఓటరు తక్షణ కర్తవ్యం. ప్రజాస్వామ్యం ముసుగులో చెలా మణి అవుతున్న ఈ అంతర్గత శత్రువుల్ని జయించడమే లక్ష్యం.

కులం నిర్ణయిస్తుందా?
రాజకీయాధికారాన్ని కులమే నిర్ణయించేదయితే, సుదీర్ఘకాలం ఈ దేశ ప్రధానులుగా ఏ జగ్జీవన్‌రామో, కాన్షీరామో, మాయావతో ఉండా ల్సింది. వారు పుట్టిన కులాల సంఖ్యా బలం అటువంటిది. కానీ, అలా జరుగలేదే? జరుగదు కూడా! అది అంగీకరించలేని వారు ఇప్పుడు ‘కులం’ కేంద్రకం చేసి రాజకీయ ఎత్తులు, పై ఎత్తులు వేస్తున్నారు. కుల బలం ఆధారంగా రాజకీయ పార్టీలనే స్థాపించి, రాజ్యాధికారం కోసం వ్యూహాలు రచిస్తున్నారు. తమ ఆర్థిక, రాజకీయ విధానాల ద్వారా ప్రజా భిప్రాయాన్ని నేరుగా ప్రభావితం చేయజాలమని గ్రహించిన ఆయా పక్ష నేతలు కొందరు, కులం కార్డును వినియోగించి దొడ్డిదారిలో ‘ప్రజా తీర్పు’ ప్రభావితం చేయాలనుకుంటున్నారు. నియోజకవర్గ ఓటర్లలో కులాల వారీ లెక్కలు తీసి, బలాలు–బలగాల లెక్కలతో బరిలోకి దిగుతు న్నారు. నేరుగా లబ్ధి పొందలేమనుకుంటే, ఇంకొకరి రాజకీయ ప్రయోజ నాల్ని దెబ్బతీసేందుకు కులం కార్డు వాడుతున్నారు. ఫలానా నియోజక వర్గంలో ప్రత్యర్థి బలంగా ఉన్నాడంటే, మూడో పక్షంతో తెరచాటు బంధమల్లి, అదే కులానికి చెందిన అభ్యర్థిని వారి తరపున దింపి, ఓట్ల చీలికకు ఎత్తులు వేస్తున్నారు. సగటు ఓటరుకు లేని కుల భావనను రాజ కీయ పక్షాలే రుద్దుతున్నాయి. కులాల మధ్య వైషమ్యాలు సృష్టిస్తు న్నాయి. ఎన్నికల తర్వాత ఇది ఏ విపరిణామాలకు దారి తీస్తుందోనని కొన్ని జిల్లాల్లో వివిధ సామాజిక వర్గాలు ఆందోళనలో ఉన్నాయి.

పుట్టలు పగిలినట్టు నోట్ల కట్టలు
ప్రలోభాలు లేకుండా ఓటరు స్వేచ్ఛగా నిర్ణయం తీసుకునే వాతావరణం కల్పించాలి. అభ్యర్థులెవరూ పరిమితి మించి ఎన్నికల్లో డబ్బు ఖర్చు చేయొద్దు. కానీ, ఓటర్లకు, కార్యకర్తలకు, నాయకులకు, ఓటు దళారీలకు, వ్యవహారకర్తలకు... ఇబ్బడి ముబ్బడిగా డబ్బు పంచుతున్నారు. కోట్ల రూపాయలు ఖర్చవుతోంది. సాక్షాత్తు ఏపీ శాసనసభాపతి స్థానంలోని నాయకుడే, ‘గత ఎన్నికల్లో నాకు 11 కోట్ల రూపాయలు ఖర్చయింది’ అని పలికినా... ఏ వ్యవస్థలూ చర్య తీసుకోలేదు. అలా ఖర్చు పెట్టడం ప్రజాప్రాతినిధ్య చట్టం, ఎన్నికల నియమావళి ప్రకారం శిక్షార్హమైన నేరం. టీడీపీకే చెందిన రాజమండ్రి ఎం.పీ మురళీమోహన్‌ డబ్బు తాజాగా పట్టుబడింది. రూ. 2 కోట్ల మొత్తాన్ని ఎన్నికలకు తరలిస్తుండగా హైదరాబాద్‌లో గురువారం çపట్టుకున్నారు. ఏపీ సీఎం బాబు బినామీగా ఈయనకు పేరుంది. ఇది సరే, మరి పట్టుబడకుండా పంపిణీ అయిం దెంత? చిత్తూరు జిల్లాలో ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో 25 నుంచి 35 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలని పాలకపక్షం వ్యూహరచన చేసిం దని రాజకీయ వర్గాల్లో ప్రచారం. గుంటూరులోని కొన్ని నియోజకవ ర్గాల్లో.. ప్రత్యర్థికి బలమైన మద్దతుదారులనుకున్న చోట, ‘ఓటు వేయ కుండా ఉండండి చాలు... ఇదో ఇంతిస్తాం’ అని బేరాలు సాగుతు న్నాయి! ఎన్నికల వ్యయానికి ముందు, తర్వాత రాజకీయ అవినీతితోనే ఆ సొమ్మును పోగుచేస్తున్నారు. లాభాలూ ఆర్జిస్తున్నారు.

అధికారమంటే అడ్డులేనితనమా?
ఏం చేసైనా అధికారం నిలబెట్టుకోవాలనే తపన వెనుక దురుద్దేశాలను ప్రజలు గ్రహించాలి. ఇదివరలో ఓట్లు కొనడానికి అభ్యర్థులు, పార్టీలు సొంత డబ్బు ఖర్చు చేసేది. కానీ, కాలం మారి... ప్రభుత్వంలో ఉన్న వారు ప్రజాధనాన్ని విచ్చలవిడిగా ఓట్ల కొనుగోళ్లకు వెచ్చిస్తున్నారు. అందంగా సంక్షేమ కార్యక్రమాల ముసుగు తొడిగి, నగదు బదిలీతో నేరుగా ఓట్లు కొల్లగొడుతున్నారు. ఏపీలో ప్రభుత్వం ఎన్నికలకు సరిగ్గా రెండు, మూడు నెలల ముందు పలు సంక్షేమ కార్యక్రమాల పేరిట నగదు బదిలీకి ఎత్తు వేసింది. ఒక్కో లబ్దిదారుకు, ఈ మూడు నెలల్లో ముఫ్పై, నలబై వేల రూపాయలు బ్యాంకు ఖాతాలో చూసుకునే యోగం కల్పించి, ప్రలోభ పెడుతోంది. ఇతర ప్రభుత్వ శాఖల, అభివృద్ధి కార్య క్రమాల బిల్లుల్ని నిలిపి వేసి, నిధుల్ని ఇటు మళ్లించింది. ఎన్నికలకు సరిగ్గా పది రోజుల ముందు, అంటే ఏప్రిల్‌ ఒకటో తేదీ ఒక్కరోజే, కొన్ని వేల కోట్ల రూపాయల మేర ఖజానా ఖాళీ అయిందంటే పరిస్థితిని అంచనా వేయొచ్చు.

ఇలా నిధుల దారి మళ్లింపును లోగడ కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ (కాగ్‌) కూడా తప్పుబట్టింది. అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఏపీలో కొనసాగించిన అరాచకాలకు అడ్డే లేదు. గ్రామీణ స్థాయిలో పార్టీ యంత్రాంగంతో ఏర్పరచిన ‘జన్మభూమి’ కమిటీలతో సమాంతర ప్రభు త్వాన్నే నడుపుతున్నారు. ఎన్నికైన పంచాయతీ పాలనా సంస్థలకు, సచి    వాలయానికి, చట్టబద్ద ప్రభుత్వ విభాగలకు విలువే లేదు. అయిదేళ్ల పాటు పోలీసు యంత్రాంగాన్ని ఇష్టానుసారం వినియోగించుకున్న పాల కపక్షం, ఎన్నికల్లోనూ వారి సేవల్ని దుర్వినియోగపరుస్తోంది. ఇంటలి జెన్స్‌ విభాగాన్ని ఇంటి సంస్థగా మార్చి, విభాగాధిపతి బదిలీని అడ్డుకు నేందుకు టీడీపీ ప్రభుత్వం చేసిన నానా యాగీని ప్రజలు కళ్లారా చూశారు. ఈసీ అధికారాల్నే న్యాయస్థానంలో సవాల్‌ చేసేంత సాహసా నికి హేతువు.. నిండైన స్వార్థం, అధికార లాలస! కడకు కోర్టు మంద లిస్తే క్షమాపణలు చెప్పి బయటపడింది.

ఓటరు ఉనికికే ఎసరు
ప్రజాస్వామ్యంలో అత్యంత కీలకమైన ప్రాథమిక యూనిట్‌ ఓటరు. సదరు ఓటరు ఉనికికే ప్రమాదం తెచ్చే దురాగతానికి టీడీపీ ప్రభుత్వం ఒడిగట్టింది. అధికారం అడ్డుపెట్టుకొని, తమకు అనుకూలం కాదనుకు న్నవారి ఓట్లను గంపగుత్తగా గల్లంతు చేయడం, దొంగ ఓట్లను ఇబ్బడి ముబ్బడిగా చేర్పించడం.. ఇదీ వరస! సామాన్యుల డాటాను ఏక మొత్తంగా ప్రైవేటు జేబు సంస్థకు అప్పగించి, అనైతిక పద్దతుల్లో దాన్ని వాడింది. వేర్వేరు సంక్షేమ పథకాల లబ్ధిదారుల డాటాను ఓటరు జాబి తాతో అనుసంధానపరచింది. ఈ డాటా ఆధారంగా సర్వే జరిపిస్తూ అనుకూలురకు ఒక పద్ధతి, వ్యతిరేకులకు మరో పద్ధతి పాటించి, ఓ కొత్త రకం వైట్‌కాలర్‌ నేర ప్రక్రియకు తెర లేపింది. ఇది పట్టుబడటంతో, తమ డాటాను పొరుగురాష్ట్రం దొంగిలించిందటూ ఎదురుదాడితో అరిచి గీపె ట్టింది. ఏపీలో 56 లక్షల దొంగ ఓట్లు చేర్పించారని ఒక అభియోగం వస్తే, దాదాపు 7 లక్షల పైచిలుకు నిజమైన ఓట్లను గల్లంతు చేశారని మరో అభియోగం ఆధారాలతో వచ్చింది. చట్టం ద్వారా లభించిన విస్తృ తాధికారాలుండి కూడా ఎన్నికల సంఘం చేష్టలుడిగి చూస్తోంది. న్యాయ స్థానాలూ ఈ దురాగతాన్ని అడ్డుకోలేకపోయాయి.

వ్యవస్థల వైఫల్యమొక శాపం
రాజకీయ దురుద్దేశాలతో ప్రభుత్వాలు, పాలకపక్షాలు దారి తప్పినపుడు రాజ్యాంగబద్ధమైన న్యాయస్థానాలు, ఎన్నికల సంఘం, ఇతర స్వతంత్ర సంస్థలు కల్పించుకోవాలి. కనీసం, న్యాయం కోరినపుడు ఆదుకోవాలని చూడటం సహజం. కానీ, సదరు సంస్థలు సకాలంలో న్యాయం చేయ కపోతే బాధితులకు దిక్కేది? ఎన్నికల షెడ్యూల్‌ వెలువడటంతోనే ఆయా ప్రభుత్వ పాలనా వ్యవస్థలు, అధికార యంత్రాంగం ఎన్నికల సంఘం పరిధిలోకొస్తాయి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కూడా ఇందులో భాగమే! అటువంటిది, ప్రభుత్వ తాబేదారుగా ఒక ప్రధాన కార్యదర్శి ఈసీ నిర్ణ యాన్నే కోర్టులో సవాల్‌ చేయడాన్ని ఎలా చూడాలి? పరిమితికి మించి డబ్బు ఖర్చు చేసిన ఒక్క కేసులోనూ అభ్యర్థిత్వం రద్దు కాలేదు. సెన్సార్‌ ఆమోదించిన ఒక సినిమా ఒక రాష్ట్రంలో విడుదలై మరో రాష్ట్రంలో విడు దలకు నోచుకోలేదు. ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్న హామీలు గాలికి పోయినా ఏ సంస్థా చర్య తీసుకోలేదు. నిష్పక్షపాతంగా ఉండాల్సిన ప్రభుత్వ సంస్థలు నిర్లజ్జగా పాలకపక్షాలకు ఊడిగం చేస్తున్నాయి.

వెతుక్కోవాల్సిన గతి!
నిజాల్ని నిలువునా పాతరేసి అబద్ధాలు రాజ్యమేలుతున్నాయి. పాలక పక్షాల నోటికొచ్చింది సమాచారం! విడదీయరాని ఆర్థిక బంధాలతో వాటికి ఊడిగం చేస్తున్న పచ్చ ప్రసారమాధ్యమాలు అసత్యాలు, అర్థస త్యాలను వ్యాప్తి చేస్తున్నాయి. ఉభయులూ కలిసి ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు చూపుతూ, తప్పుడు సమాచారంతో కనికట్టు చేస్తున్నారు. జన హితం గాలికిపోతోంది. ఇది సగటు ఓటరును గందరగోళంలోకి నెడు తోంది. అసలు ప్రజాభిప్రాయంతో నిమిత్తం లేకుండా, ఇదే ప్రజాభిప్రా యమంటూ వండి వారుస్తున్నాయి. నలుదెసల ‘నకిలీ వార్తల’యుగంలో బాధ్యతగా ఉండాల్సింది పోయి, బరితెగింపుతో వ్యవహరిస్తున్నారు. పాలకుల నోటికి హద్దు లేదు. నిన్నొక మాట నేడొక మాట! ఎన్నికల ముందొక మాట, తర్వాత మరో బాట! నిజమేదో జనం వెతుక్కోవా ల్సిన దుర్గతి. ప్రజాస్వామ్యాన్ని ఆవహించిన ఈ అరిషడ్వర్గాలను అధి గమించాలి. ఓటరుకిది పరీక్షా సమయం. పరీక్షలెన్నయినా, ప్రశ్న పత్రా లేవైనా జవాబు ఒకటే, ఓటే!

దిలీప్‌ రెడ్డి

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top