అదే నా విజయ రహస్యం.. ఈ ఘనత తనకే!

Daughter Allergy Inspires Mother To Create Jam Become Entrepreneur - Sakshi

కూతురు మార్చింది... యమ్మీ మమ్మీ

వండడం వస్తే... వంటశాలను మించిన ప్రయోగశాల మరొకటి ఉండదు. ఫుడ్‌ బిజినెస్‌ను మించిన ఉపాధి మరెక్కడా ఉండదు. హర్యానాలోని కురుక్షేత్రలో నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ నుంచి సివిల్‌ ఇంజనీరింగ్‌ చేసి, ఆ తర్వాత గుజరాత్‌లోని ‘ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రూరల్‌ మేనేజ్‌మెంట్‌ ఇన్‌ ఆనంద్‌’ లో ఎంబీఏ చేసిన సౌమీ ఇదే విషయాన్ని నిరూపించింది. చదువు పూర్తయిన తర్వాత సౌమీ హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంకుల్లో ఉద్యోగం చేసింది. ఐదేళ్ల కిందట బ్యాంకు ఉద్యోగాన్ని వదిలేసి పూర్తి స్థాయి ఎంటర్‌ప్రెన్యూర్‌గా మారింది. తనను ఎంటర్‌ప్రెన్యూర్‌గా మార్చిన ఘనత కూతురికే దక్కుతుందని కూడా చెబుతోంది సౌమీ.

సౌమీకి ఉద్యోగం, ఇల్లు, పాపాయిని చూసుకోవడంలో రోజంతా సరిపోయేది. పాపాయికి చిరుతిండి కోసం మార్కెట్‌లో దొరికే జామ్‌ల మీదనే ఆధారపడక తప్పేది కాదు. ప్యాక్‌ చేసిన ఆహారంలో, అవి నిల్వ ఉండడం కోసం తయారీదారులు ప్రిజర్వేటివ్‌లు వాడతారు. ఆకర్షణీయంగా కనిపించడం కోసం ఫుడ్‌కలర్స్‌ కూడా వాడుతారు. అవన్నీ ప్రభుత్వ ఆహార నియంత్రణ విభాగాలు నిర్దేశించిన మోతాదులోనే ఉంటాయి. కానీ సౌమీ పాపాయి ఆ మేరకు కృత్రిమత్వాన్ని కూడా భరించలేకపోయేది. ఆ జామ్‌లను తింటే అలర్జీ వచ్చేసేది. పైగా పాపాయి జామ్‌లను ఇష్టంగా తినేది. ఇంట్లో జామ్‌ లేకపోతే మరొకటి ఏదైనా తింటుందని ఒక ప్రయత్నం చేసింది సౌమీ. జామ్‌ కోసం పాపాయి మంకుపట్టు పడుతోంది తప్ప మరొకటి తినడం లేదు. దాంతో సౌమీ తనే జామ్‌ తయారు చేసింది. 

ఇల్లంతా జామ్‌ బాటిళ్లే!
జామ్‌ ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి కృత్రిమమైన ప్రిజర్వేటివ్‌లను, రంగులను కలపకుండా సహజమైన జామ్‌ను చేసింది సౌమీ. మొదటిసారి ఆమె చేసింది స్ట్రాబెర్రీ జామ్‌. ఆ ప్రయత్నం సక్సెస్‌ అయింది. పాపాయి ఇష్టంగా తింటోంది. ఎటువంటి సైడ్‌ ఎఫెక్ట్స్‌ లేకుండా ఆరోగ్యంగా ఉంటోంది. దాంతో సౌమీ ఇంటర్నెట్‌లో రకరకాల పండ్లతో జామ్‌లను ఎలా చేయాలో నేర్చుకుంది. ఇంట్లో జామ్‌ బాటిళ్లు వరుసగా బారులు తీరాయి. ఇంటికి వచ్చిన వాళ్లకు గర్వంగా రుచి చూపించేది సౌమీ. రుచి చూసి ప్రశంసించిన వారికి ఒక్కో బాటిల్‌ ఇచ్చి పంపేది. ప్రతిసారీ ఫ్రీగా తీసుకోవడానికి మొహమాట పడిన స్నేహితులు, బంధువులు ‘ఏదో ఒక ధర నిర్ణయించ’మని సౌమీ మీద ఒత్తిడి తెచ్చారు. ఇదంతా ఆరేళ్ల నాటి సంగతి. 2015లో బ్యాంకు ఉద్యోగాన్ని వదిలేసి సౌమీ సొంత స్టార్టప్‌ మొదలుపెట్టింది. తన ఉత్పత్తులకు ‘యమ్మీయమ్‌’ అనే పేరు పెట్టింది. జామ్‌లతోపాటు పచ్చళ్ల తయారీ కూడా మొదలు పెట్టింది. ఇప్పుడామె ‘స్మాల్‌ బిజినెస్, ఉమెన్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌’గా విజయవంతమైన పారిశ్రామిక వేత్తల జాబితాలోకి చేరింది.

జామ్‌తో పాటు పచ్చళ్లూ
‘‘రెడీ మేడ్‌ ఫుడ్‌తో నా పాపాయికి అలర్జీ వస్తున్న కారణంగా నేనీ ప్రయత్నాన్ని మొదలు పెట్టాను. జామ్‌ తయారీని పరిశ్రమగా మలుచుకున్నప్పటికీ నాలో తల్లి అలాగే ఉంటుంది. పిల్లల సున్నితమైన కడుపుకు ఇబ్బంది కలిగించే ఏ పదార్థాలనూ దగ్గరకు కూడా చేరనివ్వను. జామ్‌ తయారీలో ప్రధానమైన పని పండ్లను శుభ్రం చేయడం, తరగడమే. రాత్రంతా చక్కెరలో నానపెట్టిన తర్వాత మరుసటి రోజు ఆ పండ్లను అరగంట నుంచి ముప్పావు గంట సేపు ఉడికించాలి. ఇలా చేస్తే ఇక వాటిని నిల్వ చేయడం కోసం కృత్రిమ ప్రిజర్వేటివ్‌ల మీద ఆధారపడాల్సిన అవసరమే ఉండదు’’ అని తన విజయరహస్యాన్ని తెలియచేసింది సౌమీ. ‘‘యమ్మీమమ్‌ జామ్, పచ్చళ్ల పరిశ్రమలో నా ప్రయత్నం సక్సెస్‌బాట పట్టిన తర్వాత నా భర్త గోపాల్‌ కూడా తన ఉద్యోగాన్ని వదిలేసి మార్కెటింగ్‌ పనులు చూసుకుంటున్నారు. సాధారణ ఉద్యోగులుగా ఉన్న మమ్మల్ని వ్యాపారవేత్తలుగా మార్చేసింది మా అమ్మాయి’’ అంటూ నవ్వుతోంది సౌమీ.
– మంజీర

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top