సవాళ్లకు సమాధానం

Chandni Nair Is Famous Through Social Media - Sakshi

స్ఫూర్తి

అందమైన చిరునవ్వుతో ఇట్టే ఆకట్టుకునే ఆత్మవిశ్వాసంతో కనపడుతున్న ఇరవైమూడేళ్ల ఈ యువతి పేరు చాందిని నాయర్‌. అన్ని అవయవాలు సక్రమంగా పనిచేస్తున్నా సరైన అవకాశాలు అందిపుచ్చుకోలేని యువతకి చాందిని ఎదుగుదల ఒక స్ఫూర్తి పాఠమవుతుంది. వీల్‌ చెయిర్‌కే పరిమితమైనా ఫార్మసీలో డిగ్రీ చేస్తోంది. అంతేకాదు, ఇప్పుడు ఆమె ఇంటర్నెట్‌ స్టార్‌ కూడా. ‘నా ఎదుగుదల ప్రతీ దశలో చేసిన పోరాట ఫలితమే ఈ జీవితం’ అంటూ వైకల్యం ఉన్నవారిపట్ల సమాజం చూపే వైఖరిని ఎండగడుతోంది. ఎదుగుదలలో ఒకదారి మూసుకుపోయినప్పుడు మరో దారి తప్పక మనకోసం ఉంటుందని నమ్మకంగా చెబుతోంది.

‘ప్రజల మనస్తత్వం ప్రతి చోటా, ప్రతీదశలో ఒకే విధంగా ఉంటుంది అనడానికి నాకు ఎన్నో ఉదాహరణలు కనిపించాయి. నేను చిన్నప్పుడు స్థానిక ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నాను. మిగతా కాన్వెంట్లు వీల్‌చెయిర్‌లో ఉన్న అమ్మాయికి సీట్‌ ఇవ్వలేమన్నారు. పన్నెండవ తరగతిలో 90 శాతం మార్కులు సాధించాను. ఆ తర్వాత మెడిసిన్‌ చేయాలనుకున్న నా కలలపై కాలేజీ అధికారులు నీళ్లు చళ్లారు. నా చిన్నప్పటికీ ఇప్పటికీ రోజులు మారాయి, ప్రజల్లో మార్పు వచ్చింది అని ఊహించాను. కానీ, మళ్లీ అదే తిరస్కరణలను ఎదుర్కొన్నాను. నా పరిస్థితి చూసి కాలేజీ అధికారులు కష్టంగా లేని కోర్సులను చదవమని సూచించారు’ అంటూ చెప్పిన చాందిని మరో దారిని ఎలా నిర్మించుకున్నదో కళ్లకు కట్టింది.  

పక్షపాతాన్ని పక్కన పెట్టి
డాక్టర్‌ కావాలని కలలు కన్న అమ్మాయి సమాజం చూపిన పక్షపాతాన్ని పక్కన పెట్టేసి తన జీవితాన్ని ఆనందమయం చేసుకోవడానికి ఏం చేయాలో దృష్టి పెట్టింది. చాందిని చిన్ననాటి నుంచి మంచి గాయని. చిన్నప్పుడు టీవీలో వచ్చే పాటల ప్రోగ్రామ్‌లను మ్యూట్‌లో పెట్టి తను దానికి తగ్గట్టుగా పాటలు పాడేది. ఇది గమనించిన ఆమె తల్లిదండ్రులు చాందినికి శాస్త్రీయ సంగీతం నేర్పించారు. అయితే, వేదికలపై ప్రదర్శనలు ఇవ్వకపోయినా డబ్‌స్మాష్‌తో సోషల్‌ మీడియా ద్వారా పేరు పొందింది. ‘30 సెకన్ల వీడియోలను తయారు చేసి వాటిని ఇంటర్‌నెట్‌లో అప్‌లోడ్‌ చేసేదాన్ని. ఫేస్‌బుక్‌లో ‘వెరైటీ మీడియా’ అనే గ్రూప్‌లో నా వీడియోను షేర్‌ చేశాను. అది నా జీవితాన్ని ఒక మలుపు తిప్పింది. కేవలం నాలుగే నాలుగు రోజుల్లో నాలుగు మిలియన్లమంది చూశారు.

నా ప్రతిభను మెచ్చుకున్నాను. అది నాకు చాలా ప్రోత్సాహాన్నిచ్చింది’ అంటూ చెప్పుకొచ్చింది చాందిని. స్థానిక టెలివిజన్‌ కార్యక్రమానికి చాందినిని ఆహ్వానించినప్పుడు నెటిజన్లు ఆమె వైకల్యం గురించి మొదటిసారి తెలుసుకున్నారు. ‘నేను నా ముఖం మాత్రమే ఫ్రేమ్‌లో ఉండేలా వీడియోలను తయారుచేస్తుంటాను. దాంతో నా వైకల్యం అందులో ఎవరికీ తెలియదు. అయినా, నా వీడియోలు వైరల్‌ అయ్యాయి’ అంటూ సంతోషంగా వివరిస్తుంది. కిందటేడాది టిక్‌టాక్‌ వీడియోలతో నెట్‌లో మరింత యాక్టివ్‌గా మారింది. దీంతో చాందిని కథను చెప్పపడానికి ఆమెను ఆహ్వానించే టెలివిజన్‌ కార్యక్రమాల సంఖ్య పెరిగింది. ప్రస్తుతం చాందిని వీడియోలకు 8 వేల మంది ఫాలోవర్స్‌ ఉన్నారు. వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతూనే ఉంది. చాందిని కేరళవాసి అయినా ఎక్కువభాగం తమిళనాడులోనే పెరిగింది.

కష్టంపై సవాల్‌
చాందినికి మయోపతి ఉందని ఆమె ఏడాది వయసులో తల్లిదండ్రులకు తెలిసింది. కండరాల బలహీనతతో బాధపడే స్థితి. కొందరిలో స్వల్పంగా, మరికొందరిలో అసలు వైకల్యం ఏర్పడకపోవచ్చు. కొందరిలో మాత్రం వయస్సు పెరుగుతున్నకొద్దీ జబ్బు కూడా తీవ్రమవుతుంది. చాందిని ఆరోగ్యపరిస్థితి రెండవకోవకు చెందింది. ఎంతో మంది వైద్యులను కలిశారు. కానీ, ఆమెను నిలబెట్టలేకపోయారు. చాందిని తనకు ఉన్న జబ్బును చూసి భయంతో కుంగిపోలేదు. ఉన్నంతంగా జీవించడానికి తన కష్టాన్ని చిరునవ్వుతో ఎదుర్కొంటోంది. తనలోని సామర్థ్యానికి సరైన వేదిక ఏర్పాటు చేసుకుంటుంది.

చదువుతో సరైన సమాధానం
చాలా మంది చాందిని పరిస్థితిని సానుభూతితో చూస్తే కొందరు చూళ్లేమంటూ తలతిప్పుకునేవారు. బహిరంగ ప్రదేశాల్లో వికలాంగులకు సరిపడే మౌలికసదుపాయాల ఏర్పాటు లేకపోవడంతో బడి రోజుల నుంచి చాందిని అవస్థలుపడుతూనే పెరిగింది. ఆమె కోసం ఖర్చుపెట్టే ప్రతి రూపాయి వృధాయే అని చాలామంది చాందిని ముందే తల్లిదండ్రులకు చెప్పేవారు. ‘చాలా బాధనిపించేది. కానీ, నా తల్లిదండ్రులు నన్ను వేరుగా చూడలేదు. బయటకి తీసుకెళ్లడానికి వాళ్లెప్పుడూ వెనకంజ వేయలేదు. ఆరోగ్యకారణాల వల్ల కొన్ని పరిమితులు ఉంటే ఉన్నాయి. కానీ నా స్వంత నిర్ణయాలు తీసుకునేంత స్వేచ్ఛ నాకు కల్పించారు’ అని తల్లిదండ్రుల గురించి గొప్పగా  చెబుతుంది చాందిని.

ఎనిమిదేళ్ల క్రితం చాందిని 10వ తరగతిలో ఉన్నప్పుడు ఆమె వీపు భాగం బాగా వంగిపోయి ఉండేది. ఎనిమిది గంటల ఆపరేషన్‌ చేసి వెన్నెముకను సవరించారు. ఆపరేషన్‌ అయింది. డాక్టర్లు ఆరునెలలు బెడ్‌రెస్ట్‌ చెప్పారు. పది నిమిషాలు పుస్తకం పట్టుకొని కూర్చోవాలన్నా కష్టమయ్యేది చాందినికి. దీంతో బోర్డు పరీక్షలు రాయొద్దని అంతా చెప్పారు. కానీ, వినిపించుకోలేదు ఆమె. తల్లీతండ్రి పుస్తకాలు ముందు అమర్చి, ఒక్కోపేజీ తిరగేయడానికి సాయం చేశారు. అలాగే ఎక్కువసేపు కూర్చునేందుకు సహాయపడే వ్యాయామాలపై దృష్టిపెట్టారు. మూడు నెలల వ్యవధిలో పదవతరగతి పరీక్షలు రాసి, 88 శాతం మార్కులు తెచ్చుకుంది. అప్పుడే డాక్టర్‌ చదవాలనుందనే తన ఆశను బయటపెట్టింది. తల్లిదండ్రులూ ప్రోత్సహించారు.

అయితే, ఏ కాలేజీ ఆమెకు మెడిసిన్‌లో సీటు ఇవ్వలేదు. తక్కువ కష్టపడే కోర్సులు చేయమని సూచించారు. బెంగుళూరులోని ఆక్స్ఫర్డ్‌ కాలేజీ ఆఫ్‌ ఫార్మసీలో సీటు లభించింది. కళాశాల వికలాంగులకు అనుకూలమైన మరుగుదొడ్డి, అనువైన దారిని ఏర్పాటు చేసింది. ఇప్పుడు ఫార్మసీలో డాక్టరేట్‌ సాధించాలని, అలాగే వినోదరంగంలో తనదైన ముద్రవేసుకోవాలనేది ఆశయం అని, అందుకు నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటాను’ అని చెప్పింది చాందిని. ‘ప్రజలు గుర్తుపట్టి నాతో ఫొటోలు తీసుకున్నప్పుడు చాలా సంతోషం అనిపిస్తుంది. ఈ ప్రపంచంలో మనకంటే ఏదీ ఎక్కువ కాదు. జీవితమే మనకు అన్నీ నేర్పిస్తుంది. ఆశను కోల్పోకుండా నిరంతరం ప్రయత్నించడమే మనం చేసే పని’ అంటోంది చాందిని.
– ఆరెన్నార్‌

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top