తెలుగుదేశం పార్టీ ఎస్.కోట నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి స్వగ్రామంలో వైఎస్సార్ సీపీ పాగా వేసింది.
ఎల్.కోట,(విజయనగరం ఫూల్‌బాగ్) న్యూస్‌లైన్: తెలుగుదేశం పార్టీ ఎస్.కోట నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి స్వగ్రామంలో వైఎస్సార్ సీపీ పాగా వేసింది. దీంతో ఆమె భంగపాటుకు గురయ్యారు. ఎంపీటీసీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిపై వైఎస్సార్ సీపీ అభ్యర్థి గెలుపొందారు. కోళ్ల లలితకుమారి స్వగ్రామం ఎల్.కోట మండలంలోని ఖాసాపేట. ఈ గ్రామంలో టీడీపీ తరఫున ఎంపీటీసీగా ఎస్.సన్యాసమ్మ పోటీచేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున కొటాన శోభ పోటీచేశారు. టీడీపీ అభ్యర్థి సన్యాసమ్మకు 1060 ఓట్లు రాగా, వైఎస్సార్ సీపీ అభ్యర్థి శోభకు 1080 ఓట్లు వచ్చాయి. దీంతో 20 ఓట్ల ఆధిక్యంతో టీడీపీ అభ్యర్థిపై వైఎస్సార్‌సీపీ అభ్యర్థి విజయం సాధించారు. సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన కోళ్ల లలితకుమారి స్వగ్రామంలో టీడీపీ అభ్యర్థి ఓటమి చెందడంతో ఆ పార్టీ కార్యకర్తలు కంగుతిన్నారు.