రైతే.. రాజు


* తొమ్మిదేళ్ల పాటు రాష్ట్రాన్ని దారుణంగా దెబ్బతీసిన బాబు

* రైతాంగాన్ని గాలికి వదిలి... ప్రచారం కోసమే పాకులాట

* వ్యవసాయ, పారిశ్రామిక, సేవల రంగాలన్నీ కుదేలు

* వైఎస్ అధికారంలోకి వచ్చాకే రైతు అనుకూల విధానాలు

* అప్పట్నుంచే గాడిన పడిన వ్యవసాయ, పారిశ్రామిక రంగాలు

* ఆ ఐదేళ్లూ జాతీయ సగటు కన్నా అధిక వృద్ధి నమోదు చేసిన రాష్ట్రం

* గణాంకాల సాక్షిగా బాబు, వైఎస్, ఆ తర్వాతి పాలన తీరుతెన్నులివిగో...  


 

 రాష్ట్రంలో మొత్తం రైతుల సంఖ్య..   1.31 కోట్లు

 కౌలు రైతులు..   దాదాపు 50 లక్షలు

 రైతు కుటుంబాల మొత్తం ఓట్లు..   4 కోట్ల పై చిలుకు

 ..వీరంతా ఇప్పుడు తమ ఓటు ఆయుధానికి పదును పెట్టుకుంటున్నారు

 

 ప్రొఫెసర్ కె.వి.రమణారెడ్డి: ఆయనొస్తేనే బాగుంటుందండీ...అంటూ తమ అధినేత చంద్రబాబు గురించి ప్రకటనలు గుప్పిస్తోంది తెలుగుదేశం పార్టీ. నిజంగా ఆయనొస్తే ఎలా ఉంటుంది? ఇది చెప్పటం కష్టమేమీ కాదు. వైఎస్ రాజశేఖరరెడ్డి కన్నా ముందు తొమ్మిదేళ్ల పాటు ఈ రాష్ట్రాన్ని ఏలింది ఆయనే కాబట్టి... ఆయనొస్తే ఆ పాలనే రిపీట్ అవుతుం దని తేలిగ్గా  చెప్పొచ్చు. నాటి పరిస్థితి తెలిసిన వారికైతే బాబు గురించి బాగా తెలుసు. మరి తెలియని వారో..? ఇదిగో... ఆయన పాలనలో సాధించిన ‘వృద్ధి’ని, ‘ప్రగతి’ని లెక్కలతో సహా చూస్తే చాలు!! అమ్మో... ఆయనా? అని కళ్లు తేలవేయటం ఖాయం.

 

 ఆంధ్రప్రదేశ్ అంటే... అన్నపూర్ణ
:  ఇదెప్పుడంటే... రైతు చల్లగా ఉంటేనే. మరి రైతు చల్లగా ఉండాలంటే...? పంటలు బాగా పండి మంచి దిగుబడులు రావాలి. ఆ దిగుబడులకు కూడా మంచి రేటు రావాలి. రైతుకు గిట్టుబాటు కావాలి. గిట్టుబాటు కావాలంటే... ముఖ్యంగా రైతు పంటపై పెట్టే వ్యయం తక్కువగా ఉండాలి.  మరి అరకొర విత్తనాలు, ఒకవేళ దొరికినా నాసిరకం విత్తనాలు... అన్నీ కుదిరినా అధిక ధర. వీటికితోడు ఆకాశానికి ఎగసిన ఎరువుల ధరలు. ఇన్ని వ్యయప్రయాసల కోర్చి సేద్యం చేసినా పంట చేతికొస్తుందన్న గ్యారంటీ లేదు. పంట చేతికొచ్చినా గిట్టుబాటు అవుతుందన్న నమ్మకం అసలే లేదు.

 ఇదంతా ఈ రాష్ట్రాన్ని కనీసం మూడు దశాబ్దాల పాటు వెనక్కు తీసుకెళ్లిపోయిన చంద్రబాబు హయాంలో రైతుల దుస్థితి. జలయజ్ఞం చేపట్టినా, బహుళజాతి సంస్థలతో పోరాడి మరీ విత్తనాల ధరలను నియంత్రించినా, రుణాలు మాఫీ చేసినా అదంతా వైఎస్ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టాకే. మళ్లీ 2009లో ఆయన మరణించాక పరిస్థితి యథాపూర్వంగా తయారయింది. రైతుల్ని పట్టించుకునే నాథుడే లేకపోయాడు. ఇవన్నీ ఎవరెవరో చెప్పినవి కావు. అంకెలు చెబుతున్న వాస్తవాలు. గణాంకాలు వెల్లడిస్తున్న పచ్చి నిజాలు. శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ కె.వి.రమణారెడ్డి దీనిపై వివిధ ప్రభుత్వ సంస్థల నుంచి గణాంకాలను తీసుకుని ఒక నివేదిక రూపొందించారు.

 

 ఆ తొమ్మిదేళ్లు... అంటే 1996-97 నుంచి 2003-04 వరకు బాబు జమానా. తర్వాత 2004 నుంచి 2008-09 వరకు ఐదేళ్లు వైఎస్సార్ హయాం. తర్వాత రోశయ్య, కిరణ్ పాలన... అంటే వైఎస్సార్ తర్వాతి కాలం. ఈ మూడు పాలనా కాలాల తులనాత్మక అధ్యయన వివరాలు...

 

గుజరాత్‌కు దీటుగా జీడీపీ...

బాబు హయాంలో రాష్ట్ర జీడీపీ వృద్ధి రేటు 5.72 శాతం. కానీ వైఎస్సార్ హయాంలో అది ఏకంగా 9.56 శాతానికి ఎగబాకింది (2004-05 నిలకడ ధరల ఆధారంగా). తర్వాత 6.82 శాతానికి దిగజారింది. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఏ ఐదేళ్లు తీసుకున్నా అత్యధిక వృద్ధి రేటు నమోదైంది వైఎస్సార్ హయాంలోనే. ఈ సమయంలో దేశవ్యాప్త జాతీయ సగటు వృద్ధి 8.43 శాతమే. అందరూ ఆహా, ఓహో అనే మోడీ హయాంలోని గుజరాత్‌తో కూడా ఈ విషయంలో రాష్ట్రం సమానంగా పోటీ పడింది. - ఇక వస్తు సేవల ఉత్పత్తి ద్వారా బాబు హయాం మొత్తం మీదా కలిపి రూ.66,207 కోట్ల స్థూల ఆదాయం రాగా వైఎస్ ఐదేళ్ల పాలనలో అది ఏకంగా రూ.1,03,017 కోట్లుగా నమోదైంది (2004-05 నిలకడ ధరల ఆధారంగా).

 

 పంటలైనా... ఉద్యాన పంటలైనా

 వైఎస్సార్ హయాంలో పంటలే కాదు, ఉద్యాన పంటలూ గణనీయ పురోగతి సాధించాయి. వరి, జొన్న, పప్పు ధాన్యాల ఉత్పత్తి ఆయన హయాంలో 10.51 శాతం వృద్ధిని నమోదు చేయగా, బాబు హయాంలో 0.09 శాతం, వైఎస్సార్ తరువాతి కాలంలో 1.74 శాతం వృద్ధి ఉండటం గమనార్హం. ఈ పెరుగుదలతో 2004-05లో కనీస ఉత్పత్తి 1.34 కోట్ల టన్నులు కాగా... 2008-09లో గరిష్ట ఉత్పత్తి 2.04 కోట్ల టన్నులకు చేరింది. బాబు హయాంలో గరిష్ట ఉత్పత్తి 1.6 కోట్ల టన్నులే. పోనీ ఒక్కో హెక్టారుకు ఉత్పత్తిని తీసుకున్నా 2008-09లో 2,744 కిలోలు. బాబు హయాంలో హెక్టారుకు 2,088 కిలోలు. వైఎస్సార్ అనంతరం 2,575 కిలోలే.  ఉద్యాన పంటలకు వైఎస్సార్ చాలా ప్రాధాన్యమిచ్చారు. జలయజ్ఞం ఫలాలు ఈ పంటల్లో స్పష్టంగా కనిపించాయి. వైఎస్ హయాంలో ఐదేళ్లలో ఉద్యాన పంటల విస్తీర్ణం ఏటా 77.2 వేల హెక్టార్లు. బాబు హయాంలో 66.14 వేల హెక్టార్లే. వైఎస్సార్ హయాంలో రాష్ట్రంలో మొత్తం పంటల్లో ఉద్యాన పంటల శాతం 2003-04లో 12.91 శాతం నుంచి 2008-09 నాటికి 14.38 శాతానికి చేరింది. వాటి ఎగుమతులు ఏకంగా అరవై రెట్లు పెరిగాయి!

 

 2002-03లో 6,098 మిలియన్ టన్నులుండగా 2008-09 నాటికి 3.81 లక్షల మిలియన్ టన్నులకు చేరాయి. హెక్టారుకు మామిడి- 7,088 కిలోలు, జీడి - 423 కిలోలు, అరటి 29,002 కిలోలు, టమాటా 14,045 కిలోల చొప్పున ఉత్పత్త్తి సాధ్యమైంది. భూ వనరుల వినియోగమూ 2001-03 మధ్య 122.23 లక్షల హెక్టార్ల నుం చి 100.44 లక్షల హెక్టార్లకు తగ్గితే 2006-09 మధ్య 105.9 లక్షల హెక్టార్ల నుంచి 134.03 ల క్షల హెక్టార్లకు పెరిగింది.

 

 ప్రధాన రంగాలన్నింటా ప్రగతి పరుగులే

మూడు ప్రధాన రంగాలైన వ్యవసాయం, సేవలు, పరిశ్రమలు 2004-2009 మధ్య అద్భుత పనితీరు కనబరిచాయి. వ్యవసాయ, సంబంధిత రంగాలు 6.14 శాతం; పరిశ్రమలు, సేవల రంగాలు 10.91, 10.61 శాతం చొప్పున వృద్ధిని నమోదు చేశాయి. బాబు హయాంలో ఈ మూడు రంగాలూ 3.84, 6.17, 7.14 శాతం చొప్పున మాత్రమే వృద్ధి చెందగా... వైఎస్సార్ తరువాతి కాలంలో సైతం 2.56, 4.75, 9.41 శాతం చొప్పున వృద్ధిని నమోదు చేశాయి. ఇది వైఎస్ విధానాల వల్లేనని చెప్పటానికి ఇంకా ఏం కావాలి?

 

 తలసరి ఆదాయమూ పెరిగింది...

 స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి ప్రకారం తలసరి ఆదాయం చూసుకున్నా వైఎస్ హయాంలో అద్భుతమైన పురోగతి కనిపిస్తుంది. ఇది 2003-04లో రూ.39,770 ఉండగా తర్వాతి ఐదేళ్లలో రూ.13,200 వరకూ పెరిగింది. బాబు పాలనలో (ఏడేళ్లలో) ఈ పెరుగుదల రూ.6,810 ఉండగా వైఎస్సార్ తరవాత ఇప్పటి వరకూ అది రూ.9,870 ఉంది. గ్రామాల్లో తలసరి ఆదాయం పెరుగుదల వైఎస్సార్ ముందు గానీ, తరువాత గానీ 2 శాతం వరకూ ఉండగా వైఎస్సార్ కాలంలో 7 శాతం ఉండటం గణాంకాల సాక్షిగా వాస్తవం.

 

సాగు లాభసాటేనని నిరూపించిన వైఎస్

వ్యవసాయ రంగం లాభసాటిగా లేదు గనుకే ఇతర రంగాలకు ప్రాధాన్యమిస్తున్నానని బాబు తన హయాంలో బహిరంగంగానే ప్రకటించారు. కానీ సాగు లాభదాయమైనదేనని వైఎస్ తన విధానాల ద్వారా నిరూపించి చూపించారు. వ్యవసాయ రంగ తలసరి ఆదాయ సూచికే దీనికి నిదర్శనం. అది 2003-04లో రూ.7,890 ఉంటే 2008-09లో ఏకంగా రూ.10,683కి పెరిగింది. అంటే తలసరి ఆదాయం దాదాపు రూ.2,760 పెరిగింది. బాబు పాలన మొదట్లో, అంటే 1996-97లో రూ.7,194 ఉన్న వ్యవసాయ రంగ తలసరి ఆదాయం కాస్తా 2002-03 నాటికి రూ.6,687కు పడిపోయింది. అంటే రూ.507 క్షీణించిందన్నమాట! పైగా బాబు హయాంలో వ్యవసాయ తలసరి ఆదాయం నిలకడగా లేదు. కానీ వైఎస్ పాలనలో ఏటా క్రమం తప్పకుండా పెరుగుతూ వెళ్లింది.

 

బాబు ‘ఐటీ’ గొప్పలు నేతి బీరే

 ప్రత్యేకించి వ్యవసాయ పంటల్లో వృద్ధి వైఎస్ కాలంలో 6.57 శాతం ఉండగా... అంతకుముందు అది 3.42, తరువాత కాలంలో 1.39 శాతం మాత్రమే నమోదైంది. ఈ మూడూ కూడా... ఆయా కాలాల్లో నమోదైన అత్యధిక వృద్ధి రేట్లు కావటం గమనార్హం. పోనీ ఆంధ్రప్రదేశ్ ఐటీ అంబాసిడర్‌గా, సీఈఓగా చెప్పుకున్న బాబు హయాంలో ఐటీ రంగమైనా బాగుందా అంటే... అది జాతీయ సగటు వృద్ధిరేటు కన్నా 0.81 శాతం తక్కువ నమోదు కావటం గమనార్హం. అంటే ఆ సమయంలో మనకన్నా ఇతర రాష్ట్రాలే ఐటీలో చక్కని వృద్ధి కనబరచినట్లు కాదా? మరి బాబు గొప్పేంటి?

 

చాలామంది చెప్పేదేంటంటే బాబు హయాంలో కరవు తాండవించిందని... వైఎస్ హయాంలో మాత్రం చక్కని వర్షాలు పడ్డాయని. అందుకే వ్యవసాయ రంగంలో ఆ వృద్ధి సాధ్యమైందని చెబుతుంటారు. పోనీ... ఇది కొంతవరకు నిజమే అనుకుందాం. మరి అప్పుడు దేశమంతటా వర్షాలు బాగా పడ్డాయి. ఆ లెక్కన అప్పట్లో దేశమంతా వృద్ధి బాగుండాలి కదా!! అలాంటిది జాతీయ సగటు కన్నా రాష్ట్రంలో 3.41 శాతం ఎక్కువ వృద్ధి నమోదైందంటే ఏమిటర్థం? వైఎస్ మరణానంతరం జాతీయ సగటు కన్నా ఈ వృద్ధి 2.32 శాతం తక్కువ నమోదైందంటే ఏమిటర్థం? వైఎస్ అనుసరించిన రైతు అనుకూల విధానాల వల్లే ఇది సాధ్యమైందని తెలియటం లేదా? మరోరకంగా చెప్పాలంటే వ్యవసాయ వృద్ధి వల్లే రాష్ట్రం మిగిలిన రంగాల్లోనూ జాతీయ సగటును దాటింది. ఎందుకంటే పేదరికాన్ని తగ్గించాలన్నా కూడా వ్యవసాయ వృద్ధే కీలకం. సమగ్రాభివృద్ధికి ఇది అత్యవసరం. వ్యవసాయ వృద్ధి లేకుండా మిగిలిన రంగాలు పరుగులు పెడితే... అది ఆహార ద్రవ్యోల్బణానికి దారితీస్తుంది. అంటే ఆహార వస్తువుల ధరలు కొండెక్కి కూర్చుంటాయి.

 

 ఇవీ.. వైఎస్సార్ తీసుకున్న చర్యలు

 విత్తనానికి వైభవం...  1970ల చివరి నుంచి 2006-07 వరకు రాష్ట్రంలో ప్రధాన విత్తన ఉత్పత్తి సంస్థ ఏపీ సీడ్సే. 95 నుంచి 100 శాతం విత్తనాలు ఇది ఉత్పత్తి చేసేవే. కానీ 2006-07 నుంచి రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో ఏపీ ఆయిల్ ఫెడ్, హాకా వంటివి సర్టిఫైడ్ ఆయిల్ సీడ్స్ ఉత్పత్తిలోకి ప్రవేశించాయి. 2007-09 మధ్య 4 లక్షల క్వింటాళ్లకు పైగా విత్తనాలను ఉత్పత్తి చేశాయి. 2001-04 మధ్య కేవలం 30 వేల క్వింటాళ్లుగా ఉన్న ఫౌండేషన్ సీడ్... 2008-09 నాటికి 1.7 లక్షల టన్నులకు చేరుకుందంటే ఈ చర్యల ఫలితమే. తరవాత అది లక్ష క్వింటాళ్లకు పడిపోయింది. సీడ్ విలేజ్ కార్యక్రమం కింద 50 శాతానికి పైగా ఫౌండేషన్ సీడ్‌ను 50 శాతం రాయితీతో సరఫరా చేయటం 2004-09 మధ్య గణనీయ ఉత్పత్తికి దారితీసింది.

 

 రాయితీపై విత్తన సరఫరా...

 1998-99లో విత్తన సబ్సిడీపై వెచ్చించిన మొత్తం కేవలం 3 నుంచి 7 కోట్ల రూపాయలు. 2001-03 మధ్య ఇది 12 నుంచి 42 కోట్లకు పెరిగింది. కానీ 2004-09 మధ్య ఏకంగా రూ.60 కోట్ల నుంచి రూ. 298 కోట్లకు చేరుకుంది. తద్వారా అత్యధిక స్థాయిలో విత్తనాలు వైఎస్సార్ హయాంలో సబ్సిడీపై రైతులకు చేరాయి.

 

గణనీయ స్థాయిలో ఇన్‌పుట్ సబ్సిడీ...

 కరువు, వరదల వంటి సహజ విపత్తుల వల్ల రైతులు పంట నష్టపోతే అలా నష్టపోయిన ప్రాంతంలోని రైతులందరికీ తక్షణం మంజూరు చేసేదే ఇన్‌పుట్ సబ్సిడీ. గణాంకాలను చూస్తే... కరవు వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయిన 2001-02, 2002-03లో రూ.7 కోట్లు, రూ.95 కోట్లు మాత్రమే ఇన్‌పుట్ సబ్సిడీ ఇచ్చారు. రాష్ట్రంలోని మండలాల్లో 85 నుంచి 90 శాతం వరకూ కరవు పీడిత మండలాలుగా ప్రకటించటం సమయంలో ఇచ్చిన ఇన్‌పుట్ సబ్సిడీ ఇది. వైఎస్ వచ్చాక 2004-09 మధ్య నాలుగైదేళ్ల పాటు కరవు పీడిత మండలాల సంఖ్య అతి స్వల్పంగా ఉన్నప్పటికీ ఇన్‌పుట్ సబ్సిడీకి మాత్రం రూ.175 కోట్ల నుంచి రూ.235 కోట్లు వెచ్చించారు. ఈ సమయంలో సగటున ప్రతి రైతుకు ఇచ్చిన ఇన్‌పుట్ సబ్సిడీ రూ.1,080 నుంచి 1,900 కాగా... 2003-04లో ఇచ్చింది మాత్రం రూ.350 కావటం గమనార్హం.

 

నియంత్రణలో ఎరువుల ధరలు...

 అధికోత్పత్తి సాధించాలన్న పరుగులో రైతులు పురుగు మందుల వాడకాన్ని విపరీతంగా పెంచారు. దీనికి అధిక ఉత్పత్తినిచ్చే విత్తనాలు తోడయ్యాయి. ఫలితం... 1997-98లో 16.94 లక్షల టన్నులుగా ఉన్న ఎరువుల వాడకం 1999-2000 నాటికి 21.19 లక్ష ల టన్నులకు చేరింది. ధరల పెరుగుదల, కరవు వంటి కారణాలతో 2003-04 నాటికి మాత్రం 18.53 లక్షల టన్నులకు తగ్గింది. ఇదే సమయంలో ఎరువులపై సబ్సిడీని కేంద్రం తగ్గించటంతో వాటి ధరలు మరింత పెరిగి రైతుల కష్టాలు మరింత పెరిగాయి. రైతుల ఇన్‌పుట్ వ్యయంలో ఎరువులపై పెట్టే ఖర్చే 29 శాతానికి చేరింది. రాష్ట్రంలో యూరియా ధరలు 1996-97 నుంచి 2002-03 మధ్య ఏకంగా 70 శాతం పెరిగాయి. కాంప్లెక్స్ ఎరువులు 18 శాతం, డీఏపీ, ఎంఓపీ ధరలు 10 నుంచి 15 శాతం పెరిగాయి.

 

 2004-09 మధ్య ఎరువుల వినియోగం 30.7 లక్షల టన్నులకు చేరింది. చక్కని వర్షాలు, ప్రభుత్వ అనుకూల విధానాలు దీనికి కారణమయ్యాయి. పెపైచ్చు ఈ సమయంలో ఎరువుల ధరలు పెద్దగా పెరిగింది కూడా లేదు. కానీ 2008-09 తరవాత మళ్లీ ధరలు పెరిగాయి. మరోవంక 2001-02లో 3,850 టన్నులుగా ఉన్న రసాయన పురుగు మందుల వాడకం కూడా 2008-09 నాటికి 1,392 టన్నులకు తగ్గింది. సమగ్ర పెస్ట్ మేనేజిమెంట్ విధానాలు, జన్యుమార్పిడి పత్తికి పెద్ద ఎత్తున మళ్లటం వంటి రెండు అంశాలే ఈ తగ్గుదలకు కారణమయ్యాయని చెప్పవచ్చు.

 

 రైతు రాజ్యం..

 అధికారంలోకి రాగానే వైఎస్సార్ పలు రైతు అనుకూల విధానాలకు శ్రీకారం చుట్టారు. ఆత్మహత్యలు మానని గాయంలా మారిన నేపథ్యంలో... ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబానికి లక్ష రూపాయల ఎక్స్‌గ్రేషియా, రూ.50వేల వరకు పంట రుణాల లిక్విడేషన్ ప్రకటించారు. కలెక్టరేట్లలో హెల్ప్‌లైన్లు ఏర్పాటు చేశారు. ఉచిత విద్యుత్, రూ.1,300 కోట్ల మేర విద్యుత్ బకాయిల మాఫీ, పంట రుణాలపై మారటోరియం, స్టాంప్ డ్యూటీ మినహాయింపు, స్పెషల్ డ్రైవ్‌ల ద్వారా నకిలీ విత్తనాలు, ఎరువుల, పురుగు మందుల స్వాధీనం వంటి చర్యలు రైతు కుటుంబాల్లో అంతులేని విశ్వాసాన్ని నింపాయి.

 

 నిజానికి సేద్యానికవుతున్న అత్యధిక వ్యయమే రాష్ట్ర రైతాంగంలోని నిసృ్పహకు ప్రధాన కారణం. విత్తులు, ఎరువులు, పురుగుమందుల వంటి ఇన్‌పుట్లు అత్యధిక వ్యయానికోర్చి కొనటంతో ఆ డబ్బు రాబట్టుకోవటానికి రైతాంగం ఎక్కువగా ఆహారేతర వాణిజ్య పంటలకే ప్రాధాన్యమిస్తున్నారు. సీఏసీపీ అధ్యయనం ప్రకారం 1990 తొలినాళ్ల నుంచీ విత్తనాల ధరలు పెరుగుతూనే వచ్చాయి. జయంతి కమిషన్‌తో పాటు క్షేత్రస్థాయి అధ్యయనాలు తేల్చిందే మిటంటే... 2000ల తొలినాళ్లలో రైతులు విత్తనాలకు సంబంధించి పలు సమస్యలు ఎదుర్కొన్నారు. కావలసినంత స్థాయిలో నాణ్యమైన విత్తనాలు సరఫరా కాకపోవటం, ప్రైవేటు రంగంలోని అధిక రేట్లు... ఒక్కోసారి నకిలీ విత్తనాలివ్వటం వంటి చర్యల వల్ల దిగుబడులు తగ్గాయి.

 

  పంటలు రాని సందర్భాలూ ఉన్నాయి. 90ల చివర్లో, 2000 మొదట్లో గుంటూరులో 75 వేల ఎకరాలు, వరంగల్‌లో 40వేల ఎకరాల పంటలు ఇలా దెబ్బ తిన్నట్లు పత్రికల్లోనూ కథనాలు వెలువడ్డాయి. వరంగల్ జిల్లా కలెక్టర్ దీనిపై నియమించిన నిజ నిర్ధారణ కమిటీ కూడా... నాసిరకం విత్తులే కొంప ముంచినట్లు తేల్చింది. దీనిపై ఎంఎన్‌సీలతో సహా పలు విత్తన కంపెనీలపై ఫిర్యాదులూ దాఖలయ్యాయి. నిజానికి ప్రభుత్వమంటూ ఉంటే క్రియాశీలకంగా వ్యవహరించాల్సింది ఇప్పుడే. సకాలంలో సరైన ఇన్‌పుట్లు... అది కూడా అందుబాటు ధరలకే ఇవ్వాల్సిన తరుణమది. కానీ నాటి రాష్ట్ర ప్రభుత్వం విత్తన ఉత్పత్తి, సరఫరాలో ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహించాలనే ఏకసూత్ర ఎజెండాతో వ్యవసాయ వర్సిటీకి, రాష్ట్ర సీడ్ కార్పొరేషన్‌కు విత్తన పరిశోధన, అభివృద్ధి నిమిత్తం తగు నిధులు కేటాయించకుండా నిర్వీర్యం చేసింది.

 

  ఫలితంగా ఏపీ సీడ్ కార్పొరేషన్, ప్రభుత్వ విత్తన సంస్థలు కలిసి 2002-03లో కేవలం 3 లక్షల టన్నుల విత్తనాల్ని మాత్రమే ఉత్పత్తి చేయగలిగాయి. మొత్తం కావాల్సిన విత్తనాల్లో ఇవి కేవలం 5 నుంచి 6 శాతం. దీంతో పప్పుధాన్యాలు, నూనెగింజలు, పత్తి పంటలకు సంబంధించి అధిక దిగుబడినిచ్చే విత్తనాలు ప్రభుత్వ రంగం నుంచి రాలేదు. ప్రైవేటు నుంచి కొనుగోలు చేసినా కూడా సర్టిఫైడ్ విత్తనాలు 9 నుంచి 12 శాతాన్ని దాటలేదు. 2001-03 మధ్య డిమాండ్-సరఫరాల మధ్య విపరీతమైన వ్యత్యాసం ఏర్పడింది. 2004లో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక పరిస్థితి మారింది. రైతు అనుకూల విధానాల ఫలితంగా 2004-05లో ప్రభుత్వ సర్టిఫైడ్ విత్తనాలు 17 శాతానికి (8.95 లక్షల క్వింటాళ్లు) చేరాయి. 2008-09లో ఇవి రెట్టింపై 34 శాతానికి, 2009-10లో 43 శాతానికి (23.97 లక్షల క్వింటాళ్లు) చేరుకున్నాయి.


 


 ‘‘భారత ఎన్నికల చరిత్రలో బహుశా తొలిసారిగా ఒక నాయకునికి వ్యతిరేకంగా  రైతులంతా ఒక్కతాటిపై నిలిచి ఓటేసిన సందర్భం ఇదొక్కటే’’

 - 2004 ఎన్నికల్లో చంద్రబాబు ఘోర పరాజయంపై రాజకీయ విశ్లేషకులు  ‘‘ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ కన్నా పెద్దదని ఇప్పటికైనా అంగీకరిస్తారనుకుంటా’’ - బాబు హయాంలో హైదరాబాద్ చుట్టూ తారు రోడ్లు, సాఫ్ట్‌వేర్,  బహుళ అంతస్తుల భవనాలనే అభివృద్ధిగా కీర్తించిన మీడియా తీరుపై  ప్రముఖ పాత్రికేయుడు పాలగుమ్మి సాయినాథ్ సునిశిత విమర్శ. 

బాబును రెండెకరాల చిన్న రైతుగా పిలుచుకునే మీడియాకు... అలాంటి రెండెకరాల రైతుకు, ఆయన భార్యకు కేవలం తొమ్మిదేళ్లలో రూ.21 కోట్ల ఆస్తులెలా సమకూరాయా అన్న అనుమానం కనీసం బాబు అధికారికంగా తన ఆస్తుల అఫిడవిట్ సమర్పించినప్పుడైనా రాకపోవడం విడ్డూరం.

Read latest Elections 2014 News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top