కాంగ్రెసా? అంటే ఏమిటి?

కాంగ్రెసా? అంటే ఏమిటి? - Sakshi


ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి పూలమ్మిన చోట కట్టెలమ్మినట్టు తయారైంది. దశాబ్దాల తరబడి ఏకఛ్ఛత్రాధిపత్యం సాధించిన కాంగ్రెస్ కి ఆంధ్రప్రదేశ్ లో నిలువ నీడ లేకపోయింది. బహుశః తెలుగు ప్రజల చరిత్రలోనే తొలి సారి ఆంధ్రప్రదేశ్ లో ఒక్క కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉండటం లేదు.



మొత్తం ఇచ్చాపురం నుంచి తడ వరకూ ఎక్కడికక్కడ పార్టీ తుడిచిపెట్టుకుపోయింది. మొత్తం 175 సీట్లలో ఒకే ఒక్క సీటులో పార్టీ డిపాజిట్ దక్కించుకుంది. ఆ ఒక్క చోటే రెండో స్థానంలో నిలిచింది. మాజీ పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ బొత్స చీపురుపల్లి నుంచి 42495 ఓట్లు సాధించారు. ఆయనదే హయ్యెస్టు స్కోరు.  




చాలా చోట్ల పార్టీ సాధించిన ఓట్లు నాలుగంకెలు కూడా చేరలేదు. ప్రకాశం జిల్లా కందుకూరులో కాంగ్రెస్ అభ్యర్థి రాచగర్ల వెంకట్రావుకు కేవలం 641 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఆయనది కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాలో చివర నిలిచారు.



పటపటా పడిన వికెట్లు

ఇక మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలని లేదు. ఒకరేమిటి అంతా ఓడిపోయారు. ఓడిపోయిన వారి జాబితా విఐపీల టెలిఫోన్ డైరక్టరీ అంత ఉంటుంది. మొత్తం 175 సీట్లలో కేవలం 14  చోట్ల మాత్రమే పదివేల ఓట్లు సాధించింది. అయిదు వేల నుంచి 9999 ఓట్లు సాధించింది మరో ఎనిమిది చోట్ల. అంటే అయిదువేల కన్నా ఎక్కువ ఓట్లు సంపాదించిన మొత్తం సీట్లు 22 మాత్రమే. నలుగురు కాంగ్రెస్ అభ్యర్థులు మాత్రమే 30 వేల కన్నా ఎక్కువ వోట్లు పోల్ చేసుకోగలిగారు.



ఆలౌట్ ఫర్ నో రన్స్

కనీసం పదివేల ఓట్లు సాధించలేని మహారథుల్లో నిన్నటి వరకూ ఆర్ధికమంత్రిగా ఉన్న నెల్లూరి సింహం ఆనం రామనారాయణ రెడ్డి, కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి భర్త పనబాక కృష్ణయ్య, రాజాం నుంచి పోటీ చేసిన మంత్రి కొండ్రు మురళి, ఉత్తరాంధ్ర కాంగ్రెస్ దిగ్గజం ద్రోణం రాజు శ్రీనివాస్ లు ఉన్నారు.  కోట్ల సుజాతమ్మ (ఆలూరు), బొచ్చా అప్పల నర్సయ్య (గజపతి నగరం), రఘువీరా రెడ్డి (పెనుకొండ), స్పీకర్ నాదెండ్ల మనోహర్ (తెనాలి), దేవినేని నెహ్రూ (విజయవాడ తూర్పు) వంటి కొద్ది మంది మాత్రమే పదివేల కన్నా ఎక్కువ ఓట్లు సాధించగలిగారు.




ఆంధ్రప్రదేశ్ లో పార్టీ భవిష్యత్తేమిటన్నదే ఇప్పుడు కాంగ్రెస్ నేతల ముందున్న ప్రశ్న. దురదృష్టవశాత్తూ ఈ ప్రశ్నకు జవాబు వారి వద్ద లేదు.

 

Read latest Elections 2014 News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top