అకృత్యాల బలిపీఠంపై భారతనారి | World Economic Forum issued | Sakshi
Sakshi News home page

అకృత్యాల బలిపీఠంపై భారతనారి

Apr 2 2015 3:16 AM | Updated on Sep 2 2017 11:42 PM

యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతా’’.. స్త్రీలను ఎక్కడ పూజిస్తారో అక్కడ దేవతలు సంచరిస్తారు

 ‘‘యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతా’’.. స్త్రీలను ఎక్కడ పూజిస్తారో అక్కడ దేవతలు సంచరిస్తారు అని నమ్మిన దేశం మనది. భరతమాత, భూమాత, ప్రకృతి మాత.. ఇలా ఎటు చూసినా స్త్రీ ప్రతిరూపంగా పూజించే వారు భారతీయులు. ఆకాశంలో సగం మేమే అంటూ స్త్రీలు సాధికారతవైపు అడుగులు వేస్తుంటే.. మరో వైపు కుటుంబంలో, సమాజంలో వివక్షకు గురవుతూనే ఉన్నారు. వరల్డ్ ఎకనమిక్ ఫోరం విడుదల చేసిన నివేదిక చూస్తే నాగరిక కాలంలోనే ఉన్నామా అనిపించేలా ఉంది. దీనికి సభ్య సమాజమే సమాధానం చెప్పాలి...
 
 వివక్ష, అసమానతలతో కూడిన భారతీయ సమాజంలో మహిళల మీద అత్యాచారాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఒకవైపు మహిళా సాధికారతకు ప్రభుత్వం, పౌర సమాజం కృషి చేస్తుంటే, ఇంకోవైపు వారిమీద జరిగే అత్యాచారాలు, హింస నానాటికీ పెచ్చరిల్లుతోంది. కఠిన చట్టాలు, విస్తృతమైన విద్యా ఉపాధి అవకాశాలు కొంతమేర హింస తగ్గడానికి దోహదపడ్డాయి. మహిళలకు స్వేచ్ఛా పూరిత వాతావరణాన్ని కల్పించి, పురుషులతో సమానస్థితికి చేర్చాలంటే ఇంకా ఎంత కాలం వేచి ఉండాలో?
 
 నివేదికలు - సిగ్గుపడే నిజాలు

 ప్రపంచ ఆర్థిక వేదిక 2014లో విడుదల చేసిన 142 దేశాల జాబితా లింగ వ్యత్యాస నివేదిక ప్రకారం... భారతదేశం లింగవివక్ష విషయంలో 114వ స్థానంలో నిలిచింది. ఐస్‌ల్యాండ్ అగ్రస్థానంలో ఉండగా, ఇటీవల అంతర్యుద్ధంతో అతలాకుతలమవుతున్న యెమెన్ దేశం అట్టడుగున ఉంది. ఆర్థిక కార్యకలాపాల్లో భారత మహిళల భాగస్వామ్యాన్ని పరిశీలిస్తే.. 134వ స్థానంలోనూ, విద్యారంగంలో 126, ఆరోగ్యం, మనుగడలో 141 స్థానాల్లో మన దేశం నిలవడం విచారకరం. రాజకీయ సాధికారతలో మాత్రం 15వ స్థానంతో ఫరవాలేదనిపించింది.
 
 జాతీయ నేర గణాంకాల నివేదిక - 2014 మేరకు అతివలపై కొనసాగుతున్న నేరాలు కింది స్థాయిలో ఉన్నాయి.
 భర్తల హింసాత్మక చర్యలకు గురవుతున్న భార్యల సంఖ్య: 1,20,000
 వేధింపులకు గురవుతున్న వారు: 70,000
 అపహరణలు: 55,000
 అత్యాచార బాధితులు: 35,000
 అవమానానికి గురయ్యేవారు: 10,000
 వరకట్న చావులు: 10,000
 వ్యభిచార వృత్తికి బానిసలు: 5,000

 జాతీయ నేర గణాంకాలు తెలిపిన వివరాలు అధికారికమైనవి మాత్రమే. ఇవి వాస్తవాల్ని ప్రతిబింబించేలా లేవు. మహిళల మీద జరిగే నేరాల్ని భౌగోళిక పరంగా విశ్లేషిస్తే.. దేశం మొత్తం జరిగే నేరాల్లో 20 శాతం అవిభక్త ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్‌లోనే నమోదవుతున్నాయి. ఈశాన్య సరిహద్దు రాష్ట్రాల్లో ముఖ్యంగా నాగాలాండ్‌లో మహిళల మీద జరిగే అత్యాచారాలు అతి తక్కువ. వరకట్నానికి సంబంధించిన కేసుల సంఖ్య ఒడిశా రాష్ట్రంలో అధికంగా ఉంటే, అత్యాచారాలకు సంబంధించిన కేసుల సంఖ్య మధ్యప్రదేశ్‌లో ఎక్కువ. ఇటీవల కాలంలో మహిళలు అత్యాచారానికి గురికావడం, దానిమీద ప్రచార మాధ్యమాలు విస్తృత ప్రచారాన్ని కల్పించడం మనకు తెలిసిందే. 2012లో జరిగిన నిర్భయ ఉదంతమే ఇందుకు నిదర్శనం. నిర్భయ ఘటనతో స్త్రీలపై జరుగుతున్న అకృత్యాలపై పెద్ద ఎత్తున పోరాటానికి యువత ముందుకొచ్చింది. దీనికి మీడియా సైతం విస్తృత ప్రచారాన్ని కల్పించి ప్రాధాన్యమిచ్చింది.
 
 పాపం... ఆడపిల్లలు
 జాతీయ నేర గణాంకాల నివేదిక - 2014 ప్రకారం అత్యాచారానికి గురైనవారిలో ఎక్కువ శాతం 14-18 ఏళ్ల మధ్య వయస్కులే. పదేళ్లలోపు బాలికల మీద జరిగిన అత్యాచారాల సంఖ్య 110, 10-14 ఏళ్ల మధ్య వారిపై 130, 14-18 ఏళ్లలోపు 150, 18-30 సంవత్సరాల మధ్య వారిపై 120, 30-50 ఏళ్ల మధ్య వారిపై 30, 50 సంవత్సరాలు ఆపైన వారిమీద 5 కేసులు నమోదయ్యాయి. నిజానికి నమోదుకాని కేసులు వీటికి నాలుగు రెట్లున్నాయి. ఈ నివేదికలో దిగ్భ్రాంతికరమైన విషయమేమిటంటే 94 శాతం కేసుల్లో అత్యాచారాలకు పాల్పడింది కుటుంబ సభ్యులే.మహిళల మీద కొనసాగుతున్న హింస కేవలం లింగ పరమైందే కాదు. మత, సామాజిక పరంగా, కొన్ని సందర్భాల్లో అభివృద్ధి అనే నెపంతో మహిళలపై దారుణాలు చోటు చేసుకుంటున్నాయి. రాజ్యాంగం ప్రాథమిక హక్కుల ద్వారా సమాన హక్కులు కల్పించింది. పార్లమెంట్, రాష్ట్ర శాసన సభలు అతివలపై వివక్షను నిషేధిస్తూ ఎన్నో చట్టాలు తీసుకొచ్చాయి. అయినా అత్యాచారాల పర్వం ఆగడం లేదు. సరికదా ఆ సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది.
 
 ‘అబలై’ పోతోంది
 ప్రపంచవ్యాప్తంగా జరిగిన సర్వే ప్రకారం ప్రతి ముగ్గురు మహిళల్లో ఒకరు పురుషుని చేతిలో దెబ్బలు తినడం, అత్యాచారానికి బలవడం, అవమానానికి లోనవడం జరుగు తోంది. ఎక్కువ సందర్భాల్లో ఈ అకృత్యాలకు పాల్పడుతున్న వ్యక్తులు కుటుంబ సభ్యులే కావడం దురదృష్టకరం. ప్రతి నలుగురు గర్భిణీ స్త్రీలలో ఒకరు వేధింపులకు గురవుతున్నారు. భారతమాతగా భాసిల్లుతోన్న మన దేశంలో లింగ వివక్ష ద్వారా ఇప్పటిదాకా కొన్ని మిలియన్ల అబలలు అదృశ్యమయ్యారు. బలవంతపు గర్భస్రావం, ఆడశిశువుల్ని చంపడం మన దేశంలో పరిపాటైపోయింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాల ప్రకారం 70 శాతం మహిళా హత్యలు వారి భర్తల చేతుల్లోనే జరుగుతున్నాయి. 10-20 శాతం మహిళలు తమ జీవిత కాలంలో భాగస్వామివల్ల లేదా పూర్వ భాగస్వామి వల్ల బలవంతపు లైంగిక కార్యకలాపాలకు గురవుతున్నారు. ఇక మన దేశంలోనైతే ప్రతి పది మంది మహిళల్లో నలుగురు గృహహింసకు లోనవుతున్నారు. 45 శాతం మంది కనీసం ఒక్కసారైనా శారీరక, మానసిక హింసకు, 55 శాతం గర్భిణీ స్త్రీలు శారీరక గాయాలకు, ప్రతిరోజూ కనీసం 30 మంది అబలలు వరకట్న దాహానికి విగత జీవులవుతున్నారు. ఇవి అధికారిక లెక్కలు మాత్రమే. వాస్తవంగా జరుగుతున్నవెన్నో..
 
 హింస - లైంగిక హింస అంటే?
 ఒక మహిళ పురుషుని కంటే ఎన్నో రెట్లు హింసకు గురి కావడమే లింగపరమైన వివక్ష. 2002లో గుజరాత్‌లో జరిగిన మత పరమైన హింసాకాండలో ముస్లింలు, ముఖ్యంగా ము స్లిం మహిళలు బలయ్యారు. కొన్ని సందర్భాల్లో పురుషులు కూడా హింసకు గురయ్యారు. హిజ్రాలను వేధించడం, కొట్టడం, తిట్టడం, చంపడం కూడా ఈ కోవలోకే వస్తాయి.
 
 మహిళలపై హింస - రకాలు
 1.    మానసిక హింస: మహిళల్ని తిట్టడం, హేళన చేయడం, అవమానించడం, మానసిక దిగ్బంధానికి గురిచేయడం.
 2.    శారీరక హింస: కొట్టడం, హింసించడం, అవయవాల్ని తొలగించడం, చంపడం.
 3.    లైంగిక హింస: అత్యాచారానికి ఒడిగట్టడం
 4.    ఆర్థిక హింస: మహిళలకు ఎలాంటి ఆస్తి హక్కుల్లేకుండా చేయడం, వారి ఆదాయాన్ని పురుషులే ఖర్చు చేయడం, అర్హతలున్నప్పటికీ ఉద్యోగ అవకాశాల్లేకుండా చేయడం.
 5.    ఆధ్యాత్మిక హింస: మహిళలకు ఇష్టం లేని మతపరమైన, సాంస్కృతిక ఆచారాల్ని పాటించమని ఒత్తిడిచేయడం.ఈ అంశాల్ని దృష్టిలో పెట్టుకొని ఐక్యరాజ్యసమితి మహిళా హింసను ఇలా నిర్వచించింది. ‘లింగపరమైన వివక్షతో మహిళల్ని శారీరకంగా, లైంగికంగా, మానసికంగా వేధించి వారి స్వేచ్ఛను హరించడమే మహిళా హింస’.
 
 ఐరాస ప్రకారం హింసకు కారణాలు
 చారిత్రాత్మకంగా పురుషులు స్త్రీలపై రాజకీయ, ఆర్థిక, సామాజిక రంగాల్లో పెత్తనం చె లాయించడం. మహిళల లైంగిక స్వేచ్ఛను నియంత్రించడం,హింస ద్వారా అబలలపై పురుషులు ఆధిపత్యం చెలాయించడం. సాంప్రదాయాలు, ఆచారాలు పేరిట స్త్రీని ఎల్లప్పుడూ పరాధీన స్థితిలో ఉంచడం.గోప్యత సిద్ధాంతం నెపంతో కుటుంబంలో మహిళలపై జరిగే హింసను సమాజంలో చర్చ జరగకుండా నివారించడం.అంతర్జాతీయ ఘర్షణలు జరిగినప్పుడు సైనికులు ప్రత్యర్థి దేశాలకు చెందిన అబలలను ఎత్తుకుపోవడం, అత్యాచారానికి ఒడిగట్టడం, ఆపై హత్య చేయడం జరుగుతుంది.
 
 చివరికి అగ్నికి ఆజ్యం తోడైనట్లు పాలక ప్రభుత్వాల నిర్లిప్తత అతివలపై మరిన్ని అకృత్యాలు జరగడానికి కారణమని చెప్పవచ్చు. ప్రపంచీకరణ నేపథ్యంలో పెట్టుబడిదారీ విధానం మహిళా హింసకు మరింత ఊతమిస్తుందని చెప్పవచ్చు. నానాటికి పెరిగిపోతున్న వినిమయతత్వం (ఇౌటఠఝ్ఛట జీటఝ) మరిన్ని వరకట్న చావులకు కారణమవుతోంది. సమాజంలో స్త్రీ విలువ దిగజారిపోతోంది. హర్యానా, పంజాబ్ లాంటి రాష్ట్రాల్లో మగపిల్లలకు ప్రాధాన్యమిస్తూ, లింగనిర్ధారణ పరీక్ష జరిపి ఆడశిశువని నిర్ధారణైతే గర్భస్రావాన్ని ప్రోత్సహిస్తున్నారు. ఇది పెట్టుబడిదారీ విధాన ఫలితమే అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
 
 కష్టాలు... కన్నీళ్లు
 భారతదేశంలో సగం మంది మహిళలు 18 ఏళ్ల వయసుకు ముందే వివాహితులవుతున్నారు. వారు శారీరకంగా ఎదగకముందే గర్భం ధరించడం, పిల్లల్ని కని పాలివ్వడం లాంటివి ఒక రకంగా వారిని హింసించడమే. మన దేశంలో మాతృ, శిశు మరణాల సంఖ్య అధికంగా ఉండటానికి ప్రధాన కారణం చిన్న వయసులోనే వారికి పెళ్లి చేసి, కుటుంబ బాధ్యతలనే బంధంలో సంకెళ్లు వేయడమే. గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా దళిత స్త్రీలు ఎక్కువగా వివక్షను ఎదుర్కొంటున్నారు. వారికి భూమి మీద హక్కులేదు. బాలికలైతే మరింత వివక్షకు గురవుతున్నారు. 2006లో మహారాష్ట్రలోని కైర్‌లాంజి అనే గ్రామంలో దళిత మహిళ సురేఖ తన కూతురు ప్రియాంకలను వివస్త్ర చేసి, గ్రామ నడిబొడ్డున బహిరంగంగా అత్యాచారానికి ఒడిగట్టి ఆపై హత్య చేశారు. గ్రామస్థులు ఈ దమనకాండకు ప్రేక్షకులుగా మిగిలిపోయారు.
 
 చట్టం ఏం చెబుతోందంటే?
 అత్యాచారం: భారతీయ శిక్షా స్మృతిలో సెక్షన్ 375,376 ప్రకారం అత్యాచారం నేరం. కానీ భర్త భార్యపై చేసే అత్యాచారం నేరం కాదు. అయితే సరైన ఆధారాలు లేవనే నెపంతో లేదా మహిళ అంగీకారంతోనే లైంగిక చర్య జరిగిందనే సాకుతో ఎక్కువ సందర్భాల్లో ఈ కేసులు వీగిపోతున్నాయి. చాలామంది మహిళలు బిడియంతో కేసుపెట్టడానికి వెనుకాడుతున్నారు. కొన్ని సందర్భాల్లో వార్ని భయపెట్టడం జరుగుతుంది. వ్యభిచార వృత్తిలో ఉన్నవారి విషయానికి వస్తే పరిస్థితి మరీ దయనీయం. తమపై అత్యాచారం జరిగిందని కేసుపెట్టినా అటు పోలీసులు, ఇటు న్యాయస్థానాల నుంచి సరైన న్యాయం జరగడం లేదు.
 
 బాలికల్ని లైంగికంగా వేధించడం
 తరచుగా కుటుంబసభ్యులు, తెలిసినవారు అమాయకులైన పసి మొగ్గల మీద అత్యాచారానికి పాల్పడుతున్నారు. ఇలాంటి నేరానికి సంబంధించి మన దేశంలో ఎలాంటి చట్టాలూ ఇంకా ప్రాణం పోసుకోలేదు. బహుశా రాజ్యాంగ రచన క్రమంలో ఇంతటి నీఛమైన ఘోరాలు జరుగుతాయని మేథావులు ఊహించకపోయి ఉండవచ్చు.
 
 పనిచేసే చోట లైంగిక వేధింపులు
 పనిచేసే చోట సహచరులు, పైఅధికారుల వేధింపులకు మహిళలు తరచుగా గురవుతున్నారు. చాలామంది తమ జీవనభృతిని కోల్పోతామేమోనన్న భయంతో బాధను భరిస్తున్నారు. ఇంకొంతమంది చేసేదేమీలేక శారీరక, మానసిక వేధింపులకు బానిసలవుతున్నారు. 1997లో సుప్రీంకోర్టు ఇచ్చిన సంచలనాత్మక తీర్పు (విశాఖ కేసు) మహిళా ఉద్యోగులకు కొంతమేర ఊరట కలిగించినప్పటికీ, అసంఘటిత రంగంలో పనిచేసే వారికి ఈ తీర్పుపై అంత అవగాహన లేదన్నది నిజం. ఒకవేళ ఉన్నా అమలు చేయడం కష్టతరమే. గృహ హింస: మహిళలకు తమ ఇళ్లలో తగిన రక్షణ కల్పించే ఉద్దేశంతో 2005 గృహ హింస నిరోధక చట్టం రూపు దాల్చింది. కానీ ఎంతమంది తమ భర్తలపై కేసులు పెట్టి జైలుకు పంపడానికి ఇష్టపడతారు? కుటుంబ బాధ్యతలు, సాంప్రదాయాలు, గౌరవం అనే బాంధవ్యాల ఛట్రంలో ఈ చట్టం ఆశించినంతగా అమలుకావడం లేదు.
 
 సాధికారతే సరైన చికిత్స
 ఎ)    మహిళా సాధికారతకు కృషి:
 1. సమానమైన పనికి సమాన వేతన సూత్రం అమలు చేయాలి
 2. హిళల్లో సామాజిక చైతన్యాన్ని కల్గించాలి
 . ఆర్థిక వనరుల్ని అందుబాటులోకి తీసుకురావాలి
 4. నిర్ణయీకరణలో మహిళలకు భాగస్వామ్యం కల్పించాలి.
 బి)    హింసను ఖండించడం, ఇలాంటి సంఘటనల్ని సర్కారు దృష్టికి తీసుకురావాలి.
 సి)    చట్టాలపట్ల సరైన అవగాహన కల్పించాలి.
 డి)    స్నేహితులు, సహచరులతో కలిసి సంఘీభావాన్ని నెలకొల్పాలి.
 ఇ)    మహిళా హ క్కుల ఉద్యమకారులతో చేతులు కలపాలి.
 ఎఫ్)    తనకున్న హక్కులను తెలుసుకొని, వాటిని పొందేందుకు పోరాడాలి.
 జి)    పురుషులతో చేతులు కలిపి ఉమ్మడిగా ఉద్యమించి మహిళలపై హింసను అరిక ట్టాలి.
 
 మహాత్ముని మాటలే మననంగా
 సృష్టికి మూలాధారం స్త్రీ. ఆమె లేనిదే మనం లేమనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తెరగాలి. అమ్మగా, చెల్లిగా, భార్యగా....ఇలా అన్ని పాత్రల్లో పురుష లోకాన్ని ముందుకు నడిపించేది మహిళలే అని తెలుసుకోవాలి. వ్యక్తిగత విచక్షణతో మెలగాలి. ఇలా ప్రతి ఒక్కరిలో పరివర్తన కలిగినప్పుడే అర్థరాత్రివేళ ఆడపిల్ల నడిరోడ్డుపై సంచరించిననాడే భారత దేశానికి నిజమైన స్వాతంత్య్రం అన్న మహాత్ముని మాటకు సార్థకత చేకూరుతుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement